1994 డిసెంబరులో పేపర్లకు ఎక్కిన ఇస్రో గూఢచర్యం కేసులో నిందితుడు నంబి నారాయణన్‌ను యీ ఏడాది సెప్టెంబరులో నరేంద్ర మోదీ కలిశారు. ఎందుకు? ఆయనకూ, యీయనకూ లింకేమిటి? అని ఆశ్చర్యపడుతున్నారా? ఉంది ఓ బాదరాయణ సంబంధం! మోదీ ప్రభుత్వంపై ఒక బోగస్ ఎన్‌కౌంటర్ కేసు నడుస్తోంది. గుజరాత్‌కు డిజిపిగా పని చేసిన ఆర్.బి.శ్రీకుమార్ కోర్టులో 'సొహ్రాబుద్దీన్ తదితరులను హత్య చేసి దాన్ని ఎన్‌కౌంటర్‌గా చూపమని మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా తనను ఆదేశించారని' చెప్పాడు. అది మోదీకి, బిజెపికి పెద్ద తలకాయనొప్పిగా తయారైంది. వాళ్ల తక్షణ కర్తవ్యం – ఈ శ్రీకుమార్ విశ్వసించదగిన వ్యక్తి కాదు అని నిరూపించడం. దానికై అతని పాత చరిత్రంతా తవ్వితీశారు. దానిలో 1994 నాటి ఇస్రో కేసు తీగ తగిలింది. లాగితే డొంక కదిలింది.
ఇస్రోలో పనిచేసే నంబి నారాయణన్, డి.శశికుమారన్ అనే యిద్దరు సైంటిస్టులు రాకెట్లలో వుపయోగించే క్రయోజనిక్ టెక్నాలజీని విదేశాలకు అమ్ముకుంటున్నారనే వార్త బయటకు వచ్చింది. వారికి యిద్దరు మాల్దీవు దేశస్తులైన యువతులు సహకరించారని కూడా ఆరోపణ. కేసు పెట్టి నారాయణన్‌ను జైల్లో పడేశారు. 50 రోజులపాటు హింసించారు. ఇస్రో ఖ్యాతి దెబ్బతింది. వాళ్లు ఆ టెక్నాలజీపై ఆధారపడి తయారుచేసిన జిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం నిలిపివేశారు. నారాయణన్ ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో కెమికల్ రాకెట్ ప్రొపల్షన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, యు.ఆర్.రావు వంటి మహానుభావుల వద్ద పనిచేశారు. ఇస్రోలో అతనికి ఎంతో పేరుంది. సిబిల్ మాథ్యూస్ అనే పాత్రికేయుడు, అప్పటి కేరళ పోలీసు అధికారి శ్రీకుమార్ కలిసి తనను కావాలని యిరికించారని నారాయణన్ వాపోయాడు.
కేసు పెద్దది కావడంతో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ రాజీనామా చేశారు. సిబిఐకు అప్పగించారు. విచారణ జరిపి నారాయణన్ నిర్దోషి అని సిబిఐ క్లియర్ చేసింది. ఇస్రోలో మళ్లీ ఉద్యోగం యిచ్చారు. 1998లో సుప్రీం కోర్టు విచారించి, నిందితులందరినీ నిర్దోషులుగా నిశ్చయించి విడిచిపెట్టింది. నారాయణన్ వదిలిపెట్టలేదు. తనకు నష్టపరిహారం కావాలని 1999లో కేసు వేశాడు. 2001లో హ్యూమన్‌రైట్స్ కమిషన్‌వారు కేరళప్రభుత్వం కోటి రూ.ల పరిహారం యివ్వాలని తీర్పు చెప్పింది. వాళ్లు యివ్వలేదు. ఈయన హైకోర్టుకి వెళితే మొదట రూ.10 లక్షలు ఎడ్వాన్సుగా యిమ్మనమని 2012లో తీర్పు చెప్పింది. ఇదంతా శ్రీకుమార్ నిర్వాకం అని, వాళ్లు ఇస్రో కేసులో వృత్తిపరమైన పరిధులు దాటి ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి. కేరళ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. కేసులు విత్‌డ్రా చేసుకోమని సిబిఐ సిఫార్సు చేయడంతో 2012లో కేసు మూసేసింది.
ఇది బిజెపికి కలిసివచ్చింది. సొహ్రాబుద్దీన్ కేసులో కూడా శ్రీకుమార్ అనుచితంగా వ్యవహరించాడని చూపడానికి, అతని తరహాయే అంత అనడానికి ఇస్రో కేసు అనువుగా వుంది. సెప్టెంబరులో మోదీ కేరళ వచ్చినపుడు స్థానిక బిజెపి నాయకులు నంబి నారాయణన్‌కు కబురుపెట్టారు. ఆయన వెళితే మోదీ మీకేసు సంగతేమిటన్నాడు. శ్రీకుమార్ తనను ఎలా వేధించాడో యీయన అంతా చెప్పాడు. ఏ వ్యక్తికీ యిలాటి కష్టం రాకూడదంటూ ఓదార్చి పంపాడు మోదీ. బిజెపి పార్టీ తన డిఫెన్సు కోసం నారాయణన్‌ను వాడుకుని వదిలేస్తుందో, లేక తను అధికారంలోకి వస్తే ఆయనకు న్యాయం చేకూరుస్తుందో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్