కొరటాల శివ-మెగాస్టార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆచార్య. కోవిడ్ కారణంగా అలా అలా వెనుకబడిపోయింది. ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆఖరికి ఈమధ్యనే స్పీడ్ అందుకుంది. మే 13 విడుదల డేట్ ప్రకటించారు.
అలాగే టీజర్ ఇచ్చి మాంచి బజ్ తెచ్చారు. కనీ వినీ ఎరుగని రేట్లకు మార్కెట్ చేసారు. అంతా బాగానే వుంది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ డేట్ కు విడుదల డౌట్ అంటూ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ఓవర్ సీస్ బయ్యర్ కు వర్తమానం కూడా చేరిందనే వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా షెడ్యూలు ప్రకారం నడవడం అన్నది కాస్త ముందు వెనుక అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ కాస్త సిక్ అయ్యారు అన్న వార్తలు గుప్పుమన్నాయి.
దాన్ని సోనూ సూద్, డేట్లు, ఇలా ఏవేవో చెబుతూ కవర్ చేసే వార్తలు కూడా వచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మెగాస్టార్ చిరంజీవి విరామం లేకుండా పనిచేయడం వల్ల, ఎండల వల్ల నీరస పడ్డారని వినిపిస్తోంది.
అందువల్ల ఆయన సెట్ మీదకు వెంటనే వస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అన్నది చూడాలి. ఒక వేళ గ్యాప్ తీసుకుంటే మాత్రం ఆచార్య విడుదల వాయిదా తప్పదేమో? అయితే కొరటాల శివ మాత్రం తమ సినిమా పక్కాగా అనుకున్న డేట్ కే వస్తుందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు బోగట్టా.