ఒకవైపు సినిమాల ద్వారా.. మరోవైపు రియాలిటీ షో ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడనే పేరును కలిగి ఉన్న అక్కినేని నాగార్జున అప్పుల ఖాతా వెలుగులోకి వచ్చింది. కేవలం నాగార్జున మాత్రమే కాకుండా.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకులు జారీ చేసిన నోటీసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తమకు అక్కినేని ఫ్యామిలీ అప్పుబడిన నేపథ్యంలో వారికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ను సీజ్ చేయనున్నట్టుగా బ్యాంకులు ప్రకటించడం విశేషం.
ఈ మేరకు ఆంధ్ర బ్యాంక్ , ఇండియన్ బ్యాంకులు ఉమ్మడి నోటీసులు జారీ చేశాయి. ఈ రెండు బ్యాంకులకూ కలిపి అక్కినేని ఫ్యామిలీ మొత్తం 62 కోట్ల రూపాయలు బకాయిపడిందని తెలుస్తోంది. ఆంధ్రా బ్యాంక్ కు 32.3 కోట్ల రూపాయలు, ఇండియన్ బ్యాంక్ ఖాతాలో 29.7 కోట్ల రూపాయలు అప్పులున్నాయి.
వీటి చెల్లింపు విషయంలో అక్కినేని కుటుంబం ఏ మాత్రం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఇలా మొండి బకాయిదారులుగా ముద్రపడ్డ అక్కినేని నాగార్జున, వెంకట్ అక్కినేని, వై సురేంద్ర, నాగ సుశీల , వెంకట్ రొద్దంలకు ఈ వ్యవహారంలో ఇది వరకూ అనేక నోటీసులు ఇచ్చాయి బ్యాంకులు.
అయితే వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ ను సీజ్ చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ మేరకు అధికారికంగా నోటీసులు ఇచ్చాయి. అప్పుగా ఇచ్చిన సొమ్మును రికవర్ చేయడానికి మొత్తం ఏడుంపావు ఎకరాల స్టూడియోస్ ను సీజ్ చేయడమే తమకున్న మార్గమని బ్యాంకులు పేర్కొన్నాయి.
ఈ వివాదం గురించి అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇటీవల కాలంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్ రాజేంద్రన్ తరచూ చెబుతూనే ఉన్నాడు. సినీ రాజకీయ కుటుంబాలు తీసుకొన్న అప్పులు తిరిగి చెల్లించడం లేదని.. దీంతో తమకు నష్టాలు వస్తున్నాయని ఆయన చెబుతున్నాడు. అంటే అలా బ్యాంకులను కుంగదీస్తున్న మొండి బకాయిదారుల్లో అక్కినేని నాగార్జున కూడా ఒకరనమాట!