సినిమా గురించి చెప్పమంటే ఎవరైనా హీరో గురించి మాట్లాడతారు. లేదంటే సినిమాలో కథ గురించి మాట్లాడతారు. ఎన్టీఆర్-మహానాయకుడు గురించి చెప్పమంటే బాలయ్య మాత్రం చంద్రబాబు గురించి మాట్లాడాడు. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్-చంద్రబాబుల అసలైన అనుబంధాన్ని చూస్తారంటున్నాడు బాలయ్య.
“పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టం చేయమని చెప్పింది చంద్రబాబే. రాజకీయ సంక్షోభం సమయంలో చంద్రబాబుది కీలక పాత్ర. ఆ టైమ్ లో నాన్నగారికి ఎవరూ అందుబాటులో కనిపించలేదు. ఆయన (చంద్రబాబు) మాత్రమే కనిపించారు. పార్టీ బాధ్యతలు తీసుకోమని నాన్నగారే స్వయంగా చంద్రబాబును అడిగారు. కానీ తను నాయకుడిలా కాకుండా పార్టీ కార్యకర్తగా, ఓ పాలేరుగా పార్టీ కోసం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు.”
చరిత్రలో దాగున్న ఇలాంటి నిజాలన్నింటినీ మహానాయకుడులో చూపించామంటున్నాడు బాలయ్య. నాన్నగారు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల్ని చంద్రబాబే కవర్ చేశారని, పార్టీని నిలబెట్టరాని అంటున్నాడు. ఇవన్నీ నిజాలేనని, వాటినే చూపించామని అంటున్నాడు.
“పార్టీ కోసం ఆయన (చంద్రబాబు) చాలా కష్టపడ్డారు. రాజకీయ తరగతులు నిర్వహించారు. సంక్షేమం కోసం పాటుపడ్డారు. ఇవన్నీ పక్కనబెడితే రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నారనేది అందరికీ తెలిసిందే. నాన్నగారు ఆవేశంతో తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని చంద్రబాబు సర్దుబాటు చేసి మళ్లీ పార్టీని ట్రాక్ లోకి తీసుకొస్తారు. ఇవన్నీ నిజాలు. వాటినే చూపించాం.”
నాన్నగారు ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికీ తెలుసని, అందుకే వాటిగురించి చెప్పలేదని… నాన్నగారు, చంద్రబాబు మధ్య అనుబంధం గురించి చాలామందికి తెలియదని.. అదొక పెద్ద డ్రామా అని అంటున్నాడు బాలయ్య. అందుకే వాళ్లిద్దరినే హైలెట్ చేస్తూ సినిమాను నడిపించామని చెప్పుకొచ్చాడు.
“నాన్నగారి జీవితం మొత్తాన్ని చూపించాలన్నది మా ఉద్దేశంకాదు. రాజకీయ సంక్షోభం వరకు మాత్రమే చూపించాం. మొదటిభాగంలో చాలా గెటప్స్ ఉన్నాయి. పైగా నాన్నగారి వ్యక్తిత్వం చూపించాలనుకున్నాం. అందుకే లెంగ్త్ పెరిగింది. రెండోభాగంలో రాజకీయాలే కదా. పైగా ఆ సంక్షోభం వరకే చూపించాలని పెట్టుకున్నాం. కాబట్టి 2 గంటల 8 నిమిషాలకే సినిమా ముగుస్తుంది.”
బసవతారకం పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుందని చెప్పిన బాలయ్య, రాజకీయంగా నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ జీవితంలో చెప్పుకోదగ్గ పెనుమార్పులు లేవన్నట్టు మాట్లాడాడు. ఓవరాల్ గా బాలయ్య మాటల్లో ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది.
ఆయన కథానాయకుడు సినిమాను ఎన్టీఆర్ కోసం తీస్తే, మహానాయకుడు సినిమాను బావ చంద్రబాబు కోసం తీశారు. అసలైన చరిత్రను పక్కనపెడితే, రేపు థియేటర్లలో ప్రేక్షకులకు కనిపించేది ఈ నిజమే.