మన పౌరాణిక సినిమాల రచయితలు, దర్శకులు మూలకథను సంస్కృత పురాణాల నుంచి, తెలుగు పురాణాల నుంచే కాకుండా, యితర భాషల్లో రాసిన పురాణాల నుంచి కూడా తీసుకుని మార్పులు చేర్పులు చేసుకున్నారు. ప్రస్తుతం రాముని జననంతో మొదలుపెట్టి సీతారామకల్యాణం వరకు పురాణాలలో వున్న విషయం ఏమిటో, దాన్ని ''సీతారామ కల్యాణం'' సినిమాలో, ''సంపూర్ణ రామాయణం''లో సీతారామకల్యాణం వరకు చూపించిన భాగంలో చూపించినపుడు ఎలాటి మార్పులు చేశారో ఆ వైనం చూద్దాం. ఈ సందర్భంగా రామకథను కూడా చర్చిద్దాం. మొదట రామావతారానికి ఎందుకింత ప్రాముఖ్యత యిస్తున్నామో తెలుసుకుందాం. విష్ణువు అనేక అవతారాలు ఎత్తినా ముఖ్యమైనవి మత్స్య, కూర్మాది పది అవతారాలు. అవి మన సృష్టిక్రమంలో కాస్త మ్యాచ్ అవుతాయి కూడా. భూమి పుట్టాక మొదట వచ్చినవి జలచరాలు. మత్స్య అవతారం దానికి రిలేట్ అవుతుంది. తర్వాతది ఉభయచరాలు అంటే నీటిలోనూ, నేలమీదా నడిచేవి. తాబేలు లాటివి. అది రెండో అవతారం. తర్వాతది క్షీరదాలు. పాలిచ్చే జంతువులు. వరాహం అదే. ఆ తర్వాతది సగం జంతువు, సగం మనిషి. నారసింహుడు. ఆ తర్వాత వచ్చేది వామనుడు. పొట్టివాడైన మానవుడు. నెక్స్‌ట్ పరశురాముడు, గొడ్డలి పట్టిన ఆటవిక జాతి మనిషి వంటివాడు. అడ్డువచ్చినవాళ్లను నరకడమే తప్ప పరిపాలించవలసిన అవసరం లేదు. తర్వాత వచ్చినది రాముడు. పురుషోత్తముడు. పరిపూర్ణమానవుడు. ఒక ఫ్యామిలీమ్యాన్‌గా ఎలా వుండాలి, ఒక పరిపాలకుడిగా ఎలా వుండాలి అన్నది చేసి చూపించాడు. అదే రామాయణం – రాముడు చూపిన బాట.
ఇవన్నీ చేసేటప్పుడు రాముడు ఏ మహిమలూ చూపించలేదు. మామూలు మనిషికి వుండే శక్తియుక్తులే అతనికి వున్నాయి. అందుకే సీతను ఎవరో ఎత్తుకుపోయినపుడు అతనూ చెట్టును, పుట్టనూ, పక్షినీ, పశువునూ అడిగాడు తప్ప దివ్యదృష్టితో ఎక్కడుందో కనుక్కోలేదు. రామాయణం ద్వారా మనకు పెద్దలు చెప్పే సందేశం యిదే. మామూలు మనిషి అనుకరించదగిన వ్యక్తిత్వం రాముడిది. మనం కావాలనుకున్నా కృష్ణుడిలా చక్రం తిప్పలేం. విశ్వరూపప్రదర్శన చేయలేం. కానీ రాముడిలా పితృవాక్యపరిపాలన చేయగలం, ఏకపత్నీవ్రతం ఆచరించగలం. మంచి స్నేహితుడిగా, మంచి సోదరుడిగా, మంచి నాయకుడిగా, మంచి పరిపాలకుడిగా వుండగలం. ఈ నీతి చెప్పడానికి వాల్మీకి ఆరు కాండాలుగా, అంటే ఆరు చాప్టర్లగా రామాయణగాథను చెప్పాడు. అయితే దీన్ని ప్రచారం చేయడం ఎలా? కుశీలవులు అనే వీధిగాయకులకు నేర్పితే వారు ఈ కథను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే వివిధ ప్రాంతాలకు ఆ కథ వెళ్లినపుడు అక్కడ తెలిసో, తెలియకో కథలో మార్పులు, చేర్పులు జరిగాయి. పాఠాంతరాలు వచ్చాయి. వాల్మీకి యిన్‌స్పిరేషన్‌తో ఆ కథను తర్వాతి రోజుల్లో తిరగ రాసినవారు కొన్ని మార్పులు చేశారు. ఇంకొందరు ఏకంగా వాల్మీకి రామాయణంలో అనేక ప్రక్షిప్తాలు అంటే యింటర్ పొలేషన్స్, వేరేది పట్టుకువచ్చి దీనిలో దూర్పేయడాలు చేసేశారు. ఉత్తరకాండ అని చివర్లో ఒక చాప్టర్ చేర్చేశారు. సీతాపరిత్యాగం దానిలోదే! అసలైన వాల్మీకి రామాయణం రామపట్టాభిషేకంతో అయిపోతుంది. అంతవరకే మనకు ఆథెంటిక్.
భారతదేశంలో కోసలదేశం వుంది. దానికి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకు వంశీయుడైన దశరథుడు ఆ రాజ్యాన్ని ఏలుతున్నాడు. అతనికి ప్రధానమైన రాణులు ముగ్గురున్నా పిల్లలు లేరు. ఆ దిగులు ఆయన్ని పీడిస్తోంది. రాజుకి వశిష్ఠుడు, వామదేవుడు అనే మహర్షులు ముఖ్యపురోహితులు. వాళ్లు అశ్వమేధయాగం చేయమని సలహా యిచ్చారు. దాని తర్వాత పుత్రకామ యిష్టి అనే యాగం చేయమన్నారు. దీనికి పౌరోహిత్యం వహించగలిగినది ఋశ్యశృంగుడు ఒక్కడే అన్నారు. ఈ ఋశ్యశృంగుడు మహా శక్తి సంపన్నుడు. అంగరాజ్యాధిపతి రోమపాదుడు తన రాజ్యంలో వర్షాలు కురవకపోతే అడవిలోవున్న ఋశ్యశృంగుణ్ని మాయోపాయంతో తన నగరంలో అడుగుపెట్టేట్టు చేశాడు. అతను అడుగుపెట్టగానే వర్షాలు కురిసాయి. అప్పుడు రాజు అతను మళ్లీ నగరం విడిచి అడవికి వెళ్లకుండా తన కూతురు శాంతను యిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దశరథుడు రోమపాదుడికి చెప్పి ఋశ్యశృంగుణ్ని భార్యతో సహా రప్పించి ఆయన ఆధ్వర్యంలో అశ్వాన్ని వదిలిపెట్టారు. అది ఒక ఏడాదికి తిరిగివచ్చింది. అప్పుడు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి మొదలుపెట్టాడు. ఇదంతా సీతారామకల్యాణం సినిమాలో చూపించారు.
ఆ యాగంలో హవిస్సు తీసుకోవడానికి వచ్చిన దేవతలు రావణుడి అకృత్యాల గురించి బ్రహ్మ వద్ద మొరపెట్టుకున్నారు. బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. అప్పుడు విష్ణువు తను అవతారం ఎత్తడమే కాక తనకు సహాయంగా దేవతలందరినీ తమ తమ అంశలతో నరులుగా, వానరులుగా పుట్టమన్నాడు. యజ్ఞగుండంలోంచి ప్రాజాపత్య పురుషుడు ఉద్భవించి ఒక పాత్రలో పాయసం యిచ్చాడు. కౌసల్యాదేవికి దానిలో సగం యిచ్చాడు. మిగతాసగంలో సగాన్ని సుమిత్రకు యిచ్చాడు. అప్పుడు మిగిలి పావువంతులో సగం కైకకు, సగం మళ్లీ సుమిత్రకు యిచ్చాడు. దానివలన కౌసల్యకు 50% ఎఫెక్టుతో రాముడు, సుమిత్రకు 25% ఎఫెక్టుతో లక్ష్మణుడు, 12.5% ఎఫెక్టుతో శతృఘ్నుడు పుడితే కైకకు తక్కిన 12.5% ఎఫెక్టుతో భరతుడు పుట్టాడు. పాయసం పెర్సంటేజి బట్టే పాత్రల యింపార్టెన్సు వుంది చూడండి.
చిన్నప్పటినుండీ లక్ష్మణుడు సవతి సోదరుడైన రాముడి వెంటనే వుండేవాడు. అన్నాదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులనే పేరు వచ్చేసింది. లక్ష్మణుడి తమ్ముడు శతృఘ్నుడు భరతుడి వెంటనంటి వుండేవాడు. నలుగురూ కలిసి అనేక విద్యలు నేర్చారు. ఒకరోజు విశ్వామిత్రుడు దశరథుణ్ని చూడడానికి వచ్చి తనకు సహాయం కావాలన్నాడు. దశరథుడు ముందూ వెనుకా ఆలోచించక మాట యిచ్చేసాడు. అప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు – నేను చేసే యజ్ఞాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విఘ్నం చేస్తున్నారు. యజ్ఞదీక్షలో వుండడం చేత నేను వాళ్లను శపించలేను. అందుకని రాముణ్ని పంపిస్తే అతను వాళ్ల పని పడతాడు. నాతో పంపించు. నీ పిల్లవాడికి అనేక విద్యలు ఉపదేశిస్తాను అన్నాడు. కానీ దశరథుడి భయం దశరథుడిది. చిన్న పిల్లవాడు కదా, కావాలంటే యాగరక్షణకు నేను వస్తాను అన్నాడు. ఆడితప్పావని నిందిస్తూ విశ్వామిత్రుడు లేచి వెళ్లిపోబోయాడు. అప్పుడు వశిష్టుడు దశరథుడికి నచ్చచెప్పాడు – దీనిలో ఏదో మంచి వుంది. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. వెంట పంపించు అని. గత్యంతరం లేక దశరథుడు పంపించాడు. విశ్వామిత్రుడు వాళ్లకు దారిలో అనేక అస్త్రాలను ఉపదేశించాడు. దీనివలన వాళ్లిద్దరికీ ఎంతో మేలు జరిగింది. దారిలో వీళ్లకు ఒక పాడుపడ్డ నగరం తగిలింది. రాక్షసిగా మారిన తాటక అనే యక్షిణి వలన ఆ నగరం గతి అలా అయింది. విశ్వామిత్రుడు ఆమెను వధించమన్నాడు. మామూలుగా అయితే స్త్రీని వధించకూడదు. కానీ అలా చెప్పినది తన గురువు విశ్వామిత్రుడు. ఆయన మాట వినమని చెప్పినది తన తండ్రి. ఈ లాజిక్‌తో రాముడు తాటకను వధించాడు.
రాముడి కారెక్టరులో అడుగడుగునా కనబడేది యిదే. కొన్ని ఎథిక్స్‌కు, ధర్మాలకు కట్టుబడ్డాడు. తండ్రి మాట జవదాటకూడదు. అంతే. వనవాసానికి వెళ్లమని తండ్రి చెప్పిన తర్వాత దానికి కట్టుబడ్డాడు. తండ్రి పోయిన తర్వాత కైక, భరతుడు అందరూ వచ్చి బతిమాలినా వనవాసం నుండి వెనక్కి రాలేదు. అంతెందుకు, దశరథుడే మాట యిచ్చినవాణ్ని నేను కదా, సుక్షత్రియుడిలా నన్ను చంపేసి నువ్వు రాజ్యం చేసేసుకో అని సూచించినా వినలేదు. నీ మాట విని వనవాసానికి వెళతానన్నాడు. వెళ్లాడు. సుగ్రీవుడితో, విభీషణుడితో ఒప్పందాలు చేసుకున్నపుడు తూచ తప్పకుండా నెరవేర్చాడు. సమాజంలో నీతిసూత్రాలు అనేవి ఒక్కసారిగా పైనుండి వూడిపడవు. క్రమంగా యివాల్వ్ అవుతాయి. ఆ దశలో నీతి అంటే యిది, ధర్మం అంటే యిది అని మనకు చాటిచెప్పడానికి రామకథను మనకు నేర్పుతున్నారు. రాముడిది ఒకటే మాట, అతని వద్ద రెండు మాటలు లేవు. అని నొక్కి చెప్పడం దీనికే. మనకున్న మానవసంబంధాలలో అతి ముఖ్యమైనది స్త్రీపురుష సంబంధం. బహుభార్యావిధానం వున్న రోజుల్లో రాముని ఏకపత్నీవ్రతాన్ని హైలైట్ చేశారు. మంచి దాంపత్యం ఎలా వుండాలో సీతారాములు ఉదాహరణగా మిగిలిపోయారు. సూర్యుడికి తేజం ఎలాగో, నాకు సీత అలాగ అంటాడు రాముడు. ఒకరుంటే మరొకరు వుండి తీరాల్సిందేనన్నమాట. నా భార్య నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు రాముడు. తన లైఫ్ పార్ట్‌నర్‌గురించి యింతకంటె మంచి నిర్వచనం అప్పుడే కాదు, యిప్పటికీ దొరకదు. సుఖం, దుఃఖం అన్నీ సమానంగా పంచుకున్నారు ఆ జంట. రాముడి కథను సినిమాలుగా తీసినపుడు పురాణంలో వున్నట్టుగానే తీసారు తప్ప పెద్ద మార్పులు చేయలేదు. అయితే సీత విషయంలో చాలా మార్పులు జరిగాయి. అవేమిటో చూద్దాం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)