వెంకటేష్ అనే కన్నా వెంకీ అంటేనే జనాలకు గుర్తు వచ్చేంత దగ్గరి తనం. తన పనేదో, తన సినిమాలేమిటో అంతే తప్ప, టాలీవుడ్ లో ఎప్పుడూ కనిపించనంత దూరం. సినిమాలు చూస్తే,,అయ్యో..అయ్యయ్యో అంటూ నేల నుంచి కుర్చీ వరకు అందరినీ అలరించే ప్రయత్నం. కానీ ఆయన వ్యవహారం మాత్రం కామన్ మాన్ కు అంత సులువుగా పట్టని వేదాంతం.
ఇలా అన్ని విధాలా జనానికి కనిపించేది ఒకటి, అనుకునేది ఒకటి. కానీ అసలు వ్యవహారం మొత్తం వేరొకటి. అదే విక్టరీ వెంకటేష్. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్రయ్ చేస్తూ, కంటిన్యూటీ చెడకుండా చూసుకుంటూ వస్తున్న సీనియర్ హీరో. అలాంటి హీరో తొలిసారి గ్రే హెయిర్ తో, రొటీన్ హీరోయిజానికి దూరంగా చేస్తున్న సినిమా గురు. క్రీడల నేపథ్యంలో వస్తున్న సినిమా. ఈ సినిమా నేపథ్యంలో వెంకీతో ఇంటర్వూ.
*కొత్త గెటప్ లు మీకు కొత్త కాదు కానీ, మీ ఈ గెటప్ మాత్రం ప్రేక్షకులకు కొత్తగా వున్నట్లుంది?
నిజమే. నన్ను దగ్గరగా నిత్యం చూసే వారికి నాఈ గెటప్ కొత్తది కాదు. నేను ఇలాగే కనిపిస్తాను. ఇప్పుడు సినిమాలో కూడా అలాగే కనిపించాను. మేకప్ ఏమీ లేదు. అందరూ అంటున్నారు. చాలా బాగున్నావ్ స్క్రీన్ మీద అంటూ కాంప్లిమెంట్ లు ఇస్తున్నారు.
*కానీ మీ అభిమానులు మీరు ఎప్పటికీ యంగ్ గా, గ్లామర్ గా కనిపించాలని కోరుకుంటారేమో?
అదేం లేదండీ. వాళ్లు నేనేం చేసినా ఓకె అన్నారు. అంటున్నారు. నా మీద నేనే జోక్ లు వేసుకున్నా ఓకె అన్నారు. సింపుల్ పాత్రలు చేసినా సరే అన్నారు. వాళ్లు ఎప్పుడూ నన్ను నన్నుగా ప్రోత్సహిస్తూనే వున్నారు. లేదూ అంటే అలాంటి డైలాగులు, అలాంటి సినిమాలు వచ్చి వుండేవి కాదు కదా? ఈ సినిమాలో కూడా అంతే. మేకప్ కు ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను నేనులాగే కనిపిస్తా అన్నా. అదే కాదు. హీరోయిన్ హీరోతో మాట్లడే డైలాగుల విషయంలో కూడా చాలా నేచురల్ గా వుండేలా చూసుకున్నా.
*ఈ తరహా సినిమాలు మనవాళ్లు చూడరనే అభిప్రాయం ఒకటి వుంది
లేదండీ ప్రేక్షకుల అభిప్రాయాలు మారుతున్నాయి. మనమే ఇంకా మారాల్సి వుంది. బాలీవుడ్ లో ఎప్పుడో మొదలయింది. నాకు ఎప్పటి నుంచో డిఫరెంట్ సినిమా చేయాలి. ఎక్కడో ఓ పాయింట్ దగ్గర స్టార్ట్ కావాలి. మారాలి. అనుకుంటూ వస్తున్నా. అప్పటికీ మల్టీ స్టారర్లు చేసా. ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ వస్తుంటే, ఇక్కడ సెట్ అయింది. ఈ రోజు కోసం ఎన్నాళ్ల నుంచో చూసాను.
*2016-17 మీ సీనియర్ హీరోలందరికీ కమ్ బ్యాక్ ఇయర్ అవుతోంది
అవును మళ్లీ అందరం మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చింది.
*యంగ్ జనరేషన్ తో పని చేయడం ఎలా వుంది?
కొత్త తరంతో చేయడం ఎప్పుడూ బాగుంటుంది నాకు. కొత్త వాళ్లని ఎప్పుడూ అడుగుతుంటాను. నాకు కథలు రాయండి అని. ఎందుకంటే వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ వేరుగా, వైవిధ్యంగా వుంటాయి.
*ఈ సినిమా కోసం ఏమయినా ప్రత్యేకంగా నేర్చుకోవడం? పరిశీలించడం?
మరీ ఎక్కువ లేదు కొంతవరకు చేసాను. అదీ కాక, నాకు యంగ్ ఏజ్ లో ట్రయినర్ లు గా పని చేసిన వారి తీరు, వాళ్ల బాడీ లాంగ్వేజ్, ఏటిట్యూడ్ ఇవన్నీ కూడా కొంతవరకు ఫీడ్ బ్యాక్ గా పనికి వచ్చాయి.
*తరువాతి ప్రాజెక్టులు ఏమిటి?
చాలా వున్నాయి కానీ, అన్నీ డిస్కషన్ స్టేజ్ లోనే, పూరి జగన్నాధ్, క్రిష్, త్రివిక్రమ్, ఇంకా కొంతమంది కొత్తవాళ్లు.
*మీ ప్రాజెక్టులపై బోలెడు వినిపిస్తుంటాయి. మాయమవుతుంటాయి?
డిస్కషన్ స్టేజ్ లో వుండగానే ఏవో వస్తుంటాయి. అన్నీ ఫైనల్ కావు కదా? ఏవో సమస్యలు అడ్డం పడుతుంటాయి. ఓ ప్రాజెక్టు అనుకోవడానికి ఫైనల్ కావడానికి మధ్య చాలా వుంటుంది. నా మటుకు నేను ఏవీ పట్టించుకోను. మనకు రావాల్సింది మనకు వస్తుంది. ఒక్కోసారి నాలుగు సినిమాలు సెట్ అయిపోతాయి. ఒక్కోసారి ఒక్కటీ వుండదు. దేనికయినా నా ఫీలింగ్ ఒక్కటే.
*ఫీలింగ్ అంటే అడగాలనిపిస్తోంది. మీ వేదాంత ధోరణి సంగతేమిటి? ఆధ్యాత్మికత? తత్వ చింతన? ఏ దశలో వున్నారు మీరు?
అదంతా ఓ పెద్ద సబ్జెక్ట్ అండీ.
*ఫరవాలేదు చెప్పండి..అసలు మీకు ఎప్పటి నుంచి అలవాటైందీ వ్యవహారం.
చిన్నప్పటి నుంచి. అంటే టెన్త్ స్టేజ్ నుంచే. కాస్త పెద్దవాళ్లు కనిపిస్తే వాళ్లతో మాట్లాడడం. పూజలు, అమ్మవారు ఇలా చాలా.
*ఇంట్లో, బంధువుల్లో ఎవరి ప్రభావమన్నా పడిందా?
అదేం లేదండీ. పూజలు అంటే అమ్మ చేసేది. కానీ నాది కొంచెం దాని కన్నా ఎక్కువే. చదువు పూర్తయి ఇండియాకు వచ్చాక, ఒక దశ వచ్చేసరికి ఊ అంటే రుషీ కేష్ వెళ్లిపోయేవాడిని. కనిపించిన సాధువును పలకరించేవాడిని. అక్కడి సందుల్లో తిరిగేవాడిని. ఇంట్లో వాళ్లు కంగారు పడేవారు కూడా. వీడేమయిపోతాడో అని. ఆఖరికి సెట్ అయ్యాను.
*ఎలా? ఎక్కడ?
అణ్ణామలై వెళ్లాను. ఇంటకి వచ్చాను. ఆధ్యాత్మికత నుంచి తత్వ చింతన వైపు మళ్లాను. మొత్తం క్లీన్.
*అంటే దేవుళ్లు, పూజలు అన్నీ వదిలేసారా?
అవన్నీ మనిషి తత్వ చింతన వైపు మళ్లడానికి ఓ సాధనం మాత్రమే నండీ. ఆ దశ తరువాత ఈ దశ.
*కానీ నిత్యం పూజించే దేవుళ్లను వదిలేసి, చింతనలోకి మారడం చాలా కష్టమేమో?
చాలా కష్టం. దానికి చాలా ధైర్యం, ఇంకా చాలా కావాలి. అదృష్టం కొద్దీ నేను అది సాధించగలిగాను.
*ఇప్పుడు పూజలు మానేసి, చదవడం చేస్తున్నారా?
లేదు. ఆ స్టేజ్ కూడా దాటేసాను. ఇప్పుడు అంతా చింతన మాత్రమే. నాలో నేను. నాతో నేను.
*కానీ మీ కెరీర్, ఫ్యామిలీ, పిల్లలు ఇదంతా.
ఆ డిటాచ్ మెంట్ క్లియర్ గా వుందండీ. ఇదంతా మన డ్యూటీ. సిన్సియర్ గా చేయాలి. ఆ చేయడం లో కూడా కచ్చితంగా అన్నీ ఆలోచించాల్సిందే. ఏది మంచి, ఏది చెడు అన్నది చూడాల్సిందే. కెరీర్ అయినా, పిల్లలు, ఫ్యామిలీ అయినా. కానీ అదే సమయంలో ఆ స్పృహ వుండాలి. ఇది మన ఇల్లు కాదు. టెంపరరీ. మనం ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అన్న స్పృహ.
*ఆలోచన అంటారు? ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తుంటారు.
చెప్పనా? మరణం గురించి. చావు పుట్టుకుల గురించి. పూర్వ జన్మ వాసనల గురించి. మనం ఉత్తచేతులతో వచ్చాం. ఉత్త చేతులతో పోతాం అనుకుంటాం. కానీ మనతో మన పూర్వ జన్మ బ్యాగేజీ తెచ్చుకు వస్తాం. ఎవరి బ్యాగేజీ వారు జీవితాతం మోయాల్సిందే. దానికి అనుగుణంగానే ఈ జన్మలో మన జీవితం, పయనం, గమ్యం వుంటుంది అని నమ్ముతాను.
*మీ పిల్లలకు ఇవన్నీ చెబుతారా ?
నేను ఎవరికీ ఏమీ చెప్పను. ఎవరి బ్యాగేజీ వారికి వుంటుంది. జస్ట్ గైడ్ చేస్తానంతే. పిల్లలకే కాదు, ఎవరికీ చెప్పను. ఎవడి బాధలు వాడికి వుంటాయి. మనం చెప్తే, ఆ బాధల్లో వున్నవాడికి ఇవేవీ పట్టవు సరికదా? సుత్తిలా వుంటుంది. అందుకే నా పనేదో, నా ఆలోచనేదో నాది.
*మీ ఫాదర్ ఓ సామ్రాజ్యం నిర్మించి వెళ్లారు. మరి మీరు చూస్తే ఇలా. అదంతా ఎలా నడుస్తుంది?
లక్కీగా నాకు ఓ మాంచి అన్నయ్య దొరికాడు. ఆయన చూసుకుంటారు అంతా. నేనేమీ పట్టించుకోను. నాన్నగారు వున్నపుడు కూడా అనేవారు. కొంచెం వెళ్లు, చూడు. అని. నేను అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకునేది లేదు.
*ఈ తరహా చింతన వల్లనేనా, ఆన్ స్క్రీన్ తప్ప, ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా కనిపించరు మీరు?
అది కూడా కరెక్ట్ కాదేమో? ఎవరన్నా పిలిస్తే వెళ్లకుండా వుండను. వెళ్లిన తరువాత అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తాను. ఫుల్ గా ఇన్ వాల్వ్ అవుతాను. కానీ నా అంతట నేను రాసుకుని, పూసుకోను అంతే.
కమింగ్ బ్యాక్ కు గురు. ఈ సినిమా ఫినిష్డ్ ప్రోడక్ట్ చూసారా?
వై నాట్. చాలా బాగా వచ్చింది. చిరంజీవి గారు కూడా చూసారు. ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ గురించి ఆయనే అడిగారు. సినిమా చూడాలి. చూసాక మీతో ఆ గేమ్ ఆడాలి అని. చూపించాం. చూసి చాలా మెచ్చుకున్నారు. గేమ్ టైమ్ లో ఆయన ఆ సినిమా గురించి చాలా మాట్లాడారు.
*మల్టీ స్టారర్లు మసాలా మినహా అన్నీ హిట్ లే. మరి మళ్లీ ఏమన్నా చేస్తున్నారా?
వుందండీ. త్రివిక్రమ్ గారు చెప్పారు. ఏదో రెడీ చేస్తున్నా అని. చూడాలి.
*ఎనీథింగ్ ఎల్స్?
మంచి సినిమాలు మన వాళ్లు ఎప్పుడూ ఆదరిస్తారు. గురు కూడా చూడండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది. అది మాత్రం చెప్పగలను. అంతే.
విఎస్ఎన్ మూర్తి