ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లు వుంది వ్యవహారం. పవర్ స్టార్ పేరుతో హీరో పవన్ కళ్యాణ్ మీద సినిమా ప్రకటించారు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ మీద సినిమా కాదు అని ఆయన అంటున్నారు. కానీ విడుదల చేసిన స్టిల్స్ అన్నీ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లను, పవన్ సతీమణి ని గుర్తుచేసేలా వున్నాయి.
ఇండస్ట్రీలో ఈవెంట్ లు చేసే శ్రెేయాస్ మీడీయా సంస్థ, మరి కొంత మంది భాగస్వాములతో కలిసి శ్రియా ఇటి అనే సంస్థను ప్రారంభించి, ఎనీ టైమ్ థియేటర్ అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. ఇందులో ఓ థియేటర్ ను డైరక్టర్ ఆర్జీవీకి అయిదేళ్లకు అగ్రిమెంట్ చేసింది. ఆయన ఏ సినిమాలు అయినా అందులో వేసుకోవచ్చు.
ఇప్పుడు పవర్ స్టార్ సినిమా అందులో విడుదల చేయడం అన్నది శ్రేయాస్ కు ఇబ్బందిగా మారింది. వద్దు అంటే ఆర్జీవీ వినరు. వద్దు అనే హక్కు కూడా లేదు. కానీ అలా కాకుండా శ్రేయాస్ లో విడుదల చేస్తే, టాలీవుడ్ ఇండస్ట్రీ, మెగా ఫ్యామిలీ మొత్తం శ్రేయాస్ కు వ్యతిరేకం అవుతారు. శ్రేయాస్ సంస్థ అసలు బిజినెస్ అయిన టాలీవుడ్ ఈవెంట్లు అన్నవి టార్గెట్ అయ్యే ప్రమాదం వుంది,.
ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలా? అని శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే దారులు వెదుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆర్జీవీ సినిమాను శ్రేయా మీడియా తన ఈటి సంస్థ ద్వారా వేయకపోవచ్చు. కానీ ఆపలేదు. ఆయన వేరే మార్గం చూసుకుంటారు. అలాగే టాలీవుడ్ కూడా వర్మను ఏమీ చేయలేదు. కానీ శ్రెేయాస్ మీడియాను టార్గెట్ చేయగలదు. అదీ విషయం.