బివివిఎస్ ఎన్ ప్రసాద్ అంటే ఎవరు అని ఎవరన్నా పొరపాటున అంటారేమో కానీ, ఛత్రపతి ప్రసాద్..భోగవిల్లి ప్రసాద్ అంటే మాత్రం, సినిమారంగాన్నిపరిశీలించేవారందరి కళ్ల ముందు నిండైన ఓ భారీకాయం కనిపిస్తుంది. ఛత్రపతి సినిమా ముందు ఆయన చాలా సినిమాలు తీసినా, ఆ సినిమా ఆయనకు ఆ గుర్తింపు తెచ్చింది. ఒక నిర్మాతగా అనేకానే ఢక్కామక్కీలు తిన్నారాయన. చాలా మందికి ఆయన సినిమాలు ఇటీవల కాలం నుంచే తెలుసు. కానీ నిర్మాతగా ఆయన ప్రస్థానం చెన్నయ్ లో ప్రారంభమైంది.
శోభన్ బాబు, కృష్ణ, నాగేశ్వరావు వంటి వారితో సినిమాలు తీసి, పరిశ్రమతో పాటు హైదరాబాద్ తరలి వచ్చారు. కానీ రెండో ఇన్నింగ్స్ కాస్త ఆలస్యంగా అంటే 2003 లో ప్రారంభించారు. రవితేజతో ఈ అబ్బాయి చాలా మంచోడు…అంటూ. తరువాత ఛతప్రతి, ఖతర్నాక్, డార్లింగ్, ఊసరవెల్లి, దేవుడు చేసిన మనుషులు, ఒంగోలు గిత్త, సాహసం, అత్తారింటికి దారేది నిర్మించారు. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో పదో గా దోచేయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో చిట్ చాట్
అత్తారింటికిదారేది లాంటి బ్లాక్ బస్టర్, భారీ సినిమా తరువాత ఒక్కసారి కాస్త మీడియం బడ్జెట్ సినిమా చేస్తున్నట్లున్నారు..కారణం?
అదేం లేదు..భారీ సినిమానా..మీడియం సినిమా అని ఎప్పుడూ చూడలేదు. ప్రాజెక్ట్ సెట్ అయితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుని వెళ్లడమే అలవాటు. ఈ ప్రాజెక్టు ఎలా మొదలైంది అంటే, దర్శకుడు సుధీర్ వర్మ మా ఇంట్లో కుర్రాడి లాంటివాడు. మాకు బాగా సన్నిహితుడు. అతని మొదటి సినిమా కు చాన్నాళ్ల ముందు నుంచీ కూడా. తొలి సినిమా హిట్ అయ్యాక, ఈ సబ్జెక్ట్ చెప్పాడు. నచ్చి ముందుకు వెళ్లాం.
సబ్జెక్ట్ కోసం నాగచైతన్య అనుకున్నారా? లేక నాగ చైతన్య అనుకున్నాక సబ్జెక్ట్ చూసారా?
లేదు. సబ్జెక్ట్ వినగానే ఇది చైతూకి సరిపోతుంది అనుకున్నాం. సినిమా బాగా వచ్చింది. సుధీర్ చాలా బాగా తీసాడు.
ఇన్నేళ్ల అనుభవం తరువాత నిర్మాతగా మీ ఫీలింగ్స్ ఏమిటి?
అసలు ఇప్పుడు నిర్మాతలు ఎక్కడున్నారు? కొద్ది మంది మాత్రమే మిగిలారు. సినిమా రంగం ఇప్పుడు కార్పొరేట్ అయిపోయింది.వ్యాపారంగా మారిపోయింది. నిర్మాత అంటే సినిమాను ప్రేమించాలి. లాభం నష్టం చూడకుండా సినిమా అంటే పిచ్చి పడాలి. అలాంటి వారు ఇప్పడు తగ్గిపోయారు.
అసలు హీరో, దర్శకుడు కలిసి ప్రాజెక్ట్ అనుకుని, ఎవరో ఓ నిర్మాతను ఎంచుకుని ఆ ప్రాజెక్టు చేతిలో పెడుతున్నారు. అలాంటపుడు నిర్మాతలు ఎలా వుంటారు?
మీరన్నది కొంత వరకు నిజమే. కానీ అలా ప్రాజెక్టు తీసుకున్నా కూడా, సినిమా సబ్జెక్ట్ మీద, ఖర్చు మీద, అవగాహన వుండాలి.
మరి ఇంత చెబుతున్నారు..మీరు కూడా మ్యూజిక్ సిటింగ్స్ కు విదేశాలు వెళ్లడం ఎంతవరకు సబబు?
ఇది ఇవ్వాళ కొత్తగా లేదు. ఇంతకు ముందు బెంగుళూరు, ఊటీ, విజిపి గార్డెన్స్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఫ్లయిట్ లు, ఫోన్ లు ఎక్కువైపోయాయి. బిజీగా వున్న మ్యూజిక్ డైరక్టర్ ను కావడంతో, ఫోన్ లు చేసి, లేదంటే ఎక్కడున్నారో తెలుసుకుని ఫ్లయిట్ లో వచ్చి డిస్ట్రబ్ చేసేస్తున్నారు. దాంతో వారంలో అవ్వాల్సిన పని నెలలు పడుతోంది. అదే విదేశాలకు తీసుకెళ్లిపోతే, వచ్చిన పని అదే కనుక, చకచకా ఓ వారంలో ఫినిష్ చేసి వచ్చేయచ్చు.
మరి ఖర్చు మాటేమిటి?
అక్కడే నిర్మాత చాకచక్యం వుంటుంది. ఎక్కడ అవసరమైతే అక్కడ కాస్త ఎక్కువ పెట్టాలి. దాన్ని ఇంకో దగ్గర తగ్గించుకోవాలి.అలా కాకుండా పెట్టుకుంటూ పోతే బడ్జెట్ పెరిగిపోతుంది.
సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అలాగే చేస్తున్నారు..తెరపై బ్రాండ్ లు కనిపిస్తాయంటారా?
హీరో కు వున్న ఇమేజ్, అభిమానుల క్రేజ్ దృష్ట్యా కొన్ని కొన్ని తప్పవు.
సినిమా నిర్మాణంలో మీరు చూసినన్ని ఎత్తుపల్లాలు ఎవరు చూసి వుండరేమో? అయినా ఇంత నిబ్బరంగా ఎలా వుండగలుగుతున్నారు?
నిజమే. చాలా దెబ్బలు తిన్నాను. ఎర్లీ స్టేజ్ లో అయితే వెనక్కు వెళ్లాలా..ముందుకు వెళ్లాలా అన్న ఆలోచన వచ్చేదేమో? ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను.ఇక ముందుకే తప్ప వెనక్కు వెళ్లలేం. అయినా ఇంకా ఎంతని..నాకూ వయస్సు అయిపోతోంది.
ఇంత అనుభవంతో, మీరు నిర్మాణంలోనేనా, కథా చర్చలు, స్క్రిప్ట్ తయారీలో పాలు పంచుకుంటూ వుంటారా?
అన్నీ చూస్తాను. అదృష్టం కొద్దీ నా దర్శకులు నా సలహాలు సూచనలు వింటారు. పాటిస్తారు. రాజమౌళి, త్రివిక్రమ్ కూడా నా సందేహాలు విని, వాటికి అనుగుంణగా మార్పులు, చేర్పులు చేసారు.
కొత్త నిర్మాతలకు ఇది సాధ్యమయ్యేదేనా? పెద్ద దర్శకుల దగ్గర పెదవి విప్పగలరా?
నిర్మాతలో డబ్బు మాత్రమే కాకుండా, విషయం కూడా వుంటే అతవలి వాళ్లు వింటారు. నేను చెబుతున్నది అలాంటి వాళ్లు తగ్గిపోయారనే.
టెక్నాలజీ పెరగడం కూడా ఖర్చు పెంచుతోందా?
టెక్నాలజీ ఒక విధంగా పరిశ్రమకు మేలు చేసింది. మంచి అవుట్ పుట్ ఇస్తోంది.కానీ మరో విధంగా కీడు చేస్తోంది. విడుదలయిన సాయంత్రానికే నెట్ లో సినిమా ప్రత్యక్షమైపోతోంది.
అత్తారింటికి దారేది అనుభవమా?
అవును కదా? అదృష్టం కోద్ది ప్రేక్షకులు నాకు దన్నుగా నిల్చున్నారు. అందువల్ల సరిపోయింది.
మంచి సినిమాలు హిట్ అవుతున్నాయి. అక్కడ పైరసీ ఏమీ చేయలేకపోతోంది కదా?
అదీ నిజమే. మంచి సినిమాను ప్రేక్షకుడు థియేటర్లోనే చూడాలనుకుంటాడు. దానికీ కారణం వుంది. ఒకప్పుడు సినిమా కామన్ మాన్ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు ఆ స్థానాన్ని టీవీ ఆక్రమించింది. సినిమా మంచిది, బాగుంది అని నిర్థారణ అయితేనే ప్రేక్షకుడు థియేటర్ కు వస్తున్నాడు. లేదంటే సీడీ నో, టీవీనో నమ్మకుంటున్నాడు.
కానీ అలా నిర్థారణ అయ్యే వరకు సినిమా థియేటర్లో వుంటోందా? వారంలోనే ఎంతటి సినిమా అయినా కలెక్షన్ల గ్రాఫ్ జారిపోతోంది కదా?
చెప్పాను కదా..ఏ సినిమా అయినా చూడాలనుకునేవారు లేదా కొత్త సినిమా వస్తే చూడాలనుకునేవారు వారానికి సరిపడా వున్నారు. ఆపైన మంచి టాక్ వస్తే మరో వారం, రెండు వారాలు. ఈటాక్ మొదటి వారంలో తెచ్చుకోవడం అన్నది సినిమా బాధ్యత.
దోచేయ్ తరువాత
సుక్కు ఎన్టీఆర్ సినిమా మీకు తెలిసిందే. ఆపై ఇంకా ఏమీ అనుకోలేదు..మంచి ప్రాజెక్ట్ సెట్ కావాలి
విఎస్ఎన్ మూర్తి