విజయ్ దేవరకొండ.. ఉవ్వెత్తున లేచిన కెరటం. తనదైన ఆటిట్యూడ్, తనదైన డైలాగ్ డిక్షన్, తనదైన పబ్లిసిటీ ప్లానింగ్ ఇవన్నీ కలిసి అతన్ని మిగిలిన వారికన్నా వైవిధ్యంగా నిలబెట్టాయి. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సక్సెస్ లు అతనికి దాదాపు సూపర్ స్టార్ ఇమేజ్ ను దగ్గర చేసాయి. అలాంటిది నోటా సినిమా, దభాల్నపడేసింది. విడుదలైన మూడు నాలుగు రోజుల వరకు స్పందించని విజయ్ ట్విట్టర్ లో స్పందించాడు. మళ్లీ అది కూడా తనదైన స్టయిల్ లోనే.
దాదాపు ఓ పేరాగ్రాఫ్ మెసేజ్ లో పైకి కనిపించని భావాలు బాగానే వ్యక్తం చేసాడు. ఇక్కడి క్రిటిక్స్ కు, మీడియాకు నచ్చలేదు కానీ, తమిళ్ మీడియాకు, జాతీయ మీడియాకు బాగానే నచ్చిందని ఇండైరెక్ట్ గా ఎత్తి పొడిచాడు. అదే సమయంలో ఆంధ్రలో నచ్చిన ఆడియన్స్ కూడా వున్నారన్నాడు.
తను ఏమాత్రం పశ్చాత్తాపం పడడం లేదని, తప్పు చేసిన భావన లేదని, నోటా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నానని, తాను చెప్పాలనుకుంటున్న కథ చెప్పానని, చేయాలనుకున్న విధంగా ఆ పాత్రను చేసానని విజయ్ స్ఫష్టం చేసాడు.
అంతే కాదు, నోటా సినిమా ఫెయిల్ అయినందుకు కొందరు పండుగ చేసుకుని వుండొచ్చని, చేసుకోవాలని అనుకునేవారు త్వరగా చేసేసుకోవాలని, ఎందుకంటే మళ్లీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని సెటైర్ వేసాడు.
సక్సెస్ లు, ఫెయిల్యూర్ లు ఓ రౌడీ ప్రయాణాన్ని ఆపలేవని, యుద్ధం చేస్తూనే వుంటామని, గెలిస్తే గెలుస్తామని, లేదంటే పాఠాలు నేర్చుకుంటామని విజయ్ పేర్కోన్నాడు.