రివ్యూ: ఎన్టీఆర్ – మహానాయకుడు
రేటింగ్: 2.5/5
బ్యానర్: ఎన్‌బికె ఫిలింస్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా
తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, రానా దగ్గుబాటి, కళ్యాణ్‌రామ్, సచిన్ ఖేడేకర్, భరత్ రెడ్డి, దగ్గుబాటి రాజా, వెన్నెల కిషోర్, సుప్రియా వినోద్, పూనమ్ బాజ్వా తదితరులు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: అర్రం రామకృష్ణ
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.
సహ నిర్మాతలు: సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు: బాలకృష్ణ, వసుంధర
కథ, కథనం, దర్శకత్వం: క్రిష్
విడుదల తేదీ: ఫిబ్రవరి 22, 2019
పేరుకి ఎన్టీఆర్ బయోపిక్ కానీ… రెండు భాగాలుగా వచ్చినా స్వర్గీయ ఎన్టీఆర్ ఉద్ధాన పతానాలన్నిటినీ, ఆయన ప్రస్థానం అంతటినీ కవర్ చేసిన సినిమా కాదిది. నందమూరి తారకరామారావు ప్రస్థానం ఆయన భార్య బసవ రామతారకం కళ్ల ద్వారా చూపించిన సెమీ బయోపిక్ ఇది. ఇంకా చెప్పాలంటే ఇది ''తారకం'స్ ఎన్టీఆర్!''.
బసవరామ తారకం (విద్యాబాలన్) జీవితంలోకి 'బావ' తారక రామారావు (బాలకృష్ణ) ప్రవేశించినప్పటినుంచి, ఆమె పరమపదించే వరకు అతను సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రమే 'ఎన్టీఆర్' కవర్ చేస్తుంది. మూడుసార్లు సిఎం అయిన వ్యక్తి జీవితంలోంచి మొదటిసారి సిఎం అయినప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణలో కొంత మాత్రమే కవర్ చేయడం ఆయన నాయకత్వానికి, ఆయన సాధించిన విజయాలకి, అధిరోహించిన శిఖరాలకి తగిన నివాళి కాదనిపిస్తుంది.
'కథానాయకుడు' ఎన్టీఆర్ సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇంకా ఎత్తుకి ఎలా ఎదిగారనేది కూలంకషంగా చూపిస్తే, 'మహానాయకుడు' మాత్రం ఎన్టీఆర్ ఎందుకు మహా నాయకుడు అయ్యాడనేది చూపించకుండానే అర్ధాంతరంగా ముగుస్తుంది. 'ఇంతే చూపించాలి' అని ఖచ్చితమైన గిరి ఎందుకు గీసుకున్నారనేది తెలియని సంగతి కాదు. కాకపోతే 'ఇంత చూపించినా' కానీ ఆయన 'మహా నాయకుడు' ఎందుకయ్యాడనేది చూపించుకునే వీలుని పూర్తిగా వాడుకోలేదు. ఎన్టీఆర్ కథలో మిగతావన్నీ 'సహాయ' పాత్రలే అయినపుడు, ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రం సూర్యుడి తర్వాత చంద్రుడిలా అంత ప్రకాశమెందుకు ఇచ్చారనేది అంత పెద్ద రహస్యమేం కాదు.
సాధారణంగా బయోపిక్స్ అంటే… 'తెలిసిన కథ' లేదా 'చదివిన కథ' ఒక్కోసారి 'చూసిన లేదా విన్న కథ'ల్లోంచి తెరకెక్కుతాయి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కొందరికి 'కావాల్సినట్టుగా', కొన్నిటిని 'చెరిపేసేట్టుగా', గట్టిగా చెప్పాలంటే వారికి 'అనుకూలించేట్టుగా' రూపొందింది. 'కథానాయకుడు'లో ఎన్టీఆర్‌లోని మహా నటుణ్ణి కొనియాడుతూ కాసిని అతిశయాలున్న మాట నిజమే కానీ… వాస్తవాలకి దగ్గరగానే వుంది. ఏదీ దాచిపెట్టడానికి గానీ, మరేదైనా అజెండా కానీ లేదు. అందుకే ఆ ప్రస్థానం అతిశయాలని అధిగమించి అలరించింది. అది ఆర్థిక పరమైన విజయం సాధించిందా లేదా అనేది అప్రస్తుతం. సినిమాగా 'కథానాయకుడు'కి సంపూర్ణంగా కాకపోయినా, న్యాయం చేసిందనేది మాత్రం నిజం. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఎలా చూపించుకున్నా, ఎంత కీర్తించుకున్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో దర్శకుడికి స్వేఛ్ఛ లభించింది. దాంతో తన సృజనకి సదరు నటుడిపై వున్న ఆరాధనని జోడించి క్రిష్ ఒక ఆకట్టుకునే చిత్రాన్నే అందించాడు.
'మహానాయకుడు' విషయానికి వచ్చేసరికి దర్శకుడు తీయాలనుకున్నది తీసుకునే సౌలభ్యం ఖచ్చితంగా లేదు. ఎంత చూపించాలనే దానిపై స్వేఛ్ఛ దొరకలేదు. కథ ఎక్కడ ముగించాలి, అలా ముగించేస్తే రెండు భాగాల ఈ చిత్రం సంతృప్తినిస్తుందా అని తర్కించుకునే సౌకర్యమూ ఇవ్వలేదు. నాయకుడిగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని కేవలం మాటలకి, ఉపన్యాసాలకే పరిమితం చేసారు. తెలుగు జాతి గర్వించే నాయకులలో ఒకరైన ఎన్టీఆర్ అంతటి 'మహానాయకుడు' ఎందుకయ్యాడనేది చూపించే ఒక్క సన్నివేశం లేదు. ఎన్టీఆర్ ఛరిష్మాని హైలైట్ చేయడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రని ఇష్టానుసారం వాడేసుకున్నారు. ఓకే… భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛగా దానిని ఓవర్ లుక్ చేసేయవచ్చు. కానీ కేంద్రంలో తల పొగరు చూపించిన నాయకుడిని రాష్ట్రంలో 'కీలుబొమ్మ'గా ఎందుకు చూపించారు?
అవసరం వున్న చోట ఎన్టీఆర్ చిత్రకారుడయ్యాడు (తెలుగుదేశం జెండాని స్వహస్తాలతో గీసి చూపిస్తారు), అవకాశం వున్న చోట ఎన్టీఆర్ ఇంజినీర్ అయ్యాడు (తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెనేషన్). కానీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే చోట మాత్రం సహచరులపై ఆధారపడ్డారు (ఉద్యోగుల వయో పరిమితి నిర్ణయం నాదెండ్ల సలహాతో తీసుకున్నట్టు, దానిని చంద్రబాబు అప్పుడే తప్పు పట్టినట్టు చూపించారు). ఎన్టీఆర్‌ని మహానాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయడంపై కంటే చంద్రబాబుని తెలుగుదేశంకి భావి అధినేతగా చిత్రీకరించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అంతవరకు ఎన్టీఆర్ కథలో మిగిలిన పాత్రలకి అంత ప్రాధాన్యం లేకపోయినా, చంద్రబాబుకి మాత్రం ప్రోపర్ ఇంట్రడక్షన్ సీన్, పర్‌ఫెక్ట్ క్యారెక్టర్ ఆర్క్ సృష్టించారు. ''పార్టీకి పాలేరులా పనిచేస్తా'' అంటూ డైలాగులు చెప్పించడంతో పాటు 'బాబు మామూలోడు గాదు' అంటూ ఎలివేషన్లూ ఇచ్చారు.
కథలో కీలక ఘట్టమైన 'నమ్మక ద్రోహం' ఎపిసోడ్‌ని కూడా చాలా తక్కువ సీన్లకి పరిమితం చేసారు. ఒక ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించడమనేది చాలా పెద్ద కుట్ర. అందులో బోలెడంత పొలిటికల్ డ్రామాకి, సంఘర్షణకీ స్కోప్ వుంది. కానీ ఆ పార్ట్ చాలా నిరాసక్తంగా జరిగిపోతుంది. రెండు వందలకి పైగా సీట్లు గెలిచిన నాయకుడిని పదవీచ్యుతుణ్ణి చేయడాన్ని అంత సింపుల్‌గా తీసేయడం నిరాశ పరుస్తుంది. అయితే దీనిపై పోరాటాన్ని ఢిల్లీలో ఎన్టీఆర్ మాటలతో చేస్తూ వుంటే, యుద్ధ రంగంలో యాక్షన్‌లోకి దిగుతాడు చంద్రబాబు. ఎన్టీఆర్‌పై ఎంత ఫోకస్ వుంటుందో, ఈ కథలో చంద్రబాబు నుంచి కూడా ఫోకస్ అసలు షిఫ్ట్ కాదు. ఆ రకంగా చూసుకుంటే… ఈ చిత్రానికి 'చంద్రబాబు – ది బిగినింగ్' అనే టైటిల్ పెట్టుకోవచ్చు.
ఎన్టీఆర్ కథని 1985 వరకు మాత్రమే చెప్పగలిగే వీలుంది. కారణాలేంటనేది తెలియనివి కావు. అందుకోసం బసవరామతారకం పరమపదించే వరకు మాత్రమే కథ చెప్పారు. ఆ కారణంగానే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడిపారు. అలా అని ఆమె ప్రతి రాజకీయ వ్యవహారానికీ సాక్షి కాదు, ఇందులో జరిగే ప్రతి సన్నివేశం ఆమెకి తెలిసే వీల్లేదు. స్క్రీన్‌ప్లే టూల్‌గా మాత్రమే ఆమె పాత్రని వాడుకున్నారు. దీని వల్ల ఈ రాజకీయ చిత్రానికి కుటుంబ కోణం ఇచ్చే వీలు చిక్కింది. భార్యాభర్తల అనుబంధాన్ని, ఎన్టీఆర్‌కి భార్యపై వున్న అభిమానాన్ని, భర్తపై ఆమెకున్న ఆరాధనని చూపించే సన్నివేశాలు కొన్ని బాగానే పండాయి. పన్నెండు మందికి జన్మనిచ్చిన ఆమె గురించి మాట్లాడుతూ 'పన్నెండుసార్లు నన్ను కన్నది. ప్లీజ్ నా అమ్మని బ్రతికించండి' అంటూ ఎన్టీఆర్ దుఃఖించే సన్నివేశంలో ఆర్ధ్రత వుంది. అలా అని ఈ త్రెడ్‌కి పూర్తి జస్టిఫికేషన్ జరగలేదు. పైన చెప్పినట్టు కథనం నడిపించడానికి ఈ బంధం, ఆమె పాత్ర ఒక టూల్ మాత్రమే!
పొలిటికల్ డ్రామా పండించడం కోసం, ఎన్టీఆర్ పట్ల సానుభూతి రగిలించడం కోసం అసెంబ్లీ సన్నివేశాలని మరీ టూమచ్‌గా చిత్రీకరించారు. ఆ వ్యవహారమంతా ఫోర్స్‌డ్‌గానే అనిపిస్తుంది తప్ప 'అరెరె' అని ఆవేదన కానీ, ఆగ్రహం కానీ పుట్టించలేదు. అంతా చేసి చివర్లో నాదెండ్లపై ఎన్టీఆర్ తాలూకు విజయంతో 'పే ఆఫ్' వుంటుందా అంటే అదీ లేదు. సడన్‌గా రాజకీయం నుంచి కుటుంబంవైపు టర్న్ తీసుకుని, బసవతారకం మరణంతో 'ఎన్టీఆర్' కథ ముగుస్తుంది!
నటన పరంగా బాలకృష్ణకి ఈసారి యంగ్‌గా కనిపించాల్సిన అవసరం పడలేదు కనుక 'కథానాయకుడు' చివర్లో వున్న కంఫర్ట్ కంటిన్యూ అయింది. రాజకీయ పరంగా ఆవేశాన్ని అణచిపెట్టాల్సిన చోట, నమ్మకద్రోహాలని మౌనంగా భరించాల్సిన సందర్భంలో, భార్య కోసం తపించే భర్తగా భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో బాలయ్య నటన చాలా మెప్పిస్తుంది. విద్యాబాలన్ తన పాత్రకి ప్రాణం పోసింది. తన 'బావ' ప్రజా నాయకుడిగా, ప్రజల మధ్య స్త్రీలకి సమాన హక్కులు ఇస్తానని మాట ఇస్తున్నపుడు ఆమె కళ్లల్లో ఆనందం, అతని పట్ల వున్న ఆరాధన చూసి తీరాల్సిందే. నారా చంద్రబాబు బాడీ లాంగ్వేజ్‌ని, మాట తీరుని కాస్త అనుకరిస్తూ రానా దగ్గుబాటి మెప్పించే ప్రదర్శన ఇచ్చాడు. నాదెండ్ల భాస్కరరావు పాత్రని సచిన్ ఖేడేకర్ సహజంగా పోషించాడు. హరికృష్ణగా కళ్యాణ్‌రామ్‌కి అడపాదడపా ఆవేశపడడం మినహా ఎక్కువ స్కోప్ దక్కలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ అనగానే గుర్తుండే లేదా గుర్తు చేసుకుని ప్లే చేసుకునే పాటలని కీరవాణి ఇవ్వలేదు. సన్నివేశ బలం లేక నేపథ్య సంగీతానికి కూడా స్కోప్ దొరకలేదు. బుర్రా సాయిమాధవ్ సంభాషణల్లో కూడా మొదటి భాగంలో వున్నంత కమాండ్ వినిపించలేదు. ఛాయాగ్రహణం, కళ, నిర్మాణ విలువలు అన్నీ చక్కగా కుదిరాయి. దర్శకుడిగా క్రిష్‌కి మొదటి భాగంలో వున్న భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ లేకపోవడం, ఈ చిత్రం ఎలా వుంటాలనే దానిపై 'పర్యవేక్షణ' జరగడం వల్ల క్రిష్ క్రియేటివిటీ, డైరెక్షన్ కేపబులిటీ అక్కడక్కడా మాత్రమే మెరిసింది.
ఒక బయోపిక్ చూసినపుడు సదరు వ్యక్తి తాలూకు గొప్పతనం ముద్రించుకుపోవాలి. భావి తరాలకి ఆయనో మహనీయుడిగా గుర్తుండిపోవాలి. అతను చేసిన గొప్ప కార్యాలు ఈ తరానికి తెలిసి రావాలి. ఇలాంటివేమీ చేయకుండా, రెండు భాగాల్లో వచ్చినప్పటికీ అసంపూర్ణంగా 'ఎన్టీఆర్' మిగిలిపోయింది. తెలుగు జాతి గర్వపడే నాయకుడికి తగిన నివాళి కానే కాదిది.
బాటమ్ లైన్: ఇంతేనా 'మహానాయకా'!
గణేష్ రావూరి