తమిళంలో దర్శకుడు రాజ్ కిరణ్ చేసిన రోల్ ను తెలుగులో చేశాడు దాసరి నారాయణ రావు. “ఎర్రబస్సు'' సినిమా తమిళ వెర్షన్ లో రాజ్ కిరణ్ చెన్నై వచ్చిన తమిళనాడు సగటు గ్రామీణుడి పాత్ర చేయగా… తెలుగు వెర్షన్ లో పాలకొల్లు నుంచి వచ్చిన నారాయణ స్వామి అనే పల్లెటూరి మనిషి పాత్రను చేశాడు దాసరి. రాజ్ కిరణ్ దాసరి అంతటి పెద్ద డైరెక్టర్ కాదు కానీ.. ఇలా ఒక తమిళ దర్శకుడు చేసిన పాత్రను తెలుగులో కూడా మరో దర్శక నటుడే చేయడం విశేషం.
తమిళంలో చేసిన పాత్రకు గానూ రాజ్ కిరణ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఆయన సిటీ వచ్చిన పల్లెటూరి మనిషి పాత్రలో జీవించేశాడనే పేరును తెచ్చుకొన్నాడు. ఆయనకు పలు అవార్డులు కూడా గ్యారెంటీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అదే పాత్రను తెలుగువారికి చేసి చూపిన దాసరికి ఎన్ని అవార్డులు వస్తాయనేది ఆసక్తికరమైన అంశం!
ప్రత్యేకించి దాసరి- అవార్డుల అంశం ఎందుకు చర్చనీయాంశమో చెప్పనక్కర్లేదు. వెనుకటికి మేస్త్రీ సినిమాలో దాసరి నటనకు గానూ నంది అవార్డు సొంతం అయ్యింది. అప్పట్లో ఆ విషయం ఒకింత వివాదం కూడా అయ్యింది. అదే ఏడాదిలో వచ్చిన “మగధీర' హీరో చరణ్ కు ఉత్తమ నటుడి అవార్డును ఇవ్వాల్సింది పోయి.. దాసరికి ఇవ్వడం ఏమిటి? అనే సందేహాలను వ్యక్తపరిచారు కొంతమంది. అప్పట్లో ఆ పరిణామంపై మెగా ఫ్యామిలీ కూడా గుర్రుగానే మారిందట!
ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి దాసరి లీడ్ రోల్ లో కనిపించాడు. మరి ఈ సారి కూడా ఆయన అవార్డులను సొంతం చేసుకొంటారా? లేక అలాంటిదేమీ ఉండదా? అనేది ఆసక్తికరమైన పరిణామం. అయితే రీమేక్ సినిమాలకు సాధారణంగా అవార్డులు ఇవ్వరు. మరి ఇక్కడ నటించింది దాసరి కాబట్టి ఆ ఎక్సెప్షన్ కూడా ఉంటుందేమో చూడాలి!