వరల్డ్‌ కప్‌లో అసలు మజా షురూ.!

క్వార్టర్‌ ఫైనల్స్‌ పోరు ముగిసింది. ఇక సెమీస్‌ పోరు షురూ కానుంది. గ్రూప్‌ దశ నుంచి నాకౌట్‌ దశకు ఎనిమిది జట్లు చేరుకున్నా, అందులో కొన్ని జట్లు వీక్‌ కావడంతో.. నాకౌట్‌ పోరు దాదాపుగా…

క్వార్టర్‌ ఫైనల్స్‌ పోరు ముగిసింది. ఇక సెమీస్‌ పోరు షురూ కానుంది. గ్రూప్‌ దశ నుంచి నాకౌట్‌ దశకు ఎనిమిది జట్లు చేరుకున్నా, అందులో కొన్ని జట్లు వీక్‌ కావడంతో.. నాకౌట్‌ పోరు దాదాపుగా ఏకపక్షంగానే సాగిందని చెప్పొచ్చు. అసలు సిసలు మజా ఇప్పుడు షురూ అయ్యింది. సెమీస్‌లోకి నాలుగు బలమైన జట్లు ప్రవేశించాయి. దేన్నీ తక్కువగా అంచనా వెయ్యడానికి వీల్లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విషయంలో.. ఏ జట్టుకు ఆ జట్టు ప్రత్యేకమే.

సౌతాఫ్రికా – న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీస్‌ జరగనుండగా, ఇండియా – ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్‌ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడ్తాయి. న్యూజిలాండ్‌ ఎంత పవర్‌ఫుల్‌గా వుందో, ఈ రోజు మ్యాచ్‌తో స్పష్టమైపోయింది. ఆస్ట్రేలియా సంగతి సరే సరి. టీమిండియా తక్కువేం కాదు. సౌతాఫ్రికా జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది.

క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన జట్టు అయినా ఏ మ్యాచ్‌నీ వదులుకోడానికి సిద్ధపడదు. అలాంటిది సెమీస్‌ విషయంలో ప్రతి జట్టూ ఎంత జాగ్రత్తగా వుంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కప్పు కొట్టడానికి ప్రతి టీమ్‌ రెండు అడుగుల దూరంలోనే వుంది. నాలుగు జట్లు.. కప్పు కొట్టడానికి రెడీ అయిపోయాయి. అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించి కప్పుని కైవసం చేసుకోవాలనుకుంటున్న జట్లు.. బరిలో తలపడ్తోంటే.. అభిమానులకు కలిగే కిక్‌ అంతా ఇంతా కాదు.

సెమీస్‌ బరిలో నిలిచిన ఆస్ట్రేలియా గతంలో పలుమార్లు వరల్డ్‌ కప్‌ని కైవసం చేసుకుంది. టీమిండియా ఇప్పటికే రెండు సార్లు కప్‌ గెలిచింది, పైగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కూడా. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ మాత్రం కప్పు గెలవలేదు. తొలిసారి కప్‌ సౌతాఫ్రికా లేదా న్యూజిలాండ్‌కి దక్కుతుందా.? ఆల్రెడీ వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌ హోదా దక్కించుకున్న ఆస్ట్రేలియా, టీమిండియాలలో ఏదో ఒక జట్టుకు దక్కుతుందా.? అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.