సినిమా రంగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వరకు, క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి హీరోల వరకు ఎందరో నిర్మాతలుగా మారినవారు వున్నారు. అలాగే జర్నలిస్టుల నుంచి నిర్మాతలుగా మారినవారూ వున్నారు. అలాంటి వాళ్లలో బిఎ రాజు ఒకరు. ఆయన వ్యవహారం పూర్తిగా వేరు. వయస్సు వల్ల వచ్చిందా? అనుభవం వల్ల వచ్చిందా? లేక స్వతహాగా ఆయన అంతేనా? ఎందుకంటే ఇండస్ట్రీలో బిఎ రాజులాంటి వ్యక్తులు వుండొచ్చు కానీ బిఎ రాజులా వుండే వ్యక్తులు అరుదు.
'కర్మణ్యే వాధికారస్తే..' 'తామరాకు మీద నీటిబొట్టు' వంటి ఉపమానాలు గుర్తుకు వస్తాయి ఆయనను దగ్గర నుంచి పరిశీలిస్తే. ఎందుకంటే ఈర్షాద్వేషాలకు అతీతంగా ఎవరూ వుండలేరు. అది సర్వ సాధారణం. సహజం. అందులో ఆదాయమే పరమావధిగా పనిచేసే సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్. ఇక్కడ అందరూ రెండు మాటలు మాట్లాడేవారే. ఎదురుగా ఒకటి, వెనుక మరొకటి.
కానీ బి ఎ రాజు దగ్గర ఎవ్వరైనా రెండు మాటలు వినడం అన్నది వుండదు. నిజమా, అబద్దమా? అన్నది కాదు. ఆయన ఒకటే మాట మాట్లాడతారు. అది పాజిటివ్.. అంతే. నో నెగిటివ్. ఆయన నోట నెగిటివ్ అన్న మాట వినిపించదు. ఆయనకు అవకాశం ఇచ్చిన వారి గురించి అయినా, ఇవ్వని వారి గురించి అయినా. ఆయన అవకాశాన్ని పట్టుకుపోయిన వారి గురించి అయినా, వదిలేసిన ప్రాజెక్టు అయినా, చేయని సినిమా అయినా. బిఎ రాజు మాట కేవలం పాజిటవ్. అలాంటి బిఎ రాజు పుట్టిన రోజు జనవరి 7. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వూ.
జర్నలిస్ట్.. పిఆర్వో.. నిర్మాత.. ఎంత సుదీర్ఘ ప్రయాణం మీది?
36 ఏళ్లు. 1981లో ఆంధ్రభూమి సినిమా పత్రికతో జర్నలిస్టుగా. అయితే సూపర్ హిట్ పత్రిక పబ్లిషర్ గా 24ఏళ్లు. ఇక నిర్మాతగా 15ఏళ్లు.
జర్నలిస్ట్ పీఆర్వో కావడం, ఆపై పత్రిక నడపడం కామన్. నిర్మాత కావాలని ఎందుకు అనిపించింది. ఆ రంగంలో కనిపించే ఆదాయం చూసి అనుకోవాలా?
అలా ఆదాయం కోసమే అయితే పెద్ద పెద్ద హీరోలతో, దర్శకులతో భారీ సినిమాలే చేసేవాడిని కదా? నాకున్న అభిమానాలు, పరిచయాలతో అదే కష్టం కాదు కదా? నేను నిర్మాణం చేపట్టింది కేవలం బి జయ (భార్య) టాలెంట్ తెలుసుకుని. మంచి సినిమాలు అందించాలనే ఆమె తపన చూసి. మా బ్యానర్ స్టార్ట్ చేసింది అందుకే. తీస్తున్నది అందుకే.
ఎంతయినా సినిమా నిర్మాణం అంటే వ్యాపారమే కదా?
అవును కాదని అనడంలేదే. కానీ కాస్త మంచి క్లీన్ సినిమాలు తీయాలన్నది మా సంకల్పం. ఇప్పటి దాకా తీసిన సినిమాలు అన్నీ అలాగే తీసాం. ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సినిమా చూడాలి అన్నది మా డైరక్టర్ జయ ఆలోచన.
సినిమా నిర్మాణం కన్నా సినిమా ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెడతారా మీరు?
సినిమా నిర్మాణం మీద దృష్టి పెట్టకపోవడం లేదు. ఒక ప్రాజెక్టు అనుకున్నాక, స్క్రిప్ట్ ఓకె అయ్యాక, డైరక్టర్ కు కావల్సింది ఇవ్వడమే పని. అది పెద్ద కష్టం కాదు. డబ్బులుంటే అయిపోతుంది. కానీ పూర్తయిన సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్లేది పబ్లిసిటీ. ఒక పీఆర్వోగా నా సినిమాకే నేను సరైన పబ్లిసిటీ ఇవ్వకుంటే, రేపు వేరే వాళ్ల సినిమాకు ఎలా ఇవ్వగలను. ఆ ప్రశ్న నాకు ఎదురు కాకూడదు కదా?
లేటెస్ట్ గా తీసిన వైశాఖం లాభాలు తెచ్చిందా?
వైశాఖమే కాదు, ఇప్పటి దాకా మా బ్యానర్ లో తీసిన ఏ సినిమా వల్లా కూడా మేం పైసా నష్టపోలేదు. ఇక వైశాఖంలో మేం బిజినెస్ కన్నా, దాంతో చెప్పాలనుకున్న మెసేజ్ చూసాం. ఆ సందేశం జనాలకు రీచ్ కావడం కోసం చూసాం. అది నెరవేరింది. మహిళలు, రచయితలు, ప్రముఖులు, మంచి సినిమా అందించారు అన్న ప్రశసంలు కురిపిస్తుంటే, నిర్మాతగా నేను, డైరక్టర్ గా జయ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.
వైశాఖం సినిమాకు అవార్డులు ఏవైనా ఆశిస్తున్నారా?
అవార్డు అన్నవి ఆశిస్తే రావు. మనం తీసిన సినిమాలో నిజాయతీతో కూడిన సందేశం, విలువలు వుంటె వస్తాయి. ఇక ఆశించడం అంటారా? ఆశ అనేది ఎవరికైనా వుంటుంది కదా ?
మీరు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక్క సినిమా అయినా కాస్త చూసి కానీ నిద్రపోరట. నిజమేనా?
నేను తెల్లవారుతూనే లేచి బయటకు వస్తాను. సినిమా వాళ్లతోనే గడుపుతాను. రాత్రి పడుకునే ముందు ఏదో సినిమా కొంతయినా చూస్తాను. హాయిగా పడుకుంటాను. సినిమాయే నా జీవితం.
ఏ సినిమా గురించి మీరు అస్సలు నెగిటివ్ మాట్లాడరు. ఇది ఎలాసాధ్యమైంది?
నేనేవరు వాళ్ల సినిమా గురించి నెగిటివ్ మాట్లాడడానికి? కావాలంటే నేను పెట్టుబడి పెట్టి, నేను సినిమా తీసి, నా సినిమాను నేను తిట్టుకోవచ్చు. కానీ ఎవరో కష్టపడి తీసుకున్న సినిమాను నేనెందుకు విమర్శించాలి. ఇది నా ఐడియాలజీ. ఇది కొందరికి నచ్చు వచ్చు. నచ్చకపోవచ్చు.
ఇంతమంది సినిమా వాళ్లతో తిరుగుతూ, ఇందరు హీరోలకు తలలో నాలుకలా వుంటూ, ఆ విషయాలన్నీ తలలోనే వుంచుకుని, పైకి అస్సలు వెల్లడించకుండా వుండడం ఎలా సాధ్యమైంది?
వాళ్ల నమ్మకం పోగొట్టుకోకుండా వుండడం కోసం. వాళ్లు నన్ను ఇంటి మనిషిలా చూస్తారు. అలాంటపుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా? అందుకే నా మ్యాగ్ జైన్ లో కానీ, వెబ్ సైట్ లో కానీ గ్యాసిప్ లకు తావు లేదు. కేవలం కన్ ఫర్మ్ న్యూస్ మాత్రమే రాస్తాను. కేవలం జర్నలిస్ట్ గా వుంటే అది వేరు. కానీ నేను చాలా మందికి ఆప్తుడిగా వుండే అదృష్టం పొందాను. అది ముఖ్యం.
మళ్లీ ఇప్పట్లో సినిమా వుందా?
త్వరలోనే స్టార్ట్ చేస్తాము. మాంచి స్క్రిప్ట్ తయారవుతోంది. అన్నీ కుదరగానే ప్రకటిస్తాను. బహుశా జూన్ లో వుండొచ్చు.
అందరికీ వారసులు వుంటారు. మీ వారసుడు ఏరంగంలోకి రాబోతున్నాడు?
దర్శకుడిగానే. పూరి జగన్నాధ్, వివి వినాయక్ లాంటి పెద్దల దగ్గర ట్రయినింగ్ పొందుతున్నాడు. అన్ని విధాలా నేర్చుకున్నాక అప్పుడు.
రోజుకు 18గంటలు పనిచేస్తారట మీరు. ఈ వయసులో అవసరమా? అలుపు రాదా? ఇదంతా పీఆర్వోగానేనా?
పీఆర్వోగా అని కాదు. సినిమా రంగంలో నేనూ వున్నాను. ఆ రంగంలోనే ఇంతవరకు వచ్చాను. ఇలా ఈ ప్రయాణం కొనసాగించాలి. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కాదు. 24హవర్స్ వర్క్. అందుకే ఇదేమీ పెద్ద కష్టం, అలుపు అనిపించదు నాకు.
యువతరంతో పోటీ పడుతూ ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా రాజుగా ఎలా పట్టుసాధించగలిగారు.
చెప్పాను కదా? సినిమా అంటే మమకారం, పిచ్చి ఏదైనా అనండి. అందుకే ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకుంటూనే వుంటాను. సూపర్ హిట్ మ్యాగ్ జైన్ పెట్టి 24ఏళ్లు అయితే ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ పెట్టి నాలుగేళ్లు దాటుతోంది. అలాగే ట్విట్టర్ లో మూడున్నర లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇదంతా మామూలుగా రాదు. మీరు అన్నారే రోజుకు 18గంటల పని. దాని ఫలితమే ఇదంతా. అందుకోసమే అలా పని చేయడం.
కాలంతో మారుతూ వస్తున్నారు. మరి కొత్తగా క్రైం థ్రిల్లర్లు, లేదా యూత్ ఫుల్ మూవీస్ కాకుండా, ఇంకా ఫ్యామిలీ మూవీస్ నే ఎందుకు?
ఎవరు చెప్పారు? మా జోనర్ మొదట్నించీ ఒక్కటే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు. అది చంటిగాడు అయినా, లవ్ లీ అయినా, వైశాఖం అయినా. అది ఎవర్ గ్రీన్ జోనర్. మిగిలినవి సీజన్ ను బట్టి మారతాయి. ఈ జోనర్ పర్మనెంట్.
ఈ పుట్టిన రోజుకు ఏం చేయబోతున్నారు కొత్తగా.
కొత్తగా చేసేదేమీ లేదు. రోజువారీ కార్యక్రమాలే. అయితే కారు పాతదైపోయింది. కొత్తకారు కొనుక్కోవాలి. కొత్త అంటూ వుంటే అదొక్కటే.
ఓకె.. విష్ యు ఎ హ్యాపీ బర్త్ డే
థాంక్యూ. నాకు మీ మీడియా, మన మీడియా ఇస్తున్న సపోర్ట్ చాలా గొప్పది. మీ అందరూ మహానుభావులు. మీ అందరికీ వందనాలు.