ప్రేమపై నమ్మకం పెంచుతున్న సెలబ్రిటీలు!

ఒకవైపు ప్రపంచం వేగవంతం అవుతోంది.. ఈ వేగంలో చాలా వాటి గురించి పట్టించుకునే తీరిక జనాలకు లేకుండా పోతోంది. అలాంటి వాటిల్లో 'ప్రేమ'కూడా ఒకటి. ప్రేమ గురించి చెప్పమంటే మనుషులు ఎంతైనా చెప్పగలరు. నిజమైన…

ఒకవైపు ప్రపంచం వేగవంతం అవుతోంది.. ఈ వేగంలో చాలా వాటి గురించి పట్టించుకునే తీరిక జనాలకు లేకుండా పోతోంది. అలాంటి వాటిల్లో 'ప్రేమ'కూడా ఒకటి. ప్రేమ గురించి చెప్పమంటే మనుషులు ఎంతైనా చెప్పగలరు. నిజమైన ప్రేమ.. అంటూ మొదలుపెట్టి.. లోతులకు వెళ్లే కొద్దీ ఎన్నో పదాలు వస్తాయి. ఎంతో అద్భుతమైన కవిత్వాలు వినిపిస్తాయి. అయితే ప్రస్తుత ప్రపంచంలో ప్రేమ కవిత్వాలను దాటి వచ్చే పరిస్థితిలేదు.

నిజమైన ప్రేమ అంటే.. అది సినిమాల్లో మాత్రమే అగుపిస్తోంది. ప్రేమ గురించి ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. నవీన దేవదాసుల కథలు 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'ల రూపంలో 'అర్జున్‌ రెడ్డి'ల రూపంలో చక్కటి ప్రేమకథా చిత్రాలు వస్తున్నాయి. ప్రేమకు అద్భుతమైన ఆవిష్కరణలుగా నిలుస్తున్నాయి. సినిమాల రూపంలోని ఆ ప్రేమల సంగతి సరే. నిజ జీవితంలో ప్రేమ కథేంటి? అంటే.. సమాధానం చెప్పడం మాత్రం కష్టం అవుతోంది. అది అమ్మాయిల వైపు నుంచి చూసినా, ఇటు అబ్బాయిల వైపు నుంచి చూసినా.. 'ప్రేమ' కోసం పరితపించిపోయే తత్వం తగ్గిపోతోంది.

ఈ రోజుల్లో ప్రేమ అంటూ… ఎవరైనా ఆత్మహత్యలూ గట్రా చేసుకున్నా, ప్రేమ కోసం అంటూ త్యాగాలు చేసినా.. వాళ్లను అమాయకులుగా, వెర్రివాళ్లుగానే చూస్తున్న పరిస్థితి. అవకాశవాదం.. ఇదే అమ్మాయిలనైనా, అబ్బాయిలను అయినా నడిపిస్తోంది. ప్రేమ అంటే అప్పటికప్పటి అవసరాలను తీర్చుకోవడానికి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇక ప్రేమను చిరకాలం కొనసాగించడం మాత్రం చాలాకష్టం అయిపోతోంది. యుక్తవయసులో ప్రేమ రూపంలో దగ్గరైన జంటలు.. తీరా దాన్ని శాశ్వతం చేసుకోవడానికి మాత్రం చాలా లెక్కలే వేస్తున్నాయి.

ఇంతకు ముందు ప్రేమించుకున్నాం అని పిల్లలు చెబితే.. వీళ్లు ప్రేమించిన వాళ్ల కులమేంటి, మతమేంటి, ఆర్థిక స్థితిగతుల మాటేంటి, సమాజంలో వాళ్లకు ఉన్న గుర్తింపు ఏమిటి? అనే అంశాల గురించి పెద్దలు ఆరాలు తీసేవాళ్లు, ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్లు. అయితే.. ఇప్పుడు అమ్మాయిలూ అబ్బాయిల స్థితిగతుల గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారు. తమ సేఫ్టీని తాము చూసుకుంటున్నారు. ఇలా చూసుకోవడం తప్పుకాదు కూడా.

అయితే.. ముందు ప్రేమించి, కలిసి తిరిగి.. తీరా పెళ్లి వద్దకు వచ్చాకా.. ఇలా ఆలోచించడమే విడ్డూరం. ఇక ప్రేమ విషయంలో అబ్బాయిల కథా వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో అబ్బాయిల లెక్కలు అబ్బాయిలకూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచీకరణ భారతీయుల ప్రేమకథలను కూడా మార్చేసింది. ప్రేమ అంటే.. ఇదీ ఒక టైంపాస్‌ వ్యవహారంగానూ మార్చేసింది.

ఫలానా వర్గంలో అనికాదు.. ఫలానా స్థితిలో ఉన్న వారిలో అని కాదు.. ప్రేమను సమాజం చూసే చూపే మారిపోయింది. దీనికి సామాన్యుడు, సెలబ్రిటీ మినహాయింపు కాదు. ప్రేమ అంటే.. వయసు వేడిని చల్లార్చుకోవడానికన్నట్టుగా, అప్పటికప్పుడు మానసికంగా తోడు కోసం.. అన్నట్టుగా మారింది. అయితే ఏదైనా ఒకేతీరున సాగదు కదా. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. సంప్రదాయాలను, ఆలోచనలనూ మార్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ విషయంలో కూడా జనాల ధోరణిలో కొంతమార్పు వస్తున్నట్టుగా ఉంది.

ప్రేమ అంటే.. డబ్బున్న వాడికొక వినోదం. నంబరాఫ్‌ ఛాయిస్‌లు ఉంటాయి.. ఒక్కోరితో కొంతకాలం తిరిగి వదిలేసుకున్నా, మరొకరిని పట్టుకోవడం సులభమే. ప్రత్యేకించి క్రేజ్‌, క్యాష్‌ ఉంటే.. ప్రేమ ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. అందమైన అమ్మాయి, క్రేజ్‌ ఉన్న అమ్మాయి… దొరకడం కూడా కష్టం ఏమీకాదు. ఒకరి తర్వాత మరొకరిని సులభంగా మార్చేయవచ్చు. మార్చేస్తారంతే.. ఎందుకంటే అవకాశాలున్నాయి ఉన్నాయి కాబట్టి. నంబరాఫ్‌ ఛాయిస్‌లు ఉన్నాయి కాబట్టి… ఇదీ సెలబ్రిటీల, సినిమా వాళ్ల ధోరణి. అయితే ఈ ధోరణిలోనే ఇప్పుడిప్పుడు చాలామార్పు వచ్చినట్టుగా ఉంది. జరుగుతున్న కొన్ని ప్రేమ పెళ్లిళ్లను పరిశీలిస్తే సెలబ్రిటీల ధోరణిలో చాలామార్పే వచ్చినట్టుగా ఉంది. ఇందుకు నిదర్శనంగా కొన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

మొన్న సమంత, నాగ చైతన్యలు. నిన్న అనుష్కా శర్మ, విరాట్‌ కొహ్లీలు.. ఇంకా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న ఇతర సెలబ్రిటీలు. వాస్తవాలు మాట్లాడుకుంటే.. సమంత, చైతూలు పెళ్లి చేసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నామని ప్రకటించుకున్నప్పటికీ జనాలవి అనుమానాలే. ఎందుకంటే.. ఇద్దరికీ క్రేజ్‌ ఉంది.. ప్రేమలో పడ్డారు.. వీళ్లకు విడిపోవడం పెద్ద కష్టం కాదు అనుకున్నారు. అంతకు ముందే సమంతకు చిన్న లవ్‌స్టోరీ ఉండటం కూడా ఈ అనుమానాలకు కారణం అయ్యింది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సమంత, చైతూలు పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ టైమ్‌పాస్‌ వ్యవహారం కాదని నిరూపించారు.. కులం, మతం, భాష, కుటుంబ నేపథ్యం.. వీటన్నింటినీ దాటుకుని వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రేమను విజేతగా నిలిపారు.

కేవలం వాళ్లే కాదు.. అనుష్కా, విరాట్‌ల ప్రేమకథ కూడా ఇలాంటిదే. కొన్నేళ్లుగా నడుస్తున్న వీళ్ల కథ ఒకదశలో విమర్శల పాలైంది. విరాట్‌ కోసం అనుష్క మైదానంలోకి వస్తే క్రికెట్‌ ప్రియుల కళ్లే ఓర్వలేకపోయాయి. వీళ్ల ప్రేమకథ సుదీర్ఘంగా నడవడం చూసి.. సహజంగానే కొంతమంది అనుమానించారు కూడా. వీళ్లిది కూడా వయసు వేడి మాత్రమే.. వీళ్ల ప్రేమకథ కూడా ఎక్కువకాలం నడిచే అవకాశం లేదని తీర్మానించిన వాళ్లు కూడా బోలెడుమంది. అలాంటి వాళ్లందరికీ ఝలక్‌ ఇచ్చింది… అనుష్కా, విరాట్‌ల జంట. ఈ జంట కూడా ప్రేమను విజేతగా నిలబెట్టింది.

అందం, డబ్బు, క్రేజ్‌ ఉన్నంతమాత్రానా.. తమ ప్రేమను కూడా టైంపాస్‌గా చేసుకోలేం అని ఈ జంట నిరూపించింది. ఇక ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న యువరాజ్‌- హజిల్‌ కీచ్‌, జహీర్‌ ఖాన్‌ -సాగరికలవి కూడా ప్రేమ చేసిన పెళ్లిళ్లే. అయితే యువరాజ్‌కు కొన్ని పాత ప్రేమకథలు ఉన్నాయి, జహీర్‌కి కూడా ఇషాశర్వాణితో ప్రేమకథ నడించింది. ఆ కథలు కొండెక్కినా.. వీరి రెండో ప్రేమకథలు అయినా.. పెళ్లిళ్ల వరకూ వచ్చాయి సంతోషం.

యువరాజ్‌, జహీర్‌ లాంటి ముదుర్ల కథలు పక్కన పెడితే.. ఆల్రెడి క్రికెట్‌ రిటైరైన దశలో వీళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం పెద్ద విశేషం కూడా కాదు అనుకోవచ్చు. కానీ.. సమంత- నాగచైతన్య, అనుష్కా -విరాట్‌లది మాత్రం ఎవరిగ్రీన్‌ లవ్‌ అనే అనాలి. వీళ్లు సెలబ్రిటీలకు అయినా, ప్రేమ విషయంలో అవకాశవాదంతో వ్యవహరించే సామాన్యులకు అయినా ఒకింత గుణపాఠాలుగా నిలవగలరని చెప్పాలి.

బ్రేకప్‌లు అంటూ వదిలించేసుకుని వేరే వాళ్లను చూసుకునే అవకాశాలు ఉన్నా.. వీళ్లు మాత్రం ప్రేమ విషయంలో కొత్త పాఠాలు చెప్పారు తమ పెళ్లిళ్లతో. క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే ప్రయత్నాలు కూడా పక్కనపెట్టి లైమ్‌ లైట్లో ఉండగానే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇకపై ప్రేమను అవకాశవాదంగా తీసుకునే వాళ్లకు, ప్రత్యేకించి లవ్‌ను టైమ్‌ పాస్‌గా తీసుకునే వాళ్లకు..కలిసి తిరిగినంత కాలం తిరిగి తలోదిక్కు చూసుకుందాం అనుకునే వాళ్లు సిగ్గుపడేలా చేయగలవు ఈ ప్రేమ, పెళ్లిజంటలు.