ఎమ్బీయస్‍: మొజార్ట్ మరణం ఒక మిస్టరీ!

మొజార్ట్‌ చావుకి కారకుడయ్యాడనే మాట చాలా ప్రబలంగా వినబడడంతో దాని ఆధారంగా కొన్ని కళారూపాలు తయారయ్యాయి.

కె.విశ్వనాథ్ తీసిన “స్వాతికిరణం” (1992) సినిమాలో తన కంటే ప్రజ్ఞావంతుడైన శిష్యుణ్ణి చూసి గురువు అసూయపడితే అది ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో చూపబడింది. మన వాతావరణంలో గురువును తండ్రిగా, దేవుడిగా భావిస్తాం కాబట్టి గురువు ఆ విధంగా ప్రవర్తించడం మన ప్రేక్షకులకు మింగుడు పడలేదు. అసలు అటువంటి గురువులు ఉంటారని ఊహించడం కూడా కష్టం మనకు. కానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంగీతకారుడు ఎమడేయాస్ మొజార్ట్ (1756-91) విషయంలో అటువంటిదే జరిగిందనే విషయం ప్రచారంలోకి వచ్చింది.

ఎవరీ మొజార్ట్? పాశ్చాత్య సంగీత ప్రపంచంలో ధృవతార అనదగినవాడు మొజార్ట్. 269 సంవత్సరాల క్రితం జనవరి 27న పుట్టాడు. ఇంకొక ప్రముఖ సంగీతకారుడు బీతోవెన్ ఇతనికి నేరుగా శిష్యుడు కాదు కానీ యితని వలన ప్రేరణ పొందినవాడు. 35 సంవత్సరాల అల్పాయుర్దాయంలోనే 626 కంపోజిషన్స్ (వాటిలో 50 సింఫనీలు, 19 ఓప్‌రాలు) చేసి, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన మొజార్ట్, క్లాసికల్ వెస్టర్న్ మ్యూజిక్ అభిమానులెవరూ మరిచిపోలేని వ్యక్తి. ఆయన కంపోజ్ చేసిన మ్యూజికల్ పీసెస్ ఎన్నో ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. మొజార్ట్ జన్మించిన సాల్జ్‌బర్గ్ (ఆస్ట్రియా దేశం)లో అతని పేర ప్రతీ ఏటా వారం రోజుల పాటు సంగీతోత్సవాలు జరుపుతారు. అతను పుట్టిన ఇంటిని నేషనల్ మ్యూజియంగా మార్చారు. సిటీలో ముఖ్యమైన సెంటర్‌కు మొజార్ట్ స్క్వేర్ అని పేరు పెట్టారు.

మొజార్ట్ ఆరేళ్లకే ప్రాడిజీ అనిపించుకున్నాడు. ఆ వయస్సులో వయొలిన్, ఆర్గన్, క్లావియర్ ఉపయోగించి అతను చేసిన 5 పియానో పీసెస్ ఇప్పటికి కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అతని తండ్రి లియోపోల్డ్ మొజార్ట్ సాల్జ్‌బర్గ్ ఆస్థానంలో కంపోజర్. తండ్రి వద్ద తొలివిద్య అభ్యసించిన మొజార్ట్ తండ్రితో బాటు యూరోప్ అంతా తిరిగి ఆయన కచ్చేరీలలో పాల్గొనేవాడు. 13వ యేట అతన్ని సాల్జ్‌బర్గ్ ఆస్థానంలో కాన్సర్ట్ మాస్టర్‌గా ఉద్యోగం వరించింది. ఇటలీలోని మిలాన్‌లో పోప్ చేతుల మీదుగా షెవలియార్ అనే బిరుదుతో గౌరవం, ఒక ఓప్‌రా రాసే పని అతనికి దక్కాయి. 14 యేళ్ల వయసులో అత్యద్భుతంగా ఆ ఓప్‌రాను తయారు చేసినందుకు అతనికి అఖండ సన్మానం జరిగింది. అప్పుడే మొజార్ట్ సొంత ఊరికి తిరిగిరావడం, అలంకారంగా పదవి లభించినా ధనం దొరక్క భంగపడి వెళ్లిపోవడం జరిగాయి.

యూరోప్ రాజాస్థానాలు ఈ 21 ఏళ్ల సంగీతజ్ఞుణ్ణి నిరాదరించాయి. మంచి ఉద్యోగం కోసం వెతుకుతూనే అలోసియా వెబర్ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. కానీ తండ్రి వ్యతిరేకించడంతో పెళ్లాడలేదు. నిజానికి తండ్రి మాట జవదాటడానికి మొజార్ట్ భయపడేవాడు. అలోసియా ఒక నటుణ్ని పెళ్లాడింది. ఐదేళ్ల తర్వాత మొజార్ట్ అలోసియా చెల్లెలు కాన్స్‌టాంజ్‌ను ప్రేమించాడు. కానీ తండ్రి దీనికీ ఓ పట్టాన అంగీకరించక పోవడంతో కొన్నాళ్లు ఆమెతో సహజీవనం చేసి, చివరకు 1782 ఆగస్టులో పెళ్లాడాడు. చివరకు తండ్రి ఒప్పుకున్నాడు. వారికి ఆరుగురు పిల్లలు పుడితే యిద్దరే బతికి బట్టకట్టారు.

వృత్తిపరంగా యీ ఐదేళ్లలో రాజుల మన్ననలు పొందడాలు, రాజాస్థానాల కుట్రలతో విసిగి బయటకు నడవడాలూ కూడా జరిగింది. ఆరోగ్యం దెబ్బతింది. దారిద్ర్యం చుట్టుముట్టింది. అతని ఓప్‌రాలు ప్రదర్శించినవారు పారితోషికం ఇచ్చేవారు కారు. “ది మాజిక్ ఫ్లూట్” అనే మ్యూజికల్ పీస్ తయారుచేస్తూండగా ఒక అజ్ఞాత వ్యక్తి అతని వద్దకు వచ్చి ఒక ‘రెక్వియెమ్’ (అంత్యక్రియల్లో పాడే పాట) తనకై చేసిపెట్టమని అడిగేడు. దాన్ని ‘న భూతో న భవిష్యతి’ స్థాయిలో చేసే ప్రయత్నంలో అతను అసలే అంతంతమాత్రంగా తన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసుకున్నాడు. డిసెంబరు 5, 1791 న మొజార్ట్ టైఫాయిడ్‌తో మరణించాడని అధికారికంగా ప్రకటించినా అతని చావుకు సాటి సంగీతకారుడు సెలియేరీయే కారకుడని పుకార్లు వచ్చాయి.

తన కంటె ఆరేళ్లు పెద్దవాడు, ఇటలీ దేశస్తుడు ఐన ఏన్టోనియో సెలియేరీతో మొజార్ట్‌కు పరిచయం ఏర్పడింది రాజాస్థానాలలోనే! తను యితనికి గురువు కాదు కానీ సీనియరు. సెలియేరీ మంచి పండితుడు. ప్రజ్ఞాశాలి. బీతోవెన్ గురువులలో ఒకడు. పాండిత్యంతో బాటు రాజదర్బారులలో ఎలా ప్రాపు సంపాదించాలో, ఎలా నిలబెట్టుకోవాలో తెలిసినవాడు. వియన్నా రాజాస్థానంలో ఆస్థాన సంగీతకర్తగా ఉన్నాడు. తనకన్నా చిన్నవాడు, ఓ పల్లెటూరి కుర్రాడు అయిన మొజార్ట్ తనను మించిన ఖ్యాతి గడించడం సహించలేక పోయాడని, స్పర్ధతో రగిలి పోయేవాడని అంటారు. అతనే మొజార్ట్‌ చావుకి కారకుడయ్యాడనే మాట చాలా ప్రబలంగా వినబడడంతో దాని ఆధారంగా కొన్ని కళారూపాలు తయారయ్యాయి.

మొజార్ట్, సెలియేరీల వైరం ఆధారంగా రష్యన్ కంపోజర్ నికొలాయ్ కోర్సకోవ్ 1898లో “మొజార్ట్ ఎట్ సెలియేరీ” అనే ఓప్‌రాను కూర్చాడు. దానిని అలెగ్జాండర్ పుష్కిన్ రష్యన్ డ్రామాగా మలిస్తే, బ్రిటిష్ నాటకకర్త పీటర్ షాఫర్ ఆంగ్లనాటకంగా తయారుచేసాడు. దాని పేరు “ఎమడేయాస్”. (మొజార్ట్ పూర్తి పేరు ఉల్ఫ్‌గాంగ్ ఎమడేయాస్ మొజార్ట్) అదే పేరుతో 1984లో ఒక ఇంగ్లీషు సినిమా తయారయి (https://www.youtube.com/watch?v=r7kWQj9FCGY) అనేక ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. సెలియరీ మతిస్థిమితం పోగొట్టుకుని, శానిటోరియంలో చేరి, అక్కడ ఒక క్రైస్తవ ఫాదిరీ ఎదుట తన తప్పులు ఒప్పుకుంటూ గతాన్ని వివరించినట్లు సినిమా తీశారు. ‘‘స్వాతికిరణం’’ కూడా గురువు పశ్చాత్తాప భారంతో మతిభ్రష్టుడు కావడంతో ప్రారంభమౌ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతుంది. అందుకే రెండిటికి పోలిక కనబడింది.

‘‘ఎమడేయాస్’’లో సెలియరీ కన్ఫెషన్ యిలా సాగుతుంది – ‘మొజార్ట్ చైల్డ్ ప్రాడిజీ అని వినగానే, నా కంటె వాణ్ని ఎందుకు ప్రతిభావంతుడిగా సృజించావంటూ దేవుడితో పేచీ పెట్టుకున్నాను. మొజార్ట్ అంత ఖ్యాతి నాకు తెప్పిస్తే నీకు సదా విధేయుడిగా ఉంటానని దేవుడికి మాట యిచ్చాను. 1774 నాటికి వియన్నా ఆస్థాన గాయకుణ్ని అయ్యాను. కానీ నేను రూపొందించినవి గొప్ప కంపోజిషన్స్ కావని నాకు తెలుస్తూనే ఉంది. మొజార్ట్‌ని తొలిసారి కలిసినప్పుడు అతనెంత అనాగరికుడో, పరిపక్వత లేనివాడో తెలిసింది. అలాటివాడికి ఆశువుగా సంగీతపరికల్పన చేసే శక్తిని యిచ్చినందుకు దేవుడితో వైరం పూనాను. ఆ పగ తీర్చుకోవడానికి మొజార్ట్‌ని నాశనం చేయడానికి సమకట్టాను.

‘‘మొజార్ట్ ‘‘మాజిక్ ఫ్లూట్’’ అనే ఓప్‌రాను సామాన్య ప్రజల కోసం రూపొందిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది నాకు. మొజార్ట్‌కు తండ్రి పట్ల ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ‘మీ నాన్న ఆత్మయే నిన్ను ‘‘రెక్వియమ్’’ చేయమని శాసిస్తోంది.’ అని చెప్పాను. మానసిక స్థయిర్యం చెదిరిన మొజార్ట్ వెంటనే అది నమ్మి దానిపై పని ప్రారంభించాడు. అది పూర్తి కాగానే నేను మొజార్ట్‌ని చంపేసి, ఆ రిక్వియమ్‌ను నా దానిగా ప్రకటించుకుంటూ మొజార్ట్ అంత్యక్రియల్లో దాన్ని వాయించి పేరు తెచ్చుకుందా మనుకున్నాను. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మొజార్ట్ ‘‘మాజిక్ ఫ్లూట్’’, ‘‘రెక్వియమ్’’ రెండూ చేయడంలో పూర్తిగా అలసి పోయాడు. నేను మొజార్ట శయ్య చెంతనే ఉంటూ ‘‘రెక్వియమ్’’ డిక్టేషన్ తీసుకున్నాను. ఆ క్రమంలో అతను నాకంటె నిశ్చయంగా గొప్పవాడని నాకు రూఢి అయింది. నా దురుద్దేశాలు ఏమీ తెలియని మొజార్ట్ నన్ను స్నేహితుడిగానే భావించాడు.

‘‘రిక్వియమ్’’ పూర్తి చేస్తూనే మొజార్ట్ మరణించాడు. నేను దాన్ని పట్టుకుని బయటకు వచ్చేయబోతూ ఉండగానే అతని భార్య వచ్చి నా దగ్గర్నుంచి లాక్కుంది. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న మొజార్ట్‌కి ఒక సామాన్యుడిగానే అంత్యక్రియలు జరిగాయి.’ ఇలా సెలియేరీ చెప్పిన కన్ఫెషనంతా విన్న ఫాదర్ నీ పాపాలను క్షమార్హమైనవి కావు అని డిక్లేర్ చేస్తాడు. ఒక పర్టిక్యులర్ సంగీతరూపకాన్ని తయారు చేయడమనేది ‘‘స్వాతికిరణం’’లో కూడా కనబడుతుంది. ఎటొచ్చీ మమ్ముట్టి గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉన్నదాన్ని కావాలని యీసడిస్తూ శిష్యుడు నైతిక స్థయిర్యాన్ని చెడగొడుతూ, చివరకు దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు.

శిష్యుణ్ని యీసడించడమనే అంశం ‘‘సుర్’’ (2002) హిందీ సినిమా నిర్మాతలను ఆకర్షించింది. దానిలో లక్కీ ఆలీ అసూయాగ్రస్తుడైన గురువుగా వేశాడు. విక్రమ్ అనే గాయకుడు మ్యూజిక్ స్కూల్లో టీచరుగా పని చేస్తూ అనేక మంది యువ గాయనీగాయకులను స్టార్స్‌గా తీర్చిదిద్దుతూ ఉంటాడు. టినా (గౌరీ కార్నిక్) అనే అమ్మాయి తారసిల్లితే ఆమెను తన స్టూడెంటుగా చేర్చుకుని అద్భుతమైన గాయనిగా తయారు చేశాడు. అతని కల నెరవేరింది కానీ ఆ క్రమంలో అతనికి ఆమె తనకంటె ఎక్కువ ప్రతిభావంతురాలని తెలిసి వచ్చి అసూయకు లోనయ్యాడు.

ఇక ఆ పై ఆమెతో పోటీ ఫీలవుతూ, ఆమెలో తప్పులు పడుతూ, ఆమె ఆత్మవిశ్వాసాన్ని చెదరగొట్టి, డామినేట్ చేయాలని చూశాడు. కొంతకాలానికి అంతర్మథనంతో తన తప్పు తెలుసుకుని, తను పాడవలసిన కచ్చేరీలో ఆమె చేత పాడించాడు. కచ్చేరీ విజయవంతమైంది. టీనా విక్రమ్ యింటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపి, తన ప్రేమ వ్యక్తపరిచి పెళ్లి చేసుకుందామని, కలిసి యుగళగీతాలు పాడదామని అంది. కానీ విక్రమ్ నిరాకరించాడు. నువ్వు విడిగానే ఎదగగలవు. అంతటి టాలెంటు ఉంది నీకు అని ప్రోత్సహించి పంపించి వేశాడు.

కల్పనల మాట అలా వుంచితే మొజార్ట్ చావుకి అసలు కారణం ఏమిటి అన్న ప్రశ్న సంగీతప్రియులను ఇంకా వేటాడుతూనే ఉంది. అతను మరణించగానే మొట్టమొదట వచ్చిన పుకారు – సెలియేరీ స్లో పాయిజినింగ్ ద్వారా మొజార్ట్‌ని చంపేశాడని! ఈ పుకార్లకు కారణం మొజార్ట్ భార్య అంటారు. దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న ఆమె మొజార్ట్ మరణానంతరం వెల్లువెత్తిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె, ఆమె రెండో భర్త నికొలస్ నిస్సెస్ కలిసి మొజార్ట్ స్మృతులతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. దాంట్లో ఇలాటి పుకార్లకు అవకాశాన్నిచ్చారు. 1823లో, అంటే మొజార్ట్ మరణించిన 32 ఏళ్ళకు, సెలియేరీ పియానిస్టు మోషెలెస్కీ ఇంటర్వ్యూ ఇస్తూ – తను మొజార్ట్‌కి విషప్రయోగం చేయలేదని స్పష్టం చేశాడు. 2001లో వెలువడిన కొత్త పరిశోధనల ప్రకారం మొజార్ట్ చావుకి అసలు కారణం, విషపూరితమైన కుక్కగొడుగులు తినడమేనట! అసలే అతను అర్భకంగా, పీలగా ఉండేవాడట. అది ప్రాణాంతకమైందట. ఇప్పటికీ అతని మరణం గురించిన ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. వాస్తవాల మాట ఎలా ఉన్నా, ఇద్దరు ప్రజ్ఞావంతుల మధ్య స్పర్థ కాల్పనిక కథలకు, సినిమాలకు మంచి ముడిసరుకు అయింది. (చిత్రం – మొజార్ట్, ‘‘స్వాతికిరణం’’లో ముఖ్య పాత్రధారులు)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2025)

13 Replies to “ఎమ్బీయస్‍: మొజార్ట్ మరణం ఒక మిస్టరీ!”

  1. స్వాతి కిరణం చాలా మంచి సినిమా, కాని మన గొర్రెలకి అర్ధం కాలేదు అనుకుంటా సరిగ్గా. మమ్ముట్టి సటిల్ expressions తో చాలా బాగా చేసాడు. రాధిక కూడా

    1. విశ్వనాథ్ సినిమాలలో సాగతీసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమా చూసి మమ్ముట్టి ఓవరేటెడ్ యాక్టర్ అనుకున్నా. కానీ మలయాళం మూవీస్ చూసిన తర్వాత అర్థమైంది.

  2. శంకరాభరణం శంకర శాస్త్రి.. సప్తపది శాస్త్రి.. శైవులు మంచివారు.. స్వాతికిరణం మమ్ముట్టి వైష్ణవుడు చెడ్డవాడు.. విశ్వనాధ్ గొప్ప దర్శక నిదర్శన కోణం అందులో కూడా కనిబిస్తుంది…

    1. Hmm.. మంచి ఎనాలిసిస్. త్రివిక్రమ్ కూడా హీరోలకి ఇంటి పేరు బదులు, నాన్న పేరు పెడతాడు. శైవ భక్తులు అనుకుంటా.

      కానీ ఆపత్బాంధవుడు, శుభసంకల్పం, స్వర్ణకమలం ఇలా అన్నిట్లో వైష్ణవులే. సప్తపది లో శైవులైన కూడా వాళ్లది తప్పు అని చూపించాడు.

  3. Salieri was a just professional rival of mozart. He did not poison as shown in movie Amadeus..not true..I have visited salzburg, vienna and this was one of the topic I got clarity…

    ..this is typical village style gossip and movie Amadeus portrays as such this for better drama..

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. హాయిగా ఇలాంటి ఎనాలిసిస్ లు చేసుకుంటా ఈ అయుదు ఏళ్ళు కాలక్షేపం చేసెయ్యండి మాస్టారు

Comments are closed.