ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 67

జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశాక రాష్ట్రపతి పాలన విధించి ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది తమిళనాడులో పూర్తి గందరగోళం నెలకొంది. ఆ గందరగోళ సృష్టికర్తల్లో స్పీకరు పేరు మొదటగా చెప్పాలి. ఎమ్జీయార్‌…

జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశాక రాష్ట్రపతి పాలన విధించి ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది తమిళనాడులో పూర్తి గందరగోళం నెలకొంది. ఆ గందరగోళ సృష్టికర్తల్లో స్పీకరు పేరు మొదటగా చెప్పాలి. ఎమ్జీయార్‌ మద్దతుతో అతను నియంతలా చెలరేగిపోయాడు. 1986 డిసెంబరులో హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారంటూ పదిమంది డిఎంకె ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేసేశాడు. అలా చేస్తే వాళ్లను ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని కాలరాసినట్లే కదా, స్పీకరుకు అంత అధికారాలుంటాయా అని అడిగితే నా అధికారాలకు ఆకాశమే హద్దు అని చెప్పుకోవడంతో అతనికి స్కై హై (ఎస్‌ఎచ్‌) పాండ్యన్‌ అనే నిక్‌నేమ్‌ వచ్చింది. అసలు పేరు పిఎచ్‌ పాండ్యన్‌. పార్టీ చీలినతర్వాత అతను వీరప్పన్‌ వర్గంలో చేరాడు. బలపరీక్ష రోజున జయలలిత వర్గం, కొన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీకి హాజరు కాలేదు. జానకి వైపు నిలిచినవారు 99 మందే. వారిని సగం కంటె ఎక్కువగా చూపించాలంటే అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించాలి. దానికై  పాండ్యన్‌ జయలలిత వర్గపు 33 ఎమ్మెల్యేల గుర్తింపు రద్దు చేసేశాడు. పాత రద్దు, యీ రద్దు కలిపి అసెంబ్లీలో లోని ఎమ్మెల్యేల సంఖ్య 191 అయింది. అవేళ హాజరైనవాళ్లు 111 మంది. వారిలో 3 తటస్థంగా వుండగా 8 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అందువలన 99 ఓట్లతో జానకి బలపరీక్ష నెగ్గినట్లే అనేశాడు పాండ్యన్‌. ఇది ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్లే అని అందరూ గగ్గోలు పెట్టారు. వీరప్పన్‌వి నీచరాజకీయాలంటూ అసహ్యించుకున్నారు. జానకి ప్రభుత్వాన్ని గవర్నరు ద్వారా నిలబెట్టడానికి చూసిన కాంగ్రెసుకు కూడా మసి అంటింది. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీకి రాజకీయంగా నష్టమని బోధపడిన రాజీవ్‌ ప్రజలు యీ ఉదంతాన్ని మర్చిపోవాలని ఏడాది దాకా రాష్ట్రపతి పాలనను సాగదీశాడు. 

ఈ లోపున పార్టీ బలపడకపోగా బలహీనపడింది. విడిగా పోటీ చేయాలా, జయలలిత, జానకి వర్గాలలో ఎవరినైనా సమర్థించాలా, ఎవర్ని సమర్థించాలి అనే విషయంపై తీవ్రంగా అంతర్గత చర్చలు జరిగాయి. ఎమ్జీయార్‌ చనిపోయాడు కాబట్టి కరుణానిధి యిన్నాళ్లూ ప్రతిపక్షంలో వుండి వనరులు లేక మగ్గుతున్నాడు కాబట్టి, కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రావడానికి యిదే తరుణం అని జికె మూపనార్‌ వాదించాడు. ఎందుకంటే కాంగ్రెసు పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే ఛాన్సు తనకే వుందని అతనికి తెలుసు. కావాలంటే ఎన్నికల తర్వాత వేరేవారి మద్దతు తీసుకోవచ్చని అతని ఊహ. కానీ తక్కిన వాళ్లు ఒప్పుకోలేదు. కాంగ్రెసుకు అవకాశం పెరిగినా ఒంటరిగా పోటే చేసేటంత శక్తి రాలేదు కాబట్టి జయలలిత వర్గంతో పొత్తు పెట్టుకోవాలని తీర్మానం చేశారు. అది వినగానే కాంగ్రెసు నాయకుడు శివాజీ గణేశన్‌ మండిపడ్డాడు. అతను తొలి రోజుల్లో డిఎంకెలో వున్నా తర్వాతి రోజుల్లో కాంగ్రెసులో చేరి ఎన్నికలలో వారి తరఫున ప్రచారం చేసేవాడు. కామరాజ్‌ అతనికి ఎంతో విలువ యిచ్చేవాడు. శివాజీ ఎన్నికల సమయంలో తప్ప తక్కిన రోజుల్లో రాజకీయాల్లో జోక్యం చేసుకునేవాడు కాడు. తనకంటూ అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కామరాజ్‌ మరణం తర్వాత శివాజీకి కాంగ్రెసులో ఆదరణ తగ్గింది. ఇందిర మరణం తర్వాత జాతీయస్థాయిలో కూడా అతన్ని పట్టించుకునేవారు తగ్గిపోయారు. రాజీవ్‌కు శివాజీ స్థాయి గురించి ఏ మాత్రం అవగాహన లేదు. జాతీయ కాంగ్రెసులో చిన్న స్థాయి కార్యదర్శి దగ్గర్నుంచి తనను విమర్శిస్తూ మాట్లాడడంతో శివాజీకి ఒళ్లు మండిపోయింది. కాంగ్రెసుతో వుంటే లాభం లేదనుకుని 1988 ఫిబ్రవరిలో బయటకు వచ్చేసి తమిళగ మున్నేట్ర మున్నణి (తమిళ ముందడుగు కూటమి) అనే పార్టీ పెట్టాడు.

శివాజీ గణేశన్‌ డబ్బు విషయంలో చాలా పొదుపరి. ఎవరికీ ఉత్తి పుణ్యాన ఉపకారం చేసే మనిషి కాదు. దర్శకనిర్మాతలతో గొడవలేమీ లేవు కానీ, ఎవరితోనూ ఉదారంగా వున్న దాఖలాలు కూడా లేవు. ఎమ్జీయార్‌ కంటె ఎక్కువగా చాలాకాలం అనేక సినిమాల్లో నటించడమే కాక, సొంతంగా విజయవంతమైన సినిమాలు తీశాడు. సినిమా థియేటర్లు కట్టాడు. అతని కుమారుడు ప్రభు కూడా సినిమా నటుడయ్యాడు. దాతగా ఎమ్జీయార్‌ కున్న పేరు శివాజీకి ఎప్పుడూ లేదు. పేదల్లో పలుకుబడీ లేదు. అందరూ గొప్ప నటుడిగా అతన్ని గౌరవిస్తారంతే. కానీ ఎన్నికలలో గెలుపుకు అది చాలదు. ఈ దశలో శివాజీకి ఎందుకు పుట్టిందో కానీ రాజకీయాల్లోకి వచ్చి తన తడాఖా చూపాలనిపించింది. సొంతంగా పార్టీ పెట్టి అప్పటిదాకా దాచి వుంచిన డబ్బు సంచీల మూతలు విప్పాడు. 

శివాజీ బయటకు వెళ్లిన తర్వాత జయలలితతో పొత్తు విషయం పక్కన పెట్టి సొంతంగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు మూపనార్‌. మూపనార్‌ తంజావూరు జిల్లా కపిస్థలంలో ధనిక జమీందారు కుటుంబానికి చెందినవాడు. కామరాజ్‌ కాలంలో కాంగ్రెసులో చేరి, 1965 నాటికి తంజావూరు జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడయ్యాడు. పార్టీ చీలిపోయినప్పుడు కామరాజ్‌తో బాటు పాత కాంగ్రెసులో వున్నాడు. ఆయన మరణం తర్వాత 1974లో ఇందిరా కాంగ్రెసులో చేరాడు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. అతని ప్రతిభను, విశ్వాసపాత్రతను గుర్తించిన ఇందిర ఢిల్లీకి రప్పించి, 1977లో రాజ్యసభలో స్థానం యిప్పించింది. 1980లో పార్టీ జనరల్‌ సెక్రటరీ చేసింది. రాష్ట్రాలలో కాంగ్రెసు ముఖ్యమంత్రులకు, వారి ప్రత్యర్థులకు పేచీలు వచ్చినపుడు మధ్యవర్తిగా ఇందిర ప్రతినిథిగా మూపనార్‌ వచ్చి చర్చలు జరిపేవాడు. అతను అవినీతికి లొంగలేదు, పదవీలాలస లేదు. తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా వుంచాడు. అధినాయకత్వానికి విశ్వాసంగా వుంటూ పార్టీ కోసమే శ్రమించాడు. అతను జాతీయ రాజకీయాల్లో వుంటేనే అతనికీ, పార్టీకి మేలు కలిగేది. కానీ రాజీవ్‌ అతన్ని తమిళనాడుకి పంపి, మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపాడు. కొన్నేళ్లగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా లేని మూపనార్‌ పార్టీ అవకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. శివాజీని పోగొట్టుకున్నాడు. పార్టీ పెట్టిన కొన్నాళ్లకు శివాజీ తన వెంట కాంగ్రెసు నాయకులు ఎవరూ రాలేదని గ్రహించి తన బలం చాలదనుకుని జానకి వర్గంతో పొత్తు పెట్టుకున్నాడు. జానకి, జయలలిత యిద్దరూ తమదే అసలు ఎడిఎంకె అని ఎన్నికల చిహ్నం 'రెండాకులు'ను తమకు యివ్వాలని అడిగారు. ఎన్నికల కమిషన్‌ ఎడిఎంకె (జెఆర్‌ – జానకీ రామచంద్రన్‌)కు రెండు పావురాల గుర్తును, ఎడిఎంకె (జెఎల్‌ – జయ లలిత)కు కోడిపుంజు గుర్తును కేటాయించింది. 

రాజీవ్‌ గాంధీని అప్పటికే బోఫోర్స్‌ వివాదం చుట్టుముట్టింది. అతను అవినీతిపరుడంటూ విపి సింగ్‌ తదితరులు మంత్రిపదవి వదిలేసి బయటకు వచ్చి జనతా దళ్‌ స్థాపించారు. శ్రీలంక సమస్యపై రాజీవ్‌తో విభేదిస్తున్న డిఎంకె జనతాదళ్‌తో చేతులు కలిపింది. ఎన్నికలలో సిపిఎం జనతాదళ్‌, డిఎంకెలతో పొత్తు పెట్టుకోగా, సిపిఐ జయలలిత వర్గంతో చేతులు కలిపింది. ఆ విధంగా యిది చతుర్ముఖ పోరాటంగా తయారైంది. 12 ఏళ్ల తర్వాత కాంగ్రెసు సొంతంగా పోటీ చేస్తూండడంతో రాజీవ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అనేకసార్లు తమిళనాడు పర్యటించి ప్రచారం చేశాడు. డిఎంకె తరఫున విపి సింగ్‌, జ్యోతి బసు యిత్యాదులు ప్రచారం చేశారు. ఇక ఎమ్జీయార్‌ వారసత్వం కోసం ఎడిఎంకెలోని రెండు వర్గాలు విపరీతంగా పోటీ పడ్డాయి. జానకి వర్గం వాల్‌పోస్టర్లలో ఎమ్జీయార్‌కు జానకి ఎంత సేవ చేసిందో చూపడానికి ఎమ్జీయార్‌కు అన్నం వడిస్తూన్నట్లు, చేత్తో తినిపిస్తున్నట్లు, పట్టుకుని నడిపిస్తున్నట్లు ఫోటోలు వేస్తే, మర్నాడే ఎమ్జీయార్‌, జయలలిత నటించిన సినిమాల్లోంచి తీసుకున్న స్టిల్స్‌తో, కొన్ని బయటి ఫోటోలతో జయలలిత వర్గం పోస్టర్‌ వెలిసేది. దానిలో ఎమ్జీయారే జయలలితకు అన్నం తినిపిస్తున్నట్లు, లాలించినట్లు చూపించేవారు. ఇద్దరూ కలిసి ఎమ్జీయార్‌ జీవితాన్ని బట్టబయలు చేసినట్లు కనిపించేది. బ్రాహ్మణ వ్యతిరేకతే వూపిరిగా ప్రారంభించిన ద్రవిడోద్యమంలోంచి ఉద్భవించిన ఎడిఎంకె పక్షాన పోటీ పడిన యిద్దరు ప్రత్యర్థులూ బ్రాహ్మణ మహిళలు కావడం విచిత్రం! 

పోటీ హోరాహోరీగా సాగింది. అందరి కంటె ఎక్కువ హంగామా కాంగ్రెసు చేసింది. 1989 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఎడిఎంకె (జెఎల్‌) 198 సీట్లు పోటీ చేసి 22% ఓట్లతో 27 గెలిచింది. దాని భాగస్వామి సిపిఐ 13టికి 3 గెలిచింది. కాంగ్రెసు 214 పోటీ చేసి 20% ఓట్లతో 26 గెలవగా, ఎడిఎంకె (జెఆర్‌) 175 పోటీ చేసి 9% ఓట్లతో 2 సీటు దక్కించుకుంది. జానకి సైతం ఓడిపోయింది. శివాజీ టిఎమ్‌ఎమ్‌ 49కి పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు. శివాజీ కూడా ఓడిపోయి, లెంపలేసుకుని పార్టీ కట్టిపెట్టేశాడు. తక్కిన పార్టీల ఓట్లు చీలిపోగా డిఎంకె ఓటు బ్యాంకు 33% ఓట్లతో స్థిరంగా అలాగే వుంది. అందుకని 202 సీట్లు పోటీ చేసి 150 గెలిచింది. దాని భాగస్వాములైన జనతా దళ్‌ 10కి 4 గెలవగా, సిపిఎం 21 పోటీ చేసి 15 గెలిచింది. 5గురు స్వతంత్రులు గెలిచారు. కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. శివాజీలాగే జానకికి కూడా రాజకీయాలపై విరక్తి కలిగింది. జయలలిత వర్గంతో పార్టీని కలిపేసింది. చక్రం తిప్పిన వీరప్పన్‌ అనామకుడై పోయాడు. జయలలితను ఎమ్జీయార్‌ వారసురాలిగా అందరూ గుర్తించారు. ఎడిఎంకె పార్టీ గుర్తు రెండు ఆకులు ఆమెకు యిచ్చారు. కరుణానిధికి ప్రత్యామ్నాయంగా జయలలితను అందరూ గుర్తించారు. ఈ ఓటమితో కంగు తిన్న కాంగ్రెసు, కరుణానిధిని కట్టడి చేయడానికి జయలలితతో చేతులు కలపసాగింది. 1989 నవంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో రాజీవ్‌, జయలలిత కలిసి అద్భుత విజయాన్ని సాధించారు. (సశేషం) ఫోటో – కుటుంబసభ్యులతో శివాజీ గణేశన్‌  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives