బిగ్‌బాస్‌-2: అసలేం జరుగుతోంది నానీగారూ.!

బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా అదరగొట్టేసింది. వారంలో ఐదు రోజులూ ఒక లెక్క.. శని, ఆదివారాలు ఇంకో లెక్క. ఎన్టీఆర్‌ అలా కన్పిస్తే చాలు, టీఆర్పీ రేటింగులు అదిరిపోయేవి.…

బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా అదరగొట్టేసింది. వారంలో ఐదు రోజులూ ఒక లెక్క.. శని, ఆదివారాలు ఇంకో లెక్క. ఎన్టీఆర్‌ అలా కన్పిస్తే చాలు, టీఆర్పీ రేటింగులు అదిరిపోయేవి. వీకెండ్‌లో ఎన్టీఆర్‌ ఇచ్చే ఉత్సాహం, హౌస్‌మేట్స్‌కి మిగిలిన అన్నిరోజులూ కొత్త ఎనర్జీని ఇచ్చేది. సీజన్‌ వన్‌లో ఎక్కువమంది స్టార్స్‌ వున్నారు.

రెండో సీజన్‌కి వచ్చేసరికి, మొత్తం వ్యవహారం మారిపోయింది. తెలిసినవారు తక్కువ.. ఆ తెలిసినవారి పాపులారిటీ కూడా అంతంతమాత్రమే. ఇక, తెలియనివారిది వేరే కథ. రెండో సీజన్‌ మొదలైంది.. సామాన్యులకు పెద్ద పీట వేయాల్సింది పోయి, జాగ్రత్తగా కొందర్ని సాగనంపేశారు. అసలు ఎవరు ఎందుకు బయటకు వెళుతున్నారో చూసే ఆడియన్స్‌కి అర్థంకాని పరిస్థితి. ఇది చాలదన్నట్టు, బిగ్‌ హౌస్‌లో డ్రమెటిక్‌ వివాదాలతో చాలావరకు బిగ్‌ బాస్‌ బుల్లితెర ఆడియన్స్‌కి దూరమైపోతోంది.

మొదట్లో నూతన్‌ నాయుడు, కిరీటి, కౌషల్‌, తనీష్‌, సామ్రాట్‌ తదితరుల మధ్య గొడవ చాలా ఇబ్బందికరంగా అన్పించింది. నూతన్‌ నాయుడు ఔట్‌ అయిపోయాడు. ఆ తర్వాత తేజస్వి, హౌస్‌లో చేసిన గొడవలు అన్నీ ఇన్నీకావు. భానుశ్రీ సంగతి సరేసరి. భానుశ్రీ ఔట్‌ అయిపోయింది. తేజస్వి కూడా బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ కూడా చాలా వింతగా కన్పిస్తోంది. తేజస్వి ఎలిమినేషన్‌ సమయంలో నాని సోషల్‌ మీడియాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన్ని ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో ట్రాల్‌ చేసేందుకు కారణమయ్యాయి.

బిగ్‌ హౌస్‌లో రకరకాల స్కిట్లు.. అందులో లవ్‌ ట్రాక్‌లు.. ఇవేవీ ఆడియన్స్‌కి 'కిక్‌' ఇవ్వడంలేదు సరికదా, మరింత వెగటు పుట్టిస్తున్న మాటవాస్తవం. కిరీటి విషయంలో హోస్ట్‌ నాని చేసిన వ్యాఖ్యలతోనే నాని ఇమేజ్‌ బుల్లితెరపై దారుణంగా పడిపోయింది. కిరీటిని నాని బిగ్‌హౌస్‌కి సంబంధించి 'నేరస్తుడ్ని' చేసేశాడు. ఆ తర్వాత 'క్లీన్‌గా పంపిస్తున్నాం..' అని నాని చెప్పొచ్చుగాక.. కిరీటి పర్సనల్‌ ఇమేజ్‌ని నాని దారుణంగా దెబ్బకొట్టేశాడు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వున్నప్పుడు ఇలాంటివేమీ జరగలేదు.

రెండో సీజన్‌ని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేద్దామనుకుని నిర్వాహకులే బొక్క బోర్లాపడ్డారో, హోస్ట్‌గా నాని తడబడ్తున్నాడో అర్థంకాని పరిస్థితి. సోషల్‌ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంటుంది.. దాన్ని షోలో ఖండించడం ఏమంత సమంజసంగా అన్పించలేదెవరికీ. పైగా, నాని మీదనే శ్రీరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. దానిపై లీగల్‌ నోటీస్‌ ఇచ్చాడేమోగానీ, బాహాటంగా నాని స్పందించిన దాఖలాల్లేవు.

ఏదిఏమైనా, నాని బిగ్‌ బాస్‌ సీజన్‌ టూ విషయంలో పూర్తిగా విఫలమయినట్లే కన్పిస్తోంది. షో నిర్వాహకులు, కంటెస్టెంట్స్‌.. ఇలా ఎలా చూసినా, సీజన్‌ వన్‌తో సీజన్‌ టూని పోల్చే పరిస్థితే లేకుండా పోయింది.