ప్రచండుడు తన ప్లాన్లలో తాను వున్నాడు. యువరాజుపై చేసిన కరవాల ప్రయోగాలు విఫలమవుతున్నాయి కాబట్టి గరళంతో పని సాధిద్దామనుకున్నాడు. పట్టాభిషేకం చేయించి, ఆ మహోత్సవంలో అతని పానీయంలో విషం కలిపించి చంపేయడానికి ప్రణాళిక వేశాడు. వదినగారితో 'ప్రతాపుడికి పట్టాభిషేకం చేసి నేను తీర్థయాత్రలకు వెళ్లిపోతాను, మా అబ్బాయి భజరంగుడి బాధ్యత మీదే' అన్నాడు. ఇతని ప్లాను ఏదైనా కావచ్చు, ఎదుర్కోవాలి కదా అనుకుని సరే నాయనా అంది. పట్టాభిషేకం జరిగింది. ఓ పక్క డాన్సు జరుగుతూంటే ప్రచండుడు లోపలికి వెళ్లి మహారాజు తాగే ద్రాక్షసారాయం పాత్రలో విషం కలిపి వచ్చాడు. అతనిమీద అప్పటికే అనుమానం వున్న ప్రతాపుడు అతను లోపలికి వెళ్లడం గమనిస్తూ వున్నాడు.
పాత్రలు వచ్చాక తమ్ముణ్ని, అంటే ప్రచండుడి కొడుకుని పక్కన కూచోబెట్టుకుని డాన్సులో నిమగ్నమై పోయినట్టు నటిస్తూ ఈ పాత్ర అతని చేతికి యిచ్చాడు. అతను తాగబోయాడు. ప్రచండుడి గుండె గుభిక్కుమంది. 'భజరంగా' అని ఒక్క పొలికేక పెట్టి ఆపేశాడు. 'మహారాజు పాత్రను ముట్టుకుంటావా?' అన్న మిష పెట్టి తిట్టిపోశాడు. ఆయనది ఆయనకు యిచ్చేయ్ అన్నాడు. భజరంగుడు వణికిపోయాడు. అతనికి తండ్రి ప్లాను సంగతి తెలుసు. చావు కొద్దిలో తప్పిపోయిందని గ్రహించి భయపడిపోయాడు. కానీ ప్రతాపుడు అదేమీ తెలియనట్టు 'నేనొకటీ, తమ్ముడొకటీనా, తాగు తమ్ముడూ' అంటూ అతన్ని అనునయిస్తున్నట్టు నటిస్తూ అతన్ని అడ్డుపెట్టుకుని ఆ గ్లాసులో పానీయం వెనుకనున్న మొక్కల్లో పోసేశాడు. తర్వాత ఉత్తిగ్లాసులోది తాగేసినట్టు నటించి కెవ్వున కేక పెట్టి పడిపోయాడు. ఆ తర్వాత పిచ్చెక్కినట్టు నటించాడు. సభంతా ఆశ్చర్యపోయింది. ప్రచండుడు కూడా ఆశ్చర్యం నటించి, తర్వాత విషం యిచ్చిన వైద్యుణ్ని నిలదీశాడు. నాలిక్కి తగలగానే ఛస్తాడన్నాడు చావలేదేం? అని. అతను తెలివిగా తప్పించుకున్నాడు. అనుపానం నిమ్మరసంతో యిమ్మంటే మీరు ద్రాక్షారసంతో యిచ్చారు, అందుకే పనిచేయలేదు, అయినా అతను కృంగి, కృశించి, నశించడం ఖాయం. అన్నాడు. అది విని భజరంగుడు దిగాలు పడ్డాడు. భజరంగుడి వేషం వేసినది పద్మనాభం. ఆయన కెరియర్‌లో ది బెస్ట్ రోల్ యిదే ననిపిస్తుంది నాకు. తర్వాత తర్వాత కొన్ని సినిమాలలో గ్యాలరీకోసం అతిగా చేసిన పాత్రలున్నాయి కానీ ఈ సినిమాలో ఈ పాత్రకు సరిగ్గా అతికినట్టు చేశారు.
ప్రచండుడు దిగాలు పడ్డాడు. కానీయ్, యిదెందుకు వచ్చిందో, యిలా కొంతకాలం గడిచాక పిచ్చివాడు సింహాసనానికి అనర్హుడు అని ప్రకటించి భజరంగుణ్ని ఎక్కించవచ్చు అని ఊరడిల్లాడు. భజరంగుడికి తను రాజ్య వ్యవహారాలు నేర్చుకోవడం మంచిదనిపించింది. అందువల్ల ఖజానా దోచుకున్న విద్రోహులను వేటాడడానికి అడవులకు ప్రయాణం కట్టాడు. తోడుగా తన సలహాదారు ఆచార్యను తీసుకెళ్లాడు. ఆ ఆచార్య పాత్ర వేసినది వంగర. ఇలా వెళ్తున్న పద్మనాభం కంపెనీకి జిప్సీలు ఎదురయ్యారు. ఎవరయ్యా మీరు అంటే వినోదులం అన్నారు. అయితే ఆడి చూపించండి అంటే 'ఎక్కడ పడితే అక్కడ ఎలా ఆడతాం? రాచనగరులో ఈ రాత్రికి ప్రదర్శన ఏర్పాటు చేయండి' అని అడిగారు. సరే అని అలాగే వాళ్ల డాన్సు ఏర్పాటు చేశాడు. నిజానికి ఈ జిప్సీలు వేరెవరో కాదు. రాజసులోచన బృందమే! ఈ రూపేణా రాచనగరులోకి ప్రవేశించి ప్రతాపుణ్ని చంపుదామని ఆమె ప్లాను. సింహాసనంపై ప్రతాపుణ్ని చూసినా అతనే తన పరదేశి అని గుర్తించలేదు. ఎందుకంటే అతను విచిత్ర వేషధారణలో – పిచ్చివాడు కదా – వున్నాడు. పైగా సగం సగం వెలుతురు. అప్పుడు అరబ్బీ స్టయిల్లో 'ఠింగన ఠింగన ఠియ్యా' అంటూ పాట పాడింది.
చివర్లో బొడ్లోంచి బాకు తీసి రాజుపైకి విసిరింది. అతను తప్పించుకున్నాడు కానీ బెదిరిపోయినట్టు నటించాడు. దాడి జరగగానే సైన్యం వారిని చుట్టుముట్టింది. సేనాపతి ప్రచండుడు వచ్చాడు. ఎవరు రానిచ్చారు వీళ్లని అంటే తన కొడుకే అని తెలిసింది. నెత్తి కొట్టుకున్నాడు. రాజసులోచనను చూశాడు. విప్లవసంఘంలో వున్న సాహసవంతురాలు ఈమెనే అని ఊహించాడు. ఈమెకు ఆశ చూపించి వలలో వేసుకుంటే ఈమె ద్వారా విప్లవసంఘం ఆచూకీ తెలుస్తుందికదా అనుకున్నాడు. తక్కినవాళ్లను ఖైదులో పడేయించి, ఈమెను తన శయ్యాగారానికి చేర్పించాడు. తను శృంగార పురుషుడిలా తయారయ్యి ఆమె వద్దకు వెళ్లాడు. ఇక్కడ హీరోకి సంకటం వచ్చింది. రాజసులోచనను, తక్కిన విప్లవకారులను విడిపించాలి. కానీ రాజులా కాదు. అందువల్ల కొత్త అవతారం ఎత్తాడు. ముసుగువీరుడిలా తయారయ్యాడు. ఎవరో పాము గుర్తుతో ముఠా నడుస్తున్నట్టు చిన్నాన్న యింతకుముందే ఓ డ్రామా ఆడాడు కాబట్టి దాన్నే నిజం చేస్తే మంచిదనుకుని నల్లత్రాచు అనే పేరు పెట్టుకుని ముసుగుపై ఓ శిరస్త్రాణం తగిలించుకుని రాజమందిరంలో తిరిగాడు. ఖైదులోంచి విప్లవకారులను తప్పించాడు. గుమ్మడి శయ్యాగారానికి వెళ్లి రాజసులోచనను విడిపించాడు. గుమ్మడిని తివాచీలో కట్టేశాడు కానీ చంపలేదు. తనకు ప్రజల్లో బలం పెరిగేవరకు తొందర పడకూడదు మరి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)