జయలలిత మరణం కాదు కానీ అప్పణ్నుంచి తమిళనాడులో అనేక వింతలు జరుగుతున్నాయి. ఏది ఎందుకు జరుగుతోందో, ఎవరు జరిపిస్తున్నారో ఎవరి వూహలు వారివి. నోట్లరద్దు తర్వాత బ్లాక్‌మనీ బయటకు వచ్చేస్తుం దని, నల్ల ధనవంతులు జైలుకి వెళతారని ప్రభుత్వం వూద రగొట్టేసినపుడు భారత ఆర్థిక రాజధానిగా వున్న ముంబయిలోని ధనవంతులు, గుజరాత్‌లోని పారిశ్రామికవేత్తలు, నల్లధనానికి చిరునామాగా వుండే వివిధ నగరాలలోని సినిమా పరిశ్రమలోనివారు, షెల్ కంపెనీలకు ఆలవాలమైన కలకత్తా మార్వాడీ వ్యాపారస్తులు, దేశరాజధానిలో అవినీతిపరులైన అధికారులు, హవాలా ఆపరేటర్లు – వీరందరికీ మూడుతుందనుకున్నారు. తీరాచూస్తే ఇన్‌కమ్‌టాక్స్ దాడులకు తమిళనాడే కేంద్రంగా మారింది. అది కూడా జయలలిత అనుయాయులపై మాత్రమే! జయలలిత బతికున్నంతకాలం స్తబ్దంగా వున్న కేసులు ఆమె మరణం తర్వాతనే పురులు విప్పి శశికళను జైలుకి పంపాయి. ఆమె వర్గీయులందరూ ఏదో రకమైన కేసుల్లో ఇరుక్కో సాగారు. ధిక్కరించినవారికి బుద్ధి చెప్పాలన్న ధోరణిలో కేంద్రం, అణుస్తున్న కొద్దీ తిరగబడుతున్న ధోరణిలో శశికళ వర్గం వ్యవహరిస్తున్నాయి. ఏడీఎంకే పార్టీ రెండుగా చీలింది. ఎమ్మెల్యేలలో అధికసంఖ్యాకులు శశికళను విడిచిపెట్టకపోయినా, ఎన్నికల కమిషన్ పార్టీ ఎన్నికల గుర్తు రెండాకులను స్తంభింపచేసింది. ఆర్కేనగర్ ఉపయెన్నికలో ఇరువర్గాలు పోటీపడ్డాయి. తమిళనాడులో గతం లో జరిగిన అనేక ఎన్నికలలో ధనం ప్రవహించినా పట్టిం చుకోని ఎన్నికల కమిషన్ ఈసారి మాత్రం చురుగ్గా వ్యవహరించి, ఎన్నిక రద్దు చేసింది.
అంతేకాదు, రెండాకుల గుర్తు తమ వర్గానికి తెచ్చుకోవ డానికై దినకరన్ సుకేశ్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తి ద్వారా ఎన్నికల కమిషన్‌లోని అధికారికి రూ.50కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడంటూ కేసుపెట్టి అతన్ని, అతని సహచరుడు మల్లికార్జునను మే 15వరకు కస్టడీకై తిహా ర్ జైలుకి పంపారు. పోలీసుల వాదనలో స్పష్టంకాని అం శాలు కొన్ని వున్నాయి. ముఖ్యమైనది లంచం తీసుకోవ డానికి సిద్ధపడిన కమిషన్ ఉద్యోగి ఎవరో ఇప్పటిదాకా పోలీసులు బయటపెట్టలేదు. అతని ప్రమేయం బయట పెట్టకపోతే అది దినకరన్, సుకేశ్ మధ్య ఆర్థిక లావా దేవీగా మిగిలిపోతుంది. లంచాల కేసుల్లో పుచ్చుకోవడా నికి ప్రయత్నించినవాడి పేరు చెప్పకుండా కేసెలా పెడతారు? ఎవరైనా ఎవరికైనా లంచం ఇద్దామనుకోవచ్చు, నేను ఆ సంగతి చూసుకుంటానంటూ వేరేవారు నమ్మించి డబ్బు పుచ్చుకోవచ్చు, అంతమాత్రం చేత నేరం జరిగినట్లు కాదు కదా! ఎవరో ఒకరు లంచం తీసుకున్నట్లో, కనీసం ప్రయత్నించినట్లో ఆధారం దొరకాలి. ఇప్పటిదాకా దిల్లీ పోలీసులుకమిషన్ అధికారులను రంగంపైకి తీసుకురా లేదు.దినకరన్‌ను, అతని అనుచరుడును జైలుకిపంపారు.
దినకరన్ మధ్యవర్తిగా ఎంచుకున్న వ్యక్తి అంటూ పోలీసులు చెప్తున్న సుకేశ్ గతచరిత్రంతా నేరచరిత్రే. అది పోలీసులకు మాత్రమే కాదు, మీడియాకు కూడా తెలుసు. తనపార్టీ భవిష్యత్తును నిర్ణయించే పెద్ద వ్యవహారాన్ని నిర్వహించడానికి దినకరన్‌ను సుకేశ్‌ను ఎంచుకున్నాడంటే అతని కంటె బుద్ధిహీనుడు మరొకడు వుండడు. ఇటువంటివి ఏ రాజకీయనాయకుల ద్వారానో, ఉన్నతాధికారుల ద్వారానో చక్కబెట్టుకుందామని చూస్తారు తప్ప అందరి నోళ్లలో నానిన కిలాడీని మధ్యవర్తిగా పెట్టుకోరు. సుకేశ్ టీనేజి నుంచి మోసాలు మొదలుపెట్టాడు. తను ఫలానా నాయకుడి బంధువునంటూ చెప్పుకుని జనాలను మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ''మద్రాసు కఫే'' నటీ మణి, ప్రియురాలు లీనా మారియా పాల్‌తో కలిసి అనేక మోసాలు చేశాడు. 2013లో ఆమె పట్టుబడి ఇతని ఆచూ కీ చెప్పేసింది. అతన్ని పట్టుకుని జైలుకి పంపేనాటికి అతనిపై 50 కేసులున్నాయి. అరెస్టయ్యాక మళ్లీ బెయి లుపై బయటకు వచ్చేస్తూంటాడు. ఈసారి పోలీసులు అతన్ని అరెస్టు చేసేనాటికి ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో పది రోజులుగా నివాసముంటున్నాడు.
పోలీసులు చెప్పేదేమిటంటే – సుకేశ్ తనకు తెలిసున్న ఎన్నికల కమిషన్ అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వాల్సి వుంటుందని, ఎడ్వాన్సుగా రూ.10 కోట్లు ఇవ్వాలని దినకరన్‌కు చెప్పాడు. దినకరన్ కోచీలోని ఒక ఆపరేటర్ ద్వారా చాందినీ చౌక్‌లోని షా ఫైజర్ అనే ఒక హవాలా ఆపరేటర్‌కు, అతని ద్వారా సుకేశ్‌కు ఆ డబ్బు చెల్లిం చాడు. ఈ విషయం ఒక ఇన్‌ఫార్మర్ ద్వారా పోలీసులకు తెలిసింది. వచ్చి సుకేశ్‌ను పట్టుకుని అరెస్టు చేసి, అతని దగ్గర దొరికిన రూ.1.30 కోట్లను స్వాధీనం చేసుకు న్నారు. పోలీసులకు అతని వద్ద నుంచి పెద్దగా సమాచారం లభించలేదు. దినకరన్ వద్ద అసిస్టెంటుగా వున్న జనార్దనను సాక్షిగా చేసుకుని అతనిచ్చిన స్టేటుమెంట్ల ఆధారం గా ఇతరులను అరెస్టు చేద్దామని చూస్తున్నారట. సుకేశ్‌కు, దినకరన్‌కు మధ్య ఫోను సంభాషణలు జరిగాయని చెపుతున్న పోలీసులు ఆ మేరకు ఆధారాలను కోర్టుకి సమర్పించలేకపోవడంతో ఏప్రిల్ నెలాఖరులో కోర్టు పోలీసులకు అక్షింతలు వేసింది. పోలీసులు దినకరన్‌కు చెందిన ఐదు ఖాతాలను పరిశీలిస్తున్నారు. అతని ఆడిటరును పిలిపిస్తున్నారు. ఈ లంచం కేసు నిలవకపోతే కనీసం మనీ లాండరింగ్ (నల్లధనాన్ని తెల్లగా మార్చే పని) కేసైనా నిలుస్తుందని పోలీసుల ఆశ. ఎన్నికల కమిషన్‌లో గుర్తు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించగలిగిన స్థాయి అధికారి లంచం పుచ్చుకోవడానికి అంగీకరించాడని చూపితే తప్ప పోలీసుల వాదనకు బలం చిక్కదు. మరి దిల్లీ పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియటం లేదు.
అలాగే తమిళనాడు పోలీసులు కూడా! నీలగిరి జిల్లాలో జయలలితకు, శశికళ చెందిన కొడనాడు గెస్ట్ హౌస్‌లో ఏప్రిల్ 24 తెల్లవారుఝామున దొంగతనం జరిగింది. దొంగతనానికి వచ్చినవారు నేపాలీ సెక్యూరిటీ గార్డును చంపేశారు. తక్కిన 10మంది సెక్యూరిటీ గార్డులలో ఇంకో అతన్ని గాయపరిచారు. పోలీసుల కథనం ప్రకారం – 10, 11మంది సభ్యులున్న దొంగల ముఠా రెండు, మూడు వాహనాల్లో వచ్చింది. వాళ్లు కొన్ని వాచీలు, ఒక క్రిస్టల్ షో పీస్ మాత్రం దొంగిలించారు. కొన్ని సూటు కేసులు తెరిచివున్నాయి. అవి ఖాళీగా వున్నాయి. గెస్టు హౌస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కోటగిరి పట్టణంలో వున్న సీసీటీవీ కెమెరాల్లో పడిన వాహనాల ఫోటోల ఆధారంగా శశికళకు 2008 నుంచి ఐదేళ్లు డ్రైవర్‌గా పనిచేసిన కనకరాజ్ అనే అతనే దాడిలో పాల్గొన్నట్లు తేలింది. అతను ముఖ్యమంత్రి పళనిస్వామి వూరివాడే. అతనికి దూరపు బంధువు కూడా, అయితే రెండు కుటుంబాలకు అస్సలు పడదు. శశికళ వద్ద పనిచేసే రోజుల్లో ఆమె వద్ద తన పలుకుబడి ఉపయోగించి, తన సోదరుడు ధనపాల్‌ను పళనిస్వామి స్థానంలో తేవడానికి ప్రయత్నించాడు. దాంతో పళనిస్వామి గొడవ చేసి ధనపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరింప చేశాడు. శశికళ వద్ద పనిమానేశాక కనక రాజ్ కోయంబత్తూరులో ఒక బేకరీలో పనిచేస్తూ తనతో పాటు పనిచేసే కెవి సాయన్ అలియాస్ శ్యామ్ అనే అతనితో కలిసి దోపిడీకి ప్లాను చేశాడు. సాయన్‌కు తెలిసున్న కొందరు కేరళీయులు గ్యాంగ్‌లో చేరారు. మొత్తమంతా కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తర్వాత మాయమయ్యారు. దాడిలో పాల్గొన్న ఆరుగుర్ని అదు పులోకి తీసుకోవడం జరిగింది.
ప్రధాన నిందితుడైన కనకరాజ్ ఏప్రిల్ 28రాత్రి సేలంలో అత్తూరు హైవే మీద తన సోదరి ఇంటికి మోటా ర్‌సైకిల్‌పై వెళుతూండగా ఒక కారు వచ్చి గుద్దేసి, చచ్చి పోయాడు. 6గంటల తర్వాత సహనిందితుడు సాయన్ కేరళలోని పాలక్కాడ్‌లో భార్య, ఐదేళ్ల కూతురుతో సహా కారులో వెళుతూ ఆగి వున్న ట్రక్‌ను గుద్దేశాడు. భార్య, కూతురు వెంటనే చనిపోగా అతనికి తీవ్రమైన గాయాలు తగిలి కోయంబత్తూరు ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ చేయడానికి ముందు మేజిస్ట్రేటు అతని స్టేటుమెంటు రికార్డు చేశాడు. అతని కారు రిజిస్ట్రేషన్ నెంబరు కూడా బోగస్సే. అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆగి వున్న ట్రక్‌ను గుద్దాడని పోలీసుల సందేహం. ఈ రెండు సంఘటనల తర్వాత పోలీసుల కథనాన్ని అందరూ శంకించసాగారు. కనకరాజ్ భార్య ''దోపిడీ రోజు రాత్రి నా భర్త చెన్నయ్‌లో మా ఇంట్లోనే వున్నాడు. ఏప్రిల్ 27న మాత్రమే వాళ్ల ఊరికి బయలుదేరాడు. పోలీసులకు ఆయన మీద అనుమానం వుంటే ఆ రెండు రోజుల్లో మా ఇంటికి వచ్చి విచారణ చేసి వుండాల్సింది. కానీ వాళ్లు రానేలేదు.'' అంటోంది. ఇంకో తమాషా అంశమేమిటంటే -10 మంది వచ్చి దోపిడీ చేసిన సామానులు పట్టుకు న్నాం అంటూ పోలీసులు చూపించిన వాచీలు డయల్ మీద జయలలిత బొమ్మ ముద్రించి వున్న చవకరకం వాచీలు. పార్టీ ఫంక్షన్లలో పంచిపెట్టే వాచీలవి. ఏ ఏడీ ఎంకే కార్యకర్త ఇంట్లోనైనా వుంటాయి తప్ప అత్యంత ధనికురాలైన జయలలిత ఇంట్లో వుండదగ్గవి కావు.
ఇదంతా గందరగోళంగా వుంది. కొందరి అనుమానం ఏమిటంటే – ఆ గెస్ట్‌హౌస్‌లో జయలలితకు, శశికళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు వున్నాయి. బహుశా జయలలిత విల్లు కూడా అక్కడే వుంది. సుప్రీంకోర్టు అదేశాల మేరకు గెస్ట్‌హౌస్ కోర్టు స్వాధీనంలో వుంది. దినకరన్‌ను అరెస్టు చేశాక దిల్లీ పోలీసులు ఆ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి ఆ పత్రాలు స్వాధీనం చేసుకుంటే శశికళ, దినకరన్ మరింత ఇబ్బందుల్లో పడతారు. కోర్టు స్వాధీనంలో వుంది కాబట్టి బాహాటంగా వెళ్లి తీసుకుని వచ్చే వెసులు బాటు లేదు. అందువలన ఆమె బంధువులు ఆ ఇంటి ఆనుపానులు బాగా తెలిసున్నవారిని అక్కడకు పంపించి సూటుకేసుల్లో వున్న పత్రాలను తెప్పించుకుని దానికి దోపిడీ రంగు పులిమారు. శశికళ డ్రైవర్‌గా కనకరాజ్‌కు ఆ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువుందో బాగా తెలుసు. అందు వలన అతన్ని పంపి వుండవచ్చు. ఆ గెస్ట్‌హౌస్‌లో వున్న 1400 కెమెరాలు ఇప్పుడు పనిచేయకపోవడం వింతగా వుంది. కనకరాజ్, సాయన్ యాక్సిడెంట్ల తర్వాత పోలీసులు ఆధారాలు దొరకలేదంటూ కేసు మూసివేసే ఛాన్సు లేకపోలేదు.
800 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న టీ ఎస్టేటులోని కొడనాడ్ గెస్ట్‌హౌస్‌కు చరిత్ర వుంది. దాని సొంతదారు పీటరు గ్రేస్ జోన్స్ అనే ఇంగ్లీషు వ్యక్తి. దాన్ని మేన్‌టేన్ చేయలే రూ.3.5 కోట్ల అప్పు పడ్డాడు. 1991 నుంచి 1996 వరకు ముఖ్యమంత్రిగా వున్న జయలలితకు శశికళ దాని గురించి చెప్పింది. జయలలితకు సన్నిహితుడైన లిక్కర్ బేరన్, మెడికల్ కాలేజీ అధిపతి రామస్వామి ఉడయార్ కోడలు రాధా వెంకటాచలం ఆ ఎస్టేటును జోన్స్ నుండి రూ. 7.5కోట్లకు కొని, జయలలిత, శశికళ, ఇళవ రసి భాగస్వాములుగా వున్న కంపెనీకి 1992లో అదే ధరకు అమ్మింది. దీనికి గాను రాధ తండ్రి కృష్ణమూర్తిని జయలలిత అడ్వకేట్ జనరల్‌గా నియమించింది. ఎస్టేటు తన చేతికి వచ్చాక జయలలిత దానిలో ఒక పెద్ద శ్వేతసౌ ధాన్ని నిర్మించింది. అక్కడ సకల సౌకర్యాలు అమర్చింది. ఎందుకంటే ఏడాదిలో మూణ్నెళ్లపాటు ప్రభుత్వాన్ని అక్కడి నుంచే నిర్వహించేదామె. ప్రతిపక్షంలో వుండగా ఆరేసి నెలలు వుండేది. 150మంది పనివారున్నారు. జయలలిత ఆస్తిపాస్తులకు, రాజకీయాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలు అక్కడ వుండడంలో ఆశ్చర్యం లేదు.
అంత పెద్ద ఇంట్లో ఏవి వుండాలో, ఏమి మిగిలాయో తేల్చుకోకుండానే వాచీలు, ఒక షో పీస్ మాత్రమే పోయాయని పోలీసులు చెప్పడమేమిటి? క్రైమ్ బ్రాంచ్-సిఐడి విచారణ జరపాలన్న డిమాండ్ వచ్చినపుడు రాష్ట్ర పోలీసు చీఫ్ రాజేంద్రన్ దాన్ని తిరస్కరించారు. సీబీఐకి అప్పగించిన మాత్రాన మిస్టరీ విడిపోతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు కంటెయినర్ ట్రక్కులు రూ.570 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డాయి. మద్రాసు హైకోర్టుకేసు సీబీఐకి అప్పగించింది. పదినెలల తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం మినహా ఆ కేసు ముందుకు సాగలేదు. కేంద్ర పోలీసులు కానీ, తమిళనాడు పోలీసులు కానీ అసమర్థులని ఎవరూ అనలేరు. పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వారిని విని యోగించుకుంటూన్నంతకాలం వారి పనితీరు ఇలాగే అఘోరిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]