దిల్ రాజు. సినిమా అభిమానులకు, సినిమా జనాలకు, సినిమాల గురించి కాస్తయినా తెలిసిన వారికి సుపరిచితమైన పేరు. వెంకటరమణా రెడ్డి అంటే ఎవరు అని ఎవరైనా అడుగుతారేమో కానీ, దిల్ రాజు అంటే, వికీపీడియా మాదిరిగా బోలెడు చెప్పేస్తారు. ఆటోమొబైల్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి, తనదంటూ ఓ ముద్ర వేసుకుని, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఇలా ఒక్కో పాత్ర పోషించుకుంటూ వస్తున్న దిల్ రాజు పుట్టిన రోజు (18 డిసెంబర్) సందర్భంగా ఆయనతో ఇంటర్వూ
ఆర్పీరోడ్, రాణీ గంజ్ నుంచి ఫిల్మ్ నగర్ ప్రయాణం. తలుచుకుంటే ఎలా వుంటుంది మీకు?.
చాలా ఆనందంగా, చిత్రంగా వుంటుంది. ఆటో మొబైల్ స్పేర్స్ వ్యాపారంలో వుంటూ ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. కానీ వచ్చాను.
అప్పడప్పుడైనా అటు వెళ్తుంటారా? ఎలా అనిపిస్తుంది ఆ వాతావరణం, ఆ పాత రోజులు గుర్తుకు వస్తే.
తరచు కాకపోయినా, మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు వుంది కాబట్టి వెళ్తుంటాను.. అది ఒరిజినల్, ఇది మాన్యుఫాక్చర్డ్. ఎప్పటకైనా ఒరిజినల్ ఒరిజనలే. ఆ రోజులు, ఆ సరదాలు, ముచ్చట్లు గుర్తుకు వస్తుంటాయి. చాలా హ్యాపీగా ఫీలవుతుంటాను.
ఎన్నో పుట్టిన రోజు ఇది?
47. ఇవేవీ లెక్క పెట్టుకోను. నా ధ్యాస అంతా పని చేసుకుంటూ పోవడం మీదే.
ఈ ఏడాది నిర్మాతగా ఓకె. మరి డిస్ట్రిబ్యూటర్ గా ఏమైంది?
తప్పు నాదే. నిర్మాతగా అంటే నాకు నచ్చిన కథలు, నేను ఎంచుకున్న కథలు, వాటిలో నా ఇన్ వాల్వ్ మెంట్. ఇలా చాలా వుంటాయి. కానీ పంపిణీ అంటే అలా కాదు. కాంబినేషన్ చూసి కొన్ని, ఎమోషనల్ అయి కొన్ని, మొహమాటాలు కొన్ని, అనుబంధాలు కొన్ని ఇలా ప్రభావితమై తీసుకుంటాను. నమో వెంకటేశాయ సినిమా వుంది.. నేను ఆ వెంకటేశ్వరుడి భక్తుడిని. ఆ సినిమా నేనే పంపిణీ చేయాలి అని తీసుకున్నా. స్పైడర్. మంచి కాంబినేషన్. ఇలా రకరకాల కారణాలు.
మరి ఇప్పడు ఈ పాఠాలతో ఏం చేయబోతున్నారు.
ఇక డిస్ట్రిబ్యూషన్ తగ్గించుకుంటున్నాను. పూర్తిగా మానేయను. కానీ పూర్తిగా ప్రాజెక్టు గురించి తెలిస్తే, అన్నీ నచ్చితే తీసుకుంటాను. వరుణ్ తేజ తొలిప్రేమ టోటల నెగిటివ్ రైట్స్ తీసుకున్నాను. నాని కృష్ణార్జున యుద్ధం అలాగే తీసుకున్నాను. ఇకపై ఇలా అన్నీ బాగుండి, తెలిస్తేనే పంపిణీకి తీసుకుంటాను. మొన్నామధ్య వున్నది ఒక్కటే జిందగీ సినిమా విషయమే తీసుకోండి.
కొనమని వచ్చారు స్రవంతి రవికిషోర్. కొనడం తగ్గించేసాను అని చెప్పాను. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చి చూడండి అన్నాను. ఇచ్చారు. జస్ట్ టూ డేస్ కిందటే లెక్కలు చూపించాను. ఆయన ఫుల్ హ్యాపీ. నువ్వెంత పెర్ ఫెక్ట్ నో ఇండస్ట్రీలో నేనే చెబుతా అంటూ వెళ్లారు. మనం చేసే పనిలో నిజాయతీ వుండాలి. అది పంపిణీ అయినా కొనుగోలు అయినా, నిర్మాణం అయినా సరే.
దిల్ రాజు అంటే నిర్మాతగా కన్నా థియేటర్లు చేతిలో వుంచుకున్న వ్యక్తిగా ఇండస్ట్రీలో ఎందుకు ప్రచారం ఎక్కువ వుందంటారు?
మీరు నమ్ముతారా.. నైజాం మొత్తం మీద నాకు యాభై థియేటర్లు మాత్రమే వున్నాయి అంటే. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కలిపి గట్టిగా ముఫై థియేటర్లు మాత్రమే వున్నాయంటే. కానీ అదే నిజం.
అసలు ఈ థియేటర్ల వ్యాపారం వైపు ఎలా మళ్లారు? దీన్ని ఓ వ్యాపారంగా చూసారా? ఇంకేమన్నా ఉద్దేశంతో వచ్చారా?
అదంతా ఓ పెద్ద విషయం. నేను వస్తూనే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు ఇచ్చాను. అప్పటికే సునీల్-సురేష్ బాబు ఈ వ్యాపారం ప్రారంభించారు. నేను సఖి సినిమా విడుదలకు కాస్త ఇబ్బందులు పడ్డాను. సరిగ్గా థియేటర్లు దొరకలేదు. అప్పుడు ఆలోచన వచ్చింది. మనకంటూ కొన్నయినా థియేటర్లు వుంటే బెటర్ యేమో? అని.
అప్పడు దర్శకుడు దాసరి గారిని కలిసాను. నా అయిడియాలు షేర్ చేసుకున్నాను. బాగుంది అన్నారు కానీ ఆ తరువాత ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఆ తరువాత కొన్నాళ్లకు అరవింద్ గారిని కలిసాను. మీరు కాస్త మోరల్ సపోర్ట్ ఇస్తే, నేను ముందుకు వెళ్తాను అన్నాను. ఆయన ఓకె అన్నారు. అలా ప్రారంభమైంది.
కేవలం మీ సినిమాల కోసం ఈ వ్యాపారంలోకి వచ్చారంటారు?
అది మాత్రమే కాదు. ఎప్పుడూ ఏ వ్యాపారం కూడా ఒక షేడ్ లో వుండకూడదు. అదీ కాక, సినిమా మార్కెట్ పెరగడానికి థియేటర్లు చాలా కీలకం. బి సెంటర్లలో థియేటర్లను ఆధునీకరణ చేయడం ద్వారా మార్కెట్ పెంచవచ్చని ఇప్పుడు ప్రూవ్ అయింది. నిజానికి థియేటర్ల వ్యాపారం వర్కవుట్ కాదు. ఒక థియేటర్ మోడర్నైజ్ చేయడానికి కనీసం రెండున్నర కోట్లు కావాలి.
మొత్తం మీద ఏడాది చివర బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే పెట్టిన పెట్టుబడి మీద రెండు శాతం కూడా కిట్టుబాటు కావడం లేదు. కానీ వేరే విధంగా బాగుంది. ఎలా అంటే సినిమాల షేర్ పెరుగుతోంది. కృష్ణా జిల్లాలో, ఉత్తరాంధ్రలో సినిమాల మార్కెట్ పెరగడానికి ఇదే కారణం. మనం ఫెసిలిటీస్ ఇస్తే వంద కాదు రెండు వందలు ఇచ్చయినా థియేటర్ కు వస్తారు.
ఇప్పుడు మీరు, సునీల్ ఒక్కటై నైజాంలో సినిమాలను శాసిస్తున్నారని..?
అంతా వట్టి మాట. ఆయనదీ బిజినెస్ నే. నాదీ బిజినెస్ నే. రోబో ఆయన వెళ్లి కొన్నారు. అవకాశం వస్తే నేను కొననా? డబ్బున్న వాళ్లు ఎవరైనా సరే నైజాం వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు కదా? ఎవరు వద్దంటారు? నేను ఇక్కడకు వచ్చేసరికే బోలెడు మంది వుండేవారు. వారంతా ఏరీ?
నైజాంలో ఎవరైనా కాలు పెట్టినా థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి మళ్లీ మీరు, సునీల్ నే గా ఇవ్వాల్సింది.
ఎందుకు ఇవ్వము. మంచి సినిమా వున్న డిస్ట్రిబ్యూటర్ కింగ్. థియెటర్ వాళ్లు పరుగెత్తుకు వస్తారు. సినిమా బాగా లేకున్నపుడు చెప్పే మాటలు ఇవి.
ఇప్పుడు అరవింద్ గారు, సురేష్ గారు ఏకమవుతారా?
అలా ఏం లేదే.. ఎవరి వ్యాపారం వారిదే.
మరి ఈస్ట్ లో అరవింద్ తో వున్న సత్యనారాయణ, సురేష్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాంటపుడు అరవింద్ గారు సత్యనారాయణతో వుండకపోవచ్చేమో?
డిజె సినిమాకు ముందు కానీ, తరువాత కానీ దిల్ రాజు అంటే నాన్ కాంట్రావర్సీ. కేవలం అప్పుడేందుకు?
దానికి చాలా కారణాలు వున్నాయి. నేను ఎప్పుడూ ఈ లెక్కలకు దూరంగా వుంటాను. నా లెక్క ఒక్కటే. ఎంత పెట్టాం. ఎంత వచ్చింది. ఎంతకు అమ్మాం. వాళ్లకు ఎంత వచ్చింది. ఈ రెండో పాయింట్ ఎందుకంటే నా సినిమాలు అమ్మే బ్యాచ్ మారదు. అందువల్ల వాళ్లకు సమస్య రాకూడదు.
డిజె సినిమా నా కెరీర్ లో అత్యథిక లాభం తెచ్చి ఇచ్చిన సినిమా. అది పక్కా వాస్తవం. ఇక కొన్నవాళ్లకు అంటారా. వాళ్లను కూడా నష్టపోనివ్వలేదు. అది వచ్చిన రెండు నెలలకే ఫిదా వచ్చింది. అందరికీ ఫోన్ లు చేసి చెప్పాను. మీరు ఏం లెక్కలు చెబుతారో నాకు అనవసరం. ఎంత తగ్గించి కట్టాలి అనుకుంటే అంత తగ్గించి కట్టండి అని. ఓవర్ సీస్ వాళ్లను అలాగే అడిగాను. అందరూ అలాగే కట్టారు. ఫిదా వచ్చింది బ్లాక్ బస్టర్ అయింది. వాళ్లు హ్యాపీ. ఏ వ్యాపారమైనా ఏడాది చివర్న లెక్కలు చూసుకోవాలి. అలా చూసుకుంటే నా బయ్యర్లు అంతా ఈ ఏడాది హ్యాపీనే.
మరి కలెక్షన్ల లెక్కల గొడవ ఏమిటి?
డిజె విషయంలో కాదు, మరే సినిమాకైనా నేను ఈ లెక్కలు, అంకెలు పట్టించుకోను. నాకై నేను చెప్పను. ఒకవేళ ఎవరైనా అడిగితే ఒరిజినల్ అంకెలే చెప్పమని మా స్టాఫ్ కు చెబుతాను. డిజె విషయంలో ఏవి? ఎందుకు జరిగాయో? అన్నీ అలా జరిగాయంతే.
నాగార్జున గారితో మీకు మంచి అనుబంధం వుంది. ఆయన చాలా ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్న ప్రాజెక్టు మీద మీ సినిమా వదలడం?
కొన్ని మన చేతుల్లో వుండవు. డిసెంబర్ లాస్ట్ వీక్ అన్నది ఆయన సెంటిమెంట్. నాకు అనుకోకుండా ఈ ఏడాది అయిదు హిట్ అయ్యాయి. ఆరోది కూడా హిట్ అవుతుందన్న నమ్మకం పక్కగా వుంది. ఒకే ఏడాది ఆరు హిట్ లు అన్న ఫీట్ ను వదులుకోకూడదు అన్న కోరిక బలంగా వుంది. మళ్లీ ఇలాంటి ఫీట్ సాధించగలనో, సాధిస్తానో లేదో నాకు తెలియదు. మరోపక్క వెనక్కు వెళ్దాం అంటే ఎక్కడా అవకాశం లేనంతగా సినిమాలు. అందువల్ల తప్పలేదు. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు విడుదలై హిట్ కొట్టినట్లు, ఈ క్రిస్మస్ కు కూడా రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ తో సినిమా మీ డ్రీమ్ ప్రాజెక్టు కదా? ఎప్పుడు అది?
టైమ్ రావాలి. వాస్తవం చెప్పాలంటే మంచి సబ్జెక్ట్ దొరకాలి. మొన్న కూడా కలిసాం ఇద్దరం. ఆయన ఒకటే అన్నారు. ''..రాజూ.. ఎప్పడు కావాలంటే అప్పుడు రా. నేను రెడీ. నా రాజకీయాలు, నా కమిట్ మెంట్ లు అవన్నీ నీకు అనవసరం. నేను చేస్తాను..'' అని. అలాంటి సబ్జెక్ట్ దొరకాలి.
దర్శకత్వం ఎప్పుడు?
సమస్యే లేదు. చేయను.
శతమానం భవతి విషయంలో దాదాపు అంతపనీ చేసారని అంటారు.
కాస్త ఎక్కువ కేర్ తీసుకున్నాను అంతే. నా ఆఫీస్ లో ప్రతీదీ క్లియర్ గా, పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేయకుండా సెట్ మీదకు వెళ్లను. సెట్ మీదకు వెళ్లాక, చెప్పింది చెప్పినట్లు, అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారా లేదా అన్నది చూస్తాను. వన్స్ ప్రొడక్ట్ ఎడిట్ రూమ్ లోకి వచ్చాక, జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ తరువాతే నా బయ్యర్లకు చెబుతాను.
ఎంసిఎ సినిమాకు ఇప్పటి దాకా ఓవర్ సీస్ మినహాయిస్తే మరే ఒక్క ఏరియాకు కూడా ఇప్పటి దాకా రేట్ చెప్పలేదంటే మీరు నమ్ముతారా? రేపు సినిమా చూస్తున్నాను. అప్పుడు చెబుతాను. ఎప్పుడూ అంతే. సినిమా ఇలా వుంటుంది. ఈ సీన్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం డల్ వుంటుంది. ఇలా వివరించి, అడ్వాన్స్ కమిట్ మెంట్ తీసుకుంటాను. మార్నింగ్ షో పడ్డాక కొన్నవాళ్లు చెబుతారు. నేను కరెక్ట్ గా చెప్పానో లేదో.
రాజకీయాల సంగతేమిటి? ఎంపీ కి పోటీ చేస్తారని
అబ్బే.. అస్సలు ఆ ఆసక్తి లేదు. ఎందుకంటే సినిమాలు అంటే నాకు ఇష్టం. నేను వాటిని ఎంజాయ్ చేస్తాను. ఈ వ్యాపారంలో ఆ ఎంజాయ్ మెంట్ వుంటుంది. రాజకీయాలు నాకు కుదిరే పని కాదు.
-వి. రాజా