వైఎస్ జమానా నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్న నేత. అలాంటి నేత త్వరలో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా బోత్స చాలా స్తబ్దుగా వున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టడం మినహా పెద్ద యాక్టివ్ గా లేరు. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడమే దానికి కారణం అని తెలుస్తోంది.
అందుకే వచ్చే ఏడాది రాజ్యసభకు పంపమని సిఎమ్ జగన్ ను బొత్స కోరారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి సిఎమ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు బోగట్టా. ఇప్పుడు దాదాపు 65 ఏళ్లు దాటాయి. ఓ ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వుండి, ఆపై పూర్తిగా రాజకీయాలు విరమించుకోవాలని బొత్స ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా.
దాదాపు మూడు దశాబ్దాల కాలంగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. పెనుమత్స సాంబశివరాజు అనుచరుడిగా ప్రస్థానం ప్రారంభించి రకరకాల పదవులు చేపట్టారు. ఎంపీగా కూడా చేసినా, రాజ్యసభ సభ్యుడిగా చేయలేదు. ఇప్పుడు ఆ దిశగానే బొత్స పావులు కదుపుతున్నారని బోగట్టా.