తన గురించి భారతీయ మీడియా ప్రచారం చేస్తున్న ఆర్థిక కష్టాలను కొట్టి పడేసింది కిమ్ శర్మ. ఈమె దుర్భర దారిద్ర్యంతో బాధపడుతోందని.. కనీసం రోజు గడవడం కూడా కష్టం అయిపోయిందని రెండు మూడు రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిని గమనించిన కిమ్.. ఘాటుగా స్పందించింది. తన ఆర్థిక ఇబ్బందులు అనేవి పూర్తిగా తప్పుడు వార్తలు అని ఈమె స్పష్టం చేసింది. ఆ కథనాలను జస్ట్ రబ్బిష్ .. అనేసింది.
కొన్నాళ్ల కిందట అలీ పుంజానీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది కిమ్. సినిమాల్లో అవకాశాలు బాగున్న రోజుల్లో క్రికెటర్ యువరాజ్ తో చట్టాపట్టాలేసుకు తిరిగిన కిమ్, అతడితో బ్రేకప్ అయ్యాకా.. అవకాశాలు తగ్గిన తర్వాత వివాహం చేసుకుంది. సదరు అలీ పుంజానీ.. కెన్యాలో సెటిలైన వ్యాపారి. అతడికి హోటల్స్ వ్యాపారాలున్నాయట. మరి చాలా మంది హీరోయిన్ల ప్రేమ, పెళ్లి కథల్లానే కిమ్ శర్మ వ్యవహారం కూడా విడాకులాంతం అయ్యింది. అతడితో తెగదెంపులు చేసుకుని కొన్నాళ్ల కిందట ఇండియా వచ్చింది కిమ్. కొంత విరామం తర్వాత ఈమె తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం యత్నిస్తున్న తరుణంలో కొత్త రూమర్లు మొదలయ్యాయి.
ఈమె ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని.. భర్త మోసం చేశాడని, ఈమెను దిక్కూదివాణం లేకుండా వదిలేశాడనే ప్రచారం ఊపందుకుంది. కిమ్ శర్మ విషాదగాథ అంటూ మీడియా వర్గాలు రెచ్చిపోయాయి. ఆమెపై జాలి గొల్పేంతలా రాసేశాయి. అయితే వాటన్నింటినీ ఒకే మాటతో ఖండించింది కిమ్. తనకు ఇప్పుడొచ్చిన ఇబ్బందులు ఏమీలేవని స్పష్టం చేసింది. తనపై జాలి చూపాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ప్రస్తుతానికి అయితే సినిమా అవకాశాలను సంపాదించుకునే పనిలో, వ్యాపార రంగంలో రాణించాలనే ప్రయత్నంలో ఉందట ఈమె.