ఎమ్బీయస్‌ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 1

కాస్సేపట్లో మంత్రుల ముఠా ఆఖరి సమావేశం జరుగుతోంది. వివరాలు వాళ్లు బయటకు చెపితే రాయల తెలంగాణ ప్రతిపాదన వుందో లేదో కచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే లీకులే గతి. నిన్న, ఇవాళ్టి పేపర్లు, టీవీ ఛానెళ్లు…

కాస్సేపట్లో మంత్రుల ముఠా ఆఖరి సమావేశం జరుగుతోంది. వివరాలు వాళ్లు బయటకు చెపితే రాయల తెలంగాణ ప్రతిపాదన వుందో లేదో కచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే లీకులే గతి. నిన్న, ఇవాళ్టి పేపర్లు, టీవీ ఛానెళ్లు చూస్తే రాయల తెలంగాణ ఐడియాను సోనియా ఆమోదించారనే తెలుస్తోంది. ఈ విషయంలో తెలుగు మీడియాను నమ్మలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంగ్లీషు ఛానెళ్లు పెట్టి చూశా. ఎన్‌డిటివి, హెడ్‌లైన్స్‌ టుడే వంటివి కూడా నిర్ధారించాయి. వాళ్లు 'బిగ్గర్‌ తెలంగాణ' అంటున్నారు. '20% అధికం, అదే ధరకు..' అన్న స్లోగన్‌తో టూత్‌పేస్టు, షాంపూలాటివి అప్పుడప్పుడు అమ్ముతూ వుంటారు చూశారా, అలాగ, '10 జిల్లాల కోసం అడిగితే 20% కలిపి 12 జిల్లాలు.. అదే ఉద్యమానికి' అన్నట్టు తెలంగాణకు ఆఫర్‌ చేస్తున్నారు.

దీనివలన ఆంధ్రప్రదేశ్‌ సరిగ్గా సగానికి తెగుతుందట. అదో పెద్ద పాయింటా? అనుకోవద్దు. రెండు రాష్ట్రాలూ సమానంగా వుంటే ఎవరు అన్న, ఎవరు తమ్ముడు అనే వివాదం రాదు. మొన్నటిదాకా టి-ఉద్యమకారులు 'ఆంధ్రులు పెద్దన్నల్లా వ్యవహరిస్తున్నారు' అంటూ వుండేవారు, సంఖ్యాపరంగా అక్కడ ఎక్కువ స్థానాలు, జిల్లాలు వుండేవి కాబట్టి. జులై 30 ప్రకటన తర్వాత యింకో నినాదం విన్నాను – 'ఆంధ్రోడు తమ్ముడే, అడ్డొస్తే మాత్రం తన్నుడే!' అని. పంచ్‌ బాగుంది కానీ అన్నగారు హఠాత్తుగా తమ్ముడెలా అయిపోయాడు – ప్రాసకోసం కాకపోతే! అనుకున్నాను. ఇలా సగానికి విడగొడితే అలాటి సందేహాలు రావు.

కాంగ్రెసు తెలంగాణ యిచ్చింది కాబట్టి ఎన్నికలలో లబ్ధి పొందుతుంది అని టి-కాంగ్రెసు నాయకులు అంటూ వచ్చారు. 'అవునవును తెలంగాణ యిస్తే వాళ్లకు ఎదురు వుండదు' అంటూ ఊరిస్తూ వచ్చిన టి-వాదులు జులై 30 ప్రకటన వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. 'ఈ ఇచ్చేదేదో నాలుగేళ్లకు ముందే యివ్వాల్సింది. ఇప్పుడు వెయ్యిమంది ప్రాణాలు బలిగొన్న తర్వాత యిస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? సోనియాకు గుడి కట్టాలంటే ఆ వెయ్యిమంది సమాధుల మధ్య కట్టండి.' అనసాగారు. ఆలస్యానికి తప్పుపడుతున్న ప్రజలను ఊరడించడానికి, నష్టపరిహారంగా యింకో రెండు జిల్లాలు కలిపి సోనియా యిస్తోంది అనుకోవచ్చుగా!  జానపద చిత్రాలలో రాజుగారు అసాధ్యమైన పనిని చేసిన సాహసికి యువరాణిని యిచ్చి పెళ్లి చేయడంతో బాటు, అర్ధరాజ్యం కూడా యిచ్చేవారు. ఒక్కోప్పుడు యిద్దరు కూతుళ్లుంటే యిద్దర్నీ యిచ్చి పెళ్లి చేసేవారు. ఇద్దరు భార్యలతో సహా సింహాసనం ముందు నిలబడి హీరో ప్రేక్షకులకు నమస్కారం పెడుతూ వుంటే 'శుభం' అని వచ్చేది. అలాగ యిప్పుడు టి- ఉద్యమకారుల పోరాటస్ఫూర్తిని మెచ్చి సోనియా తెలంగాణ కన్యతోబాటు, రాయలసీమ (సగమే అనుకోండి) కన్యను కూడా కట్టబెట్టింది అనుకోవచ్చు.

భగవాన్‌ చాహేతో ఛత్‌ ఫాడ్‌కే దేతా హై అని సామెత. నాకేం అక్కరలేదనుకుని తలుపులు బిడాయించుకుని కూర్చున్నా, యింటి కప్పు పగలగొట్టి దేవుడు ఆకాశం నుండి మండువాలో పడేస్తాడు. తెలంగాణ దేవతగా కీర్తించబడుతున్న సోనియా దేవత  తెలంగాణ చాలు అంటున్నా పై నుంచి రాయలసీమ కూడా పడేసింది – పండగ చేస్కోండి అని. సేర్‌ కో సవా సేర్‌ మిల్‌నా అంటారు హిందీలో – ఎవడైనా గట్టివాడికి వాడి కంటె ఇంకో నాలుగాకులు ఎక్కువ చదివినవాడు (సవా సేర్‌ అంటే శేరుంపావు అని అర్థం) ఎదురైతే యిది వుపయోగిస్తారు. ఇప్పుడు తెలంగాణ సేర్‌ అనుకుంటే రాయల తెలంగాణ సవాసేర్‌ అనవచ్చు (20% పెరిగింది కాబట్టి). టి-ఉద్యమం వాళ్లు సేర్‌ అడిగితే సోనియా సవాసేరు ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.

లెక్కప్రకారం ఉద్యమకారులు దీనికి సంతోషించాలి కానీ అదేమిటో మండిపడుతున్నారు. మొన్నటిదాకా చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన జయపాల్‌ రెడ్డిగారు నిన్నటినుండి మొహం వేళ్లాడేశారు. ఇన్నాళ్లూ ఆయన ముసుగువీరుడు. జులై 30 ప్రకటన తర్వాత మీడియా ముందుకు పదేపదే వచ్చి శీతాకాల సమావేశాల్లో టి-బిల్లు రావడం, జనవరిలో తెలంగాణ ఏర్పడడం ఖాయం అని ధాటీగా చెపుతూ తెగ తిరిగారు. అంతేకాదు, అసలు నేను తెలంగాణకోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ క్రెడిట్‌ కొట్టేద్దామని చూశారు కూడా. నిజానికి తెలంగాణ అంశం యీ స్థాయిదాకా రావడానికి కారణం నిశ్చయంగా కెసియారే. కాంగ్రెస్‌ అంతఃకలహాల వలన ఆయన విజయం సాధించాడన్నది వేరే విషయం. కానీ తెలంగాణ కోసం పోరాటం సాగుతోంది అని చూపించడానికైనా ఒకరు ఆ జండా పట్టుకుని తిరగాలి కదా, ఆ పని కెసియారే చేశారు. తెలంగాణ జాతిపిత కెసియారే అని డా|| శ్రవణ్‌ ప్రకటించారు. ఇప్పుడు జయపాల్‌ ఆ జాతిపిత బిరుదు కొట్టేయాలని చూస్తున్నారు. తన కాబినెట్‌ సహచరులను గొప్పగా యింప్రెస్‌ చేశానని, సీమాంధ్ర మంత్రులను చవటలను చేశానని ఆయన మురియడం, విజయగర్వాన్ని ప్రదర్శించడం కనబడింది.

రెండు రోజుల క్రితం 'హైదరాబాదుపై పరిమిత ఆంక్షలు వుంటాయి సుమా' అని ముఠా సభ్యులు ఒక సూచన చేశారాయనకు. దాన్ని మీ వాళ్లను మానసికంగా సిద్ధం చేయండి అని కూడా చెప్పి వుంటారు. అందుకే ఆయన 'హైదరాబాదుపై పరిమిత ఆంక్షలు పెట్టడానికి కూడా రాజ్యాంగ సవరణ అక్కరలేదు' అంటూ పరోక్షంగా ఆంక్షల గురించి చెప్పారు. 'ఆయన దృష్టిలో పరిమితమైనవి, మన దృష్టిలో అపరిమితమైనవేమో' అని టి-ఉద్యమకారులు ఉగ్గబట్టుకుని చూస్తున్నారు. అంతలో యిప్పుడు రాయల తెలంగాణ మాట బయటకు వచ్చింది. ఇది జయపాల్‌కు కూడా తెలిసినట్టు లేదు. ముఠా వాళ్లు ఆయనకు కూడా జెల్లకాయ కొట్టినట్టున్నారు. 'బిల్లు అంతిమదశ లో యీ ప్రస్తావన, ప్రతిపాదన అనవసరం' అంటున్నారు జయపాల్‌.

ఇది అంతిమ దశ  అని ఆయన ఎలా అనగలరు? సుప్రీం కోర్టు వాళ్లేమంటున్నారు? 'ఇప్పటిదాకా ఏం జరిగింది కనుక? అన్నీ ప్రతిపాదనలే కదా' అంటున్నారు. కాబినెట్‌ తీర్మానం చేయాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, పార్లమెంటుకి బిల్లు రావాలి, సవరణలు చేయాలి.. అని చేంతాడంత జాబితా చదివారు. మరి జయపాల్‌గారి కంటికి యివేమీ కనబడటం లేదు. అప్పుడే తెలంగాణ వచ్చేసినట్టు, దానికి ముఖ్యమంత్రిగా వుండమని అధిష్టానం ఆయనను బతిమాలుతున్నట్టు కొన్ని దృశ్యాలు ఆయన కళ్లముందు కదలాడుతున్నాయి. మధ్యలో రాయల తెలంగాణ పీడకల రావడంతో ఆయనకు మెలకువ వచ్చేసింది. అధిష్టానం సీమాంధ్ర మంత్రులను వెర్రివాళ్లను చేసి ఆడుకుంది కానీ నాతో అలా జరగదు అనే నమ్మకంతో వుండి వుంటారు. ఇప్పుడు ఆయనా గతుక్కుమన్నారు. ఎందుకంటే 'ఓహో ఇన్నాళ్లూ తెలంగాణ కోసం లాబీయింగ్‌ చేసి విజయం సాధించామన్నావు, దీనికోసమా? సీమాంధ్ర మంత్రుల్లా నువ్వూ అధిష్టానంతో లాలూచీ పడ్డావా?' అని టి-ఉద్యమకారులు నిలదీసే ప్రమాదం వుంది. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

mbsprasad@gmail.com