ఎండవల్ల చర్మం రేగడాన్ని సన్‌బర్న్ అంటారు. దీనిలో ఎండ తాకిడికి చర్మం కమలడం గాని, బొబ్బల్కెడం కాని జరుగుతుంది. సన్‌బర్న్ లక్షణాలు ఎండ తాకిడికి గురైన వెంటనే కనిపించవు. ఒకటి రెండు రోజుల తర్వాత మొదలై వారం పాటు కొనసాగుతాయి. సూర్య కిరణాల తాకిడి వల్ల స్కిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది కనుక చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణకారక పదార్ధం సూర్య కిరణాల్లోని అతినీల లోహిత కిరణాలను అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలో చర్మం నల్లగా మారుతుంది. (ఫొటో సెన్సిటి విటి) తెల్లని చర్మం కలిగిన వ్యక్తుల్లో సన్‌బర్న్ వచ్చే అవకాశం ఎక్కువ. తరచుగా ఎండతాకిడికి గురయ్యే వ్యక్తుల్లో చర్మం త్వరగా ముడతలు పడుతుంది (ఫోటో ఏజింగ్). ఈ ముడతలు మామూలు వృద్ధాప్యపు ముడతల్లా కాకుండా లోతుగా, ప్రస్ఫుటంగా ఏర్పడతాయి.
అతినీల లోహిత కిరణాలు
సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత కిరణాలు (యు.వి. కిరణాలు) సన్‌బర్న్‌ని కలిగిస్తాయి. నీడ చెప్పే నిజం: మీ నీడ మీకంటే పొడుగ్గా కనిపిస్తుంటే యు.వి కిరణాల తీక్షణత తక్కువగా ఉన్నట్లు, పొట్టిగా కనిపిస్తుంటే తీక్షణత ఎక్కువగా ఉన్నట్లూ భావించవచ్చు. యు.వి. కిరణాలు రెండు రకాలు. 1) యు.వి.ఎ. 2) యు.వి.బి.
యు.వి.ఎ కిరణాలు
కిటికీ అద్దాలనుంచీ చొచ్చుకువెళ్లగలుగుతాయి. ఎత్తు, వాతావరణాల ప్రభావం ఉండదు. కాలం, ఋతువులతో సంబంధం లేదు. ఏడాది పొడుగునా ఉంటాయి. సూర్య కిరణాల్లో 5 శాతం ఉంటాయి. చర్మం లోనికి, లోతుగా చొచ్చుకు వెళతాయి. స్కిన్‌కేన్సర్‌ను కలిగించే అవకాశం ఉంది. సన్‌స్క్రీన్‌లోషన్లు పూర్తిగా అడ్డుకోలేవు.
యు.వి.బి. కిరణాలు
కిటికీ అద్దాలనుంచీ ప్రసరించవు. చర్మం పైపైన ప్రభావం చూపుతాయి. చర్మాన్ని నల్లబడేలా చేస్తాయి. చర్మంపైన ముడతలు కలిగిస్తాయి. కంట్లోని కటకాన్ని అపారదర్శకంగా మార్చి, క్యాటరాక్ట్‌కు కారణమవుతాయి. శరీరం డి-విటమిన్‌ను తయారుచేసుకునేలా చేస్తాయి. కాలానుగుణంగా తీక్షణత మారుతుంది. ఎండాకాలం తీక్ష ణంగా, చలికాలం అల్పస్థాయిలో ఉంటాయి. రోజులో మద్యాహ్నం తీక్షణంగా, ఉదయసాయంత్రాలు అల్పంగా ఉంటాయి. సముద్ర మట్టం నుంచీ ఎత్తుకి వెళ్లేకొద్దీ తీక్ష ణత పెరుగుతుంది. భూమద్యరేఖ వైపు వెళ్లేకొద్దీ తీక్షణత పెరుగుతుంది. సూర్యకిరణాల్లో 0.5% ఉంటాయి. సన్‌స్క్రీన్ లోషన్లు చాలా వరకూ అడ్డుకోగలుగుతాయి.
సన్‌బర్న్ కలిగే విధానం
బొబ్బలు తయారయ్యే విధానం: ఎండవల్ల చర్మం ఎర్రగా మారి బొబ్బ కడుతుంది. కొన్ని రోజులకు మృత కణాలు తయారై పొలుసులుగా ఊడిపోతాయి. అతినీలలోహిత కిరణాలు చర్మపు వెలుపలి పొరల్లో ఉండే కణాలను నాశనం చేస్తాయి. దీనితో కేశసాదృశ్యమైన రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా కొంత ద్రవాంశం రక్తనాళాలనుంచీ లీక్ అవుతుంది. బొబ్బలు తాయారవుతాయి.
ఎలర్జీ వచ్చే విధానం
చర్మంలో ఉండే ప్రోటీన్లు సూర్యకిరణాలతో కానీ, సన్‌స్క్రీన్ ప్రోడక్ట్స్‌తో గానీ వీభేదించి ఎలర్జీని కలిగిస్తాయి. (ఫోటో టాక్సిసిటి) సూర్యకిరణాలు, సన్‌స్క్రీన్ పదార్ధాల్లోని అంశాలు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు హానికరంగా మారతాయి కనుక వాటిని 'యాంటిజెన్స్' అంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు శరీరం ప్రతిరక్షక కణాలను తయారుచేసుకుంటుంది. వీటిని 'యాంటీబా డీస్' అంటారు. ఇవి అవసరమైనప్పుడల్లా అప్రమత్తమవు తూ ఎలర్జీక్ రియాక్షన్‌ను కలిగిస్తాయి. (ఫోటో ఎలర్జీ)
క్యాన్సర్ తయారయ్యే విధానం: అతినీలలోహిత కిరణాల తీక్షణత కారణంగా కణాలు ప్రోటీన్ పదార్ధాన్ని తయారుచేసుకోలేవు. కణాల్లో ఉండే డి.యన్.ఏ అనే జన్యు పదార్ధం నాశనమవుతుంది. తత్ఫలితంగా, కొన్ని కణాలు అదుపుతప్పి క్యాన్సర్ కణాలుగా తయారవుతాయి.
స్కిన్‌క్యాన్సర్లలో రకాలు
స్కిన్ క్యాన్సర్లు ప్రధానంగా మూడు రకాలు. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా అనేవి. బేసల్ సెల్ కార్సినోమా అనేది చర్మపు పైపొరలో ప్రారంభమవుతుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చు. తల, ముఖం, మెడ, వీపు, ఛాతి, భుజాలు తదితర భాగాల్లో అంటే, ఎండ తాకిడికి గురయ్యే భాగాల్లో ఎక్కువగా వస్తుంది. తెల్లని చర్మం కలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నల్లని చర్మం కలిగిన వ్యక్తుల్లో అంతగా కనిపించదు. నెమ్మదిగా పెరుగుతుంది. సాధారణంగా పక్కకణజాలాల్లోకి వ్యాపించదు (మెటస్టసైజ్). చూడటానికి చిన్న మాంసపు ముద్దలాగా, ముట్టుకుంటే రక్తం కారుతూ తిరిగి చెక్కుకడుతూ ఉంటుంది.
సన్‌బర్న్ లక్షణాలు
ఫస్ట్‌డిగ్రీ బర్న్స్: చర్మం వెలుపలి పొర మాత్రమే సూర్య కిరణాల తాకిడికి గురవుతుంది. చర్మం ఎర్రగా కములు తుంది. ముట్టుకుంటే మంటగా, నొప్పిగా అనిపిస్తుంది.
సెకండ్ డిగ్రీ బర్న్స్: నొప్పి, ఎరుపుదనాలతో పాటు వాపు కనిపిస్తుంది. బొబ్బలు తయారవుతాయి.
ఎలర్జిక్ రియాక్షన్: ఎర్రని దద్దురు కనిపిస్తుంది. ముఖం ఉబ్బరిస్తుంది. చర్మం కదుములుగా, గడ్డలుగా తయారవుతుంది.
క్యాన్సర్‌గా మారిన చర్మపు మచ్చలు: (ఎ.బి.సి.డి.): ఎసిమెట్రి – సగం బాగం ఒక రంగులోనూ రెండో సగభాగం మరో రంగులోనూ ఉండటం. బోర్డర్ ఇరెగ్యులారిటి: ఎగుడుదిగుడుగా, అసమంగా ఉండటం.
కలర్: మచ్చంతా ఒకే రంగులో కాకుండా వివిధ రంగుల్లో కనిపించడం.
డయామీటర్: మచ్చ వైశాల్యం లేదా చుట్టుకొలత 6 మిల్లీ మీటర్లకు సైజుకు (చింత పిక్క సైజుకు) మించి పెరగడం.
కళ్లకు హాని జరిగినప్పుడు కనిపించే లక్షణాలు: కళ్ల మంటలు. కళ్లలో ఏదో నలక పడినట్లు మెరమెరలాడటం. కాంతిని తట్టుకోలేకపోవటం (ఫోటోఫోబియా) (ఐరిస్ లేదా కార్నియా ఇన్‌ఫ్లేమ్ అవ్వటం వల్ల) చూపు మసకబారటం లేదా కళ్లు కనిపించకపోవటం (రెటీనా దెబ్బ తినడం వల్ల లేదా, కంటి కటకం అపారదర్శకంగా మారడం వల్ల)
సన్‌బర్న్‌ని ఎక్కువ చేసే అంశాలు (రిస్కులు)
పగటిపూట సమయం: ఉదయం 10 గంటల నుంచీ మద్యాహ్నం 3 గంటల వరకూ సూర్యకిరణాల్లో అతినీల లోహిత కిరణాలు తీక్షణంగా ఉంటాయి. ఒక వేళ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ అతినీల లోహిత కిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి. సూర్యకిరణాలను ప్రతిఫలించే ఉపరితలాలు: నీటి సరస్సులు, లేత రంగులో ఉండే ఇసుక దిబ్బలు, కాంక్రీటు భవనాలు, మంచు తదితరాలు.
నివారణ
చర్మాన్ని ఎండకు గురిచేయకూడదు. పదిహేను నిమిషాలకు మించి ఎండలో గడపకూడదు (అలవాటు లేకుండా) చర్మాన్ని కప్పేలా లేత రంగు కలిగిన మందపాటి కాటన్ దుస్తులు ధరించాలి. అంచుకలిగిన (కనీసం 4 అంగుళాలు లేదా 10 సెం.మీ.) టోపీ ధరించాలి. కళ్లకు హాని జరగకుండా నల్ల కళ్లద్దాలు ధరించాలి. నీళ్లలో ఈదులాడేటప్పుడు కూడా చర్మాన్ని కాపాడేలా దుస్తులు ధరించాలి.
జాగ్రత్త పడాల్సిన సందర్భాలు
వయసు: ఆరు సంవత్సరాలు లోపుండటం లేదా అరవై దాటడం.
హార్మోన్ల తేడాలు: గర్భధారణ, గర్భనిరోధక మాత్రల వాడకం.
పూర్వపు ఇతివృత్తం: ఇంతకు మందు ఎండ వల్ల ఫోటోసెన్సిటివిటి వచ్చి ఉండటం. కుటుంబంలో ఎవరికైనా స్కిన్ క్యాన్సర్ (ముఖ్యంగా మాలిగ్నెంట్ మెలనోమా) వచ్చి ఉండటం.
చర్మవ్యాధులు: చిన్నతనం నుంచే ఏదైనా సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధి ఉండటం. చర్మం తేలికగా కందిపోవటం.
పుట్టుమచ్చల్లో మార్పులు చోటుచేసుకోవటం: చర్మంపైన మచ్చలు హెచ్చుసంఖ్యలో, అస్తవ్యస్తంగా, పెద్ద ఆకారంలో పెరగటం.
మద్యం ప్రభావం: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం. ఆల్కహాల్ అలవాటును హఠాత్తుగా వదిలిపెట్టడం.
ధూమపాన దుష్ఫలితం: సిగిరెట్లు ఎక్కువగా తాగటం.
ప్రాథమిక వైద్యం
చర్మం కమిలితే… చల్లని నీళ్లతో స్నానం చేయాలి. చల్లని, మెత్తని దుస్తులు ధరించాలి. ఎక్కువగా ద్రవాహారాలను తీసుకోవాలి. చల్లని పాలు, చన్నీళ్లు రెండూ సమాన భాగాలు కలిపి, మెత్తని బట్టను ముంచి చర్మం కమిలిన చోట అద్దాలి. గ్లాసు చన్నీళ్లకు చెంచాడు వంటసోడా కలిపి చర్మంపైన ప్రయోగించాలి.
బొబ్బలు ఏర్పడితే.. బొబ్బలను చిదుపకూడదు. వాటంతట అవే తగ్గిపోతే మంచిది. ఇబ్బంది పెట్టకుండా, ఒరుసుకుపోకుండా ఉన్నంతవరకూ దేనితోనూ కప్పవద్దు. ఒక వేళ ఒరుసుకుపోయి ఇబ్బందిని కలిగిస్తుంటే బ్యాండేజి గుడ్డను వదులుగా కప్పి స్టిక్కింగ్ టేప్‌ను వేయవచ్చు. టేప్‌ను మరీ గట్టిగా చుట్టకూడదు. (గట్టిగా చుడితే వాపు ఏర్పడినప్పుడు రక్తం ఆగిపోయి తిమ్మిర్లు, మంట వస్తాయి). ఇన్ఫెక్షన్ లక్షణాలున్నాయేమో (వాపు, నొప్పి, ఎరుపుదనం, వేడి, చీము, గ్రంథులవాపు, జ్వరం, చలి) జాగ్రత్తగా గమనించాలి.
డా. చిరుమామిళ్ళ మురళీ మనోహర్
సెల్- 91774 45454