ఎమ్బీయస్‌: అచ్ఛే దిన్‌ – బురే దిన్‌

'మోదీ వచ్చాక కార్పోరేట్‌లకు అచ్చే దిన్‌ వచ్చాయి' అన్నారు అణ్నా హజారే. 'మాకూనూ..' అంటున్నారు ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితుడుగా  సాబర్మతి జైల్లో వున్న గుజరాత్‌ మాజీ పోలీసు అధికారి డి జి…

'మోదీ వచ్చాక కార్పోరేట్‌లకు అచ్చే దిన్‌ వచ్చాయి' అన్నారు అణ్నా హజారే. 'మాకూనూ..' అంటున్నారు ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితుడుగా  సాబర్మతి జైల్లో వున్న గుజరాత్‌ మాజీ పోలీసు అధికారి డి జి వంజారా. వెన్నెల వుండగా కలువలు వికసిస్తాయి. సూర్యుడు రాగానే కలువలు ముడుచుకుంటాయి, కమలాలు విచ్చుకుంటాయి. యుపిఏ పాలన పోయి ఎన్‌డిఏ పాలన రాగానే ఎక్కడ బడితే అక్కడ కమలాలు విచ్చుకుంటున్నాయి. సిబిఐ తన ధోరణి మార్చుకోవడంతో మోదీ, అమిత్‌ షా యిరుక్కున్న కేసులన్నీ టపటపా ఎగిరిపోతున్నాయి. వారి ఆదేశాలు మన్నించిన వారు కేసుల్లోంచి బయటపడుతున్నారు. ఎన్‌కౌంటర్‌ కేసులో జైలుకి వెళ్లిన వంజారా నిరాశకు లోనై 2013లో రాజీనామా లేఖ రాస్తూ అమిత్‌ షా మోదీని తప్పుదోవ పట్టించాడని ఆరోపించాడు కూడా. 8 ఏళ్ల జైలువాసం తర్వాత బుధవారం ఆయనకు బెయిల్‌ వచ్చి, బయటకు వచ్చి 'అచ్ఛే దిన్‌ వచ్చాయని మోదీగారు అన్నది నిజం. నాకూ నా తోటి పోలీసు ఆఫీసర్లకు యిక మంచి రోజులే'' అన్నాడు. మరి గతంలో రాసిన లేఖ మాటేమిటి అంటే 'నేను గతంలోనో, భవిష్యత్తులోనో జీవించను. నాకు వర్తమానం ముఖ్యం' అన్నాడు.

కమలాలు యిలా విచ్చుకుంటూ వుంటే కలువలు ముడుచుకోవాలిగా. వీళ్లపై కేసులు పెట్టిన వారు యిప్పుడు అవస్థల పాలవుతున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం యిప్పుడు వాళ్ల పని పడుతోంది. అందరి కంటె వాళ్లకు కసి వున్నది ప్రజాహక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌పై! లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన ఆమె ''సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌'' (సిజెపి) అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి, 2002 గోధ్రా అల్లర్లపై, నకిలీ ఎన్‌కౌంటర్లపై నిరంతర పోరాటం జరిపి, బాధితుల గాథలను మీడియా ముందుకు తెచ్చి మోదీ, అమిత్‌లను చాలా యిబ్బందులకు గురి చేసింది. ఆమెను కట్టడి చేయడానికి ఆమెపై కేసులు పెట్టించారు వారు. బాధితులు కోర్టులో వేసిన రిట్‌ పిటిషన్లు యీమె వారికి చెప్పకుండా వేసిందని, వారు పాపం యీమె మాయమాటలకు లొంగిపోయి సంతకాలు పెట్టేశారని.. యిలా. గుజరాత్‌ అల్లర్లలో బాగా దెబ్బ తిన్న ప్రాంతం గుల్‌బార్గ్‌ సొసైటీ. అక్కడ 68 మంది చనిపోయారు. నిర్వాసితులైన వారు యిళ్లు కట్టుకోవడానికి సాయపడతామని చెప్పి ఆమె సంస్థ దేశవిదేశాల నుంచి విరాళాలు సేకరించి వాటిని దుర్వినియోగం చేసిందని కేసు పెట్టి ఆమెను వేధిస్తున్నారు. 

కేసు పెట్టినవారెవరు? విరాళాలు యిచ్చిన దాతలు కారు. గుల్‌బర్గ్‌ సొసైటీలో గతంలో నివసించామని చెప్పుకున్న 12 మంది సభ్యులు. ''చనిపోయినవారి స్మృతికై మ్యూజియం కడతామని, మా పేరు చెప్పి వసూలు చేసిన నిధులు సిజెపి దుర్వినియోగం చేసింది.'' అని 2013లో సొసైటీ లెటర్‌హెడ్‌పై ఫిర్యాదు చేసి లీగల్‌ నోటీసు పంపారు. అంతేకాదు, ''ఆ సంస్థ సభ్యులను నిషేధించండి. వారిని మా కాలనీలో అడుగు పెట్టనీయకండి.'' అని కూడా చేర్చారు. ఇది చాలా తీవ్రమైన అభియోగం, దీనిపై విచారణ జరుపుతాం అని అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రకటించింది. ఆ లేఖ పంపిన 12 మందికి సొసైటీకి ఏ సంబంధం లేదని, వారు లెటర్‌హెడ్‌ను దొంగిలించి దురుపయోగం చేశారని సొసైటీ చైర్మన్‌, సెక్రటరీ పోలీసు కమిషనర్‌కు, క్రైమ్‌ బ్రాంచ్‌కు 2013 మార్చిలో లేఖలు రాశారు. మ్యూజియం కోసం తాము నిధులు వసూలు చేయలేదని సిజెపి మీడియాకు స్పష్టం చేసింది. సబ్‌రంగ్‌ ట్రస్టుకు ఆ వుద్దేశం వుండేదని రూ.4.60 లక్షలు సేకరించాక ఆ నిధులు సరిపోవని గమనించి ఆ ఐడియా వదులుకుందనీ, దాతలతో సంప్రదించి దాని విషయమై తుది నిర్ణయం తీసుకుంటుందని అంది. ఇక తమకు వచ్చిన విరాళాలపై మాట్లాడుతూ 'మేం వసూలు చేసిన విరాళాలను మా కార్యకలాపాలకు వినియోగిస్తున్నాం. వాటిని ఆడిట్‌ చేయించి, సంబంధిత అధికారులకు తెలియపరుస్తూనే వున్నాం.' అని చెప్పుకుంది. ఇంత చెప్పినా 2014 జనవరిలో అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ తీస్తాపై, ఆమె భర్త జావేద్‌ ఆనంద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వారు బెయిల్‌ కోసం అప్లయి చేస్తూ ''మానవహక్కుల కోసం పోరాడేవారిని భయపెట్టడానికి గుజరాత్‌ పోలీసు బనాయించిన తప్పుడు కేసు యిది. 2004 నుండి నాపై యిలాటి కేసులు 5 పెట్టారు. జాకియా జాఫ్రీ కేసులో అప్పీలుకి వెళ్లకుండా భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమిది'' అని అన్నారు. జడ్జి వారికి తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేశారు. 

గుల్‌బర్గ్‌ సొసైటీ తీస్తా పక్షాన నిలబడి కోర్టుల్లో పోరాడింది. 2014 ఫిబ్రవరిలో మేజిస్ట్రీటు కోర్టు ఫిర్యాదు చేసిన 12 మంది ఎవరో వారిని వెతికిపట్టుకుని, సొసైటీ లెటర్‌హెడ్‌ ఎలా మిస్‌యూజ్‌ చేశారో విచారణ జరపండని గుజరాత్‌ క్రైం బ్రాంచ్‌ను ఆదేశించింది. క్రైం బ్రాంచ్‌ ఆ దిశగా ఏమీ చేయలేదు. కేంద్రంలో సర్కారు మారడంతో గుజరాత్‌ పోలీసులు, కోర్టులకు ధైర్యం వచ్చింది. తీస్తా, జావేద్‌, వారి స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఎక్కవుంట్లు ఫ్రీజ్‌ చేసేశారు. డీ ఫ్రీజ్‌ చేయమంటూ వారు 2014 నవంబరులో స్థానిక కోర్టుకి వెళితే వాళ్లు తిరస్కరించారు. గుజరాత్‌ క్రైం బ్రాంచ్‌ తీస్తా, జావేద్‌లను అరెస్టు చేయడానికి పూనుకుంటే వాళ్లు యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం గుజరాత్‌ హైకోర్టుకు అప్లయి చేసుకున్నారు. కానీ 2015 ఫిబ్రవరి 12న హైకోర్టు ఆ అప్లికేషన్‌ను తిరస్కరించింది. గుజరాత్‌ పోలీసు వెంటనే ముంబయి వచ్చి తీస్తాను, భర్తను అరెస్టు చేయబోయారు. ఇక వాళ్లు సుప్రీం కోర్టుకి అప్లయి చేసుకున్నారు. వాళ్లు ఫిబ్రవరి 19న వాదనలు వింటామని అప్పటి వరకు హైకోర్టు ఆదేశాలు అమలు కావని తీర్పు యిచ్చారు. తీస్తా సమర్పించిన 1500 పేజీల డాక్యుమెంట్లు పరిశీలించకుండా, వాటిపై విచారణ జరపకుండానే గుజరాత్‌ పోలీసులు తీస్తాను అరెస్టు చేయడానికి వుబలాట పడడమేమిటని ఆమె తరఫున హాజరైన కపిల్‌ సిబ్బల్‌ ప్రశ్నించాడు. న్యాయమూర్తులు ఎస్‌ జె ముఖోపాధ్యాయ, ఎన్‌ వి రమణ ''తీస్తా ఎక్కణ్నుంచో దిగి రాలేదు. అందరిలాగే ఆమె కూడా. ఆమెపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవి..'' అంటూ కఠినంగా మాట్లాడారు. ఎడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌ ''మూడు హత్యలు చేసిన కేసుల్లో కూడా బెయిల్‌ యిచ్చిన సందర్భాలున్నాయి. నిధుల దురుపయోగం కేసులో బెయిల్‌ యివ్వకపోవడం ఎక్కడా వినలేదు'' అని చెప్పబోతే ''మీకు సంబంధం లేని కేసు కాబట్టి మీరు మాట్లాడడానికి వీల్లేదు'' అన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న తుషార్‌ మెహతా బాధితుల పేరు చెప్పి సేకరించిన నిధులతో తీస్తా విదేశీ పర్యటనలు చేస్తోందని, బట్టలు, బూట్లు కొంటోందని ఆరోపించడంతో ఒళ్లు మండిన ఇందిరా జైసింగ్‌ ''మోదీ సూటు మాటేమిటి?'' అని అడిగింది. న్యాయాధీశులు తుషార్‌ను ఏమీ అనలేదు కానీ ఇందిరనే చివాట్లు పెట్టారు.

ఈ వరసంతా చూస్తే న్యాయమూర్తులిద్దరూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని న్యాయకోవిదులు ఫీలయ్యారు. ప్రశాంత్‌ భూషణ్‌ నిరసన తెలుపుతూ ''ముఖోపాధ్యాయ, రమణల యిళ్లల్లో యీ మధ్య జరిగిన పెళ్లిళ్లకు మోదీ హాజరయ్యారని విన్నాను. మోదీకి వ్యతిరేకంగా నడుస్తున్న యీ కేసుల్లో వారు వాదనలు వినడం సబబా?'' అనే ప్రశ్న లేవనెత్తారు. సుప్రీం కోర్టు ఏమనుకుందో ఏమో యీ కేసు విచారించే బెంచ్‌లో వారిద్దరికీ బదులు దీపక్‌ మిశ్రా, ఎ కె గోయల్‌లను నియమించింది. వారు గుజరాత్‌ ప్రభుత్వ పక్షాన వాదిస్తున్న మహేశ్‌ జెఠ్మలానీని ''పోలీసులు విచారణకై తీస్తాను పిలిచినపుడు ఆమె వచ్చిందా లేదా?'' అని అడిగారు. రెండు సార్లు పిలిస్తే రెండు సార్లూ ఆమె వచ్చిందని మహేశ్‌ చెప్పవలసి వచ్చింది. ''దాతల నుండి ఫిర్యాదులు లేవు, ఫండ్స్‌ను వేరే పనులకు మళ్లించినట్లు మీ వద్ద ఆధారాలు లేవు, యిచ్చిన డాక్యుమెంట్లు పరిశీలించి అనుమానాలుంటే తీర్చుకోండి. ప్రశ్నలడగడానికి ఆమెను నిర్బంధంలోకి తీసుకోవాలనుకోవడం దేనికి?'' అని అడిగారు. మహేశ్‌ దగ్గర సమాధానం లేదు. తీస్తాను అతితెలివికి పోకుండా గుజరాత్‌ పోలీసులతో సహకరించమని చెప్పండి ఆమె న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌కు చెపుతూ ఆమె అరెస్టుపై స్టేను కొనసాగించారు న్యాయాధీశులు. ఈ కథ ముందుముందు ఎలా సాగుతుందో ఆసక్తిగా గమనించాలి. ఒక్కమాట మాత్రం నిజం – మోదీని వ్యతిరేకించినవారికి చెడ్డదినాలు వచ్చాయి! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]