ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్రస్తుతం థియేటర్లలో ఉన్న జూ.ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అందించిన పెద్ద నిర్మాత.. దిల్ రాజు తన సినిమాకు పనిచేసిన కార్మికులు టెక్నీషియన్లకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయిట. పైగా ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రానికి పనిచేసిన కార్మికులకు ఇచ్చిన చెక్కులే బౌన్స్ అవుతుండడం ఇక్కడ యాదృచ్ఛికం. అటు థియేటర్లలో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా బౌన్స్ అయిందని, ఆ సినిమాకు పనిచేసినందుకు కార్మికులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయని ఇండస్ట్రీలో జోకులేసుకుంటున్నారు. అయితే తమ లాగే చాలా మందికి చెక్కులు బౌన్స్ అయిన సంగతి తెలుసుకున్న కార్మికులు గగ్గోలు పెడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఇచ్చే చెక్కులు బౌన్స్ కావడం అనేది కొత్త విషయం కాదు. కానీ పెద్ద నిర్మాణసంస్థలకు ఇలాంటి సమస్య ఉండదు. కార్మికులు పెద్దసంస్థల విషయంలో ఆ నమ్మకంతోనే ఉంటుంటారు. కానీ భారీ చిత్రాల ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం చర్చనీయాంశం అవుతోంది.
అసలు ఆయన చెక్కులు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌నే మూసేశారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అసలే భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిత్రం (రాంచరణ్`ఎవడు) విడుదలకే నోచుకోకుండా ఆఫీసులోనే బాక్సులు మూలుగుతున్నాయి. మరోవైపు సాహసించి విడుదల చేసిన రామయ్యా వస్తావయ్యా చిత్రం బాల్చీ తన్నేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. చెక్‌లు బౌన్స్ కాక ఇంకేం అవుతాయని సినీజనం కామెంట్లు రువ్వుతున్నారు.