తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కెసియార్ చూపుతున్న పంతం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వాధినేతా అలా వ్యవహరించరు. సమ్మె చేయడం కార్మికుల హక్కు, అది చేయకుండా చూడడం యాజమాన్యం బాధ్యత. సమ్మె న్యాయబద్ధమైనది కావచ్చు, కాకపోవచ్చు. జీతభత్యాల గురించి చేసే డిమాండ్లు సాధారణంగా విపరీతంగా ఉంటాయి. కొండంత అడిగితే దోసెడంతైనా యిస్తారన్న లెక్కలో కార్మిక సంఘాలుంటాయి. ఇద్దామనుకున్న దానిలో పావు వంతుతో యాజమాన్యం బేరాలు మొదలుపెడుతుంది. తాము ఏకపక్షంగా గెలవలేమని. ఏదో ఒక దశలో, ఏదో ఒక పాయింటు వద్ద రాజీ పడాలనీ యిద్దరికీ తెలుసు. ఎటొచ్చీ ఆ పాయింటును యిటు జరుపుదామని వాళ్లు, అటు జరుపుదామని వీళ్లు కొన్నాళ్లు ప్రయత్నిస్తారు. అడిగినదంతా యివ్వరని కార్మికులకు ఎంత బాగా తెలుసో, ఎంతోకొంత యివ్వక తప్పదని యాజమాన్యానికీ తెలుసు. అయితే బెట్టు చెయ్యకుండా యిస్తే లోకువై పోతామని భయం.
సంస్థ స్థాపించడానికి, నడపడానికి సొంత పెట్టుబడి పెట్టిన ప్రైవేటు యజమానే తెగేదాకా లాగకుండా దిగి వచ్చి, కార్మికుల కోరికలను ఏదో ఒక స్థాయిలో అంగీకరించక తప్పని యీ రోజుల్లో, కేవలం ప్రజా ప్రతినిథిగా, ప్రజల సొమ్ముకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధినేత ఎంత ఉదారంగా వ్యవహరించాలి? ఎంత లౌక్యంగా వ్యవహారాలు చక్కపెట్టాలి? అందుకే ప్రభుత్వసంస్థల్లో కార్మికుల మాట ఎక్కువగా చెల్లుతుంది. సమ్మె నోటీసు అందగానే సంబంధిత మంత్రి కార్మికులతో చర్చలు ప్రారంభిస్తారు. అవి విఫలమవుతాయి. సమ్మె ప్రారంభమవుతుంది. సమ్మె కాస్త తీవ్రం అవగానే మళ్లీ చర్చలు మొదలవుతాయి. కార్మిక నాయకుల సామర్థ్యం బట్టి, యాజమాన్యం బింకం బట్టి ఆ చర్చలు ముందుకూ వెనక్కి నడుస్తూంటాయి. క్రమశిక్షణారాహిత్యం సహించం అంటూ ప్రభుత్వం తొలిదినాల్లో ప్రకటిస్తుంది కానీ అంతిమంగా కార్మికులను మరీ యిబ్బంది పెట్టదు.
కొన్నాళ్ల సమ్మె తర్వాత కార్మికులకు కూడా ఓపిక తగ్గుతుంది కాబట్టి ఏదోలా రాజీ పడతారు. సమ్మె కాలాన్ని పనికాలంగా పరిగణించామని ప్రకటించి ప్రభుత్వం వారిని ఊరడిస్తుంది. గతంలో అయితే కార్మిక సంఘాలు బలంగా ఉండేవి. కార్మికులలో చైతన్యం పాదుకుని ఉండి, నెలా రెండు నెలల సమ్మెకు సిద్ధపడేవారు. ఇప్పటి కార్మికులకు అంత ఓర్పు లేదు. ఆడంబరాలు పెరిగి నెల జీతం సమయానికి రాకపోతే రోజు గడవనంతగా అప్పులు చేసేస్తున్నారు. యంత్రాల వినియోగం పెరిగింది, దిగుమతులు పెరిగాయి, ఔట్‌సోర్సింగ్ అందివస్తోంది. అందువలన యాజమాన్యాలు బలపడ్డాయి. కార్మిక హక్కుల చట్టాలను సడలించి ప్రభుత్వం కూడా వారికి మద్దతుగా నిలుస్తోంది. కొన్ని రంగాల్లో అయితే చెప్పా పెట్టకుండా ఉద్యోగం పీకేసినా, యివ్వాల్సినవి ఎగ్గొట్టినా దిక్కులేకుండా ఉంది. అందువలన గతంలోలా సమ్మెలు తగ్గిపోయాయి. కార్మికులు తలవంచుకుని బతకడానికి అలవాటు పడ్డారు. ఏ మాట కా మాట చెప్పాలంటే యాజమాన్యాలు కూడా గతంలో అంత క్రూరంగా లేవు.
జీతభత్యాలు బాగానే యిస్తున్నాయి. అయితే యిది సంఘటీకృత (ఆర్గనైజ్‌డ్) సెక్టార్‌లో మాత్రమే జరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అంటూ ప్రభుత్వంతో సహా అన్ని రకాల యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రస్తుత సమ్మె విషయానికి వస్తే కార్మికుల కోర్కెలన్నీ సమంజసమైనవని ఎవరూ సర్టిఫికెట్టు యివ్వటం లేదు. ఇచ్చినా అది చెల్లదు. కానీ చర్చలు కూడా జరపనక్కరలేనంత నేరం చేయలేదు వాళ్లు. సమ్మె ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే చర్చలు ప్రారంభం కావాలి. ముఖ్యంగా దసరా సమయంలో సమ్మె ప్రారంభమైంది కాబట్టి ప్రజలు యిబ్బంది పడకుండా చూడడానికి ప్రభుత్వం చేతనైనంత చేయాలి. ఏదో ఒక ఉపాయం చేసి, ప్రజల పట్ల, కార్మికుల పట్ల సహానుభూతి ఉందని చూపుకోవాలి. కొంతయినా ఔదార్యం చూపితే కార్మికవర్గాల్లో చీలిక వస్తుంది. కొందరు మెత్తబడతారు, కొందరు గట్టిగా నిలబడతారు. మెత్తబడినవాళ్లతో కొన్నయినా బస్సులు నడిపేట్లు చేయాలి.
'ఔదార్యం చూపడం అసాధ్యం, వాళ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది వాళ్ల ప్రధాన డిమాండు. అదెలా సాధ్యం?' అని కొందరు వాదించవచ్చు. 'విలీనం అసాధ్యం' అనే బదులు 'సాధ్యమేమో పరిశీలించడానికి కమిటీ వేశామనవచ్చు. 'ఆంధ్ర ప్రయోగాన్ని గమనించి, దానిలోని లోటుపాట్లు సరిదిద్ది అప్పుడు విధానాన్ని ప్రకటిస్తామ'ని కాస్త సమయం దొరకబుచ్చుకోవచ్చు. ముందుగా కొన్ని విభాగాలను, కొన్ని రూట్లను విలీనం చేస్తామనవచ్చు. ఏదో పాపం మన గోడు వింటున్నారన్న అభిప్రాయం కార్మికులకు కలిగిస్తే చాలు. కానీ ఆ లక్షణాలేవీ కెసియార్‌లో కానరావటం లేదు. తన పాలనలో కార్మికులు హక్కు చేయడమేమిటి, తలపొగరు కాకపోతే అన్న ధోరణే కనబరుస్తున్నారు. సింగరేణి కార్మికుల విషయంలోనూ యిలాగే ప్రవర్తించారు. ప్రజోద్యమాలు చేసేవారిని, సామాజిక కార్యకర్తలను అందర్నీ చులకనగానే చూస్తున్నారు. ఉద్యోగులను కుక్కతోకతో పోల్చి, తోక కుక్కను ఊపలేదు అని సామెత చెప్పారు. మరి అదే తోకను ఉపయోగించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు కదా!
సకల జన సమ్మె అంటూ నెలల తరబడి ఉద్యోగుల చేత సమ్మె చేయించి లబ్ధి పొందారు కదా! ఈ రోజు వారే పనికి రాకుండా పోయారు. మమ్మల్ని వాడుకుని వదిలేశారు అని వాళ్లనడంలో అబద్ధమేముంది? 'ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన వాళ్ల హిరణ్యాక్ష వరాలన్నీ తీర్చాలా? నేను చూడు ఎంత పొదుపుగా బతుకుతున్నానో!' అనే ఛాన్సు ప్రగతి భవన్ పేర కట్టిన బ్రహ్మాండమైన భవంతిలో ఉంటూన్న కెసియార్‌కి లేదు. సెక్రటేరియట్‌కే రాని కెసియార్ ఉద్యోగవిధుల గురించి యితరులకు లెక్చర్లు దంచలేరు. తెలంగాణ ధనికరాష్ట్రం అంటూ కెసియార్ ఎన్నో ప్లాన్లు చూపించి జనాల్ని ఊదరగొట్టారు. హైదరాబాదు అంతర్జాతీయ నగరం అన్నారు. తెలంగాణ వస్తే యింటికో ఉద్యోగం అన్నారు. చివరకు ఏమైంది? తెలంగాణ రావడం వలన బాగుపడిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది కెసియార్ కుటుంబం ఒక్కటే! రాష్ట్రం విడిపోతే ఆంధ్రావాళ్లు వెళ్లిపోతారనీ, వాళ్ల ఉద్యోగాలు, అవకాశాలు, వ్యాపారాలు, నివాసాలు మనవై పోతాయని ఆశలు పెట్టుకున్న సాధారణ తెలంగాణ పౌరుడు ఉసూరుమన్నాడు.
సమైక్యరాష్ట్రం ఉన్నంతకాలం హైదరాబాదులో కాలుష్యానికి కారణం సమైక్యపాలకులే అంటూ నోరు పారేసుకున్న కెసియార్ యీ రోజు ఆ నగరం మొత్తం ఆసుపత్రిగా మారడానికి ఎవర్ని బాధ్యులను చేస్తారు? రోడ్డు మీద గుంత కనబడితే వెయ్యి రూపాయలు యిస్తామని ప్రకటించిన కెసియార్ ప్రభుత్వం యిప్పుడు రోడ్డు కనబడితే వెయ్యి రూపాయలిస్తామని ప్రకటించాల్సిన అవసరం పడుతోంది. రోడ్లు అధ్వాన్నం, నీటి సరఫరా అధ్వాన్నం. ఊరంతా చెత్తకుప్పలే. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాదు, ప్రయివేటు ఆసుపత్రులలో కూడా రోగులకు పడకలు లేకుండా పోయాయి. ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, తనేం చేసినా పార్టీలో ఎదురు చెప్పేవారు లేకుండా చేస్తున్న కెసియార్ రాజకీయనాయకుడిగా సఫలమయ్యారు కానీ పాలకుడిగా పూర్తిగా విఫలమయ్యారు. ప్రజాజీవితం దుర్భరమైంది. గొప్పగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో మరే ముఖ్యమంత్రైనా అయితే ప్రజాగ్రహానికి దడిసి కాస్త తగ్గి వుండేవారు.
కానీ కెసియార్‌లో ఆ భయం ఆవంతైనా లేదు. పాతకాలం రాజుల తరహాలో తన చిత్తం వచ్చినట్లు చేస్తున్నారు. ఉద్యోగులు అడక్కపోయినా తను తలచుకుంటే చాలు 43% పెంపు, తను తలచుకోకపోతే పైసా విదల్చడు. అదేమిటంటే ఉద్యోగం పీకేస్తా జాగ్రత్త అని హుంకరింపు. నోటిమాటతో 50 వేల మంది ఆర్టీసి ఉద్యోగులను హాంఫట్ చేశాడు. ఆర్టీసిని పిపిపిని చేసేస్తామంటున్నాడు. సెప్టెంబరు నెల జీతాలు యిప్పటిదాకా యివ్వలేదు. విలీనం డిమాండ్‌ను వాయిదా వేసి తక్కిన 25 డిమాండ్లపైన చర్చ మొదలు పెట్టవచ్చు, అదీ లేదు. ప్రభుత్వం ఆర్టీసికి యివ్వవలసిన బకాయిల గురించి ఊసు లేదు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నా చలనం లేదు. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులకు బస్సులు లేవని ఫిర్యాదులు వస్తాయన్న భయంతో దసరా సెలవులను 19 దాకా పొడిగించాడు. ఇదే కనుక ఏ కిరణ్‌కుమార్ రెడ్డో చేసి ఉంటే కెసియార్ ఎంత హంగామా చేసి ఉండేవాడు? ఇవాళ తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, ఫక్తు ఫ్యూడలిజం.
కెసియార్ నిజాంను మెచ్చుకుంటాడంటే ఊరికే మెచ్చుకున్నాడా? ఎనిమిదో నిజాంగా మారదామనే ఆకాంక్ష యిలా తీర్చుకుంటున్నాడు. గతంలో తెలంగాణలో 'కాల్మొక్త, నీ బాంచను' అనే మాట అనేకమందికి ఊతపదంగా ఉండేది. తెలంగాణ ఆత్మగౌరవం నినాదంగా నడిచిన ప్రత్యేక ఉద్యమం సఫలమై యిప్పుడు మళ్లీ ఆ సంస్కృతిని తెచ్చిపెడుతోంది. వాచ్యా ఆ మాట అనకపోవచ్చు. కానీ ఆచరణలో అదే జరుగుతోంది. రెండవ సారి నెగ్గాక కెసియార్ రెండు నెలలకు పైగా కాబినెట్ కూర్చలేదు. పార్టీలో ముందు నుంచీ ఉండి ఎంతో చేసిన హరీశ్‌రావును పక్కన పెట్టాడు, నెలలపాటు అనామకుడిగా ఉంచాడు, హరీశ్ ఎంతో శ్రమించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలవను కూడా పిలవలేదు. ఎవరికీ చెప్పా పెట్టకుండా కొడుకుని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా చేశాడు. ఉద్యమంలోంచి వచ్చినవాళ్లని పక్కన పెట్టాడు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకించినవాళ్లకు పెద్ద పీట వేస్తున్నాడు. అప్పుడు నిరంతరం తిట్టిన ఆంధ్ర పెట్టుబడిదారులతోనే యిప్పుడు అంటకాగుతున్నాడు, తను నంది అంటే అందరూ నంది అనాలి, పంది అంటే పంది అనాలి తప్ప సొంత వ్యక్తిత్వం ఉండకూడదు. మంత్రులెవరికీ గౌరవం, మర్యాద, నిర్ణయాధికారం ఉండనక్కరలేదు. సర్వమూ తానై ఉండాలి.
పార్టీని, ప్రభుత్వాన్ని యిలా పాలిస్తున్న కెసియార్‌ను పార్టీలో ఒక్కరైనా విమర్శిస్తున్నారా? బహిరంగంగా కాదు, ఆంతరంగికంగానైనా? ఈ కేశవరావు, ఎర్రబెల్లి వగైరాలు కాంగ్రెసులో, టిడిపిలో ఉండగా నోరు మహా వాడేవారు. అధిష్టానాన్ని ధిక్కరించేవారు. ఈరోజు నోరెత్తటం లేదు. నోట్లో నాలుక ఉందని సైతం మర్చిపోయారు. ఫిరాయింపుదార్లను చేర్చుకుని పార్టీ సిద్ధాంతాలను పలుచన చేస్తున్నారని ఒక్కరైనా అభ్యంతర పెట్టారా? పార్లమెంటు ఎన్నికలలో కెసియార్ కూతురే ఓడిపోయాక యిప్పటికైనా మన విధానాలను సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారా? ఈటెల, నాయిని వంటి వాళ్లు అవమానాల పాలవుతుంటే ఎందుకిలా అని అడిగారా? కార్మికులతో, శ్రామికులతో, ఉద్యోగులతో పేచీ పెట్టుకుంటే ఎప్పటికైనా నష్టమే. గతంలో జయలలిత యిలా చేసి ఓటమి పాలైంది. వారి కోర్కెలు తీర్చకపోయినా, మీరు కనీసం వారికి మర్యాద యివ్వండి. చర్చలకు కూడా పిలవకుండా అవమానించకండి, మీ లెక్కేమిటి, నేను తలచుకుంటే తెల్లారేటప్పటికి మీరు రోడ్డు మీద ఉంటారనే ధోరణిలో స్టేటుమెంట్లు యివ్వకండి అని హితవు చెపుతున్నారా?
'ఆంధ్ర కంటె తెలంగాణలో ఆర్టీసికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆంధ్రలో రైల్వే లైన్ల ద్వారా మారుమూల గ్రామాలకు వెళ్లవచ్చు, ప్రయివేటు బస్సులు బాగా తిరుగుతాయి. తెలంగాణలో ఆ సౌలభ్యం లేదు. ఉద్యమ సమయంలో 'ఆర్టీసీ అభివృద్ధిలో తెలంగాణ వాటా ఎక్కువ, ఎఱ్ఱ బస్సు ఎక్కేది తెలంగాణ వారే, ఆంధ్రావాళ్లు కాదు' అని వాదించాం కదా. మరి ఆర్టీసీ బస్సులు అగిపోతే తెలంగాణ ప్రజలు ఎంత తిట్టుకుంటారు? ముఖ్యంగా అతి ముఖ్యమైన దసరా టైములో!? మనం బతకమ్మ చీరలు యిచ్చినా పుచ్చుకోవడానికి వాళ్లు ఊళ్లకు రావాలిగా! అసలు ఆసుపత్రిలో మందులు కొనడానికి డబ్బు లేదని ఓ పక్క అంటూ బతకమ్మ చీరలు అవసరమా? ఉద్యోగుల జీతాలకు, కాలేజీ ఫీజు రీఎంబర్స్‌మెంటుకి, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు, ఆర్టీసీకి బకాయి పడినదానికి డబ్బు లేదని వాదిస్తూ మరో పక్క కోట్ల ఖఱ్చుతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా? సెక్రటేరియట్‌లో ఏడేళ్ల క్రితం కట్టిన బ్లాకు కూడా నివాసయోగ్యం కాదంటే ఎలా అని హైకోర్టు అడిగితే 'విధానపరమైన నిర్ణయాల్లో మీరు జోక్యం చేసుకోకూడద'ని కోర్టుకి చెప్పిస్తున్నారే. మరి మనం ఎవరికి జవాబుదారీ?' – యిలా కెసియార్‌కు వాళ్ల పార్టీ నాయకులు ఒక్కరైనా చెపుతున్నారా?
వీళ్ల యీ బానిస బతుకుకి కారణం ఏమిటి? కెసియార్‌కు ప్రజాదరణ ఉంది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని నరికి పోగులు పెడతారన్న భయమా? 2014 ఎన్నికలలో తెరాసకు బొటాబొటీ సీట్లు వచ్చాయి. ఫిరాయింపులతో బలిశారు తప్ప ప్రజలను చైతన్యవంతుల్ని చేసి కాదు. 2018 ఎన్నికలలో చంద్రబాబు దిక్కుమాలిన స్ట్రాటజీ నమ్మి కాంగ్రెసు బోల్తా పడి వుండకపోతే తెరాసకు అన్ని సీట్లు వచ్చేవి కావు. సంక్షేమ పథకాల కారణంగా కెసియార్ ప్రజల మనసుల్లో తిష్టవేసుకుని ఉన్నాడు. అతన్ని ఏమైనా అంటే వాళ్లు ఒప్పరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆంధ్రలో బాబు కూడా కెసియార్‌ను తలదన్నే స్కీములు పెట్టాడు. పబ్లిసిటీలో, మీడియా మేనేజ్‌మెంటులో యిద్దరూ పోటాపోటీగా ఉన్నారు. కానీ కెసియార్ గెలవగా బాబు ఓడారు. తేడా ఎక్కడ వచ్చింది? అక్కడ బాబుతో విసిగినవారికి ప్రత్యామ్నాయంగా జగన్ ఉన్నాడు, ఇక్కడ ఎవరూ లేరు. ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపులు అక్కడా జరిగాయి, యిక్కడా జరిగాయి. అక్కడ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫిరాయించారు. మరి యిక్కడ? ఫిరాయించకుండా మిగిలినవారు తక్కువ. టిడిపి పూర్తిగా లుప్తమై పోగా, కాంగ్రెసు కొసప్రాణంతో ఉంది.
అక్కడ బాబుపై జగన్ పోరాడాడు. సొంత మీడియా ఉపకరించింది. ఇక్కడ కెసియార్‌పై యుద్ధం చేసిన కాంగ్రెసులో బహునాయకత్వం! ఎవరికి వాళ్లే సిఎం కాండిడేటు అనుకున్నారు. పైగా చేతిలో మీడియా లేదు. దురదృష్టమేమిటంటే యిక్కడి నాయకులందరూ అవకాశవాదులే. తెలంగాణ తెచ్చుకుంటాం, ప్రజల జీవితాల్ని బాగు చేస్తాం అన్నవాళ్లందరూ తమ బాగు చూసుకున్నారు. సమైక్యపాలకులపై వీరాలాపాలు పలికినవారందరూ యీరోజు అమ్ముడుపోయారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెసు వారు సైతం ఫిరాయించారంటే యిక వారికి, ఆ పార్టీకి విలువేముంటుంది? రాజకీయ నాయకుల స్థితి యిలా ఉందంటే మేధావులు, సామాజిక కార్యకర్తల వ్యవహారం మరీ ఘోరంగా ఉంది. వీళ్లు గతంలో సమస్తమైన అవలక్షణాలకూ ఆంధ్ర పాలకులను, అధికారులను నిందితులుగా నిలిపారు. పేజీల కొద్దీ వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు దంచారు, టీవీ చర్చల్లో రెచ్చిపోయారు. తెలంగాణ వస్తే దళితుల స్థితి మెరుగుపడుతుందని, సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని, పెత్తందార్ల పాలన పోతుందని.. ఒకటా? రెండా?
మీడియా, జర్నలిస్టులు వారికి కొమ్ము కాసి, సమైక్యం అన్న వాణ్ని వెంటాడి వేటాడారు. ఈ రోజు కెసియార్ నిరసన తెలపడానికి కూడా వీల్లేదంటే వీళ్ల గొంతులు మూగబోయాయి. సంక్షేమ పథకాల పేర ప్రజలకు రొట్టెముక్కలు విసిరినట్లే, గౌరవ పదవుల పేర వీళ్లకూ ఏవైనా దక్కాయా? లేక కెసియార్ భయపెట్టి నోరు మూయిస్తున్నాడా? తెలంగాణ పోరాటాల గడ్డ, రజాకార్లతో, భూస్వాములతో పోరాడిన వీరులం. ధైర్యానికి, త్యాగానికి మారుపేర్లం అని చెప్పుకున్నవాళ్లు యీ రోజు ఏం చేస్తున్నారు? మా సంస్కృతి వేరు అని ఉద్యమ సమయంలో తెగ చెప్పుకున్నారు. ఇదేనా తెలంగాణ సంస్కృతి? అభ్యుదయ వాదానికి, హేతువాదానికి, ప్రజాచైతన్యానికి మాది చిరునామా అని చెప్పుకునే తెలంగాణలో వాస్తు పిచ్చితో కెసియార్ సెక్రటేరియట్ కూల్చివేస్తూ ఉంటే ఊరూరా నిరసన ప్రదర్శనలు జరగాలి. జరుగుతున్నాయా?
తెలంగాణ పేరు చెప్పి కెసియార్ సమాజంలోని అన్ని వర్గాలను ఎడాపెడా వాడేసుకున్నాడు. రాష్ట్రాన్ని యిస్తే తన పార్టీని కాంగ్రెసులో కలిపేస్తానని నమ్మించి కాంగ్రెసును వాడేసుకున్నాడు. తర్వాత ఆ పార్టీని కబళించేస్తున్నాడు. టిడిపిలో ఎదిగి, ఉద్యమసమయంలో దోషిగా నిలబెట్టడానికి దాన్ని ఉపయోగించుకుని, పార్టీని నిర్వీర్యం చేశాడు. 1500 అంటే కాదు 2 వేల మంది అమరవీరులు బలిదానం చేసుకున్నారంటూ దొంగ లెక్కలు చెప్పి వాళ్ల చావులను వాడేసుకుని గద్దె కెక్కాడు. ఇప్పుడు వాళ్ల పేర్లు కూడా తలవటం లేదు. తెలంగాణ తన ఒక్కడి వలననే వచ్చిందని చరిత్ర రాయించుకుంటున్నాడు. కోదండరామ్ లాటి వాళ్లను ప్రజల స్మృతిపథంలోంచి తొలగించి వేస్తున్నాడు.
ఇలాటి కెసియార్ అంతానికి ఆర్టీసి సమ్మె ఆరంభం అని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అంతం చేసేవారెవరో ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. కెసియార్‌కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఘనీభవిస్తోంది. కానీ దాన్ని ఛానలైజ్ చేసేవారెవరు? ప్రజలలో చేవ లేదు. మేధావులు అమ్ముడుపోయారు. జగన్‌లా యిక్కడా ఓ లీడరు ఆవిర్భవించినప్పుడే కెసియార్ భయపడాలి. బిజెపి యిప్పుడు గట్టి పోటీ యివ్వడానికి సమకట్టింది. ఇతర పార్టీలకు వేస్తే ఆ కాండిడేటు కెసియార్ పార్టీలో దూరినప్పుడు ఆ ఓటు వృథా అవుతుందనే తోస్తుంది. బిజెపి టిక్కెట్టుపై ఎన్నికైనవారు యితర పార్టీల్లోకి దుమకడం తక్కువ. అందువలన కెసియార్ వ్యతిరేక ఓటుకి ఆ పార్టీ కేంద్రబిందువుగా మారవచ్చు. కెసియార్ మజ్లిస్ పార్టీని వాటేసుకోవడం ద్వారా హిందువులను బిజెపి వైపు నెడుతున్నాడు.
బిజెపికి సంస్థాగతమైన బలం ఉంది. మోదీ గ్లామర్ ఎలాగూ ఉంది. అయితే దానికి కావలసినది కెసియార్‌కు దీటైన వాగ్ధాటి, గ్లామర్ ఉన్న నాయకుడు. అలాటివాడు హరీశ్ తప్ప వేరెవరు కనబడటం లేదు. రేవంత్ రెడ్డికి ఛాన్సుండేదేమో కానీ ఓటు-నోటు కేసులో రెడ్‌హేండెడ్‌గా దొరికిపోయాడు. బిజెపి హరీశ్‌ను దువ్వుతోందేమోనన్న భయంతోనే కాబోలు కెసియార్ అతన్ని హఠాత్తుగా పిలిచి మంత్రి పదవి యిచ్చినట్లున్నారు. కానీ యీ లౌక్యం ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. కెసియార్‌ను ఓడించగల శత్రువు కెసియార్ అహంకారం మాత్రమే! దానిది పై చేయి కాగానే యిప్పటిదాకా ఉపయోగించుకోబడి, వదిలివేయబడిన వాళ్లందరూ తిరగబడే అవకాశం వస్తుంది. అప్పటివరకు కెసియార్ మాటే చెల్లుతుంది.
-ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2019)
[email protected]