కశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే యిది అవకాశవాదానికి పరాకాష్ట అని కొందరు విమర్శించారు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. రెండు పార్టీలకు కించిత్తు కూడా భావసారూప్యం లేదన్నమాట, ఒకరి నొకరు నమ్మరన్నమాట నిజమే. కానీ వేరే ఏ విధంగా చూసినా ఏ ప్రభుత్వమూ ఏర్పడే సావకాశం లేదు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా యిదే పరిస్థితి రావచ్చు. రాష్ట్రపతి పాలన కొనసాగిస్తే పరోక్షంగా బిజెపి పాలిస్తోంది అనే విమర్శలు వస్తాయి. 87 సీట్ల అసెంబ్లీలో 28 పిడిపికి రాగా, 25 బిజెపికి వచ్చాయి. షేక్ అబ్దుల్లాకు, అతని వారసులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్సుతో చేతులు కలపలేడు. కాంగ్రెసుతో కలుపుదామంటే వారికి సీట్లు రాలేదు. బిజెపి ఒక్కటే శరణ్యం. కానీ తమతో చేతులు కలపాలంటే జమ్మూ నుంచి హిందువును ముఖ్యమంత్రిని చేయాలని బిజెపి పట్టుబడుతోంది. అదే జరిగితే కశ్మీర్‌లో ముఫ్తీ తలెత్తుకునే పరిస్థితి లేదు. ఈ రోజు వచ్చినన్ని సీట్లు భవిష్యత్తులో వస్తాయో రావో, యిప్పుడు గట్టిగా పట్టుబట్టి సాధిస్తే జమ్మూలో తిరుగులేని శక్తిగా మారవచ్చని బిజెపి అంచనా. ఇవే కాకుండా సిద్ధాంతపరమైన విభేదాలు చాలా వున్నాయి. 370 ఆర్టికల్ గురించి, సైన్యానికి యిచ్చిన విశేషాధికారాల గురించి, పశ్చిమపాకిస్తాన్ నుండి శరణార్థులుగా వచ్చిన హిందువులకు పౌరసత్వం గురించి.. యివన్నీ తేలాలి. అవతలివారితో రాజీ పడుతూనే తమ క్యాడర్‌ను మెప్పించాలి. ఈ క్లిష్టమైన చర్చలకు బిజెపి తరఫు నుంచి రామ్ మాధవ్ పాల్గొనగా పిడిపి తరఫు నుంచి ప్రస్తుతం ఆర్థికమంత్రిగా వున్న హసీబ్ ద్రాబూ పాల్గొన్నారు. ఆయన ఎకనమిస్టు. జె అండ్ కె బ్యాంకు చైర్మన్ పదవికి రాజీనామా చేసి ముఫ్తీకి ఆప్తుడయ్యాడు. ఇద్దరూ గత రెండు నెలలుగా 50 రోజుల పాటు జమ్మూలో, చండీగఢ్‌లో, ఢిల్లీలో ఎవరికీ తెలియకుండా కలుస్తూ, చర్చించుకుంటూ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి గుఱ్ఱం దిగి వచ్చి, నిర్మల్ కుమార్ సింగ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి యిచ్చినా చాలంది. అదే అదనని ముఫ్తీ 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో పది కాబినెట్ పదవులు పుచ్చుకుని, బిజెపికి ఆరు మాత్రమే యిచ్చాడు. బిజెపి యింకోలా కసి తీర్చుకుంది. ఒకప్పటి వేర్పాటు వాది, పీపుల్స్ కాన్ఫరెన్స్ లీడరైన సజ్జాద్ లోనెను ముఫ్తీ తన కాబినెట్‌లో తీసుకోనన్నాడు. లోనె మోదీతో మాట్లాడి బిజెపి కోటాలో కాబినెట్ మంత్రి అయ్యాడు. అందుకే ప్రమాణస్వీకారం సభకు హాజరైన మోదీ ముఫ్తీని కౌగలించుకున్న అనంతరం లోనెను కూడా కౌగలించుకున్నాడు. తమకు సన్నిహితం అనుకున్న పిడిపి, అధికారం కోసం బిజెపితో చేతులు కలిపినందుకు మండిపడిన పాకిస్తాన్ పిడిపి నాయకుడు నయీమ్ అఖ్తర్‌కు వీసా తిరస్కరించింది. పాకిస్తాన్ తలచుకుంటే సరిహద్దుల్లో భద్రతా సమస్యలు లేవనెత్తి తన ప్రభుత్వానికి యిక్కట్లు సృష్టించగలదని భావించిన ముఫ్తీ ప్రమాణస్వీకారం తర్వాత యిచ్చిన పత్రికా సమావేశంలో వారికి ధూపం వేశాడు. 'కశ్మీర్‌లో ఎన్నికలు సజావుగా జరగడానికి మిలిటెంట్లు, వేర్పాటువాదులు, తీరానికి అవతల వున్న ప్రజలతో (పాకిస్తాన్ అని భావం) సహా అందరూ తోడ్పడ్డారు' అని వారికి ధన్యవాదాలు తెలిపాడు. ఇది సహజంగా బిజెపిని మండించింది. స్థానిక బిజెపి నాయకులు ఏమీ మాట్లాడకపోయినా రాజ్‌నాథ్ సింగ్ ''ఎన్నికలు సవ్యంగా జరగడానికి ఎన్నికల కమిషన్, భారతసైన్యం, పౌరులు కారకులు తప్ప ముఫ్తీ చెప్పినవారు కాదు.'' అని ప్రకటించాడు.
పార్లమెంటుపై దాడి జరిపిన అఫ్జల్ గురును యుపిఏ ప్రభుత్వం ఢిల్లీ తీహార్ జైల్లో ఉరి వేసి అతని అవశేషాలను అక్కడే వుంచారు. అతని హత్యను ఖండించిన పిడిపి భౌతిక అవశేషాలను అతని కుటుంబీకులకు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఇస్తే కశ్మీర్‌లో అతనికి స్మారకచిహ్నం కడతారని జాతీయపార్టీల భయం. ఎవరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పిడిపి అఫ్జల్ గురు గురించిన డిమాండ్ మళ్లీ లేవదీసింది. ఈ గొడవలు యిలా నడుస్తూండగానే ముఫ్తీ బిజెపితో ఒక్క మాటైనా చెప్పకుండా జైల్లో వున్న పాకిస్తానీ ఏజంటు, వేర్పాటువాది మస్రత్ ఆలమ్‌ను విడుదల చేసేశాడు. అతనిపై 27 కేసులున్నాయి. ముఫ్తీ యిలా చేయడంతో బిజెపి విస్తుపోయింది. గతంలో కాంగ్రెసు పార్టీ యిలాటివి సహిస్తే 'వేర్పాటువాదులతో రాజీ పడ్డార'ని నానా యాగీ చేసే తాము యీరోజు సంజాయిషీ చెప్పుకోవలసి వస్తోందని గ్రహించింది. సహజంగానే ప్రతిపక్షాలు నిలదీశాయి. రాజ్‌నాథ్ జవాబిస్తూ ''ఆ 27 కేసులు గట్టిగా నడపండి, వదిలిపెట్టవద్దు. అతను, అతని అనుచరుల చర్యలపై నిఘా వేసి వుంచండి' అని ముఫ్తీకి చెప్పాం. ఏదైనా అవాంఛనీయమైనది జరిగితే వెంటనే చర్య తీసుకుంటాం. నిజం చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వం చేసినది మాకు సమ్మతం కాదు. కొన్ని సాంకేతిక కారణాల వలన అలా జరిగిందంతే..'' అని ప్రకటించారు.
కానీ కాంగ్రెసు పార్టీ ఏకీభవించలేదు. ''ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనే వుంది కదా, మసారత్ డిటెన్షన్‌ను కొనసాగిస్తూ ఎందుకు అదేశాలు జారీ చేయలేదు?' అని అడిగారు. ''రాష్ట్రప్రభుత్వం చెప్పిన ప్రకారం వారి పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద 2010 ఫిబ్రవరి నుండి 8 సార్లు అతన్ని కేసుల్లో బుక్ చేశారు. ఆఖరి ఆర్డర్ 2014 సెప్టెంబరు 15న జమ్మూ జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేశారు. దాన్ని 12 రోజుల్లోగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆమోదించాలి. కానీ అది హోం శాఖకు అక్టోబరు 9 న అంటే 23 రోజుల తర్వాత చేరింది. అందువలన ఆమోదించడం వీలుపడలేదు. అందువలన యీ ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం జమ్మూ మేజిస్ట్రేటుకి సెప్టెంబరు ఆర్డర్ మురిగిపోయింది కాబట్టి, కొత్తగా ఆర్డర్ వేయవచ్చు అని లేఖ రాసింది. అలా అన్న తర్వాత అతని డిటెన్షన్ కొనసాగించడానికి కారణాలు ఏమీ కనబడకపోవడం చేత మేజిస్ట్రేటు మార్చి 7 న విడుదల చేశారు.'' అని రాజ్‌నాథ్ సమాధానం. పైకి యిలా చెపుతూనే లోపాయికారీగా మళ్లీ యిలాటిది జరగడానికి వీల్లేదని ముఫ్తీకి గట్టిగా వార్నింగ్ యిచ్చిందని అంటున్నారు.
పిడిపి, బిజెపి మధ్యన కుదిరిన 16 పేజీల 'ఎజెండా ఆఫ్ ద ఎలయన్సు' యిరుపక్షాల కార్యకర్తలకు అసంతృప్తిని కలిగించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని బిజెపి చెపుతూ వచ్చింది. దాన్ని ఎలాగైనా నిలుపుకోవడమే కాక స్వయంపాలన సాధిస్తామని పిడిపి చెప్తూ వచ్చింది. ఇప్పుడు యిద్దరూ కలిసి ఒక్కడుగు వెనక్కి వేసి 'కశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదాను యథాతథ స్థితిని కొనసాగిస్తాం' అన్నారు. బుధవారం నాడు రాజ్యసభకు ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ హోం శాఖ సహాయమంత్రి రిజిజు '370 తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమే, కానీ దాన్ని తీసేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. మాకు సవరణ చేసేంత మెజారిటీ లేదు' అన్నాడు. కల్లోల ప్రాంతాలపై సైన్యానికి విశేషాధికారాలు కల్పించే ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్ ఎత్తేయాలని పిడిపి పట్టుబడుతూ వచ్చింది. కొనసాగాలని బిజెపి అంటోంది. రాజీ ప్రతిపాదనగా 'ఏవేవి కల్లోల ప్రాంతాలో గుర్తించే విషయంలో కశ్మీర్ ప్రభుత్వం పునరాలోచిస్తుంది' అన్నారు. అంటే ముఫ్తీ ప్రభుత్వం ఫలనా చోట ప్రశాంతంగా వుంది, అక్కడ యీ చట్టం అమలు చేయనక్కరలేదు అని సిఫార్సు చేస్తే కేంద్రం ఆ ప్రతిపాదనను పరిశీలిస్తుందన్నమాట. ఇదంతా ఫలానా గడువులో పూర్తవ్వాలని షరతు విధించుకోలేదు. ఇక పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ నుండి హిందువులు 1947లో కొందరు, 1965లో కొందరు, 1971లో యింకొందరు శరణార్థులుగా వలస వచ్చారు. వారికి కశ్మీరు పౌరులుగా పూర్తి పౌరసత్వం యివ్వాలని బిజెపి పోరాడుతూ వచ్చింది. వారి సంఖ్య కూడా కలిస్తే ముస్లిముల ఆధిక్యత తగ్గిపోతుందని పిడిపి భయం. ''వీరి గురించి కక్షుణ్ణంగా చర్చించి ఒన్-టైమ్ సెటిల్‌మెంట్ చేయడానికి యిద్దరూ తీర్మానించారు' అని రాసుకున్నారు. ఆ సెటిల్‌మెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా ఆర్థికసాయం మాత్రం చేస్తారట. ఇలాటి అస్పష్టమైన ప్రతిపాదనలతో ఎలాగోలా బండి నెట్టుకొద్దామని చూస్తూంటే ముఫ్తీ సవ్యంగా సాగనిచ్చేట్టు లేడు.
''మాయాబజారు'' సినిమాలో బలరాముడు వస్తున్నాడని తెలిసి, ఆయనకు నమస్కారం ఎలా పెట్టాలని లక్ష్మణకుమారుడు తన అనుచరుణ్ని సలహా అడుగుతాడు. అతను చెప్తాడు – 'ధర్మరాజుగారు కురువృద్ధులందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతూ వుంటే మీరు పడిపడి నవ్వుకునేవారు చూశారూ, యిప్పుడు మీరూ అలాగే వంగి, వినయంతో కరిగి ముద్దయిపోయి…' అని వంగి చూపుతాడు. (డైలాగు యిదే కాకపోవచ్చు, భావం యిదే). అంటాడు. ''ఇంతకంటె ద్విగుణంగా నేనూ కాగలను' అంటూ లక్ష్మణకుమారుడు బలరాముడు రాగానే పాదాలమీద తల ఆన్చి తలే ఎత్తడు. కశ్మీర్ పాలకులతో కాంగ్రెసు యిన్నాళ్లూ రాజీపడుతూ వచ్చింది. వాళ్లేం చేసినా సహిస్తూ వచ్చింది. 'మీకు దేశభక్తి లేదు, మానాభిమానాలు లేవు, ముస్లిములను బుజ్జగిస్తున్నారు, పాకిస్తాన్ అంటే భయం, వేర్పాటువాదులకు లొంగిపోతున్నారు, అదే మేమైతేనా…' అంటూ వచ్చింది బిజెపి. ఇప్పుడు వారి స్థానంలో లక్ష్మణకుమారుడిలా అదే పాత్ర పోషిస్తోంది. కబుర్లకు, చేష్టలకు వున్న యీ వ్యత్యాసాన్ని విమర్శించే హక్కు కాంగ్రెసుకు లేదు, కానీ దేశప్రజలకు వుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)