బయోపిక్ ను డీల్ చేయడం అంత సులభంకాదు. ఈ వ్యవహారం కత్తిమీద సాములా ఉంటుంది. అదృష్టవశాత్తూ అటు బాలీవుడ్ లో గానీ, ఇటు టాలీవుడ్ లో గానీ.. ఇటీవలి కాలంలో మంచి బయోపిక్ లు వస్తున్నాయి. దర్శకులు మేకింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. క్రమంగా బయోపిక్ ల మీద అనేక మందికి మోజు పెరుగుతోంది కూడా. ఈ క్రమంలో తెలుగులో ప్రస్తుతం నిర్మాణదశలో రెండు కీలకమైన బయోపిక్ లు ఉన్నాయి. అవే.. ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ చిత్రాలు. వీటిలో వైఎస్సార్ బయోపిక్ తన పనేదో తాను చేసుకుంటూ పోతుండగా.. ఎన్టీఆర్ చిత్రం విషయంలోనే అనేకానేక మలుపులు చోటు చేసుకుటున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాలకృష్ణ చేయదలచుకున్నప్పటినుంచి రకరకాల మలుపులు తిరుగుతూనే ఉంది. మహానటి చిత్రం విడుదలై సక్సెస్ సాధించిన తర్వాత.. ఎన్టీఆర్ చిత్రాన్ని అటకెక్కించేస్తారేమో అనే పుకారు వచ్చింది. ప్రేక్షకుల్లో ప్రతిఒక్కరూ మహానటి చిత్రంతో కంపేర్ చేసి చూసే అవకాశం ఉంటుంది గనుక.. అంత లోతైన రీసెర్చితో ఎన్టీఆర్ జీవితాన్ని స్పృశించలేకపోతే గనుక.. తేడా కొట్టేస్తుందని సినిమా టీమ్ భయపడ్డట్లుగా పుకార్లు వచ్చాయి. తర్వాత నెమ్మదిగా అవి సర్దుకున్నాయి. తేజను తప్పించిన తర్వాత.. దర్శకుడిగా క్రిష్ ను తీసుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
చంద్రబాబు పాత్ర ఎలా ఉండాలనే విషయంలో… దర్శకుడు వెళ్లి ఆయనను కలిసి కొన్ని సూచనలు తీసుకున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఇదంతా ఒకఎత్తు అయితే.. తాజాగా బాలీవుడ్ ఒకప్పటి సూపర్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రం తర్వాత.. ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ అయోమయంలో పడ్డట్లుగా కనిపిస్తోంది. ఆ చిత్రలో కూడా సంజయ్ దత్ ఉత్థాన పతనాలను నిర్మొగమాటంగా చర్చిస్తూ మంచి మార్కులు కొట్టేశారు.
ఎన్టీఆర్ చిత్రాన్ని ఆయన కొడుకు బాలకృష్ణే చేస్తుండడం వల్ల.. జీవితగమనంలో నెగటివ్ కోణాలను నిజాయితీగా చెప్పడం సాధ్యంకాదనే అనుమానం వారిలోనే కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు వచ్చిన తర్వాత.. అంత నిజాయితీతో తీయకపోతే.. ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రేక్షకులు ఈసడించుకున్నా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో మహానటి తర్వాత.. ఓసారి అటకెక్కే ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఎన్టీఆర్ బయోపిక్, ఇప్పుడు సంజు తర్వాత మరోసారి అదే రకం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని.. సినిమాను ముందుకు తీసుకువెళ్దామా వద్దా అనే అయోమయం మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.