ఒక యింగ్లీషు సినిమాను తీసుకుని కాస్త మార్చి హిందీ సినిమా చేస్తే దాన్ని యింకాస్త మార్చి తెలుగు సినిమా చేస్తే కొన్నేళ్లు పోయాక దాన్ని మరింత మార్చి యింకో తెలుగు సినిమా తయారుచేసిన వైనం చెప్పుకుందాం యివాళ. ఆ సినిమాలు 1962 నాటి హిందీ సినిమా – ప్రొఫెసర్, 1969 నాటి తెలుగు సినిమా భలేమాస్టారు, 1991 నాటి తెలుగు సినిమా పెద్దింటల్లుడు! ఈ సినిమాలలో కథాంశం ఏమిటంటే – ఒక పడుచు కుర్రవాడు ఉద్యోగం కోసం ముసలివేషం వేయడం. మిస్సమ్మ సినిమాలో పెళ్లయిన జంటకు గానీ ఉద్యోగం యివ్వరంటే యిద్దరు పెళ్లయినట్టు నాటకం ఆడతారు కదా. అలాగే దీనిలో పడుచుపిల్లలకు ప్రయివేటు చెప్పడానికి ముసలి మాస్టారు కావాలని యాడ్ యిస్తే, తల్లి ట్రీట్‌మెంట్‌కు డబ్బు కావలసి వచ్చి హీరోగారు ముసలివాడిగా వేషం వేసుకుని ఉద్యోగం సంపాదిస్తాడు. తన స్టూడెంట్లలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చిక్కు ఎక్కడ వస్తుందంటే ఆ అమ్మాయిల ఆలనా, పాలనా చూసే మేనత్త యీ ముసలిరూపాన్ని చూసి మోహపడినప్పుడు!
చాలా తమాషాగా వుంది కదూ…ఈ థీమ్‌తో 1939లో ''బాచిలర్ మదర్'' అనే ఓ అమెరికన్ సినిమా వచ్చింది. ప్రఖ్యాత దర్శకనిర్మాత గురుదత్ దాన్ని కిశోర్ కుమార్, వహీదా రెహమాన్‌లు హీరో హీరోయిన్లుగా హిందీ సినిమాగా తీద్దామనుకుని అబ్రార్ అల్వీ అని రచయితను దర్శకత్వం వహించమన్నాడు. అతను కాదంటే అతను రచయితగా, శశిభూషణ్ దర్శకుడిగా సినిమా ఎనౌన్సు చేశాడు. ప్యాసా సినిమా పాటల పుస్తకంలో యీ సినిమా పబ్లిసిటీ కూడా యిచ్చారు – 'ది స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ వజ్ టూ యంగ్ టు టీచ్.. అండ్ టూ ఓల్డ్ టు లవ్' అని. కానీ సినిమా తయారు కాలేదు. గురుదత్ ఐడియా డ్రాప్ చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఎఫ్.సి.మెహ్రా అనే నిర్మాత లేఖ్ టాండన్ అనే దర్శకుడిచేత ''ప్రొఫెసర్'' పేరుతో యీ సినిమా తీశారు. స్క్రీన్‌ప్లే అబ్రార్ అల్వీదే! ఈ సినిమాలో హీరో షమ్మీ కపూర్, హీరోయిన్ కల్పన. అత్త పాత్ర లలితా పవార్ వేశారు.
హిందీ హీరో పేరు ప్రీతమ్. ఎమ్మే చదివాడు. నిరుద్యోగి. తల్లికి టిబి. శానిటోరియంలో వుంచి వైద్యం చేయించాలంటే డబ్బు లేదు. ఆ సమయంలో అతని ప్రొఫెసర్ ఓ ఉద్యోగం సూచించాడు. సీతాదేవి (లలితా పవార్) అనే ఆవిడ డార్జిలింగ్‌లో వుంటుంది. ఆవిడ మేనల్లుళ్లకు, మేనకోడళ్లకు ట్యూషన్ చెప్పాలి. మంచి జీతం. అయితే తిరకాసేమిటంటే టీచర్‌కు 50 యేళ్లు పై బడి వుండాలి. గత్యంతరం లేని పరిస్థితిలో హీరో ముసలివేషం వేసుకుని టీచర్‌గా తయారయ్యాడు. తెలుగులో హీరో పాత్ర ఎన్టీయార్ వేశారు. అత్త పాత్ర అంజలి, హీరోయిన్ పాత్ర కాంచన వేశారు. హిందీలో హీరో హఠాత్తుగా ముసలివేషం వేసుకుని తయారవుతాడు. పడుచువాడు ముసలివాడిగా మారాలంటే అతనికి నాటకానుభవం వుండాలి. హిందీలో అలా వున్నట్టు చూపలేదు. కానీ తెలుగులో దానికి భూమిక ఏర్పరచారు. కాలేజీ డ్రామాలో ఓ ఇంగ్లీషు డ్రామాలో వేసినట్టు చూపారు. హిందీలో ప్రొఫెసర్ రిఫరెన్సుతో వెళ్లినట్టు చూపారు. సీతాదేవి ఫోన్ చేసి కనుక్కుంటే అసలు విషయం బయట పడిపోయే అవకాశం వుంది కదా. తెలుగులో ఆ లోపాన్ని సవరిస్తూ పేపర్లో యాడ్ వచ్చినట్టు చూపారు.
ఆ యిల్లు సీతాదేవిగారి అజమాయిషీలో వుంది. ఆవిడ ఓ బ్రహ్మచారిణి. ఐదేళ్లక్రితం ఆవిడ తమ్ముడు, మరదలు ఓ యాక్సిడెంట్‌లో పోయారు. వాళ్ల పిల్లలు యీవిడ పాల బడ్డారు. ఈవిడది చచ్చేటంత డిసిప్లిన్. లాలన పిల్లలు చేస్తే చెడిపోతారని ఆవిడ ఉద్దేశం. అందువల్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ట్యూషన్ మేస్టార్ని పెట్టి వీళ్లని ఓ దారిలో పెడదామని యీవిడ ప్రయత్నం. అది సాగకుండా వచ్చినవాడిని సాగనంపడం వాళ్ల లక్ష్యం. ఇలాటి వాతావరణంలో వచ్చిపడ్డాడు మన హీరో.
హిందీ సినిమాలో డార్జిలింగ్‌లో కలర్‌లో తీశారు. పాటలు సూపర్ హిట్. తెలుగు సినిమా బజెట్ అంత లేదు. ఆ లోపం కనబడకుండా చేయాలని హాస్యం పెంచారు. మేనకోడళ్లు యిద్దరున్నారు కదా, వాళ్లతో బాటు మేనల్లుడు రాజబాబును చేర్చారు. అతనికో ప్రేయసి రమాప్రభ. ఆమె ఎవరంటే అంజలీదేవి డ్రైవర్ అల్లు రామలింగయ్య చెల్లెలు. అంతస్తులు మరచి యితను ప్రేమించడం, అత్తకు చెప్పడానికి భయపడడం కథలో వాడుకున్నారు. ఈ ముసలిమేస్టారు అత్తయ్య మెప్పు సంపాదించేసి పాతుకుపోతాడని భయం వేసి అమ్మాయిలు అతన్ని రెచ్చగొట్టి అతని చేత కుప్పిగంతులు వేయించి అత్త కంటపడేటట్టు చేశారు. అత్తకు కోపం వచ్చి అతని ఉద్యోగం పీకేసింది. అయితే అదంతా వీళ్లు కావాలని చేసినదని తెలిసిన తర్వాత వుండిపొమ్మంది. అంతేకాదు, 'వాళ్లు అసహ్యించుకునేవాళ్లే నాకు కావాలి, మీ జీతం పెంచుతున్నా' అంది కూడా.
సరే హీరో ఎల్లకాలం ముసలివేషంలోనే వుండిపోతే ఎలా? అప్పుడప్పుడు గడ్డం పీకేసి, బజార్లో తిరుగుతూ హీరోయిన్ కంటపడ్డాడు. ఆమె యిష్టపడింది. ఇతను ఆమెను టీజ్ చేశాడు. హిందీ సినిమాలో ఓ టైలర్ దుకాణంలో తారసపడి ఆమె దుపట్టా కొట్టేసి ఏడిపించాడు. తెలుగులో దాన్ని వాచీ సీనుగా మార్చారు. హోటల్లో హీరో ఆడి పాడినట్టు చూపారు. అక్కడ 'ఆవో ట్విస్ట్ కరే' బాణీలో ఓ పాట కూడా పెట్టారు.
మాస్టారు వుండిపోయాడన్న కసికొద్దీ యీ మేనకోడళ్లిద్దరూ అత్తకు చాడీలు చెప్పారు. 'మాస్టారు నీ అందచందాల గురించి పొగుడుతున్నాడు' అని. దానితో అత్త మండిపడింది. పిలిచి మాస్టారుని నా అందచందాలతో నీకేం పని అని తిట్టింది. దానికి హీరో నిజాయితీగా సమాధానం చెప్పాడు. 'ఆవిడకు ఆస్తి, అందం అన్నీ వున్నా పెళ్లి చేసుకోకుండా మీకోసం కనిపెట్టుకుని వుంది కదా అని పిల్లలకు నచ్చచెప్పానండీ' అని. పైకి ఎంత కఠినంగా కనబడినా ఆవిడా మనిషే కదా. అనుకోకుండా లభించిన పొగడ్తకు ఉబ్బితబ్బిబ్బయింది. పైకి గాంభీర్యం చెడకుండానే 'పిల్లలకు బుద్ధి చెప్పండి, కానీ నా అందచందాల ప్రసక్తి లేకుండా చెప్పండి. ఒకవేళ అటువంటిదేమైనా వుంటే నాతో డైరక్టుగా చెప్పండి తప్ప వాళ్లతో కాదు' అంది వయ్యారాలు పోతూ.
కానీ హీరో యిదేమీ గుర్తించలేదు. అత్త కోపం తప్పించుకున్నాం బతుకుజీవుడా అనుకున్నాడు. తనపాటికి తను హీరోయిన్‌తో ప్రేమగీతాలు పాడుకుంటున్నాడు. నువ్వెవరు యింతకీ? అని హీరోయిన్ అడిగితే నీ శత్రువునైతే కాను. అన్ని వివరాలు త్వరలో చెపుతాను అని చెప్పి వూరుకున్నాడు. ఈలోపున కోర్టు వ్యవహారాలపై అత్త వూరు వెళ్లవలసి వచ్చింది. పిల్లలది మీదే పూచీ అని చెప్పి మేస్టారికి అప్పజెప్పి వెళ్లింది.
సినిమా అన్నాక విలన్ లేకపోతే ఎలా? హీరోయిన్ చెల్లెల్ని ప్రేమించానని చెప్పి దగా చేసిన క్లాసుమేటే ఆ విలన్. తెలుగులో కృష్ణంరాజు వేశారా పాత్ర. అసలే ఆ అమ్మాయి మొదటినుండీ రాలుగాయి రకం. దానివల్ల అత్త ఆమె అంటే మరీ కఠినంగా వుంటుంది. పరాయి మగాళ్లతో మాట్లాడుతోందని తెలియగానే అత్యంత కఠినంగా వ్యవహరించింది. తిండి పెట్టనంది. పైగా ఆమెకు చాటుగా పెట్టబోయిన పిల్లల్ని తీవ్రంగా దండించింది. దాంతో మాస్టారు ఆవిడకు క్లాసు తీసుకున్నాడు. దీంతో మేస్టార్ని మళ్లీ వుద్యోగంలోంచి తీసేసింది సీతాదేవి. మర్నాడు అతను వెళ్లిపోతూవుంటే వెనక్కి పిలిచి వుండమంది. వాళ్ల మంచిగురించే కదా యిదంతా అని సంజాయిషీ యిచ్చుకుంది.
తెలుగులో యింకో దృశ్యం కలిపారు. 'మా అక్క యిలాగే మోసపోయి ఆత్మహత్య చేసుకుంది.' అని. ఆమె మనసులో యీ మేస్టారి పట్ల ప్రేమ ఉద్భవించింది. తన ఉద్యోగాన్ని కూడా ఖాతరు చేయకుండా మనసులో వున్నదున్నట్టు చెప్పేసే అతని ధైర్యాన్ని మెచ్చుకుంది. అతనిమీద నమ్మకం కుదిరింది కాబట్టి యీ సారి కోర్టు వ్యవహారాలకు తనకు తోడుగా రమ్మనమంది. హిందీలో అది బాంబే. తెలుగులో హైదరాబాదు. ఆమెతో బాటు హీరోయిన్ కూడా వస్తోంది. ఇక హీరో యిబ్బంది ఏమిటంటే ముసలివాడిగా పెద్దావిడకు కంపెనీ యివ్వాలి, పడుచువాడిగా హీరోయిన్‌తో పాటలు పాడాలి. అది ఎలా సాధించాడన్నదే కామెడీ!
ప్రొఫెసర్‌గారి అన్నకొడుకు నంటూ యువకుడి రూపంలో అత్తను కలిసి కాగితం మర్చిపోయానని చెప్పి కోర్టుదగ్గర కూచోబెట్టి యివతల హీరోయిన్‌తో రొమాన్సు చేశాడు. కోర్టు దగ్గర వెయిట్ చేయలేక అత్త హోటల్‌కి తిరిగి వచ్చింది రుసరుసలాడుతూ. ముసలాయనా లేడు, మేనకోడలూ లేదు. అక్కడే బైఠాయించింది. ఆ కుర్చీలోనే హీరో ముసలి వేషం తాలూకు కోటూ, గడ్డం వున్నాయి. వాటిమీదే ఆవిడ కూర్చుంది.
ఇక్కడ హిందీలో చాలా సీను పెట్టారు. హీరోయిన్ అత్తకంట పడకుండా వుండాలని హోటల్లో యింకో గదిలోకి దూరడం, అక్కడ ఆర్టిస్టు యీమెను బట్టలు మార్చుకోమనడం, ఆమె ఆ బట్టలతో పారిపోవడం, దాంతో అల్లరవడం, ఆ గొడవలో అత్తయ్య కుర్చీలోంచి లేస్తే హీరో తన కోటూ, గడ్డం తీసుకోవడం… యిలా పెట్టారు. తెలుగులో అవి తీసేశారు. రామారావు హోటల్ గది కిటికీ లోంచి కోటు తీసుకుంటాడు. మొత్తం మీద హీరో మళ్లీ గడ్డం పెట్టుకుని అత్త దగ్గరకి వచ్చి 'నాకు జ్వరం వచ్చింది, మీ మేనకోడలు డాక్టరు వద్దకు తీసుకెళ్లింది' అని అబద్ధం చెప్పి ప్రాణం దక్కించుకున్నాడు.
అత్తకు ప్రొఫెసర్‌పై ప్రేమ పొంగింది. సింగారించుకోవడం మొదలు పెట్టింది. రూపు మార్చుకుంది. అది మేనకోడలు కంటపడింది. మేస్టార్ని టీజ్ చేసింది. ఇలాటి పరిస్థితిలో హీరో యిక అసలు విషయం చెప్పేద్దామనుకున్నాడు. సమయం గురించి ఎదురుచూస్తూ వుండగానే యింతలో తల్లికి బాగుపడిందని కబురు వచ్చింది. ఆవిడ దగ్గర కూచుని వుండగా కోటులో హీరోయిన్ రాసిన వుత్తరం తల్లి కంటపడి వివరాలు అడిగింది. ఇతను ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పి, వాళ్ల అత్త ఒప్పుకోవడం లేదని అంటాడు. ఇంతలో అత్త కారు రావడంతో గదిలోంచి పారిపోయాడు. అత్త లోపలకి వచ్చింది. మేస్టారి తల్లి మీరేనా అంటే యీవిడ ఔనంది. అంత వయసున్నట్టు కనబడటం లేదే అంటే వైద్యం వలన అంది. మా అబ్బాయి పెళ్లి గురించి చెప్పాడని తల్లి అంటే అత్త తన గురించే అనుకుని సిగ్గుపడింది. కారులో ప్రొఫెసర్‌తో తన మనసు విప్పి చెప్పేసింది. హీరో గతుక్కుమన్నాడు.
ఇక యిక్కడిదాకా వచ్చాక లాభం లేదని హీరో హీరోయిన్‌తో అసలు విషయం చెప్పేశాడు. అత్తతో చెప్పేద్దామనుకుంటూండగానే హీరోయిన్ చెల్లెలు రీటా గొడవ బయటపడింది. కోర్టు వ్యవహారాలపై అక్క, అత్త వూరెళ్లడంతో చెల్లెలు విలన్ వలలో పడింది. అతను ఆమెను గర్భవతిని చేశాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి నదిలో వురికింది. హీరో ఆమెను కాపాడడానికి నదిలో వురికాడు. తన విషయం బయటపడుతుందని వివేకం హెచ్చరించినా మానవత్వం ప్రదర్శించి వురికేశాడు. గడ్డం వూడి వచ్చింది. విషయం బయటపడింది. రీటాను కాపాడాడు కానీ అత్త దృష్టిలో దోషిగా మిగిలాడు. అదే సమయంలో అతని కోటులో బయటపడిన వుత్తరాల వలన అతను తన మేనకోడళ్లిద్దరితోనూ సరసాలాడేడని అపోహపడింది. ముసలి వేషంలో తనను గాడిదను చేశాడన్న ఉక్రోషం ఒకటి. తుపాకీ తీసుకుని కాల్చబోయింది. జనమంతా రాళ్లేసి కొట్టారు. సమయానికి అక్కడికి వచ్చిన హీరో తల్లికి దెబ్బలు తగిలాయి.
ఇప్పుడు హీరో తన హీరోయిజాన్ని ప్రదర్శించవలసిన తరుణం వచ్చింది. తల్లిని ఓ గుడిలో పడుకోబెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విలన్‌ని ఎత్తుకొచ్చి హీరోయిన్ చెల్లెలి వద్ద పడేసి, నాలుగు తన్ని వాడిచేత నిజం వొప్పించాడు. ఆ అమ్మాయికి మాట పడిపోయింది కాబట్టి వాణ్ని తన్నవలసి వచ్చింది. హీరోమీదే కోపంగా వున్న అత్త అతన్ని తన మనుషుల చేత కొట్టించింది. దాంతో హీరోయిన్‌కి తిక్క రేగింది. అత్తను దులిపేసింది. నువ్వు గొడ్రాలువి, పిల్లల పట్ల ప్రేమాభిమానాలు నీకేం తెలుసు అని తిట్టిపోసింది. గొడ్రాలు అనడాన్ని సహించలేక అత్త పిచ్చిదానిలా మాట్లాడితే, హీరో తల్లి అంటే ఏమిటో డైలాగులు చెప్పాడు.
చివరిలో ఏమౌతుందో చెప్పనక్కరలేదు. అత్తలో మార్పు రావడం అందరికీ పెళ్లిళ్లు చేయడం జరుగుతుంది. తెలుగులో అదనంగా మేనల్లుడు రాజబాబుకి డ్రైవర్ చెల్లెలితో పెళ్లి జరిపిస్తుంది. సినిమా అంతా చూసాక మధ్యలో అత్త ఫూల్ అవడం చూసి అయ్యోపాపం అనిపిస్తుంది. తెలుగులో అందుకే డోస్ తగ్గించారు. లలితా పవార్ చూపించినంత ఫన్నీగా అంజలిని చూపించలేదు. పైగా హిందీలో సీతాదేవి ప్రొఫెసర్‌తో తన పెళ్లి ఎనౌన్సుమెంటు చేయిస్తుంది. తెలుగులో యీ భంగపాటును తీసేసి కాస్త హుందాగా చేశారు.
ఇప్పుడు యిదే సినిమాను మరో పాతికేళ్ల తర్వాత ఎలా తీశారో చెప్తాను. సినిమా పేరు 'పెద్దింటి అల్లుడు' సుమన్ హీరో, నగ్మా హీరోయిన్. వాణిశ్రీ అత్త పాత్ర. కథ తెలిసిపోయింది చేసిన కొత్త మార్పులు మాత్రం చెప్తాను. దీనిలోనూ చదువుకున్న నిరుద్యోగి హీరో, జబ్బు తల్లి వున్నారు. తల్లిని వైద్యానికి హైదరాబాదు తీసుకెళుతుంటే ఓ ముసలి మ్యూజిక్ టీచర్ బాబూ మోహన్ రైల్లో తగిలాడు. ఐలాండ్ ఎస్టేట్ అనే చోట మూడువేల రూపాయల జీతంపై మ్యూజిక్ టీచర్ వుద్యోగం దొరికిందని చెప్పాడు. అయితే దాన్ని పలకడం రాక ఈస్‌లాండ్ ఎస్టేట్ అంటూ వుంటాడు. బాబూమోహన్ పెట్టె, సుమన్ పెట్టె తారుమారు కావడంతో సుమన్ అవసరార్థం అతని పేరు పెట్టుకుని యీ ఎస్టేటుకి వచ్చేశాడు. బాబూ మోహన్ మాత్రం ఈస్‌లాండ్ ఎస్టేటు ఎక్కడ అంటూ సినిమా అంతా తిరుగుతూ వుంటాడు. క్లయిమాక్స్‌లో కాని యిక్కడకు చేరడు. ఈ లోపున యిక్కడ హీరో గడ్డం పెట్టుకుని అత్త అభిమానాన్ని, తీసేసి హీరోయిన్ ప్రేమను పొందుతాడు.
ఈ వెర్షన్‌లో హీరోయిన్ చెల్లెలు విలన్ వలలో పడడాలు లేవు. మరి హీరోకి క్రైసిస్ లేకపోతే ఎలా? అది యిదిగో ఈ మోహన్‌బాబు రూపంలో దాపురించింది. ఇతనో చిల్లర దొంగ. పోలీసులనుండి పారిపోతూ యితని గదిలో దూరి అనుకోకుండా యితని రహస్యం కనుగొన్నాడు. మాస్టారి బావనంటూ అతని గదిలో తిష్ట వేసి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఓ దశలో సుమన్ యితనికి డబ్బిచ్చి వదిలించుకున్నాననుకున్నాడు. అబ్బే, యితను మెయిన్ బంగళాలో సిద్ధం.
ఒరిజినల్ వెర్షన్స్‌లాగానే అత్త ప్రేమలో పడడం, పెళ్లాడదామనుకోవడం అదీ చూపారు. ఆమెకు యీ మోహన్‌బాబు వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటూ వుంటాడు. హీరో అసలు వేషం బయటపడడానికి యీ సినిమాలో క్రైమ్ యాంగిల్ ప్రవేశపెట్టారు. విలన్ తన కూతురు పెళ్లి వేళ తన పార్ట్‌నర్‌ని చంపేసి దాన్ని ఆత్మహత్యగా బనాయిస్తాడు. పెళ్లికి వచ్చిన పోలీసుల దగ్గర్నుంచి అందరూ నమ్ముతారు కానీ ఆ హత్య దృశ్యాన్ని పెళ్లికి వచ్చిన వీడియోగ్రాఫర్ వీడియో తీస్తాడు. ఆ వీడియో తీసుకుని పారిపోతూ నగ్మా కారులో ఎక్కుతాడు. వీడియోను ఆమె బ్యాగ్‌లో పడేస్తాడు. తర్వాత విలన్ల చేతిలో చచ్చిపోతాడు. నగ్మా వీడియో చూడదు కానీ వీడియో కోసం ఆమెను విలన్ మనుషులు వెంటాడుతూంటారు. చంపబోతారు. హీరో కాపాడుతూంటాడు. చివరకు ఓ ఫైట్‌లో హీరోకి అసలు సంగతి బయటపడింది. ఇంటికి వచ్చి వీడియో కాసెట్ చూశారు. హత్య సంగతి తెలిసింది. వీడియోకోసం విలన్ అత్త కుటుంబాన్నంతా బంధించి తెచ్చాడు. హీరో ముసలివేషంలో వెళ్లాడు. ముసలాడివి నన్నేం చేయగలవంటూ విలన్ ఎద్దేవా చేస్తే గడ్డం పీకేశాడు. అత్త తెల్లబోయింది. హీరో ఫైట్‌లో మోహన్‌బాబు కూడా వచ్చి చేరాడు. ఇద్దరూ కలిసి కథను కంచికి, విలన్‌ను జైలుకి చేర్చారు. అసలు సంగతి తెలిశాక అత్తలో మార్పు సింపుల్‌గా చూపించారు. వాణిశ్రీ గదిలోంచి వచ్చి జుట్టుకి నల్లరంగు పోవడానికి గంట పట్టదా అంటుంది.
చూశారుగా, ఒక కథను కాలానుగుణంగా ఎన్ని రకాలుగా మార్చుకుంటూ వచ్చారో మనవాళ్లు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)