అర్జున్ టెండూల్కర్.. విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు. తన తండ్రి వలె తను కూడా క్రికెటర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడనే వార్తలు ఇతడి విషయంలో చాలానే వచ్చాయి. బ్యాటర్ కాకపోయినా, అర్జున్ బౌలర్ గా సత్తా చూపే ప్రయత్నంలో ఉన్నాడనే వార్తలూ వచ్చాయి. ఆ మేరకు వివిధ స్థాయిల్లో అర్జున్ టెండూల్కర్ ఆడుతూ వస్తున్నాడు.
ఈ క్రమంలో సచిన్ తనయుడిని ముంబై ఇండియన్స్ ఎప్పుడో తన డగౌట్లో కూర్చోబెట్టుకుంది. రెండేళ్లుగా అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ క్యాంపులో ఉన్నాడు. అయితే వరసగా రెండో సీజన్లో కూడా ఇతడికి ఆరంగేట్రం అవకాశం రాకపోవడం విశేషం.
సచిన్ తనయుడిని ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. గత సీజన్లోనూ ఇతడిని నెట్స్ కే పరిమితం చేసింది. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది! మరి ఇంతకీ అర్జున్ కు ముంబై ఇండియన్స్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? ఎప్పటికి ఇస్తుంది? అనేది చర్చగా మారింది.
అందులోనూ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన పరమ పేలవంగా ఉంది. ఇలాంటి సమయంలో మార్పు చేర్పులు వేగంగా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అర్జున్ టెండూల్కర్ కు రిలయన్స్ వాళ్లు చాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
ముప్పై లక్షల ధరకు అర్జున్ టెండూల్కర్ ను ముంబై జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. చాలా సాధారణ ధరే. ఇక్కడ ధర సంగతెలా ఉన్నా.. సచిన్ కొడుకు ఏ రేంజ్ క్రికెటరో తెలుసుకోవాలనే వారి కోసం అయినా.. ముంబై ఇండియన్స్ అతడికో అవకాశం ఇవ్వాల్సి ఉంది!
కేవలం బెంచ్ కు పరిమితం చేసేట్టు అయితే కొనుగోలు ఎందుకు చేసినట్టు? ఇలా ఛాన్సులే ఇవ్వకపోతే.. అది అర్జున్ కెరీర్ కు కూడా ఏమంత సాయం చేసేది కాకపోవచ్చు!