అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
దృఢంగా చెప్తే ఎదిరించినట్లా?
2003 మార్చిలో నేను కేంద్రంలో వ్యవసాయశాఖలో సెక్రటరీ (అగ్రికల్చర్, కోఆపరేషన్)గా వున్నాను.
చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినపుడు ''ఏమండీ, మీరు చీఫ్ సెక్రటరీగా వస్తారా?'' అని అడిగారు.
''నేను అగ్రికల్చర్ సెక్రటరీ. మీరు తలచుకుంటే 'కల్చర్ 'సెక్రటరీ చేయగలరు. మిమ్మల్ని ఎలా కాదంటాను?'' అన్నాను హాస్యంగా.
అంటూనే ''మీరు నన్ను ప్రశ్నలడగకండి. నేను ఆంధ్రా క్యాడర్ ఆఫీసర్‌ని. మీరు ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు ఎక్కడ పని యివ్వదలచుకుంటే అక్కడ పనిచేస్తాను. కాబట్టి నిర్ణయం మీదే'' అన్నాను.
ఆయన చీఫ్ సెక్రటరీగా రమ్మనమన్నారు. ఏప్రిల్ 2003లో బాధ్యతలు చేపట్టాను.
వచ్చి నాలుగు రోజులయిందో లేదో ''అంతా రొటీన్‌గా అయిపోతోందండి, మనం డీలా పడిపోతున్నామండీ. వి ఆర్ స్లిప్పింగ్.'' అన్నారు చంద్రబాబు.
అలా మాట్లాడడం ఆయన సహజధోరణి. అయినా ఆయన ఏం ఆశించారో, ఎందువలన ఆశాభంగం చెందారో నాకు తెలియదు కానీ ఆయన అలా అనడం రుచించలేదు. మనసు చివుక్కుమంది. వెంటనే చెప్పాను –
''లూజ్‌గా పనిచేయడానికి, డీలా పడిపోయినట్టు ప్రవర్తించడానికి నేను యిక్కడకు రాలేదండి. ఎప్పుడూ నా శక్తి కంటె తక్కువగా పనిచేయను. అది మీ ఊహలకు సరిపోతుందో లేదో, మీరు చూసుకోవాలి కానీ యింతకంటె నేను చేయగలిగేది ఏమీ లేదు. నాలో శక్తి వుండికూడా ఒళ్లు దాచుకుని పని చేయడం లేదనుకోవడం పొరబాటు. 35 ఏళ్ల సర్వీసయిపోయింది. ఇంక రెండేళ్లు మిగిలింది. ఆ రెండేళ్లు రెండు రోజులకు తగ్గిపోయినా ఫర్వాలేదు. ఇలాటి మాటలు పడడం కంటె ఇప్పణ్నుంచే వెళ్లిపోమన్నా దర్జాగా వెళ్లిపోతాను. ఇన్నాళ్ల నా అనుభవం తాలూకు విలువను కాపాడుకోవడమే నాకు ముఖ్యం.'' అన్నాను.
సమాధానం కోసం ఆయన మాటలు పేర్చుకుంటూండగానే నేను బయటకు వచ్చేసాను.
xxxxxx
ప్రభుత్వనేతలు, ప్రభుత్వాధికారుల మధ్య వుండేది ఒక విచిత్రమైన బంధం. ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు దృక్పథాలు, వేర్వేరు ప్రాధాన్యతలు. కానీ ప్రజాహితం కోసం కలిసి పనిచేయాలి. ఆలూమగలు సరసాలాడుకుంటూ, కీచులాడుకుంటూ కలిసి కాపురం ఎలా చేస్తారో అలాగే వీరూనూ..
ఈ సమీకరణం గురించి అద్భుతంగా రికార్డు చేసిన ఆంగ్ల పుస్తకం ''ఎస్, మినిస్టర్''. బ్రిటన్‌లో ఒక మంత్రి, అతని సెక్రటరీ మధ్య జరిగే జగడాలు, సరాగాలూ గొప్ప వచోవైభవంతో అక్షరీకరించిన పుస్తకం అది. దానిలో ప్రతీ పేజీ నాకే కాదు, చాలామందికి కంఠోపాఠం. దాని ఆధారంగా బిబిసివారు తీసిన టీవీ సీరియల్ దూర్‌దర్శన్ వారు ప్రదర్శించినపుడు ఇందిరా గాంధీ సైతం ఏ వారమూ మిస్ కాకుండా చూసేవారట. ఆ పుస్తకం ప్రధానంగా వ్యంగ్యాత్మకం.
కానీ నిజజీవితంలో అన్నీ అంత సరదాగా నడవవు. కొన్నిసార్లు మృదువుగా, మరికొన్నిసార్లు దృఢంగా చెప్పవలసిన ఘట్టాలు ఎదురవుతాయి, ముఖ్యంగా మన వ్యక్తిత్వానికి అఘాతం కలుగుతోందని అనుకున్నపుడు..
xxxxxx
నేను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీగా వుండగా (1990) ఏడు సబ్జక్టులు నా దగ్గర వుండేవి. ఏడుగురు మంత్రులతో వ్యవహరించవలసి వచ్చేది. ఒక మంత్రిగారితో వ్యవహారం చాలా యిబ్బందిగా వుండేది. ఆయన వద్దకు పంపిన ఏ ఫైలూ త్వరగా వెనక్కి వచ్చేది కాదు. పిలిచి డిస్కస్ చేసేవారు కాదు, అనుమానం వుంటే తీర్చుకునేవారు కాదు. తర్వాత ఎప్పుడో తిరిగి వచ్చేది. దానిలో చాలా టెక్నికల్ జార్గన్‌తో కూడిన ఓ ప్రశ్నో, క్వెరీయో, కామెంటో వుండేది.
సంగతేమిటాని ఆరా తీస్తే తెలిసింది. ఈ మంత్రిగారికి సన్నిహితుడైన ఓ లాయరుగారున్నారు. ఈయన ఆయనను రప్పించి ఫైల్ చూపిస్తే, ఆయన దాన్ని అడ్డుకొట్టడానికి తన తెలివంతా వుపయోగించి యీ సందేహాలు డిక్టేట్ చేస్తున్నారు. ఈయన రాస్తున్నారు. ఇది తెలియగానే యిది మంచి పద్ధతి కాదని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను –
''నేను మీకు కార్యదర్శిని. మీ బాగోగులని, మంచి చెడులని చూసుకోవాల్సినవాణ్ణి, ప్రజలకి సక్రమంగా సేవలందించడానికి మీకు సహాయం చేయవలసినవాణ్ణి. మీకు నా మీద అనుమానాలుండకూడదు, వుంటే పైకి చెప్పాలి. మనిద్ద్దరం చర్చించి ఎలాగోలాగ సర్దుకోవచ్చు. కాని నేను మీకు పంపించిన ఈ కాగితాలు ఎవరో బయటవాళ్లకి చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. అది తప్పు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌కి విరుద్ధం. ఆయనేం చెబితే అది ఫైలు మీద రాసి వెనక్కి పంపించడం…నాతో పరోక్షయుద్ధం చేస్తున్నట్టు అనిపించడం.. మీ వంటి వారు యిలా చేయకూడదు. నేనిక్కడ వుండకూదనుకుంటే ముఖ్యమంత్రిగారికి చెప్పండి, నాకు మార్పొస్తుంది. లేదా మీరిలా చేస్తున్నారని నేనే చెప్పాల్సివస్తుంది. మీరు తేల్చుకోండి.'' అని నిష్కర్షగా చెప్పా.
చిత్రమేమిటంటే ఆ లాయరుగారు అప్పుడు మంత్రిగారితోనే కూర్చుని వున్నారు.
దాని తర్వాత పరిస్థితి చక్కబడింది.
xxxxxx
నన్ను చీఫ్ సెక్రటరీగా రాష్ట్రానికి రప్పించిన చంద్రబాబుగారు నాకు కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వుండగా ఆయన హెరిటేజ్ సంస్థ పెట్టినపుడు గవర్నమెంట్ రికమెండేషన్ పంపడంకోసం అగ్రికల్చర్ సెక్రటరీగా వున్న నాతో తరచు మాట్లాడేవారు. నేను ముక్కుకు సూటిగా పోతానని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని ఆయనకున్న నమ్మకానికి అనుగుణంగా మా మధ్య స్నేహపూర్వకంగా, సజావుగా వ్యవహారాలు జరిగాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆయన క్యాబినెట్ ర్యాంక్‌తో కర్షకపరిషత్ చైర్మన్‌గా వుండేవారు. ఎక్సయిజ్ కమిషనర్ హోదాలో నేను ఆయనను కలవవలసి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ కంట్రీ లిక్కర్ వేలం విషయంలో విధానం మారుద్దామనే నిర్ణయానికి వచ్చింది. అప్పటిదాకా దుకాణాలనుండి కనీసం యింత అమ్ముతాము అని ఒప్పందం చేసుకుని దానికి ఎంత డబ్బు కట్టాలో వేలం ఏర్పాటు చేసేవాళ్లం. ఎవరెక్కువ ఆఫర్ చేస్తే వారికి యివ్వడం జరిగేది. దీనివలన చాలా తక్కువ ఆదాయం వస్తోందని యీ పద్ధతి మార్చేసి కొంతమంది వ్యక్తులకు, గ్రూపులకి యిచ్చే పథకం రూపొందించింది టిడిపి ప్రభుత్వం.
ఇవన్నీ రాజకీయంగా ఒకే వర్గానికి వెళతాయన్న అనుమానం కలిగితే యీ పద్ధతి నడవదని నాకనిపించి యీ విధానాన్ని వ్యతిరేకించాను.
అది తెలిసి చంద్రబాబుగారు నన్ను రప్పించారు. నేను నా అనుమానాలు, సందేహాలు అన్నీ వివరించాను.
ఆయన నేను చెప్పినదంతా విని ''మోహన్ కందాగారూ, ఇదెలాగో జరిగి తీరుతుంది. కాని మీరు మాత్రం దీన్ని వ్యతిరేకించినవారిగా మిగిలిపోతారు. జరిగేది ఎలాగూ తప్పనపుడు వ్యతిరేకించి లాభం ఏమిటి?'' అన్నారు.
దానికి సమాధానంగా నేను చెప్పాను – ''మాకు అకాడమీలో చేరినప్పటినుంచి నేర్పించే పాఠం ఏమిటంటే – మా సూచనల వలన ఏమన్నా మంచి జరిగితే దానివలన రాజకీయ నాయకులకు మంచి పేరు రావచ్చు. ఏమన్నా తప్పు జరిగితే ఆ చెడ్డపేరేదో మాకు దక్కుతుంది. దానికి ఒడంబడే మేము యీ ఉద్యోగాల్లో వుంటాం. ఫలానా విధంగా జరిగితే దానివలన వ్యక్తిగతంగా నాకు ఏం మేలు ఒనగూడుతుంది? ఎటువంటి పేరు వస్తుంది? అని లెక్కలు వేసుకుని దాన్ని బట్టి సలహా చెప్పే అలవాటు నాకు లేదు. నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది యిలా చేస్తే తప్పని నాకు ఇప్పుడు తోచింది. తోచాక అది చెప్పక తప్పదు. తర్వాత మీ యిష్టం'' అని చెప్పాను. అందువలన నా ఆలోచనావిధానం, మాట తీరు ఆయనకు బాగా తెలుసు.
xxxxxx
మొదట్లో చెప్పిన ఘట్టంలో 'కావాలంటే యిప్పణ్నుంచే వెళ్లిపోవడానికి నేను రెడీ' చెప్పేసి వచ్చేయడంతో ఆయన ఆలోచనలో పడ్డారు.
ఓ పావుగంట పోయాక ఎస్.వి.ప్రసాద్‌ని (దరిమిలా ప్రధాన కార్యదర్శి, అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి) చేత నన్ను పిలిపించారు.
''అయ్యో అదేమిటండీ, ఏదో మాటవరస కంటే.. ఏదో నా అలవాటుకొద్దీ, నా ఆవేదన కొద్దీ అలా అన్నాను. మిమ్మల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి కాదు. అంత సీరియస్‌గా తీసుకుంటారను కోలేదు. మీరే నిరుత్సాహపడితే, డీమోరలైజ్ అయితే ప్రభుత్వ పనులెలా జరుగుతాయి? ప్లీజ్ డోంట్ టేకిట్ టు హార్ట్'' అన్నారు బాధపడుతూ.
దాంతో ఆ విషయం అక్కడే వదిలేశాం.
ఆయన కావాలని నన్ను నొప్పించాలని మాట్లాడారని నేను యిప్పటికీ అనుకోను. పరిస్థితుల పట్ల అసంతృప్తి, యింకా ఏదో చేయాలన్న తపన ఆయనను అలా మాట్లాడించిందని నేను అర్థం చేసుకున్నాను.
xxxxxx
మరోసారి ఏడెనిమిది విషయాలు చెప్పి వీటన్నిటిమీదా ఫోకస్ చేయాలి అన్నారాయన.
అప్పుడు చెప్పాను – ''అయ్యా, కెమెరా చూడండి. ఒక వస్తువుపై ఫోకస్ చేస్తే చుట్టూ తక్కినవన్నీ బ్లర్ అయిపోతాయి. ఫోకస్ అంటే అర్థమే అది. లక్ష్యం స్పష్టంగా వుండాలి. తక్కినవి అప్పటికి మసకబారుతాయి. తర్వాత వాటిమీదకు దృష్టి మరలిస్తే వాటిలో ఒకటి ముందుకు వచ్చి యివి మసకబారుతాయి. అర్జునుడు, చెట్టుమీది పిట్టకన్ను కథ లాటిదే..'' అన్నాను.
''మీరు చెప్పినదీ కరెక్టే లెండి'' అన్నారాయన నాతో ఏకీభవిస్తూ.
పరిపాలనా యంత్రాంగాన్ని పరుగులు తీయించాలన్న కోరిక చంద్రబాబుగారికి చాలా ఎక్కువ. అధికారగణంపై తన అసహనాన్ని దాచుకునేవారు కారు. ప్రభుత్వ వ్యవస్థ పట్ల ఆయన కాస్త కటువుగా మాట్లాడుతూ వుంటే నేను కలగజేసుకుని ''అయ్యా! మరి చీఫ్ సెక్రటరీ అని నన్నిక్కడ కూర్చోపెట్టాక మీరు ఇలాంటి నిర్ణయాలలో కూడా నేను చెప్పింది వినిపించుకోకుంటే ఎలా?'' అన్నాను ఆయనను వారిస్తూ..
ఆయనకు కోపం వచ్చింది. ''అదేంటండి, నేను మిమ్మల్ని చూసుకున్నట్టు ఏ చీఫ్ సెక్రటరీని చూసుకోలేదు. మీరూ అలా మాట్లాడితే ఎలా?'' అన్నారు.
ఆయన మాట కరెక్టే కావచ్చు. ఆయన దృష్టిలో నా పట్ల చాలా ఆదరం చూపినట్టే లెక్క కావచ్చు. కానీ ఆయన స్టాండర్డ్‌స్ ఆయనవి, నా స్టాండర్డ్‌స్ నావి. ఆయన అంత చేసినా నాకు సరిపోలే దనిపించిందంటే దానికి కారణం – నా పూర్వానుభవాలు, లభించిన గౌరవమర్యాదలు అటువంటివి!
''మిగతావాళ్ల కంటే నన్ను బాగా చూసుకుంటున్నారా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు, నేను మోహన్ కందా అనే ఒక వ్యక్తిని. నాకు ఎటువంటి ట్రీట్‌మెంట్ కావాలో నాకొక అంచనా (ఎక్స్‌పెక్టెషన్) వుంది. అది వస్తుందా లేదా అన్నది నాకు ముఖ్యంకాని, మీరు మిగతావాళ్ల కంటే నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగ్‌తో నేనెలా సర్ది పెట్టుకుంటానండి?'' అన్నాను.
''మీరు చెప్పేవి సబబుగానే అనిపిస్తున్నాయి. కాని నాక్కూడా ఏడేళ్ల నుంచి అలా అలవాటు అయిపోయింది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఇప్పటికి యిలా కానివ్వండి. వచ్చేసారికి యివన్నీ ఏమన్నా సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం'' అన్నారు.
xxxxxx
2004 ఎన్నికలలో రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా వచ్చారు. నేను చీఫ్ సెక్రటరీగా కొనసాగాను. ఆయన మొదట్లోనే చెప్పారు – ''యూ విల్ ఫైండ్ మీ ఎ వెరీ యీజీ మాన్ టు గెట్ ఆన్ విత్'' అని (నాతో వ్యవహరించడం చాలా సులభమని మీరు గ్రహిస్తారు).
చివరిదాకా ఆయనతో అలాగే సాగింది. ప్రజలకోసం సంక్షేమ పథకాలు, జలయజ్ఞం – వీటిపై వుండేది ఆయన దృష్టి, పాలసీ విషయాలపైనే తప్ప రోజువారీ నిర్వహణ, నిర్ణయాల గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కారు. నేను చెప్పినది వినేవారు. తర్వాత ఆయన కేమైనా అభిప్రాయముంటే చెప్పేవారు. దాని తర్వాత ఆయన ప్రాధాన్యతలు, ఆసక్తి కలిగించే విషయాలు పరిగణనలోకి వచ్చేవి. మంచీ, చెడూ ఆలోచించి దాని గురించి తగు నిర్ణయం తీసుకునేవారు.
ఓ సారి పెద్ద మీటింగ్ జరుగుతోంది. నేను ముందర వున్నాను. నా వెనకాల ఉన్నతాధికారులు చాలామంది వున్నారు. ఆయన నా భుజం మీదుగా నా వెనకాలవాళ్లను ఉద్దేశించి ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్లు నోరు విప్పేలోపుగా నేనే ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్తున్నాను. ఆయన కాస్సేపు యిది గమనించాక ''ఏమండీ, మీరు మీ వెనకాల వున్నవారితో నన్ను మాట్లాడనివ్వరా?'' అని అడిగారు.
''లేదండీ'' అన్నాను నేను దృఢంగా. ఆయన నిర్ఘాంతపోయాడు.
అప్పుడు వివరించాను – ''ఇక్కడ నేను వున్నంత సేపు వాళ్ల తరఫున మాట్లాడవలసిన బాధ్యత నాదే. మీకు వాళ్లు డైరక్టుగా జవాబు చెప్పవలసిన అవసరం పడితే యిక నేనెందుకు యిక్కడ కూర్చోవడం? లీడర్‌షిప్ అంటే యిదే! మీరు నా వెనకాల వున్న వాళ్లను ప్రశ్నించి, వాళ్లేదో తప్పు సమాధానం చెపితే, దాన్ని మీరు పట్టుకుని నిలదీసి… యిటువంటి పరిస్థితి నేనుండగా ఏర్పడితే అప్పుడు నేనున్నా విలువ వుండదు…''
''…అంటే మీరు లేనప్పుడు ప్రశ్నలు అడగకూడదా?''
''..నిక్షేపంలా అడగవచ్చు. ఇప్పుడు మీరు జిల్లాలు వెళుతూంటారు. నేను మీతోనే, మీ కూడానే వుంటానా? లేదు కదా. అక్కడ మీరు ఎవరినైనా, ఏదైనా అడగచ్చు, మీకు అధికారంలేదని అనటంలేదు. కాని నేను కూర్చుని వున్న ఈ సమావేశంలో మాత్రం ఎవరి గురించి ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం నాకు తెలియకపోతే వారిని అడిగి సమాధానం చెపుతాను కాని మిమ్మల్ని డైరక్టుగా అడగనీయను. ఇది నా హక్కు, నా ధర్మం.'' అన్నాను.
''బలేవారండీ మీరు'' అని కాస్త చికాగ్గాను, కాస్త నవ్వుకుంటూను అన్నారు వైయస్. కానీ దానివలన నా ఎప్రోచ్ ఎలా వుంటుందో ఆయనకు అర్థమైంది.
xxxxxx
కొసమెరుపు – అలిపిరి ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరం ముఖ్యమంత్రితో సహా సమావేశమయ్యాం. ఎందుకలా జరిగింది, ఎక్కడ లోటుపాట్లు వున్నాయి అని కక్షుణ్ణంగా చర్చించాం. ఫలానావారి పొరబాటని యితమిత్థంగా తేల్చి చెప్పలేని పరిస్థితి. ''సరే ఎవరూ బాధ్యులు కారు, ఎవరిపైనా చర్య తీసుకోనక్కరలేదు'' అని తీర్మానించి తర్వాతి అంశంవైపు వెళ్లబోతూ వుండగా నేను అభ్యంతర పెట్టాను.
''సాక్షాత్తూ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగింది. వ్యవస్థలో లోపం యింత స్పష్టంగా కనబడుతున్నపుడు ఎవరూ బాధ్యులు కారంటే హాస్యాస్పదంగా వుంటుంది. తప్పు ఒప్పుకోని అధికారులుగా ప్రజల దృష్టిలో పలుచన అవుతాం. మీరు ఎవర్నీ బాధ్యులుగా చేయకపోతే ఇటువంటి యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నందుకు నేను రాజీనామా చేస్తాను, లేదా సెలవుపై వెళ్లిపోతాను. నాకు అనుమతి యివ్వండి'' అన్నాను.
చంద్రబాబుగారు నా కంఠంలో దృఢత్వాన్ని గమనించారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వారు సమర్థులు, పైగా నాకు ఆప్తులు. అయినా ఆ పరిస్థితుల్లో అది అవసరం అనే అనుకున్నాను.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version