‘సరిపోదా’ స్టోరీ చెప్పేసిన సూర్య

వారంలో అయిదు రోజులు మామూలు మాణిక్యంలా వుంటే కుర్రాడు శనివారం మాత్రం భాషా మాదిరిగా వుంటాడు.

సినిమా ప్రారంభానికి ముందే తన సినిమా స్టోరీ లైన్ చెప్పడం అన్నది దర్శ‌కుడు రాజ‌మౌళి స్టయిల్. స్టోరీ తెలిసేలా ట్రయిలర్ కట్ లోనే చెప్పేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. సాధారణంగా థ్రిల్లర్ టచ్ వున్న సినిమాలకు కథ ను రివీల్ చేయరు. చేయడం కష్టం కూడా. కానీ దర్శకుడు ఎస్ జె సూర్య తాను విలన్ గా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా కథను కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్లు చెప్పేసారు.

‘సినిమా కథను ముందుగా చెప్పయచ్చు. ఎందుకంటే కథలు పెద్దగా కొత్తగా వుండవు. ఎలా చెప్పామా? అన్నదే కొత్తగా వుండాలి’ అని సూర్య ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు. భాషా సినిమా నుంచి ఇంద్ర, సమరసింహారెడ్డి వరకు లైన్ ఒక్కటే. జానర్ ఒక్కటే, దాని చుట్టూ ఎలాంటి కథ అల్లుకున్నామా? అన్నదే సక్సెస్ పాయింట్ అని సూర్య వివరించారు.

ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా కథ కూడా అలాంటిదే అని సూర్య వెల్లడించారు. వారంలో అయిదు రోజులు మామూలు మాణిక్యంలా వుంటే కుర్రాడు శనివారం మాత్రం భాషా మాదిరిగా వుంటాడు. ఎందుకంటే చిన్నపుడు తల్లికి మాట ఇచ్చాడు. విపరీతమైన కోపం వున్న కుర్రాడి దగ్గర నుంచి తల్లి మాట తీసుకుంటుంది. కోపాన్ని అన్ని రోజులు కాకుండా వారంలో ఒక్క రోజు మాత్రం చూపించమని. అందుకే హీరో కోపాన్ని చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు. ఇదీ కథ అని చెప్పేసారు.

నిజానికి ఇది ఇంట్రస్టింగ్ లీడ్ పాయింట్ మాత్రమే. పైగా జ‌నాలను థియేటర్ కు డ్రయివ్ చేసే పాయింట్. వారం రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వుండడం, ఒక్క రోజు దాన్ని వెళ్లగక్కడం అన్నది చూసే ప్రేక్షకులకు హై ఇస్తుంది. వాళ్లకు తెలుసు. శనివారం వస్తే హీరో రెచ్చిపోతాడని, అలా శనివారం వచ్చేసరికి థియేటర్లో ఓ విధమైన హై ఆక్టివిటీ అనేది తెలియకుండానే అలుముకుంటుంది.

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఈ నెల చివరిలో విడుదలవుతోంది. డివివి దానయ్య నిర్మాత.

7 Replies to “‘సరిపోదా’ స్టోరీ చెప్పేసిన సూర్య”

Comments are closed.