ట్రయిలర్ చూస్తుంటే, మంచి అందమైన చిత్రానికి అంతకన్నా అందమైన ఫ్రేమ్ కట్టినట్లుంది..పేరు చూస్తే రభస..ఏమిటీ సంగతి?
మాస్ హీరోలకు మాంచి పవర్ ఫుల్ టైటిల్ కావాలి అందుకోసమే ఈ రభస. అంతకు మించేమీ కాదు. రభస అంటే చాలు ఆ సౌండింగ్ సూపర్ గా వుంటుంది. ఆ రభస ఎలా వుంటుందో థియేటర్ లో చూడండి
కందిరీగ, రభస..ఇలా నెగిటివ్ టైటిళ్లకు ఫిక్సయిపోయారా?
నెగిటివ్ అని కాదు. పవర్ ఫుల్.
రభస టైటిల్ కు సినిమా విడుదలకు ముందుగానే సార్థకత లభించేసిటన్లుంది?
(నవ్వేస్తూ) తప్పదు..చాలా వుంటాయి మరి..
కందిరీగకు రభస కు నడుమ మూడేళ్ల గ్యాప్?
కథ కోసమే ఇందతా అంతకు మించి మరేమీ కాదు.
అంతేనా..ఇంకా చాలా సంగతులు వినిపించాయే?
ఏం సంగతులు వినిపించాయి?
మీకు నిర్మాత బెల్లంకొండకు మధ్య గొడవలు జరిగాయని..ఆయన మిమ్మల్ని కొట్టారా?
అబ్బే అలాంటిదేం లేదు. అన్నీ చిన్న చిన్న గొడవలు.
దేనికోసం?
అంతా కథ కోసమే.
కథ కోసం గొడవలా..నమ్మే విషయమేనా?
నిజంగా, కథ బాగా రావాలనే తపన. ఆయనకైనా, నాకైనా. కందిరీగ విషయంలోనూ అదే జరిగింది. ఆఖరికి ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయ్యింది. ఆయన చెప్పినట్లు మార్చవడం వల్లే హిట్ కొట్టాను.
ఇక్కడ కేవలం కథ కోసమే అంత పెద్ద గొడవలయ్యాయా?
పెద్ద అని కాదు. తండ్రి కొడుకుల మధ్య గొడవల్లాంటివి. ఎన్ని అనుకున్నా..మళ్లీ తండ్రీ కొడుకు ఒకటేగా. అలా అన్నమాట.
ఆయన సెట్ లోకి వస్తే మీరు వెళ్లిపోయేవారని, మీరు వస్తే ఆయన వెళ్లిపోయేవారని?
అబ్బే అదేం లేదు. అసలు ఆయన సెట్ లోకి వస్తేగా..సినిమా ప్రారంభంలో , చివరిలో. అంత స్వేచ్ఛ ఇస్తారు దర్శకుడికి.
ఈ మాట నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నారా?
నిజంగానే అండి..
అయితే మళ్లీ బెల్లంకొండ మరో సినిమా చేయమంటే చేస్తారా?
లేదు..నాకు వేరే కమిట్ మెంట్ లు వున్నాయి.
ఈ సినిమాకు పబ్లిసిటీ వీక్ అన్న టాక్ వుంది.
అంటే..నా దృష్టికి కూడా వచ్చింది. పబ్లిసిటీ తక్కువగా వుందని. కానీ టీవీల్లో ప్రకటనలు, గోడలపై పోస్టర్లు బాగానే కనిపిస్తున్నాయి. మొదటి మూడు రోజుల టిక్కెట్లు అయిపోతున్నాయి. అంటే పబ్లిసిటీ బాగుందనే అనుకోవాలి మరి.
సినిమా ప్రారంభించాక కూడా చాలా గ్యాప్ కూడా వచ్చినట్లుంది?
అవును నాకు జాండీస్ రావడం వల్ల,. చాలా సివియర్ గా వచ్చింది. త్వరగా కోలుకున్నానంటే కారణం ఎన్టీఆరే. ఆయన ఇచ్చిన భరోసా, ధైర్యంతోనే రెండు నెలల్లో కోలుకున్నా.
సినిమా ఫైనల్ కాపీ ఎన్టీఆర్ చూసారా..ఏమన్నారు?
ఆయనకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చివరి ఇరవై నిమషాల్లో ఆడియన్స్ ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తారు. అంతబాగా చేసారు. అలాంటి నటుడు మనకు వుండడం అదృష్టం. నిజంగా అద్భుతంగా చేసారు.
మీరు అనారోగ్యంతో వున్నపుడు కొంత పార్ట్ షూట్ చేసారా?
కేవలం మూడు పాటలు తీసారు. డ్యాన్స్ డైరక్టర్ సహాయంతో. అయితే వాటికి ట్యూన్లు, లిరిక్స్ అన్నీ నేనే చూసుకున్నా బెడ్ మీద నుంచే.
ట్యూన్లు అంటే..ఈ సినిమా అడియో అంత బాగున్నట్లు లేదని..ఇచ్చిన ట్యూన్లే ఇచ్చారని టాక్?
లేదండీ..అడియో సూపర్ హిట్. ఎన్టీఆర్ రాకాసి..రాకాసి.. పాట సూపర్
ఎంత చెప్పినా ఆ ఒక్క పాట గురించేగా..
లేదండి..మిగిలినవి కూడానూ..మాంచి మాస్ ఆల్బమ్ ఇచ్చారు థమన్.
ఈ సినిమా కూడా పెద్ద హీరోల మూస ఫార్ములాలోనే సాగుతుందా?
ఫార్ములా అన్నది తప్పదండీ. ఒక్కోసారి ఒక్కో ఫార్ములా నడుస్తుంది. శివ టైమ్ లో శివ..సమరసింహారెడ్డి టైమ్ అది..ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ .
అంటే మీ సినిమా కూడా అదే బాటలో?
కరెక్టే. 300 మంది జీవితాలు ఆధారపడిన వ్యవహారం. ఇక్కడ రిస్క్ తీసుకోలేం.
రెండో సినిమా గండం. హిట్ కొట్టిన డైరక్టర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తే ఫ్లాప్ లాంటి సెంటిమెంట్ ల సంగతేమిటి?
నాకేమీ నమ్మకాలు లేవు,. నా స్క్రిప్ట్ మీదే నాకు నమ్మకం. నిజానికి ఇలాంటి విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. గ్రేట్ ఆంధ్రలో అనుకుంటాను చదివా. మంచికే అది కూడా. వాటివల్ల మరింత జాగ్రత్తగా పనిచేసాను.
సినిమా జోనర్ ఫ్యామిలీ కామెడీ ?..ఎంటర్ టైన్ మెంటా?
ఎంటర్ టైన్ మెంటే. ఎంటర్ టైన్ మెంట్ అయితే సిట్యువేషనల్ కామెడీ వస్తుంది. అప్పుడే అది పండుతుంది.
బ్రహ్మానందం మళ్లీ షరా మామూలేనా?
ఎన్టీఆర్-బ్రహ్మానందం కాంబినేషన మళ్లీ అదుర్స్ ను గుర్తుకు తెస్తుంది.
సమంత-ప్రణీతలను బాగానే బ్యాలెన్స్ చేసారా?
హీరో బ్యాలెన్స్ చేసారు. కానీ జనం కళ్లు ఇద్దరు హీరొయిన్లున్నా, ఎన్టీఆర్ పైనే వుంటాయి.
అంటే వాళ్లకి అస్సలు ప్రాధాన్యత లేదా?
అలా అని కాదు. వాళ్ల కన్నా అందంగా వుంటారు ఎన్టీఆర్ ఈ సినిమాలో. కళ్లన్నీ ఆయనపైనే. అసలు మేము అలాగే అనుకున్నాం..అలాగే తీసాం. అందువల్ల సమంత,ప్రణీత వున్నా చూపులన్నీ ఎన్టీఆర్ పైనే.
ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను అందుకుంటారా?
నేను పెద్ద అభిమానిని. అందరు హీరోలకు. అందువల్ల అభిమానులకు ఏం కావాలో నాకు తెలుసు. అదే చేసాను..తీసాను..చూపించాను.
అంటే ధైర్యంగా చూసేయచ్చంటారు అభిమానులంతా?
తప్పకుండా..వారు ఆనందించే రేంజ్ లో వుంటుందీ సినిమా.
థాంక్యూ
థాంక్యూ. గ్రేట్ ఆంధ్రా పాఠకులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
చాణక్య