గుజరాత్‌లోని విఠల్‌పూర్‌లో మారుతి-సుజుకి కార్ల ఫ్యాక్టరీ పెడుతున్నానంటూ చాలా భూమి సేకరించింది. సాధారణంగా యిటువంటి వాటిల్లో ప్రభుత్వం కొని లీజుకి యిస్తూ వుంటుంది. లేకపోతే భూమిని ప్రభుత్వ వాటాగా పరిగణిస్తుంది. అయితే దీని విషయంలో పరిశ్రమల మంత్రిగా కూడా వున్న నరేంద్ర మోదీ మారుతి-సుజుకి యీ భూమిని తన కంపెనీకే సొంతంగా కొనుక్కునేట్టు సహకరించారు. ఈ విషయమై రెండేళ్లపాటు చర్చలు జరిగాయి. అంత డబ్బు పెట్టి మారుతి ఎందుకు కొంది అనుకుని ఆశ్చర్యపడినవాళ్లకు యిప్పుడు సమాధానం దొరికింది. మారుతి కార్లు తయారుచేస్తాం అంటూ సేకరించిన యీ భూమిని మారుతి-సుజుకి తన మాతృసంస్థ సుజుకికి 100% వాటాలున్న వేరే కంపెనీకి అప్పగించేస్తోంది. మారుతి వాళ్లు యిక్కడ కార్ల తయారీ మానేసి మార్కెటింగ్‌కి మళ్లుతున్నాం అంటున్నారు. ఇదంతా పెద్ద దగా, మోసం అంటోంది స్వదేశీ జాగరణ్ మంచ్. ఈ దగాలో గుజరాత్ రాష్ట్రానికి సహకరించినది కేంద్రంలోని యుపిఏ విధానాలు. తమ భాగస్వామ్యంతో మన దేశంలో కంపెనీలు పెట్టిన విదేశీ కంపెనీలకు యుపిఏ2 ప్రభుత్వం దోచిపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఇక్కడి పిల్ల యూనిట్లు తమ మాతృసంస్థలకు కంపెనీలకు రాయల్టీ పేరుతో పెద్ద మొత్తాన్ని పంపిస్తూ వుంటాయి. దానిపై ప్రభుత్వం ఒక పరిమితి విధించింది. 2010లో పరిమితి సడలించింది. ఇలా సడలించడం వలన 37 బిలియన్ల డాలర్ల ఫారిన్ ఎక్స్‌ఛేంజి తరలివెళ్లిపోయిందని స్వదేశీ జాగరణ్ మంచ్ అంటోంది. ఇలా పట్టుకుపోవడాన్ని పిల్ల యూనిట్‌లోని భాగస్వాములు అడ్డుకునే ప్రమాదం వుంది. అది జరగకుండా చేయాలంటే పిల్ల యూనిట్‌లో మాతృసంస్థ వాటా తగ్గకుండా వుండి వాళ్ల మాటే చెల్లుబాటు కావాలి. కంపెనీ షేర్లు షేర్ మార్కెట్‌లో అమ్మకానికి వస్తే మామూలు జనాలు, స్థానిక కంపెనీలు కొనేసి యిలాటి చేష్టలు అడ్డుకుంటారు కాబట్టి, పిల్ల యూనిట్ వాటాలను ఇండియన్ షేర్ మార్కెట్ నుండి డి-లిస్టు చేయించేస్తున్నాయి విదేశీ కంపెనీలు.
మారుతి సంగతే తీసుకుందాం. మాతృసంస్థ సుజుకి జపాన్‌కి చెందినది. వాళ్లు మారుతి-సుజుకి అనే భారతీయ కంపెనీ పెట్టి దానిలో 56% వాటాలు తీసుకున్నారు. 2010లో ప్రభుత్వం రాయల్టీ పరిమితి రిలాక్సు చేయగానే మారుతి-సుజుకి తన మాతృసంస్థకు యిచ్చే రాయల్టీని అమాంతం పెంచేసింది. అది ఎంతో తెలుసా? టాక్సుకు ముందు మారుతి-సుజుకి వచ్చే లాభంలో 64%, టాక్సుకు అనంతరం వచ్చే లాభంలో 88%! ఇప్పుడు యీ గుజరాత్ భూమిని సుజుకి తనకు వచ్చేట్టు మారుతి-సుజుకితో ఒప్పందం చేసుకుంది. దీనిలోని అంశాలన్నీ సుజుకి లాభప్రదంగా, మారుతి-సుజుకికి నష్టదాయకంగా వున్నాయి. రిస్కు మారుతి-సుజుకిది, లాభాలన్నీ సుజుకికి. అయినా మారుతి బోర్డు జనవరి 28 నాటి సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. దీనికి మారుతి-సుజుకిలోని యితర భాగస్వాములు అభ్యంతరం చెప్పారు. అయినా వాళ్ల మాట చెల్లలేదు. ''సుజుకి వారి కంపెనీకి అమ్మడం వలన బోల్డంత డబ్బు వస్తుంది, దాన్ని ఆర్ అండ్ డికి వాడతాం'' అని చెప్తున్నారు మారుతి-సుజుకి చైర్మన్ భార్గవ. కార్ల తయారీ నిలిపేసిన తర్వాత పరిశోధన చేసి ఏం చేస్తారట? విదేశీ కంపెనీలు చెప్పినట్లు ఆడి ఆడి యుపిఏ మనను యీ స్థితికి తీసుకుని వచ్చింది. బిజెపి విధానాలు తేడాగా వుంటాయా? గుజరాత్ ప్రభుత్వం సహకరించిన విధానం చూస్తే ఆ ఆశా కనబడటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్