ఎమ్బీయస్‍: సినీ స్నిప్పెట్లు: ‘ఇత్తెఫాక్’, యాదృచ్ఛికమైన ఓ మలుపు

నాటకాన్ని సినిమాకు అనుగుణంగా మార్చే పని జిఆర్ కామత్‌కు అప్పగించారు. అఖ్తర్ ఉల్ ఇమాన్‌ని మాటలు రాయమన్నారు.

హిందీ సీమలో తొలి సూపర్ స్టార్‌గా వన్నె కెక్కిన రాజేశ్ ఖన్నా దశ తిప్పిన సినిమా ‘‘ఇత్తెఫాక్’’ (1969). ద యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అనే హిందీ సినిమా నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కలిసి సంయుక్తంగా 1965లో నిర్వహించిన టాలెంట్ కాంటెస్ట్‌లో 22 ఏళ్ల రాజేశ్ ఖన్నా (అప్పట్లో అతని పేరు జతిన్ ఖన్నా) ప్రథముడిగా ఎన్నికయ్యాడు. ఎంపికైన వాడికి తమ సినిమాల్లో ఛాన్సులిస్తామని ఆ నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. కానీ దాన్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తూ వచ్చారు. వారిలో ఒకరైన జి.పి.సిప్పీ (తర్వాతి రోజుల్లో ‘‘షోలే’’ తీశారు) ‘‘రాజ్’’ (1967 – హీరోయిన్ బబిత) అనే సినిమా తీస్తూ ద్విపాత్రాభినయం చేసే అవకాశం యిచ్చారు. ఆ సినిమా విడుదల కావడానికి ముందే దేవ్ ఆనంద్ అన్నగారు చేతన్ ఆనంద్ ‘‘హకీకత్’’ (1964) అనే విజయవంతమైన భారీ సినిమా తర్వాత 15 నెలల పిల్లవాణ్ని ప్రధాన పాత్రలో పెట్టి హీరోయిన్ (ఇంద్రాణీ ముఖర్జీ) ఓరియెంటెడ్‌గా తీసిన ‘‘ఆఖ్రీ ఖత్’’ సినిమాలో హీరో వేషం యిచ్చారు. అది ‘‘రాజ్’’ కంటె ముందుగా, 1966లో రిలీజైంది.

మ్యూజికల్ రొమాంటిక్ కామెడీలు తీయడంలో ప్రసిద్ధుడైన నసీర్ హుస్సేన్ ‘‘బహారోంకె సప్నే’’ (1967 – హీరోయిన్ ఆశా పరేఖ్) అనే సోషల్ డ్రామా తీస్తూ దానిలో రాజేశ్‌ను హీరోగా తీసుకున్నాడు. జెమినీ వారి ‘‘ఔరత్’’ (1967 – తెలుగులో ‘‘పిన్ని’’కి రీమేక్)లో హీరోయిన్ పద్మినికి రాజేశ్ తమ్ముడిగా వేశాడు. ‘‘శ్రీమాన్‌జీ’’ (1968) అనే కిశోర్ కుమార్ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమాలేవీ ఆడలేదు. అయినా యితన్ని సెలక్టు చేసిన కమిటీలో సభ్యుడైన శక్తి సామంత ‘‘ఆరాధనా’’ (1969)లో, రాజ్ ఖోస్లా ‘‘దో రాస్తే’’ (1969)లో హీరోగా బుక్ చేశారు. ఈ రెండూ సూపర్ హిట్స్. ఐతే అదే సంవత్సరం వీటి కంటె ముందే రిలీజైన సినిమా ‘‘ఇత్తెఫాక్’’. అదే రాజేశ్ ఖన్నా మొదటి హిట్ సినిమా కూడా! టేలంట్ కాంటెస్ట్ నిర్మాతల్లో ఒకడైనా బిఆర్ చోప్డా అతనికి ఆ ఛాన్సిచ్చాడు.

బిఆర్ చోప్డా, తన తమ్ముడు యశ్ చోప్డా దర్శకత్వంలో ‘‘ఆద్మీ ఔర్ ఇన్‌సాన్’’ (1969) అనే భారీ సినిమాను ధర్మేంద్ర, సైరా బాను, ఫిరోజ్ ఖాన్‌లతో తీస్తున్నాడు. మధ్యలో సైరా బాను కాలికి దెబ్బ తగలడంతో ఆమె లండన్ వెళ్లి ట్రీట్ చేయించుకోసాగింది. దాంతో ఫైనల్ షెడ్యూల్ ఆగిపోయింది. రెండు నెలల దాకా ఖాళీగా కూర్చోవడమెందుకు, యీ లోపున ఓ చిన్న సినిమా లాగించేస్తే మంచిదని యశ్‌కు, వాళ్లన్నయ్యకు తోచింది. సబ్జక్టు కోసం వెతికారు. ‘‘ధుమాస్’’ (పొగమంచు) అనే ఒక గుజరాతీ నాటకం కనబడింది. రాసినది ప్రవీణ్ జోషీ. అతని తమ్ముడు, నేటి హీరో శర్మాన్ జోషీ తండ్రి ఐన అరవింద్ జోషీ ఆ నాటకం హీరో. దీనికి ఆధారం ‘‘సైన్‌పోస్ట్ టు మర్డర్’’ అనే 1962 నాటి ఇంగ్లీషు డ్రామా, దానిపై ఆధారపడి తీసిన 1964 నాటి సినిమా!

భార్యను చంపాడన్న అభియోగంతో పారిపోతున్న ఓ వ్యక్తి ఒక యింట్లో చొరబడి అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను బెదిరిస్తాడు. పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వస్తారు. తను చెప్పినట్లుగా వారికి చెప్పమని యితను ఆ మహిళను బెదిరిస్తాడు. తీరా చూస్తే అమాయకురాలిగా, భీతావహగా కనబడిన ఆమె కుటిలురాలు. తన భర్తను చంపి, లోపల దాచింది. చివర్లో యీ వ్యక్తి తన భార్యను చంపలేదని కూడా తేలుతుంది. కథంతా ఒక రాత్రిలో, ఒకే సెట్‌లో నడుస్తుంది. పాటలేవీ పెట్టకుండా, నెల్లాళ్లలో షూట్ చేసి, 40 రోజుల్లో సినిమాను విడుదల చేసేయవచ్చని చోప్డా సోదరులకు తోచింది. అప్పట్లో హిందీ సినిమా అంటే ఏడాది పట్టేది. దీన్ని 1969 సెప్టెంబరు 1న ప్రారంభించి, అక్టోబరు 10న రిలీజ్ చేసేశారు.

నాటకాన్ని సినిమాకు అనుగుణంగా మార్చే పని జిఆర్ కామత్‌కు అప్పగించారు. అఖ్తర్ ఉల్ ఇమాన్‌ని మాటలు రాయమన్నారు. ఈ సినిమాలో రెండే ముఖ్య పాత్రలు. అవి వేసే నటీనటులు నెల్లాళ్ల పాటు ఖాళీగా దొరికితే చాలు, వాళ్లని పెట్టి సినిమా తీసేయవచ్చు. హీరోయిన్ పాత్రధారిణి ఎవరన్నది ముఖ్యం. ఆమె దుర్మార్గురాలన్నది చివర్లో ట్విస్టు. అది పేలాలంటే వ్యాంప్ యిమేజి లేని అమాయకపు ఫేస్ హీరోయిన్ కావాలి. రాఖీని అనుకున్నారు. కానీ ఆమె ‘‘జీవన్ మృత్యు’’ సినిమా నిర్మాణంలో రాజశ్రీ వారి కాంట్రాక్ట్‌లో ఉంది. నందా డేట్స్ ఖాళీగా ఉన్నాయి. ‘‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’’ (1965), ‘‘గుమ్‌నామ్’’ (1965) వంటి హిట్ సినిమాల ద్వారా రొమాంటిక్ యిమేజి కూడా తెచ్చుకుంది. ఇక హీరోగా ఏ యిమేజి లేని కొత్త మొహం ఎవరున్నా ఫర్వాలేదనుకుని నాలుగు వరస ఫ్లాప్స్‌తో ఉన్న రాజేశ్‌ను బుక్ చేశారు. అప్పటికే అతని ‘‘ఆరాధనా’’, ‘‘దో రాస్తే’’ షూటింగు పూర్తయి, ఖాళీగా ఉన్నాడు. పెద్ద బ్యానర్ కదాని రాజేశ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ‘‘ఆద్మీ ఔర్ ఇన్‌సాన్’’లోని పాట ‘‘జిందగీ ఏక్ ఇత్తెఫాక్ హై’’ పాట పల్లవిలో పదాన్ని తీసుకుని సినిమాకు మకుటంగా పెట్టారు. యాదృచ్ఛికం అని దాని అర్థం.

పొద్దున్నే షూటింగుకి రావడమనేది రాజేశ్ నిఘంటువులో లేదు. పెద్ద స్టారయ్యాక మాత్రమే కాదు, మొదటి సినిమా నుంచి అదే తంతు. అయితే యీ సినిమా ఒక్క దానిలో మాత్రమే మినహాయింపు యిచ్చాడు. టైముకి వచ్చి, రిహార్సల్స్ చేసి శ్రద్ధగా నటించాడు. సినిమా నిడివి తక్కువ కావడంతో ఇంటర్వెల్‌కి ముందు ‘‘బాంబేమే మధుచంద్ర్’’ అనే ఓ డాక్యుమెంటరీని చూపించి, ఇంటర్వెల్ తర్వాత సినిమా వేశారు. సలిల్ చౌధురి నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. సినిమా సూపర్ హిట్ అయింది. యశ్ చోప్డాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ ఎవార్డు వచ్చింది. రాజేశ్ అదృష్టమేమిటంటే అదే ఏడాది చివర్లో రిలీజైన ‘‘ఆరాధనా’’, ‘‘దో రాస్తే’’ కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అతను మళ్లీ వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం పడలేదు. ఈ సినిమా అతని నటజీవితంలో ఓ యాదృచ్ఛికమైన, అదృష్టకరమైన మలుపుగా సంభవించింది.

‘‘ఇత్తెఫాక్’’ విజయం చూసి తెలుగు నిర్మాత డి రామానాయుడు ‘‘ద్రోహి’’ (1970) సినిమాను జగ్గయ్య, వాణిశ్రీలతో తలపెట్టారు. కె. బాపయ్య తొలిసారి దర్శకత్వం చేపట్టి, కథను సెంటిమెంటల్‌గా మార్చారు. దీనిలో హీరోయిన్ మంచిదే. ఇంట్లోకి చొరబడి, ఆమెను అడలగొట్టిన జగ్గయ్య చివర్లో ఆమె తండ్రి అని, గతంలో చాలా అన్యాయానికి గురయ్యాడని తేలుతుంది. జగ్గయ్య ఓవరాక్షన్ ప్రజలకు విసుగు పుట్టించింది. సినిమా క్లయిమాక్స్‌లో వాణిశ్రీ తుపాకీ తీసుకుని జగ్గయ్యకు గురి పెట్టి కాల్చేస్తా అని బెదిరిస్తే ప్రేక్షకుల్లోంచి ‘కాల్చేయ్, కాల్చేయ్’ అనే అరుపులు వినబడ్డాయని రామానాయుడే చెప్పేవారు. ఆ ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి రామానాయుడు మరింత రిస్కు తీసుకుని ‘‘ప్రేమనగర్’’ (1971) తీస్తే, అది బ్రహ్మాండంగా విజయవంతమై సంస్థను నిలబెట్టింది. దాని హిందీ వెర్షన్‌లో రాజేశ్ ఖన్నా హీరోగా వేశాడు.

ఇక ‘‘ఇత్తెఫాక్’’ విషయానికి వస్తే దాని యిన్‌స్పిరేషన్‌తో, కొత్త మలుపులతో బిఆర్ చోప్డా మనుమడు అభయ్ చోప్డా 2017లో అదే పేరుతో మరో సినిమా అక్షయ్ ఖన్నా, సిద్ధార్థ్ మల్‌హోత్రా, సోనాక్షి సిన్హాలతో తీశాడు. అదీ హిట్ అయింది.

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

22 Replies to “ఎమ్బీయస్‍: సినీ స్నిప్పెట్లు: ‘ఇత్తెఫాక్’, యాదృచ్ఛికమైన ఓ మలుపు”

  1. MBS Prasadam, nuvvu rajesh kanna ni pradhama vibhatki lo sambodisthe, prathi maryada ga ninnu kooda MBS prasad ala rasadu,

    gaddam geekudu meeda modati sari article rasaDU ani memu sambhodistham.

    ee so called political analist yelativadante,

    result mundu opinion bayata pettadu, results vaccha odinavaru yeduku odaro karanalu rasthadu !!!

  2. MBS Prasadam, nuvvu rajesh kanna ni pradhama vibhatki lo sambodisthe, prathi maryada ga ninnu kooda MBS prasad ala rasadu,

    gaddam geekudu meeda modati sari article rasaDU ani memu sambhodistham.

  3. బి ఆర్ చోప్రా (ప్డా???) అంటే హిందీ లో మహాభారత్ తీసిన అతనేనా ???!!!

  4. ప్రసాద్ గారు ఈ పాత సినిమా కబుర్లకేం గానీ

    . నాలుగురూ సలహాదార్లని కూటమి నియమించింది. వెయిటింగ్ ఫార్ మీ comparative analysis!!

    1. అలాగే, first మీరు కొంచం పైసలు పంపించండి అప్పుడు చూద్దాం ఎవరికి అనుకూలంగా రాయాలో.

  5. ఇత్తెఫాక్ ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం. పాటలు లేని సినిమా ఊహించలేని రోజుల్లో వచ్చిన సస్పెన్స్ చిత్రం ఇది. బీఆర్‌చోప్డా అంతకు ముందే కానూన్ పేరుతో ఒక పాటలు లేని చిత్రం తీసారు (దాని గురించి కూడా ప్రసాద్‌గారు ఎక్కడో రాసారని ఙాపకం). ఇక పోతే ద్రోహి సినిమా శివాజీగణేశన్ నటించిన ఒక తమిళ చిత్రానికి రీమేక్ అనుకుంటాను. జగ్గయ్య తన ధోరణిలో నటించబోతే నిర్మాత, దర్శకుడు వచ్చి శివాజీలాగా నటించమన్నారట. “ఆ తరహా నటన నేను చేస్తే చూడరు” అని జగ్గయ్య చెప్పినా వినకపోవడంతో అతిగా నటించారట.

  6. ఇ..త్తె..ఫా..క్ ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం. పాటలు లేని సినిమా ఊహించలేని రోజుల్లో వచ్చిన సస్పెన్స్ చిత్రం ఇది. బీఆర్‌చోప్డా అంతకు ముందే కానూన్ పేరుతో ఒక పాటలు లేని చిత్రం తీసారు (దాని గురించి కూడా ప్రసాద్‌గారు ఎక్కడో రాసారని ఙాపకం). ఇక పోతే ద్రో..హి సినిమా శివాజీగణేశన్ నటించిన ఒక తమిళ చిత్రానికి రీమేక్ అనుకుంటాను. జగ్గయ్య తన ధోరణిలో నటించబోతే నిర్మాత, దర్శకుడు వచ్చి శి..వా..జీలాగా నటించమన్నారట. “ఆ తరహా నటన నేను చేస్తే చూడరు” అని జగ్గయ్య చెప్పినా వినకపోవడంతో అతిగా నటించారట.

  7. ఇ..త్తె..ఫా..క్ ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం. పాటలు లేని సినిమా ఊహించలేని రోజుల్లో వచ్చిన కొత్త తరహా చిత్రం ఇది. బీఆర్‌చో..ప్డా అంతకు ముందే కా..నూ..న్ పేరుతో ఒక పాటలు లేని చిత్రం తీసారు (దాని గురించి కూడా ప్రసాద్‌గారు ఎక్కడో రాసారని ఙాపకం). ఇక పోతే ద్రో..హి సినిమా శి.. వా…జీ..గణే.. శన్ నటించిన ఒక తమిళ చిత్రానికి రీమేక్ అనుకుంటాను. జ.. గ్గ..య్య తన ధోరణిలో నటించబోతే నిర్మాత, దర్శకుడు వచ్చి శి..వా..జీలాగా నటించమన్నారట. “ఆ తరహా నటన నేను చేస్తే చూడరు” అని జ.. గ్గ..య్య చెప్పినా వినకపోవడంతో అ..తిగా నటించారట.

  8. ఇ..త్తె..ఫా..క్ ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం. పాటలు లేని సినిమా ఊహించలేని రోజుల్లో వచ్చిన కొత్త తరహా చిత్రం ఇది. బీఆర్‌చో..ప్డా అంతకు ముందే కా..నూ..న్ పేరుతో ఒక పాటలు లేని చిత్రం తీసారు (దాని గురించి కూడా ప్రసాద్‌గారు ఎక్కడో రాసారని ఙాపకం).

    1. నాకు తెలిీసి తమిళ ఒరిజినల్ లేదు. జగ్గయ్య మొహమాటాలకు లొంగే నటుడు కాదు. పైగా బాపయ్యకు తొలి చిత్రం. ప్రేమనగర్ కు ముందు రామానాయుడు పెద్ద నిర్మాత కాదు. జగ్గయ్య కాలిక్యులేషనే తప్పి ఉంటుంది. అప్పట్లో ‘‘కోటీశ్వరుడు’’ (దైవమగన్) వంటి శివాజీ డబ్బింగులకు జగ్గయ్య వాయిస్ యివ్వడం వరుసగా జరిగాయి. అవి హిట్ కావడంతో జగ్గయ్య ఆ ప్రభావంలో పడి ఉంటారు. ముఖ్యంగా సినిమాలో డ్రామా, మెలో డ్రామా పండలేదు.

Comments are closed.