అప్పుడెప్పుడో నోటా రిలీజ్ టైమ్ లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు విజయ్ దేవరకొండ. సినిమా ఫ్లాప్ అని ఓపెన్ గా ఒప్పుకున్న తర్వాత కానీ అతడిపై ఆగ్రహం చల్లారలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు ఈ హీరో. ఈసారి కారణం అతడి సినిమా కాదు, అతడి తమ్ముడి సినిమా దొరసాని.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ టీజర్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ దొరసానిపై విజయ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తమ్ముడి సినిమాకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో విజయ్ ఇలా ప్రవర్తించాడని అంతా అర్థంచేసుకున్నారు.
కట్ చేస్తే, దొరసాని టీజర్ రిలీజైన కొన్ని గంటలకు వచ్చిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమా ట్రయిలర్ ను భుజానికెత్తుకున్నాడు విజయ్ దేవరకొండ. తమ్ముడు నటించిన దొరసానిని వదిలేసి, ఈ సినిమాను ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఆ ట్రయిలర్ ను షేర్ చేశాడు కూడా. దీంతో నెజిటన్లు విజయ్ దేవరకొండపై ఫైర్ అయ్యారు. సొంత తమ్ముడ్ని వదిలేసి ఈ పనులేంటని క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టారు.
నిజానికి తమ్ముడి సినిమా విషయంలో తన ప్రమేయం అస్సలు ఉండదని గతంలోనే ప్రకటించాడు దేవరకొండ. చెప్పినట్టుగానే దొరసాని సినిమాకు దూరంగా ఉంటున్నాడు. కాకపోతే అదే సమయంలో ఇతర సినిమాలకు కూడా అతడు దూరంగా ఉంటే బాగుండేది. కానీ ఆ పనిచేయలేదు. అందుకే ఇప్పుడిలా బుక్కయ్యాడు. ఇలాంటి విమర్శల్ని చూసీచూడనట్టు వదిలేసే రకంకాదు విజయ్. త్వరలోనే వీటికి సమాధానం ఇస్తాడు.