సబ్జక్టులోకి వెళ్లబోయేముందు కాస్త వ్యక్తిగత వివరణ – పదిరోజులుగా నా ఆర్టికల్స్ కనబడకపోవడంతో చాలా రకాలైన వ్యాఖ్యలు వచ్చిపడడంతో యీ వివరణ అవసరపడుతోంది. నేను యూరోప్ పర్యటనలో వుండడం చేత వ్యాసాలు రాయలేకపోయాను. దాంతో 'ఏమైంది? ఆరోగ్యసమస్యా?', 'గ్రేట్ ఆంధ్రాకు రాయడం మానేశావా?', 'ఫలితాలు చూసి హతాశుడవై మందుకొట్టి తొంగున్నావా?' 'నిరాశలో మునిగిపోయావా?' యిలా బోల్డు వాకబులు. నిజానికి టూరుకి వెళ్లబోయేముందు 'పదిరోజుల విరామం' పేర ఒక ఆర్టికల్ రాద్దామనుకున్నాను. 'ఫలితాలు వచ్చేసరికి నేను ఇండియాలో వుండను, తెలుసుకునే అవకాశం కూడా వుండదు. ఈ లోగా మీరు ఏవేవో ఊహించుకోకండి. జగన్ ఓడిపోతే ఆత్మహత్య చేసుకుని వుంటానని, నెగ్గి వుంటే నన్ను మీడియా సలహాదారుగా తీసుకుని వుంటాడని అనుకోకండి. నా సీరియల్స్ పాఠకులు దిగాలు పడకండి. ఒకవేళ నేను ఎక్కిన విమానం హైజాక్‌కు గురైతే నీతిచంద్రిక కథలో పులికి చిక్కిన ఆవు దూడకు పాలిచ్చి తిరిగి వస్తానని వేడుకున్నట్లు వాళ్లను 'నా సీరియల్స్ పూర్తి చేసి వచ్చేస్తాను. లేకపోతే ఆ పాఠకులు వూరుకోరు. ముఖ్యంగా రాజీవ్ హత్య పూర్తి చేయకపోతే 'ఎమ్బీయస్ హత్య' వార్త చూడాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు' అని బతిమాలుకుని వస్తాను..' యిలా సరదాగా రాద్దామనుకున్నాను.
అంతలోనే అనుమానం వచ్చింది – ఇదేదో ఫేస్‌బుక్ వ్యవహారంలా తోస్తుందాని. ఫేస్‌బుక్‌లో చూడండి 'ఇవాళ మార్నింగ్ వాక్‌కు వెళ్లాను, కొత్తబూటు కాబట్టి కరిచింది, దారిలో కుక్క మొరిగింది, దొంగ అనుకుని జనాలు వెంటబడడంతో జాగింగ్ కూడా చేయాల్సి వచ్చింది, దాని తాలూకు సెల్ఫీ యిదిగో..' అంటూ రాస్తూంటారు. అలాగే యిదీ అనిపిస్తుందని భయం వేసి, మధ్యలో డుమ్మా కొట్టడం అలవాటే కదా అని వూరుకున్నాను. తీరా చూస్తే యిదీ వరస! తిరిగి వచ్చాక గత పదిరోజుల పేపర్లు కక్షుణ్ణంగా చదివితే తప్ప ఫలితాల విశ్లేషణ రాయలేను. ఇవాళ్టి నుండి ఆ పనిలోనే వున్నాను. 'నీ ప్రిడిక్షన్ తప్పింది. మీ జగన్ రాలేదు' అంటూ కొంతమంది రాశారు. మొదటగా 'మా జగన్' కాదు. నేను జగన్ పార్టీకి ఓటెయ్యలేదని మొదటే రాశాను. అవకాశం వుంటే సమైక్యపార్టీకి ఓటేసి వుండేవాణ్నని రాశాను. ఆంధ్రలో ప్రజలు ఆ పార్టీకి సింగిల్ డిజిట్‌లోనైనా సీట్లు యివ్వాలని ఆశించాను. విభజన జరిగిపోయాక సమైక్యమేమిటి నీ మొహం అనేవారికి దానిలోనే సమాధానం యిచ్చాను – సమైక్యభావన ముఖ్యం అని.
ఇవాళ చూడండి, 200 కంటె తక్కువమంది సెక్రటేరియట్ ఉద్యోగుల స్థానికతపై కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఇది ఒక శాఖలో! తక్కిన శాఖల విషయానికి వస్తే యింకెన్ని గొడవలు వస్తాయో తెలియదు. దొంగ సర్టిఫికెట్టు యిచ్చారని వీరంటారు. కాదు, ఎక్కడ చదివామో అక్కడి సర్టిఫికెట్టు యిచ్చాం, అది బోగస్ ఎలా అవుతుందని వారంటారు. స్థానికత నిర్ణయించడానికి జన్మస్థలమో, చదివిన స్థలమో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలో యిప్పటిదాకా విధానపరమైన నిర్ణయం లేకుండా ఎలా వుంటుంది? జన్మస్థలం అన్నా అది వివాదమే. సాధారణంగా ఎవరైనా అమ్మమ్మ గారింట్లో పుడతారు. తాతగారు ఉద్యోగరీత్యా ఏ వూళ్లో వుంటే ఆ వూళ్లో పుడతారు. అది పరరాష్ట్రం కావచ్చు, పరదేశం కావచ్చు. దాన్ని పట్టుకుని నువ్వు బెంగాలీవి, పంజాబీవి, ఆస్ట్రేలియన్‌వి అంటే ఎలా? అన్నదమ్ముల్లా విడిపోదాం అంటూ స్లోగన్స్ యిచ్చినవారు యిలాటి విషయాలపై కొట్టేసుకుంటున్నారు. ఇలాటివి ఎన్నో ఎన్నో వస్తాయి. పైగా ఆంధ్ర ముఖ్యమంత్రి 'చంద్ర'బాబుకి, తెలంగాణ ముఖ్యమంత్రి 'చంద్ర'శేఖర్‌కు 'చుక్కెదురు'. ఇద్దరూ ప్రతీ అంశాన్నీ వివాదం చేసి, తమ తమ ప్రాంతాల్లో ఛాంపియన్లుగా ఎదగడానికి చూడవచ్చు. ఇది ఉభయ ప్రాంతాలకూ నష్టం. అందుకే సమైక్య భావనైనా వుండాలంటాను. అయితే ఆ పార్టీని ఎవరూ నమ్మినట్లు లేదు. అది దురదృష్టం.
ముందుగా ఆంధ్ర ఫలితాల గురించి కాస్త చెప్తాను. ఫలితాలపై మీడియా అంచనాలు, నాయకుల అంచనాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికల సమయంలో కార్యకర్తలను ఉత్సాహపరచడానికి క్లీన్ స్వీప్ చేస్తాం అని చెప్పడం సహజం. అయిపోయిన తర్వాత కూడా బాబు, జగన్ యిద్దరూ 130- 140 దాకా వస్తాయని ప్రకటనలు చేశారు – ఎందుకో, ఏం ఆశించో, తమ క్యాంపునుండి ఎమ్మెల్యేలు పారిపోతారన్న సందేహంతోనో తెలియదు. ఎన్నికల రోజున స్వయంగా చూసిన కొందరు పరిశీలక మిత్రులు (టిడిపి, వైకాపా పార్టీల వాళ్లు) తమ పార్టీకి 120 నుండి 140 వరకు ఖాయం అని చెప్పారు. 9 వ తారీకు పేపర్ల ప్రకారం బాబు ''మా పార్టీకి (కూటమి అనలేదాయన) 120 నుంచి 130 సీట్లు, యిరవైకి పైగా ఎంపీ సీట్లు వస్తాయి. ప్రజల మద్దతు ప్రభంజనం రూపం దాలిస్తే యింకా పెరిగితే పెరగవచ్చు'' అన్నారు. ఎవరెన్ని చెప్పినా నేను నెగ్గే పార్టీకి 90 నుండి 100 మాత్రమే వస్తాయని చెప్పాను. నెగ్గిన టిడిపికి 102 వచ్చాయి. అంటే నా అంచనా 2% తప్పితే బాబు గారి అంచనా 30% కు పైగా తప్పింది. (జగన్‌దైతే చెప్పినదానిలో 50% కూడా రాలేదు) ఓడే పార్టీకి 55 నుండి 70 లోపున వస్తాయన్నాను. (వైకాపాకు 67 వచ్చాయి) అంత మార్జిన్ కూడా ఎందుకిచ్చానంటే కాంగ్రెస్, జెయస్పీ, బిజెపి, యిండిపెండెంట్స్, లెఫ్ట్ వంటి పార్టీలకు ఎన్ని వస్తాయో చెప్పలేకపోతున్నాం కాబట్టి అన్నాను. అంటూనే ఎంతైనా వాటికి 15-20 సీట్లు వస్తాయని గెస్ చేశాను. వాస్తవానికి వాటికి 6 (బిజెపికి 4, యితరులకు 2) మాత్రమే వచ్చాయి. 90 నుండి 100 తెచ్చుకునే పార్టీ ఏది అనే విషయం రాస్తూ వైకాపాకు రాయలసీమ వాసులు బాబు కంటె జగన్‌ను ఎక్కువ ఆదరిస్తారని రాశాను. అనంతపురం తప్ప తక్కిన జిల్లాల్లో వైకాపాకే ఎక్కువ వచ్చాయి. నెల్లూరులో అయితే వైకాపాకే చాలా ఎక్కువ వచ్చాయి.
కోస్తా ప్రాంతాల్లో 'ఉత్తరాంధ్ర, తూగోజి 2009లో వలె జగన్‌పై చూపితే … వైకాపాకు లాభం.' అని రాశాను. (చూపలేదు. అక్కడే వైకాపా దెబ్బ తింది) ఆ పరిస్థితిలో వైకాపాకు 100 సీట్లు వస్తాయని అనిపిస్తోంది అంటూనే కేవియట్లు రాశాను. క్రైస్తవం ద్వారా ఓట్లు సమీకరిస్తున్నాడన్న ఫీలింగ్ వలన వలన హిందువుల్లో జగన్ వ్యతిరేక ఓట్లు పెరిగాయని, కెసియార్‌తో సాన్నిహిత్యం (నా వ్యాసం తర్వాత, ఎన్నికలయిపోయాక కెసియార్ మాట్లాడుతూ ఆంధ్రకు జగనే సిఎం అని చెప్పి, తమ మధ్య లింకును చాటుకున్నారు) కారణంగా ఆంధ్రులు జగన్ పట్ల ఉదారంగా వుండకపోవచ్చని రాశాను. ఇవన్నీ రాసి వైకాపా 90 దగ్గర ఆగిపోవచ్చని రాస్తూ మళ్లీ దానికి రైడర్‌గా 'మోదీ మ్యాజిక్ పనిచేసి మధ్యతరగతి యిబ్బడిముబ్బడిగా ఓట్లు వేస్తే మాత్రం యీ అంకెలు టిడిపికి వస్తాయి' అని రాశాను. (మోదీ మ్యాజిక్ దేశమంతా పనిచేసింది, మధ్యతరగతి యిబ్బడిముబ్బడిగా ఓట్లు వేశారు) టిడిపికి యీ అవకాశముంది అని రాస్తూనే 'పార్టీ ఫిరాయింపుదార్లను తీసుకుని సొంత క్యాడర్‌ను అసంతృప్తికి గురి చేసిన కారణంగా వెన్నుపోట్లు తగిలి టిడిపి యీ అంకె చేరకపోవడానికి ఛాన్సుంది' అని రాశాను. ఇదీ నా ఆఖరి వాక్యం. అయితే మోదీ హవాలో ఆ ఫ్యాక్టర్ పెద్దగా పనిచేయలేదు. పిఠాపురంలో మాత్రం టిడిపి రెబెల్ నెగ్గాడు.
ఆ విధంగా చూస్తే నా అంచనాలు మరీ యిదిగా తప్పలేదు. ఇక్కడో విషయం రాయాలి. నేను యూరోప్ ట్రిప్‌కు వెళ్లాను కదా. 45 మంది వున్న ట్రూపు అది. అందరూ స్టేటుబ్యాంక్ ఆఫీసర్లూ, వాళ్ల కుటుంబాలే. మధ్యతరగతి కుటుంబీకులే. అందరూ టిడిపి వీరాభిమానులే, జగన్ అంటే విపరీతమైన కోపం కలవారే. స్విజర్లండ్‌లో యుబిఎస్ బ్యాంకు చూడగానే 'జగన్ బ్యాంక్' (ఇంకెవరి వద్దా బ్లాక్‌మనీ లేనట్టు) అని కేకలు వేసినవారే. బాబు, మోదీ గెలిచితీరతారని ఉత్సాహంగా మాట్లాడినవారే. ఫలితాలు వెలువడిన రోజున కాస్త చిరునవ్వులు కనబడ్డాయి కానీ తర్వాత చప్పబడ్డారు. బిజెపికి బాగానే వచ్చినా టిడిపి 102 వద్ద ఆగిపోవడం వాళ్లకు మింగుడుపడలేదు. మీడియా హైప్ వలన కనీసం 140 వస్తాయని అందరూ ఆశించివున్నారు. చెప్పవచ్చేదేమిటంటే – టిడిపి గెలిచింది కానీ అది అభిమానులు ఆశ పెట్టుకున్నంత ఘనవిజయం మాత్రం కాదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)