ఎమ్బీయస్‌ : శ్రీలంకలో బౌద్ధుల దాడి

శ్రీలంక తమిళులలో హిందువులతో బాటు ముస్లిములు కూడా వున్నారు. జనాభాలో వారు 10%. మూడు థాబ్దాల క్రితం ఎల్‌టిటిఇ దేశంలోని ఉత్తరభాగాన్ని ఆక్రమించుకున్నపుడు అక్కడి ముస్లిములపై దాడులు చేయడంతో వారు ఆ ప్రాంతాలు వదిలి…

శ్రీలంక తమిళులలో హిందువులతో బాటు ముస్లిములు కూడా వున్నారు. జనాభాలో వారు 10%. మూడు థాబ్దాల క్రితం ఎల్‌టిటిఇ దేశంలోని ఉత్తరభాగాన్ని ఆక్రమించుకున్నపుడు అక్కడి ముస్లిములపై దాడులు చేయడంతో వారు ఆ ప్రాంతాలు వదిలి యితర ప్రాంతాలకు తరలిపోయారు. నైరృతి ప్రాంతంలో వారు అధికసంఖ్యలో వుంటున్నారు. ఆ ప్రాంతంలోనే కొలంబోకు 50 కి.మీ.ల దూరంలో వున్న అలుతగామా అనే పట్టణంలో జూన్‌ 15 న వారిపై బౌద్ధ సంఘం వారి దాడి జరిగి నలుగురు మరణించారు, 80 మంది గాయపడ్డారు. ఆ బౌద్ధ సంఘం పేరు బోదు బలసేన. రెండేళ్ల క్రితం స్థాపించారు. ముస్లిము వ్యతిరేకత బాహాటంగా కనబరుస్తూ బలపడుతున్నారు. సింహళ-బౌద్ధ సంస్కృతి చెక్కుచెదరకుండా చూడడమే మా లక్ష్యం అని చెప్పుకుంటూ వారు హింసకు పాల్పడుతూంటారు. ''ఫ్యాషన్‌ బగ్‌'' పేరుతో అనేక ఊళ్లలో నడిచే బట్టలషాపుల గ్రూపుకు సొంతదారులు ముస్లిములే. ఈ సేనవాళ్లు 2013 మార్చిలో వాటిపై దాడి చేసి దోచుకున్నారు. ముస్లిము వనితలు ధరించే బురఖాకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేదీస్తామని బెదిరించారు కూడా. వీళ్లేం చేసినా శ్రీలంక ప్రభుత్వం వారిని అదుపు చేయడం లేదు. ఈ సేన ఆఫీసులో అధ్యకక్షుడు మహీంద్ర రాజపక్ష, డిఫెన్స్‌ సెక్రటరీ గోటబయ రాజపక్ష ఫోటోలు వేళ్లాడుతూ వుంటాయి.

ఎల్‌టిటిఇని మట్టుపెట్టి శాంతి నెలకొల్పినా అధికారపక్షానికి దేశ ఉత్తరభాగంలో రాజకీయంగా లాభించలేదు. 2013 సెప్టెంబరు నాటి ఎన్నికలలో అక్కడున్న తమిళులు తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ పార్టీకే ఓట్లేశారు. వాళ్ల మాట ఎలా వున్నా సింహళీయులైనా తమకు మద్దతు యిస్తారేమోననుకుంటే వారు అధికంగా వున్న పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే అక్కడా పెద్దగా ఓట్లు రాలలేదు. నెగ్గారు కానీ ఓట్లశాతం తగ్గింది. ఈ పరిస్థితుల్లో సింహళ-బౌద్ధ ఓట్లు గంపగుత్తగా తమకు పడేట్లా చేసుకోవాలంటే ఆ ఫీలింగ్స్‌ రెచ్చగొట్టాలి. ప్రభుత్వంలో వుండి డైరక్టుగా ఆ పని చేయలేరు కాబట్టి యీ సేన ద్వారా ఆ కార్యం సాధిస్తున్నట్లుగా కనబడుతోంది. అందుకే వారిపై చర్యలు వుండటం లేదు. జూన్‌ నెల మొదటివారంలో కొంతమంది ముస్లిము యువకులు ఒక బౌద్ధసన్యాసిని కొట్టారనే వార్త రావడంతో అలుతగామాలో జూన్‌ 15న బోదు బలసేన బహిరంగ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా ప్రసంగించిన దాని నాయకుడు జ్ఞానసర తేరా ''ఈ దేశంలో మనకింకా సింహళ పోలీసు వుంది. ఇవాళ్టి నుంచి ఒక్క మరక్కాలయ (ముస్లిము గురించి నిందా పూర్వకమైన ప్రస్తావన) కానీ ఎవడైనా పరాయివాడు కానీ సింహళ వాడినెవరినా ముట్టుకున్నారో.. వాడి పని ఖతమ్‌.'' అని ప్రకటించాడు. సమావేశం ముగిసిన కాస్సేపటికే ఏ ముస్లిమూ ఎవరినీ ముట్టుకోకపోయినా వాళ్ల యిళ్లపై దాడులు జరిగాయి. ఇళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు అక్కడే నిలబడి చోద్యం చూశారు తప్ప ఎవరినీ ఆపలేదు. భయభ్రాంతులైన ముస్లిములు యిళ్లు వదిలి పారిపోయారు. శాంతి ప్రవచించిన బౌద్ధం పేరుతో జరుగుతున్న రాజకీయ అత్యాచారం యిది! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]