జన విజ్ఞాన వేదికవారు మేల్కొన్నారు. కెసియార్ సెక్రటేరియట్ వాస్తుపై చర్చ ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి యిద్దరూ సిఎంలు వాస్తుపై పెట్టిన ఖర్చుపై యింతకుముందే ఆందోళన చేపట్టి వుంటే పరిస్థితి యిక్కడిదాకా వచ్చేది కాదేమో. నిజానికి చెన్నారెడ్డిగారి వరకు సిఎంలు తమ నమ్మకాలను బాహాటంగా ప్రదర్శించలేదు. చెన్నారెడ్డిగారు షష్టిపూర్తి అనీ, ప్రభుత్వఖర్చుతో తన యింటికి వాస్తు మార్పులనీ ఖర్చు పెడితే ''ఈనాడు'' ఏకిఏకి వదిలిపెట్టింది. ఎన్టీయారూ వాస్తు పేరుతో సెక్రటేరియట్‌పై వృథా ఖర్చు పెట్టారు. అయినా నాదెండ్ల వెన్నుపోటు తప్పలేదు. వైయస్సార్ కట్టించిన సిఎం నివాస భవనానికి వాస్తుదోషం అంటున్నారు యిప్పటి సిఎంలు. ఏడాదిలోగా తీసేయడం ఖాయం అందరూ అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడే వుండి మూడేళ్లు లాగించేశారు. మంత్రిగానైనా అనుభవం లేని ఆయన మూడేళ్లు సిఎంగా వుండి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి ముఖ్యమంత్రి అనే కీర్తి కిరీటంతో కిందకు దిగారంటే వాస్తు దోషం వుందనగలమా? అయినా బాబు, కెసియార్ యిద్దరూ దాన్ని పక్కన పడేశారు. ఒక అంచనా ప్రకారం జూన్ నుంచి సచివాలయ వాస్తు దోషాల నివారణకై బాబు 81 కోట్లు, కెసియార్ 34 కోట్లు ఖర్చు చేశారట. ఇంత ఖర్చు చేసినా బాబుకి సొంతంగా ఏం కలిసి వచ్చిందో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏమీ ఒనగూడలేదు. ప్రత్యేక హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, నెలజీతాలకే తడుముకోవాల్సిన పరిస్థితి. ఇది చాలనట్లు కనీవిని ఎరుగనంతగా హుదూద్ తుపాను వచ్చి అతలాకుతలం చేసేసింది. కెసియార్ కుందన్‌బాగ్‌లోని భవనాలకు వెళదామని వాస్తు మార్పులు చేయించి చివరకు మానేశారు. అంటే మార్పులు చేయించిన పండితుడి మాటల్లో విశ్వాసం కుదరలేదన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డకు సెక్రటేరియట్‌కు మార్పించిన దాకా వుండి, అక్కడ వాస్తు బాగా లేదన్న సందేహం వస్తే మళ్లీ వెనక్కి వస్తారా? అప్పటికే యిది కూల్చేసి వుంటే యింకో చోటికి తరలిస్తారా?
వాస్తు శాస్త్రీయతపై జనవిజ్ఞానవేదికవారికి, వాస్తు పండితుడు గౌరు తిరుపతిరెడ్డిగారికి టీవీలో చర్చలు జరిగినట్లు, ఛాలెంజ్‌లు విసురుకున్నట్లు పేపర్లో చదివాను. (దానిలో గౌరు ఓడిపోయినా వాస్తు శాస్త్రం ఓడిపోయినట్లు జనవిజ్ఞాన వేదిక వారు డిక్లేర్ చేయలేరు. వైద్యుడికి వుండే పరిమితులు వేరు, వైద్యశాస్త్రానికి వుండే పరిమితులు వేరు. జన విజ్ఞాన వేదిక వాస్తును అధ్యయనం చేసి దానిలోని లోపాలను ఎత్తిచూపితే అప్పుడు జనాలకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది) ఆ సందర్భంగా నైరృతి సింహద్వారం వున్న యింట్లో వుంటే మనిషి భూమ్మీద మిగలడని గౌరువారు అన్నారట. నేను కొన్న ఒక ఫ్లాట్‌కు నైరృతి సింహద్వారమే. కొంటూంటే మా కొలీగ్ ఒకావిడ, 'ఇంటి యజమానికి మృత్యువు సంభవిస్తుంది, వద్దు' అని సలహా చెప్పారు. 'ఫర్వాలేదు లెండి' అంటూ కొనేశాను, 8 ఏళ్లపాటు నివసించాను. అక్కడ వుండగా వృద్ధి కూడా కలిగింది. ఈలోగా ఆవిడ భర్త చిన్నవయసులోనే పోయాడు – వాస్తుప్రకారం కట్టిన యింట్లో వుంటూనే. (చావులకు, వాస్తుకు ముడిపెట్టలేమని నీతి) ఈ మాట ఎవరితోనో అంటే – 'మీది ఫ్లాట్ కదా, మీదానికి పశ్చిమంవైపు యింకో ఫ్లాట్ వుంది. అందువలన మీది నైరృతి అనడానికి లేదు' అని చెప్పాడు. 'వాస్తు విరుద్ధమైన యింట్లో ఐదేళ్ల పాటు వుంటే ఐదులక్షల రూపాయలు యిస్తాను' అని ఛాలెంజ్ చేసిన గౌరు గారూ రేపు యిలాగే వాదించవచ్చు. ఇలా అనేవాళ్లందరికీ నేను అడిగేది ఒక్కటే – 'వాస్తు యిండిపెండెంట్ యిళ్లకే తప్ప ఫ్లాట్లకు వర్తించదు' అని ప్రకటించి అనేకమందికి మనశ్శాంతి చేకూర్చండి అని. దక్షిణం వైపు నుండి గాలి వస్తుంది కాబట్టి అటువైపు కిటికీ వుండాలి అని శాస్త్రం వుందంటే అది యిండిపెండెంటు హౌస్‌కే నప్పుతుంది – దక్షిణంవైపు ఖాళీగా వుంటుంది కాబట్టి. ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దక్షిణం పక్కన ఫ్లాట్ వుంటే యిక గాలి వచ్చే ప్రసక్తి ఏముంది? అయినా ఫ్లాట్‌కే కాదు, విడి గదులకు కూడా వాస్తు చెప్పేసి, గదిలో ఈశాన్యం వైపు ఖాళీగా వుంచాలి. అక్కడ పెట్టిన బీరువా జరిపేసి కిటికీకి అడ్డంగా పెట్టేయండి, గాలి రాకపోయినా ఫర్వాలేదు అనేస్తున్నారు.
వాస్తు కానీయండి, జాతకాలు కానీయండి – విడి విడి ఫలితాలు చూడడం తప్పు. మనిషి పొడుగుని బట్టి ఎంత బరువుంటే సబబో, ఎంత వుంటే బేసబబో తెలుస్తుంది. కొలెస్టరాల్ కూడా అబ్సల్యూట్ ఫిగర్ చూసి గుండెలు బాదుకోకూడదు. తక్కిన పరామీటర్స్, వయసు యిత్యాదులు పరిగణనలోకి తీసుకుంటేనే అది సరైన రేంజ్‌లో వుందో లేదో తెలుస్తుంది. అది డాక్టర్‌కే తెలుస్తుంది. గ్రహాలు కూడా అంతే! శని ఫలానా యింట్లో వుంటే ఫలానా రిజల్టు అని కంప్యూటర్‌లో రాసినది చూసి భయపడుతూంటారు. మీకూ ఫలానావారికి పొత్తు కుదరదు అని మేట్రిమోనియల్ సైట్‌లో పెట్టేసి మిస్‌లీడ్ చేస్తున్నారు. నిజానికి శాస్త్రప్రకారం ఒక్కో లగ్నానికి కొన్ని గ్రహాలు శుభం చేకూరుస్తాయి. కొన్ని అశుభం కలిగిస్తాయి. వాడుకలో శనిగ్రహం అని తిట్టుకున్నా కొన్ని లగ్నాలకు శని అత్యంత శుభుడు. శుభత్వం, పాపత్వం అబ్సల్యూట్ టెర్మ్‌స్ కావు. ఎవరితో కలిసి వున్నాడు, ఎవరిచేత చూడబడుతున్నాడు, ఎవరు, ఏ మేరకు నలిఫై చేస్తున్నారు, ఏ అంతర్దశలో వున్నపుడు ఫలితం యిస్తాడు , ఆ థ జాతకుడి జీవితకాలంలో వస్తుందా రాదా అనేవి గమనించాకే పూర్తి పిక్చర్ వస్తుంది. ఇవేమీ పట్టించుకోకుండా బిట్స్ అండ్ పీసెస్‌లో చూడబోయి సామాన్యజనం గాబరా పడుతూంటారు. శరీరంలో ఒక అవయవం బలహీనంగా వుంటే మరో దాని శక్తి పెరిగి కాంపెన్సేట్ అయినట్లే, జాతకంలో కూడా ఒకదాన్ని మరొకటి చెక్ చేసుకుంటూ, సహాయపడుతూ మొత్తం మీద పెద్దగా యిబ్బంది లేకుండా గడిచిపోతుంది. అలాగే వాస్తు కూడా.
గతంలో వాస్తు గురించి యింత పిచ్చి వుండేది కాదు. గత 30 ఏళ్లగా అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. ఒక్కసారి పల్లెటూరికి వెళ్లి మీ తాతగారి యింటికి వాస్తు ఎలా వుందో చూసి రండి. ముప్పాతిక కేసుల్లో యీనాడు వీళ్లు చెప్పే సిద్ధాంతాలకు అనుగుణంగా వుండనే వుండదు. జాయింటు ఫ్యామిలీలు వుండే రోజుల్లో మధ్యలో హాలు, దానిలో ఓ మూల ధాన్యపు గాదె, పక్కన ఒక్కో కొడుక్కి ఒక్కో రూము – అదే వాళ్లకు బెడ్‌రూము, లివింగ్ రూము, మరోటీ. అందరికీ కలిపి పెరట్లో ఓ మూల స్నానాల గది, మరో మూల టాయిలెట్. ఎక్కడ సౌకర్యంగా వుంటే అక్కడ కట్టేవారు. తండ్రి పోతే, కొడుక్కి వారసత్వంగా వస్తే నా పేరుకి సింహద్వారం యిటువైపు వుండకూడదు అంటూ గుమ్మం కూల్చేసి, మార్చేసేవారు కారు. అదే యింట్లో కొనసాగేవారు. వాళ్లంతా బతకలేదా, బట్ట కట్టలేదా? ఇవన్నీ ఆలోచించకుండా వాస్తు పేరు చెప్పి భయపెట్టేవారు ఎక్కువై పోయి చాదస్తాలు పెరిగిపోయేయి. మా మిసెస్ కొలీగ్ ఒకావిడ తన అనారోగ్యానికి కారణం వాస్తు బాగా లేని యింటిలో వుండడం అని మొత్తుకుంటూ వుండేది. దాన్ని అమ్మేసి, వేరే యింట్లోకి మారినా ఆవిడ అనారోగ్యం తగ్గలేదు. ఎందుకు? అని అడిగితే 'ఆ యిల్లు అమ్మగా వచ్చిన డబ్బు తింటున్నాం కదండీ, అందుకు..' అంది! అంటే వాస్తు బాగా లేని యిల్లు డబ్బుగా మారిన తర్వాత కూడా పీడించగలదా? ఏ సిద్ధాంతం ప్రకారం? ఇవన్నీ జనాలు ఆలోచించడం మానేశారు. రాజకీయపరమైన వ్యాసంగా మొదలుపెట్టి యిలాటి నమ్మకాలపై లెక్చరు దంచుతున్నానేమిటని అనుకోవద్దు. నాయకులు, సినిమాతారలు సమాజంపై గాఢప్రభావాన్ని కనబరుస్తారు. సామాన్యజనులు వారిని అనుకరిస్తారు. ఇవాళ బాబు వాస్తు ప్రకారం రాజధాని కడుతున్నారు, కెసియార్ వాస్తు పేరు చెప్పి సెక్రటేరియట్ మారుస్తున్నారు. రేపు శాఖాధిపతులు కూడా వాస్తు కోసం అంటూ ఆఫీసు గేట్లు, ఫర్నిచరు మారుస్తారు. మంత్రి ఫలానా ఐయేయస్ ఆఫీసరుకూ నాకూ జాతకరీత్యా పొంతన కుదరలేదు, మార్చాలి అని పట్టుబడతారు. మామూలు ప్రజలు కూడా యిక ప్రతీదీ వాస్తుకి ముడిపెట్టి బెంగ పెట్టుకుంటారు. అందువలన నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలను పాఠకులకు చెప్పి కాస్త ఉపశమనాన్ని పంచుతున్నాను. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)