ఇప్పుడీ ఆత్మహత్య జరగగానే టిడిపి బెంబేలెత్తింది. ప్రతిపక్షాలు దీన్ని వాడుకుంటాయని భయపడింది. మీడియా మేనేజ్‌మెంట్ మొదలుపెట్టింది. రెండు రకాల వార్తలు కాదు లీకులు రాసాగాయి. మొదటిరకం ప్రత్యేక హోదాపై బాబు బిజెపి కేంద్ర నాయకత్వంపై మండిపడ్డారని, తన ఎంపీలను పిలిచి మొహమాటాలకు పోతే ఎలా, పార్లమెంటులో గట్టిగా అడగండి అన్నారని లీకు వచ్చింది. రెండో రకం ప్రత్యేక హోదా ఎందుకు, దాన్ని తలదన్నే ప్యాకేజీ యిస్తాం కదా అని కేంద్రమంత్రులు అన్నారని లీకు వచ్చింది. మొదటి లీకు గురించి చర్చిస్తే – ప్రత్యేక హోదా గురించి అడగడం అనవసరం, దాని వలన ఒరిగేది ఏమీ లేదు అని బాబు బహిరంగంగా అనసాగారు. ప్రత్యేక హోదా గురించి గొడవ చేస్తున్న ప్రతిపక్షాలతో గొంతు కలపవద్దని, బిజెపితో వైరం తెచ్చిపెట్టుకోవద్దని తన ఎంపీలకు సలహా యిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దానికి మద్దతుగా ప్రత్యేక హోదా గురించి అడిగే మేధావుల ఫోరంతో సహా అందర్నీ దుమ్మెత్తి పోశారు.
ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని బాబుకి తెలిస్తే ఆ ముక్క ప్రజలకు సోదాహరణంగా చెప్పి, వారిని కన్విన్స్ చేస్తే, నటుడు శివాజీ దీక్షలు, పవన్ కళ్యాణ్ ట్వీట్లు, మునికోటి ఆత్మహత్య యివేమీ వుండేవి కావు. బాబు యివాళ అలా చెపితే 'మరి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా గురించి అంత గొప్పగా చెప్పావ్? అంత పనికిమాలినదైతే పదేళ్లు కొనసాగిస్తామని ఎందుకన్నావ్? ప్రత్యేక హోదా గురించి కాంగ్రెసు చట్టంలో పెట్టకుండా ఆంధ్రకు ద్రోహం చేసింది' అని యిప్పుడు కూడా ఎందుకంటున్నావ్?' అని అడిగే ప్రమాదం వుంది. ఈ యిబ్బంది ఎప్పటికైనా తప్పదు, ఒప్పేసుకోవాలి. 'ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో హామీ యివ్వడమే కాదు, కాబినెట్ మీటింగులో కూడా కాంగ్రెసు తీర్మానం చేసినా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బిజెపికి అది యివ్వడం సుతరామూ యిష్టం లేదు. ఈ విషయంలో నేనేం చేయలేను. వాళ్లతో సంబంధం వుంచుకున్నా, తెంచుకున్నా వాళ్లేమీ పట్టించుకోరు. అందువలన దాని గురించి ప్రస్తుతానికి మర్చిపోండి. 2019 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తే గిస్తే అప్పుడు వాళ్లకు గుర్తు చేసి అడుగుదాం' అని స్టేటుమెంటు యిచ్చేసి చేతులు కడుక్కోవడం మంచిది.
మనం అధికారంలో లేము కాబట్టి యిలాటి ఉచిత సలహాలు ఎన్నయినా చెపుతాం. వాటిని అమలు చేయడం బుకాయింపు మీదే పబ్బం గడుపుకునే నాయకులకు అంత సులభమా! పార్లమెంటులో సాక్షాత్తూ మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ ప్రకటన చేశారు. 'కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 10% పెంచినందున యిక దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా యిచ్చే ప్రశ్నే లేదు. ఆ ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు.' అని. ఆ ప్రకటన రాబట్టే ప్రశ్న వేసినది ఆంధ్ర టిడిపి ఎంపీలు కాదు, బిహార్, ఒడిశా ఎంపీలు, వాళ్ల రాష్ట్రాల హోదా గురించి అడిగారు. మంత్రిగారు మీకు లేదు అని వూరుకోవచ్చా, అబ్బే దేశంలో ఏ రాష్ట్రానికీ లేదు అని అదనపు సమాచారం కూడా యిచ్చారు. ఇదేదో అప్పటికప్పుడు ఆవేశంగా యిచ్చిన సమాధానం కాదు. రాతపూర్వకంగా యిచ్చినది. ఆంధ్ర కూడా ఆ హోదా గురించి అడుగుతోందని తెలిసే, మళ్లీ వాళ్లకేం చెబుదాం, వాళ్లకి చెప్పినా పక్కనే వున్న తెలంగాణ కూడా నా సంగతేమిటంటుంది, అందరికీ కలిపి ఒకేసారి ఢంకా బజాయించి చెప్పేస్తే వదిలిపోతుంది అనుకుంది బిజెపి కేంద్ర నాయకత్వం. ఇలా చెప్పడం వలన చంద్రబాబుకి యిబ్బందేమో అని తటపటాయించలేదు. ఇబ్బంది పడితే పడనీ అనుకున్నట్టుంది. పరికించి చూస్తే చంద్రబాబు ప్రతిష్ఠను ఆంధ్రలో నిలిపే ప్రయత్నమేమీ మోదీ చేయడం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణకు ఎక్కువ లాభాలు చేకూరుస్తున్నట్లు తోస్తోంది. దీనికి రాజకీయ కారణాలున్నాయో లేక, కేవలం ఆర్థిక కారణాలో తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దెబ్బ తిని వుంది, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనబడటం లేదు. హైదరాబాదు కారణంగా తెలంగాణ పరిస్థితి దాని కంటె మెరుగ్గా వుంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యిప్పటికే వుంది కాబట్టి దానికి కాస్త చేయూత యిస్తే చాలు, కనీసం ఒక రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారేమో తెలియదు.
ఇంత కుండబద్దలు కొట్టి చెప్పినా, మొన్నటికి మొన్న సుజనా చౌదరి, కంభంపాటి 'అబ్బే, వాళ్లు మన గురించి చెప్పలేదండి' అంటున్నారు. 'దేశంలో ఏ రాష్ట్రానికీ లేదు, అన్నాక కూడా మన గురించి విడిగా చెప్పాలా? మనది కూడా దేశంలో ఒక రాష్ట్రమే కదా' అని నిలదీస్తే 'మీరు చూస్తూ వుండండి, బిహార్ ఎన్నికల కారణంగా మనకు యివ్వలేకపోతున్నారు. మన కిస్తే వాళ్లూ అడుగుతారని భయం. బిహార్ ఎన్నికలు కాగానే మనకు యిచ్చేస్తారు' అని వాదించారు. 'బిహార్ తర్వాత తమిళనాడు ఎన్నికలంటారు. మన ప్రత్యేక హోదాకు తమిళనాడు కూడా అడ్డుపడుతోంది కదా' అని అంటే 'ఇవన్నీ ఎందుకు, బిహార్ ఎన్నికల తర్వాత మాట్లాడండి' అన్నారు. ఇప్పుడీ ఆత్మహత్య కారణంగా బిహార్ ఎన్నికల గురించి మర్చిపోయి, బాబు ఢిల్లీ నాయకులను నిలదీశారని అనుకోవాలా? కాంగ్రెసు అధికారంలో వుండగా తెలంగాణపై నిర్ణయం వచ్చేది కాదు, యుపి ఎన్నికల కారణంగా ఆగిందని, మణిపూర్‌లో ఎన్నికలు కాగానే వచ్చేస్తుందని, సరైన సమయంలో సరైన నిర్ణయమని చెపుతూ వచ్చారు. చివరకు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా చేసి మొత్తం కంపుకంపు చేశారు. తెల్లారి లేస్తే ఆంధ్ర, తెలంగాణ జుట్టుజుట్టు పట్టుకుంటున్నాయి. తగవు తీర్చాల్సిన గవర్నరుకాని, కేంద్రం కాని 'మీ ముఖ్యమంత్రులిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి, మేం చేసేదేమీ లేదు' అనేస్తున్నాయి. ఇప్పుడు బిజెపి కూడా కాంగ్రెసు బాటలోనే బిహారని, బెంగాలని, పంజాబని నిర్ణయాలు వాయిదా వేస్తే అంతకంటె ఘోరం యింకోటి లేదు. ఫలానా కారణంగా వాయిదా వేశాం అని అప్పుడు కాంగ్రెసూ చెప్పలేదు, యిప్పుడు బిజెపి చెప్పలేదు. వస్తుందని వూరించేవాళ్లు, ఆలస్యానికి తమంతట తామే కారణాలు పుట్టిస్తున్నారేమో తెలియదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)