అజ్ఞాతవాసి తో టీ సిరీస్ బేరం సెటిల్ అయిందా? హీరో రానా మధ్యవర్తిత్వంతో రోజంతా నడిచిన చర్చలు ఫలించినట్లు పది కోట్లు కథ కోసం ఇవ్వడానికి, అలాగే హిందీ శాటిలైట్, రీమేక్ ఇతరత్రా వ్యవహారాలు ప్రస్తుతం హోల్డ్ చేయడానికి ఒప్పందం కుదిరినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వాస్తవానికి సాయంత్రం 70 లక్షలకు సెటిల్ అన్న లీక్ వచ్చింది. అయితే అది కాదని 10 కోట్లు అని అర్ధరాత్రి దాటాక తెలియవచ్చింది.
ఒక కథకు పది కోట్లు ఇవ్వాల్సి రావడమా? అంటే తప్పని సరి పరిస్థితి అనుకోవాలి? అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వడం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడి పరువుకు సంబంధించిన విషయం కాబట్టి.
అ..ఆ సినిమా విడుదలకు ముందు కూడా మీనా సినిమా హక్కుల కోసం సీనియర్ నటీమణి విజయనిర్మలకు కోటిన్నరకు పైగా ఇచ్చారని, ఆ విషయం కూడా గుంభనంగా వుంచారని తెలుస్తోంది.
కధ అన్నది ఎంత విలువైనది అంటే శంకర్ దాదా జిందాబాద్ సినిమాను అప్పట్లో అయిదు కోట్లకు పైగా చెల్లించి, రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. అప్పట్లో చిరు రెమ్యూనిరేషన్ కూడా దాదాపు అంతే.
నిజానికి లార్గో వించ్ ఆల్ ఇండియా హక్కులను టీ సిరీస్ కూడా పది కోట్లు పెట్టి కొని వుంటుందా? అంటే అనుమానమే. కానీ టైమ్ కలిసి వచ్చింది అనుకోవాలి. ముందుగానే హారిక హాసిని టీమ్ కనుక నేరుగా టీ సిరీస్ నుంచి తెలుగు రైట్స్ మాత్రం తీసుకుని వుంటే, మహా అయితే కోటి రూపాయలతో అయిపోయేది. కానీ ఇప్పుడు పది కోట్లకు డేకింది.
అయితే ఈ మొత్తాన్ని భరించడానికి దర్శకుడు త్రివిక్రమ్ సుముఖమే అని, కానీ త్రివిక్రమ్ తో వున్న అనుబంధం, ఆయన కారణంగానే అజ్ఞాతవాసికి జరిగిన బిజినెస్, రాబోయే ఎన్టీఆర్, వెంకటేష్ ల సినిమాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, స్వతహాగానే సౌమ్యుడు అయిన చినబాబు స్మూత్ గా నిరాకరించారని వార్తలు వినిపిస్తున్నాయి.