ఎమ్బీయస్‌: ఒక్క పాటకే యింత ఉలికిపాటా?

''లక్ష్మీస్‌ ఎన్టీయార్‌''లో వెన్నుపోటు పాటకు టిడిపి నాయకుల స్పందన వింతగా ఉంది. ఏకంగా కేసులు పెట్టేస్తున్నారు. ఏ సెక్షన్‌ కింద పెట్టారో ఒక్క ఛానెలూ చెప్పటం లేదు. పాటలో అసభ్యపదాలు లేవు, అశ్లీలవ్యక్తీకరణలు లేవు.…

''లక్ష్మీస్‌ ఎన్టీయార్‌''లో వెన్నుపోటు పాటకు టిడిపి నాయకుల స్పందన వింతగా ఉంది. ఏకంగా కేసులు పెట్టేస్తున్నారు. ఏ సెక్షన్‌ కింద పెట్టారో ఒక్క ఛానెలూ చెప్పటం లేదు. పాటలో అసభ్యపదాలు లేవు, అశ్లీలవ్యక్తీకరణలు లేవు. అనూహ్యంగా పదవి పోగొట్టుకున్న వ్యక్తి ఆక్రోశం కనబడుతోంది అందులో. ఆ పాత్ర పాయింటు ఆఫ్‌ వ్యూలో పాట వెలువడినప్పుడు తన నుంచి అధికారం గుంజుకున్నవాడిని శకుని అనకుండా ఆపద్రక్షకుడు, ముక్తిప్రదాత అంటాడా? 

ఏదైనా సరే చూసే కోణంపై ఆధారపడుతుంది. భారతదేశం కోణం నుంచి చూస్తే గజనీ మహమ్మద్‌ పరదేశాల సొత్తు కొల్లగొట్టిన ఒక దోపిడీ దొంగ. అఫ్గనిస్తాన్‌ దృక్కోణం నుంచి చూస్తే అతను తన దేశప్రజల జీవనప్రమాణాలను పెంచడానికి మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రాణాలకు కూడా తెగించి, బలమైన, విశాలమైన భారత్‌పైకి పలుమార్లు దండెత్తిన వీరుడు, శూరుడు.

1995 ఆగస్టు నాటి ఉదంతం ఎన్టీయార్‌ అభిమానులకు వెన్నుపోటు, చంద్రబాబు అభిమానులకు ప్రజాస్వామ్య పరిరక్షణ. ఆ ఘట్టాన్ని బాబు వ్యూ పాయింటులో సినిమా తీస్తే పార్టీని కాపాడుకోవడానికి పిల్ల నిచ్చిన మావను సైతం ఎదిరించిన ధీరుడిగా చూపుతారు. నిజానికి ఆనాటి ''ఈనాడు'' అలాగే చూపింది. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో కూడా బాబు వ్యూ పాయింటే ప్రస్ఫుటంగా ఉంటుందని సులభంగా ఊహించవచ్చు.

కాంగ్రెసులో వుండగా బాబు ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు, తర్వాత ఎన్నికలలో ఓడిపోయి మామ పంచన చేరడం.. యివన్నీ ఏ మేరకు చూపిస్తారో సందేహమే. టిడిపి ఆశయసిద్ధికై బాబు మావగారి తరఫున కాంగ్రెసులో కోవర్టుగా చేరి, శల్యసారథ్యం చేసి కాంగ్రెసును అపజయం బాట పట్టించారని చూపినా ప్రమాదమే – ప్రస్తుతం కాంగ్రెసుతో దోస్తీ నెరపుతున్న కారణంగా! ఆ సినిమా వచ్చాకే ఏం చూపారో తెలుస్తుంది.

ఇక వర్మ సినిమాకు వస్తే – అంత్యఘట్టంలో ఎన్టీయార్‌ ఎలా ఫీలయ్యారో అదీ రహస్యమేమీ కాదు. బాబును నానా తిట్లూ తిడుతూ ఆయన కాసెట్లే రిలీజ్‌ చేశాడు. ఆ భావమే పాటలో రిఫ్లెక్ట్‌ అయింది. దానికి టిడిపి వాళ్లు పిసుక్కోవడం దేనికి? బాబు అనుయాయులు ఎన్టీయార్‌ను ఒక వగలాడి వగలకు భ్రమసిన ముదుసలిగా చిత్రీకరించారు. లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా వర్ణించారు. ఆమెను ముఖ్యమంత్రిని చేసి, తను ప్రధాని కావడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రచారం చేశారు. ఆమెను యింటికే పరిమితం చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. లొంగకపోవడంతో పదవీభ్రష్టుణ్ని చేశారు.

ఎన్టీయార్‌కు ప్రజల్లో ఉన్నంత పలుకుబడి, ఎమ్మెల్యేలలో లేకపోవడం చేత గద్దె దిగాల్సి వచ్చింది. పైగా అప్పుడు టాక్టికల్‌గా చాలా రాంగ్‌ స్టెప్స్‌ వేశారు. లక్ష్మీపార్వతిపై ద్వేషంతో ఆయన కుటుంబం యావత్తు బాబుతో చేతులు కలిపింది. మీడియా బాబుకి అండగా నిలిచింది. స్పీకరుతో సహా అనేక వ్యవస్థలు  బాబుకి అనుకూలంగా వ్యవహరించాయి. లక్ష్మీపార్వతి మూర్ఖత్వం, అహంకారం చివరకు ఎన్టీయార్‌ పతనానికి దారి తీసింది. ప్రజల్లో కూడా ఎన్టీయార్‌కు అనుకూలంగా తిరుగుబాటు రాలేదు. దాన్ని ఓ కుటుంబకలహంగా చూశారు. లోకసభ ఎన్నికలు జరిగేవరకూ ఎన్టీయార్‌ బతికి వుండి వుంటే ప్రజల్లో ఆయనకు ఏ పాటి సానుభూతి ఉందో తేటతెల్లమయ్యేది. కానీ ఆయన అంతకు ముందే చనిపోయాడు.

పదవి లాక్కున్న తర్వాత బాబు ఎన్టీయార్‌ను ఉతికి పారేశారు. 1995 సెప్టెంబరులో ''ఇండియా టుడే''కు యిచ్చిన యింటర్వ్యూలో ''ఎన్టీయార్‌లో నైతిక విలువలనేవే లేవు. తాను శాసనసభ రద్దుకు సిఫార్సు చేసిన తరువాత తనను వెన్నుపోటు పొడిచిపోయిన శాసనసభ్యుల్ని మళ్లీ వెనుకకు పిలవడం సమంజసమేనా?'' అని అన్నారు. (వైస్రాయి హోటల్‌కి వెళ్లి ఎన్టీయార్‌ తమ్ముళ్లూ తిరిగి వచ్చేయండి అని అడగడం గురించి అయి వుంటుంది. అలా అడగడం నైతికంగా అధర్మం కనుక ఆ రోజు చెప్పులవర్షం కురియడం సమంజసమే అనే భావన కాబోలు) ఆ విధంగా తనతో పాటు యితర శాసనసభ్యులు చేసిన చర్యను వర్ణించడానికి 'వెన్నుపోటు' అనే పదాన్ని ఆయనే వాడాడు. ఇప్పుడు ఆ పదంతో పాట తయారైతే యింత రుంజుకోవడం దేనికి? ఆ పాట ప్రొటగానిస్టు పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఉండి వుంటుంది. డైరక్టరు పాయింటు ఆఫ్‌ వ్యూలో యిరు పక్షాల వారినీ చూపించి వుంటే ఆ పాటలో బాబు వెర్షన్‌ చూపిస్తూ 'నైతిక విలువలే శూన్యమా? అధికారమంటే అంత ప్రేమా? అప్పుడు దుర్భాషలా? ఇప్పుడు వేడికోళ్లా?' అనే చరణం ఒకటి పెట్టి అక్కడ ఎన్టీయార్‌ ఫోటోలు చూపేవారేమో! 

ఇదేదో నా సొంత కవిత్వమనుకోకండి. అదే ఇంటర్వ్యూలో బాబు ''..ఆయన ప్రేమంతా అధికారం మీదే. ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఆయనకు కావలసినది. శాసనసభ్యులు కొన్ని విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు కనుకనే నాతో ఉన్నారు. …శాసనసభ్యులు మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోయారంటూ ఆయన దుర్భాషలాడి యిప్పుడు వారిని ఎలా మళ్లీ వెనుకకు పిలువగలుగుతున్నారు?'' అన్నారు. 

ఇక్కడ పెద్ద జోక్‌ ఏమిటంటే ఏదో విధంగా అధికారంలోకి వచ్చినది బాబు, రైట్‌ రాయల్‌ వే లో ప్రజల చేత అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చినది ఎన్టీయార్‌! సరే, ఏది ఏమైనా బాబు నాయకత్వాన్ని అధికాంశం టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆమోదించారు. వాళ్లకు కావలసినది బాబు వంటి నాయకుడే. ఆయన ఎన్టీయార్‌లా ఒంటిచేత్తో పార్టీని గెలిపించలేకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక తెప్పను పట్టుకుని ఏరు దాటించగలడు. వాళ్లకు కావలసినది అందించగలడు.

1995 సంఘటన తర్వాత కూడా ప్రజలు బాబును ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ఇది రాజకీయ వాస్తవం. ఎన్టీయార్‌ పరాజితుడిగానే మరణించాలని రాసి పెట్టి వుంది. ఎంత మయూర సింహాసనం ఎక్కినా షాజహాన్‌ చివరకు జైల్లోనే కన్నుమూయాలని రాసి పెట్టి ఉంది. ఇది చరిత్ర. 'అబ్బే కాదు, బాబర్‌లాగే ఆయనకూ పుత్రప్రేమ ఎక్కువ. నాయనా ఔరంగజేబూ, మీ అమ్మ మీద బెంగతో నేను రాజ్యపాలన చేయలేకపోతున్నాను, వెళ్లి జైల్లో కూర్చుంటాను, నువ్వు వెళ్లి సింహాసనం మీద కూర్చో' అని ఔరంగజేబుకు చెప్పాడని చరిత్రకారులు మార్చేయలేదు. తండ్రిని జైల్లో పెట్టాడు కదాని ఔరంగజేబు మీద ప్రజలు తిరగబడనూ లేదు. 

ఔరంగజేబు వంటి నియంత కూడా చరిత్రను అలాగే వదిలేశాడు. ఇప్పుడు బాబు అభిమానులు చరిత్రను చరిత్రలా చూడదలచుకోవటం లేదు. వాళ్లు తలచుకుంటే ఆ ఘట్టాన్ని మరోలా సినిమా తీయగలరు. దానిలో ఎన్టీయార్‌ బాబును పిలిచి ''బాబూ, నేనూ లక్ష్మీపార్వతీ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఆ సభావేదికలపై రికార్డింగు డాన్సులు వేసుకుంటాం, కాస్త యీలోగా ముఖ్యమంత్రి సీటులో కూర్చుని పెడతావా?' అని అడుగుతాడు కాబోలు. కానీ అలాటి సినిమా రావడానికి యింకో 30 ఏళ్లు పట్టవచ్చు. ప్రస్తుతానికి 1995 సంఘటన పబ్లిక్‌ మెమరీలో తాజాగా ఉంది కాబట్టి అంత సాహసం చేయరు. కానీ ఆ చరిత్రను తెర మీద చూపకుండా మాత్రం విశ్వప్రయత్నం చేస్తారని యివాళ్టి సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
[email protected]