ఎమ్బీయస్‌ :యమ్‌డన్‌ – 01

చిన్నప్పుడు నేను 'యమ్‌డన్‌' అనే మాట తరచుగా వింటూ వుండేవాణ్ని. మా నాన్న, తాత వాళ్లందరూ దేన్నయినా మెచ్చుకోవాలంటే ఆ పదం వుపయోగిస్తూ వుండేవారు. అద్భుతమైనది, అదరగొట్టేస్తుంది, బ్రహ్మాండంగా వుంది, మాంచి పవర్‌ఫుల్‌.. యిత్యాది…

చిన్నప్పుడు నేను 'యమ్‌డన్‌' అనే మాట తరచుగా వింటూ వుండేవాణ్ని. మా నాన్న, తాత వాళ్లందరూ దేన్నయినా మెచ్చుకోవాలంటే ఆ పదం వుపయోగిస్తూ వుండేవారు. అద్భుతమైనది, అదరగొట్టేస్తుంది, బ్రహ్మాండంగా వుంది, మాంచి పవర్‌ఫుల్‌.. యిత్యాది పదాలకు పర్యాయపదంగా దాన్ని వాడేవారు. ఆ పదం ఎలా వచ్చిందాని ఆలోచించాను. యమగోల వంటి పదం ఎలా పుట్టిందో యిదీ అలాగే వచ్చి వుంటుందని అనుకున్నాను. నిజానికి గోలకు, యముడికి సంబంధం ఏముంది? నరకబాధలు పడలకే యమలోకపు పాపులు గోలగోలగా గగ్గోలు పెడతారు కాబట్టి యమగోల అన్నారేమో తెలియదనుకోండి. ఇది కూడా యమడన్‌ అయి వుంటుంది, ఎఫెక్టివ్‌గా చెప్పడానికి రెండో అక్షరాన్ని పొల్లు చేసి వుంటారని అనుకున్నాను. అంతా వూహే. ఎవర్ని అడిగినా తెలియదన్నారు. ''పెళ్లినాటి ప్రమాణాలు'' సినిమాలో ఆర్‌. నాగేశ్వరరావుకు అది వూతపదం. ''ఉమ్మడి కుటుంబం''లో ఎన్టీయార్‌ ఎల్‌.విజయలక్ష్మిని ఉద్దేశించి పాడిన పాటలో 'యమ్‌డన్‌ బ్యూటీ' అని వాడతాడు.

కొన్ని కొన్ని పదాలు అప్పటి కాలమాన పరిస్థితుల బట్టి భాషలో వచ్చి చేరుతూంటాయి. నా చిన్నప్పుడు ఏదైనా ఖరీదుగా వుంటే స్పెన్సర్‌ రేటు అంటూ వుండేవారు. డిక్షనరీలో దొరికే పదం కాదది. మద్రాసులోని స్పెన్సర్స్‌ అనే సూపర్‌ బజార్‌ (అప్పట్లో ఆ మాట వుండేది కాదు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ అనేవారు) లో వస్తువులన్నీ చాలా ఖరీదుగా వుండేవట. అలాగే ఏదైనా అణా పైసలతో సహా చెపితే బాటా రేటు అనేవారు. బాటావారి చెప్పులు 25 రూ.లు, 50 రూ.లు అని వుండేవి కావు. రూ. 24.99, రూ.49.99 అలా వుండేవి. ఆ పద్ధతి బాటావారు మాత్రమే అనుసరించేవారు. ఇప్పుడు క్రెడిట్‌ కార్డు వాళ్లు కూడా అలాగే చెప్తారు – 'నెలకు రూ.1.49 మాత్రమే వడ్డీ' అని. ఏడాదికి 18% వడ్డీ అంటే మనకు సులభంగా అర్థమై పోతుందని వారికి భయం. అందుకని గందరగోళపు యింగ్లీషుకి తోడు యీ రేటు కూడా యింత కన్ఫ్యూజింగ్‌ గా చెప్తారు. కొన్నాళ్లు పోతే క్రెడిట్‌ కార్డు వడ్డీ రేటులా.. అనే ఉపమానం స్థిరపడవచ్చు. కోలా కృష్ణమోహన్‌ అబద్ధపు లాటరీ ఉదంతం యిటీవలి కాలంలో జరిగింది కాబట్టి చాలామందికి తెలుసు. ఏదైనా బోగస్‌ లాటరీ అయితే 'కోలానా..?' అంటే యీ తరానికి తెలుస్తుంది. ఆ పాత్రను ఓ సినిమాలో పెట్టి ప్రకాష్‌ రాజ్‌ చేత వేయించారు. ఓ 50 ఏళ్లు పోయాక ఆ సినిమా చూసేవారికి కోలా కనక్షన్‌ తెలియదు. మామూలు పాత్రలాగానే చూస్తారు. ఎన్టీయార్‌, లక్ష్మీపార్వతి వుదంతం తర్వాత 'జీవితచరిత్ర రాసుకోవడం' అనే పదానికి కొత్త అర్థం వచ్చి చేరింది. ఓ సినిమాలో వై.విజయ చేత ఓ డైలాగు చెప్పించారు – ఓ యిద్దరు రొమాన్సు చేసుకుంటూంటే 'వాళ్లిద్దరూ జీవితచరిత్ర రాసుకుంటున్నారు' అని చెణుకు వేస్తుంది. మన తర్వాతి తరానికి ఆ జోకులో స్వారస్యం అందకపోవచ్చు. 

నేను చూస్తూండగానే చాలా మాటలు వాడకంలోకి వచ్చాయి. బోరు కొడుతున్నాడు అనే అర్థంలో 'సుత్తి వేస్తున్నాడు' అనే వాడకం వైజాగ్‌ ప్రాంతంలో మాత్రమే వుండేది. జంధ్యాల దాన్ని సినిమాల్లోకి తెచ్చి శాశ్వతత్వం ప్రసాదించారు. తమిళనాట యిలాటి సందర్భంలో 'ఱంపం' అని వాడతారు. అది మనకు దిగుమతి కాలేదు కానీ చిన్న యిల్లు అయింది. పాతికేళ్ల క్రితం దాకా ఆ అర్థంలో వాడేవారు కాదు. తమిళనాడులో వాడేవారు. భారతీరాజా ''చిన్న వీడు'' అనే సినిమా తీశాడు కూడా. దాసరి ''పెద్దిల్లు-చిన్నిల్లు'' అని సినిమా తీసి ఆ మాటని తెలుగువాళ్లకు పరిచయం చేశారు. అది స్థిరపడిపోయింది. అలాగే ఏదో పెద్ద వూడబొడిచాడు  అనే అర్థంలో 'విరగదీశాడు' అనే మాట, లాగి కొట్టాడు అనే అర్థంలో 'పీకాడు', అల్పమైనది అనే అర్థంలో 'తొక్కలోది..' అనే మాట యివన్నీ గత 15-20 ఏళ్లల్లో ప్రాచుర్యంలోకి వచ్చినవే. ఇలాగే గతంలో కూడా జరిగింది. మా చిన్నప్పుడు ఏదైనా బోగస్‌ కంపెనీ అని అనడానికి 'ఆరుబత్తుల కంపెనీ' అంటూండేవారు. కొన్ని ప్రాంతాల్లో 'ఆల్‌ బిత్తర్‌ కంపెనీ' అని కూడా అనేవారు. ఓ పాత సినిమా పాటలో 'లోకంలో జరిగే మోసాలు గమనించరా' అనే అర్థంలో 'ఆల్‌ బిత్తర్‌ కంపెనీలు కనరా' అనే చరణం కూడా వుంది. ఈ ఆరు వత్తులో, బత్తులో ఏమిటో నాకు తెలిసేది కాదు. తూమాటి దొణప్ప గారు తెలుగులో కొన్ని విచిత్రపదాలు ఎలా పుట్టాయో వివరిస్తూ రాసిన పుస్తకంలో అనుకుంటా చదివాను – 1900 ప్రాంతంలో ఆర్‌బత్‌నాట్‌ అనే విదేశీ బ్యాంకు మదరాసులో పెట్టి దివాలా తీసిందట. డిపాజిట్లు వేసిన ప్రజలంతా విపరీతంగా నష్టపోయారు. ఈ అనుభవం తర్వాత భారతీయులు బ్యాంకింగ్‌లోకి దిగారట. అందువలన దివాలా కోరు ముఠా అనే అర్థంలో ఆర్‌బత్‌నాట్‌ పదాన్ని వాడేవారు. ఆ పదాన్ని సరిగ్గా పలకలేక ఆరుబత్తులని కొందరు, ఆల్‌ బిత్తర్‌ అని మరి కొందరు పలికేవారన్నమాట. ఈనాటి వాళ్లకు కృషి బ్యాంకు తరహా అంటే సులభంగా అర్థమవుతుంది. ఇలాగే గానన్‌ అండ్‌ డంకర్లీ అనే కంపెనీ షేర్లు అమ్మి చాలామందిని ముంచింది. ఆ పేరును ఎలా అపభ్రంశం చేశారో నాకు తెలియదు. తెలిసినవారెవరైనా చెపితే సంతోషిస్తాను. 

ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే యమ్‌డన్‌ పదం ఎలా వచ్చిందో నాకు యిప్పటిదాకా తెలియదు. అలాటిది మొదటి ప్రపంచయుద్ధం మొదలై నూరేళ్లు అయిన సందర్భంగా వెలువడిన అనేక వ్యాసాల్లో యీ పదానికి మూలం దొరికి నా అన్వేషణ ఫలించింది. ఎస్‌ఎమ్‌ఎస్‌ ఎమ్‌డెన్‌ అనేది ఒక జర్మన్‌ యుద్ధనౌక పేరు. హిందూమహా సముద్రంలో చెడుగుడు ఆడేసి, బ్రిటన్‌ను నానా తిప్పలు పెట్టింది. మద్రాసు తీరానికి వచ్చి ఫిరంగులు పేల్చి పెట్రోలు ట్యాంకులను పేల్చేసింది. దెబ్బకి మద్రాసు వాసులందరూ అడలిచచ్చారు. చాలామంది ఊరు వదిలి పారిపోయారు. ఎమ్‌డన్‌ పేరు వినగానే అందరూ వణికి, దాన్ని ఒక శక్తిమంతమైన అద్భుతంగా చూశారు. ఆ ఎమ్‌డన్‌ పేరే జనాల నోళ్లల్లో పడి యమ్‌డన్‌ అయింది. తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, సింహళ భాషల్లో కూడా యీ పదం వాడుకలో వుందట. ఇది తెలియగానే ''పెళ్లినాటి ప్రమాణాలు'' సినిమాలో ఆర్‌. నాగేశ్వరరావు పాత్రపరంగా మిలటరీవాడు కాబట్టి ఆ పదప్రయోగం బాగా కుదిరిందని అర్థమైంది. ఎమ్‌డెన్‌ కథ, దాని కెప్టెన్‌ కథ అత్యంత వుత్సాహభరితంగా వుండడంతో ఆ పదం గతంలో విననివారికి కూడా ఆసక్తి కలిగిస్తుందనే ఆశతో ఆ వివరాలు యిస్తున్నాను – 

జర్మనీవాళ్ల ఏసియన్‌ నౌకాదళం బేస్‌ చైనాలోని సింగ్‌టావోలో వుండేది. ఎస్‌ఎమ్‌ఎస్‌ ఎమ్‌డెన్‌ అనే జర్మన్‌ లైట్‌ క్రూజియర్‌ బేస్‌ అక్కడే వుండేది. ఆగ్నేయాసియా దేశాలన్నీ ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ వలసప్రాంతాలే. వాళ్ల నౌకాబలం కూడా చాలా శక్తివంతమైనది. అందుకని 1914లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే యీ ఎమ్‌డెన్‌ నౌకను శత్రుక్షేత్రంలో వుండే బదులు యూరోప్‌కు వచ్చేసి జర్మనీ నౌకాసేనకు సహాయపడమని ఆదేశాలు వచ్చాయి. అయితే ఎమ్‌డెన్‌ నౌకకు కెప్టెన్‌గా వున్న కార్ల్‌ వాన్‌ ముల్లర్‌ అనే సాహస యువకుడు 'అక్కడకు వచ్చి పదిమందిలో ఒకడిగా వుండే బదులు యిక్కడే వుండి శత్రువులను చికాకు పరచి, ముప్పుతిప్పలు పెడతాను. అనుమతి యివ్వండి' అని అడిగాడు. 'అది ఆత్మహత్యాసదృశం. చుట్టూ శత్రునౌకలే. నువ్వొక్కడివి వుండి ఏం చేస్తావ్‌' అని  ఉన్నతాధికారులు నచ్చచెప్పి చూసి చివరకు సరే అనేశారు. ఇక మనవాడు తన నౌకకు బ్రిటన్‌ నౌకగా మారువేషం వేసి 'ఎచ్‌ఎమ్‌ఎస్‌ యార్‌మౌత్‌' అనే మారుపేరు పెట్టుకుని వాళ్ల మధ్య చొరబడేవాడు. ఇంగ్లండ్‌, ఫ్రాన్సు అమెరికా నౌకల వాణిజ్య నౌకలపై విరుచుకు పడి వాటి సరుకులు దోచుకుని వాటిని ముంచేసేవాడు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

mbsprasad@gmail.com