సినిమాలు అందరూ సినిమాల మీద ఫ్యాషన్ తోనే కాదు, అవసరాల కోసం కూడా తీస్తారు. మొహమాటాల కోసం తీస్తారు. అలాగే అసలు తాము పెట్టుబడి పెట్టకపోయినా, వేరే వాళ్లకు బినామీలుగా తీస్తారు. ఇలా రకరకాలుగా వుంటుంది టాలీవుడ్ లో వ్యవహారం. కొంత మంది మరీ ముందుకు వెళ్లి రాజకీయ ప్రయోజనాల కోసమో, అలాగే వ్యాపార ప్రయోజనాల కోసమో కూడా తీస్తారు.
ఆ మధ్య నెల్లూరు ప్రాంతమాయన ఎమ్మెల్సీ కావచ్చు, పరిచయాలు, మొహమాటాలు వాడుకుంటే అనుకుని సినిమా తీసాడని గుసగుసలు వినిపించాయి. ఎమ్మెల్సీ మాట దేవుడెరుగు, చేతిలో వున్న నాలుగు డబ్బులు అయిపోయి, అందిన కాటికి ఒకటి రెండు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇండస్ట్రీలోని ఓ టాప్ హీరోతో సినిమా నిర్మాణంలో వుంది. దానిపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో భలే గుసగుస వినిపిస్తోంది. ఆ సినిమా నిర్మాతలకు ఓ పరిశ్రమ వుందట. దానికి గాను నాలుగు వందల ఎకరాల గనుల భూమి లీజుకు కావాల్సి వుందట. గతంలో వైఎస్ ప్రభుత్వం అధికారంలో వుండగా ఆ భూమిని వేరే వాళ్లకు లీజుకు ఇచ్చంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది క్యాన్సిల్ చేసారట. ఇప్పుడు ఆ భూమిని తమ పరిశ్రమ కోసం లీజుకు తీసుకోవాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారట.
ఈ టాప్ హీరో అధికార పార్టీకి దగ్గర కావడంతో, అధికార పార్టీ ముఖ్యులకు బంధువు కావడంతో, అట్నుంచి నరుక్కు రావచ్చని, అవసరం అయితే పది కోట్లు పోయినా నష్టం లేదని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏది నిజమో, ఏది గ్యాసిప్ నో ఇండస్ట్రీకే తెలియాలి.