ఇదంతా ఇండస్ట్రీలో మామూలే.. ఈ హీరోతో పనిచేయడం గొప్ప అనుభూతి అని దర్శకులు ప్రకటించడం, ఈ హీరోతోనే తర్వాతి సినిమాను చేస్తానని నిర్మాతలు ప్రకటించుకోవడం, అంతా ఒక కుటుంబంలా పనిచేశామని చెప్పుకోవడం, తమ తర్వాత సినిమాను కూడా అంతా కలిసే చేస్తామని అనడం, దర్శకుడి పని తీరుకు హీరో ముగ్ధుడయ్యాడని చెప్పుకురావడం.. ఈ దర్శకుడితో మరో సినిమాకు హీరో సై అన్నాడని చెప్పడం… ఇలాంటి కబుర్లు ప్రతి సినిమా విషయంలోనూ వినిపించేవే!
సినిమా విడుదల అయ్యేంత వరకూ ఇలాంటి ముచ్చట్లు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి సదరు సినిమా విడుదల అయ్యిందంటే ఆ తర్వాత ఎవరికి ఎవరో! విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల విషయంలో.. హీరో- దర్శకుడు, దర్శకుడు- నిర్మాత, హీరో –నిర్మాత.. ల మధ్య ఉండే అన్యోన్యతల గురించి రకారకాల కబుర్లు వినిపిస్తు ఉంటాయి. ఇప్పుడు నందమూరి నటసింహం ప్రతిష్టాత్మక సినిమా ‘గౌతమీ పుత్రశతకర్ణి’ విషయంలోనూ ఇలాంటి కబురే వినిపిస్తోందకటి.
దాని సారాంశం ఏమనగా.. బాలయ్య తన తనయుడి తొలి సినిమా బాధ్యతలను క్రిష్ కు అప్పజెప్పాడనేది. తన వందో సినిమాకు దర్శకుడు అయిన క్రిష్ పనితీరు బాలయ్యకు బాగా నచ్చిందని, అందుకే మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ సినిమా బాధ్యతలను క్రిష్ కు అప్పగించాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు.. అలాగని అధికారిక ప్రకటన కూడా లేదు!
అయినా ఇలాంటి వార్తలు వస్తున్నాయంటే.. ఇదంతా ‘గౌతమి పుత్రశతకర్ణి’ ప్రచారంలో భాగమే అని చెప్పాలి. సినిమా అద్భుతంగా వచ్చింది, క్రిష్ పని తీరు బాలయ్యకు బాగా నచ్చిందని చెప్పే క్రమంలో, మోక్షజ్ఞ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహిస్తాడు అనేమాట ద్వారా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. తద్వారా సినిమాపై జనాల్లో పాజిటివ్ ఫీల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా బాలయ్య వందో సినిమా ప్రచారంలో మోక్షజ్ఞ ఒకటో సినిమా ఉపయోగపడుతోందనమాట!