ఇదీ ఆరెస్సెస్ నినాదమే. జనసంఘ్ కూడా యిదే నినాదంతో ఎదిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా యిదే నినాదాన్ని చేపట్టింది. ఆరెస్సెస్ పుస్తకాల్లో భారతదేశం, ఆర్యసంస్కృతి, సంస్కృతం ఘనత గురించి ఉగ్గడించి, చివరిలో 'పరిణతి చెందిన వివిధ భాషలతో విలసిల్లే భారతదేశానికి లింకు భాషగా పరభాష, బానిసత్వానికి ప్రతీక అయిన ఆంగ్లభాష పనికి రాదు, సంస్కృతమే వుండాలి కానీ సంస్కృతం కష్టం కాబట్టి హిందీ వుండాలి' అని తేలుస్తారు. ఇదెక్కడి జంప్? సంస్కృతం అయితే అందరికీ సమానదూరం. నేర్చుకోవడంలో సమానకష్టం. అది క్లిష్టంగా వుంటే సరళీకృత సంస్కృతం అని వుంది, దాన్ని వ్యాప్తి చేయాలి. అంతేగాని ఆరెస్సెస్‌కు బలం వున్న ప్రాంతాల ప్రజలకు మేలు చేసేలా వాళ్ల భాషను యితరులపై రుద్దుతానంటే ఎలా? దేశంలో కౌ బెల్ట్‌గా పిలవబడే ప్రాంతాల్లోనే హిందీ బలంగా వుంది. తక్కిన ప్రాంతాల్లో హిందీ అర్థం చేసుకుంటారు కానీ, హిందీలో పట్టుమని ఒక్క పేజీ కూడా రాయలేరు, స్కూలు రోజులు దాటాక హిందీ చదవడం కూడా మానేస్తారు. అలాటివాళ్లు హిందీ మాతృభాషగా వున్నవారితో పోటీ పరీక్షల్లో ఎలా పోటీ పడగలరు?
స్వాతంత్య్రానికి ముందు నుండి తమిళులు, మలయాళీలు, బెంగాలీలు ఉన్నతోద్యోగాలలో వుండేవారు. వాళ్లందరూ ఇంగ్లీషులో నిష్ణాతులు. వీళ్లని దెబ్బ కొట్టాలంటే ఇంగ్లీషు తీసి పారేసి హిందీయే పెట్టాలి, అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి అని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి హిందీవాదులు ఆందోళన చేస్తున్నారు. నెహ్రూ కాలంలో సేఠ్ గోవిందదాస్ యీ ఉద్యమానికి నాయకుడు. రామ్ మనోహర్ లోహియా కూడా..! నెహ్రూ కూడా హిందీప్రాంతం వాడైనా దేశసమగ్రతను దృష్టిలో పెట్టుకుని వారి వాదనలు నిరాకరించాడు. దాంతో అతను ఆంగ్లమానసపుత్రుడని, ఇంగ్లీషు అమ్మాయిలతో తిరగడం చేత అలా అయ్యాడని, ముస్లిముకు పుట్టాడని.. యిలా అనేక పుకార్లు పుట్టించారు. నెహ్రూ తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ వాడే. అతను 1965లో హిందీని రుద్దబోయాడు. దాంతో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున లేచి, 1967లో అక్కడి కాంగ్రెసు ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. ఇప్పటిదాకా మళ్లీ అధికారంలోకి రాలేదు.
ఇప్పుడు మోదీ మళ్లీ హిందీని తలకెత్తుకున్నారు. సోషల్ మీడియా అఫీషియల్ కమ్యూనికేషన్‌లో అధికార భాషగా హిందీనే ఉపయోగించాలని కేంద్రప్రభుత్వం తన మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. కరుణానిధి దీనికి అభ్యంతరం తెలిపినా మోదీ ఖాతరు చేయలేదు. ఎందుకంటే బిజెపి బలమంతా హిందీ ప్రాంతాల్లోనే వుంది. వాళ్లకు అవకాశాలు రావాలంటే, పోటీలోంచి దక్షిణాది వారిని, తూర్పుప్రాంతీయులను, చాలా మేరకు పశ్చిమప్రాంతీయులను తప్పించాలంటే హిందీని రుద్దాల్సిందే. జనతా పార్టీ అధికారంలో వుండగా కాబినెట్ మీటింగులన్నీ హిందీలోనే జరిగేవి. ఎందుకంటే అప్పుడు దక్షిణాది నుండి, తూర్పు నుండి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే వుండేవారు. ఇప్పుడు మళ్లీ హిందీ హవా ప్రారంభమైంది. ప్రమాణస్వీకారాలు చేసినవారిలో అధికాంశం హిందీలోనే చేశారు. దక్షిణాది వారు మాత్రం ఇంగ్లీషులో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినపుడు ప్రణాళికా రచనంతా ఇంగ్లీషులోనే సాగుతుంది. మీడియాతో మాట్లాడినపుడు కాంగ్రెసు అధికారప్రతినిథులు సాధారణంగా ఇంగ్లీషులో మాట్లాడి, తర్వాత హిందీలో అనువదించేవారు. ఇప్పుడు ఉల్టా. హిందీలో మాట్లాడి, అర్థం కాని వారికోసం అంటూ ఇంగ్లీషులో చెప్తున్నారు. మోదీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చినపుడు మొన్న షార్‌లో ఇంగ్లీషు, హిందీ రెండు భాషల్లో మాట్లాడినట్లు మాట్లాడి వుండవచ్చు – ఎలాగూ అనువాదకుణ్ని పెట్టుకున్నారు కాబట్టి! కానీ హిందీలో మాత్రమే మాట్లాడారు. ఆ ప్రాంతాల్లో ఇంగ్లీషయితే కనీసం విద్యావంతులు కనక్ట్ అవుతారు. హిందీ అయితే ఎవరూ కనక్ట్ కారు. విదేశమైన భూటాన్‌కి వెళ్లినపుడు మోదీ హిందీలో మాట్లాడారు, వెంట నున్న సుష్మా స్వరాజ్ ఇంగ్లీషులో మాట్లాడారు. పోనుపోను 'హిందువువైతే హిందీ మాట్లాడాలి' అనే నినాదం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)