'ఎన్‌టిఆర్ కథానాయకుడు' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఎన్‌టిఆర్ బయోపిక్'కి సంబంధించి తొలిభాగం, 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' అయితే, రెండోభాగం 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఫస్ట్ పార్ట్‌లో మేగ్జిమమ్ స్క్రీన్ స్పేస్, విద్యాబాలన్‌కి దక్కనుంది, ఎన్టీఆర్‌తో పాటుగా. ఇది, బసవతారకం బయోపిక్.. అనే ప్రచారమూ జరుగుతోంది. ఆ సంగతేమోగానీ, 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' బసవతారకం మరణంతో ముగించబడ్తుందని తాజాగా బాలకృష్ణ ప్రకటించడం గమనార్హం.
మరి, 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' సినిమాలో విద్యాబాలన్‌ని చూసే అవకాశం లేదా.? ఆ కారణంతోనే, 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' కోసం, విద్యాబాలన్‌ని వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ కోసం ప్రొజెక్ట్ చేస్తున్నారా.? అంటే, అవునని చెప్పక తప్పదు. మరి, లక్ష్మీపార్వతి పాత్ర సంగతేంటి.? అన్న ప్రశ్నకు మాత్రం బాలకృష్ణ సమాధానం చెప్పలేదు, అసలు ఆ విషయం తనచెవిన పడలేదన్నట్లు వ్యవహరించేందుకు ప్రయత్నించారుగానీ, ఆ సమయంలో బాలయ్య కొంత అసహనానికి గురైనట్లు కన్పిస్తోంది.
స్వర్గీయ ఎన్టీఆర్ మొదటిభార్య బసవతారకం అయితే, రెండోభార్య లక్ష్మీపార్వతి. స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణానికి సంబంధించి, చివరిరోజుల్లో ఆయనతో వున్నది లక్ష్మీపార్వతి మాత్రమే. బసవతారకం మరణం తర్వాత చాన్నాళ్ళకు లక్ష్మీ పార్వతిని వివాహమాడారు స్వర్గీయ ఎన్టీఆర్. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది, రాజకీయంగా ఆయన్ని ఓ కుదుపు కుదిపేసింది.
'లక్ష్మీపార్వతి పాత్రలేకుండా, స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడంలో అర్థమేలేదు..' అంటూ సర్వత్రా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్న వేళ, బాలకృష్ణ ముందుకు లక్ష్మీపార్వతి గురించిన ప్రశ్న వచ్చినప్పుడు, ఆయన అసహనానికి గురవడం సహజమే. కానీ, 'ఎన్‌టిఆర్ బయోపిక్', నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లో తెరకెక్కుతోన్న సినిమా. అందుకే, అంతా ఆయనకు అనుకూలంగానే వుండబోతోంది.
ఇదిలా వుంటే, 'ఎన్‌టిఆర్ మహానాయకుడు'కి సంబంధించి కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో విద్యా బాలన్ కన్పించే అవకాశం వుందనీ, ఆ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందనీ తెలుస్తోంది. తద్వారా, లక్ష్మీపార్వతి పాత్ర ప్రస్తావనకు ఆస్కారం లేకుండా అత్యంత పకడ్బందీగా స్క్రిప్ట్ రచించారట.