రైట్‌ లెటర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ. యూపీఏ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని’…

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ. యూపీఏ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంలోనే చట్టంలో ప్రస్తావించకుండా, రాజ్యసభలో ‘ప్రత్యేక’ హామీలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్‌పై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌.

తమ ప్రభుత్వమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించిన సమయంలోనే సోనియాగాంధీ, ఆంధ్రప్రదేశ్‌ మీద మమకారం ప్రదర్శించి వుంటే, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా విభజన చట్టంలోనే పొందుపర్చబడేవి. అప్పట్లో ఆ వ్యవహారాన్ని లైట్‌ తీసుకుని, ఇప్పుడు తీరిగ్గా సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

సోనియా రాసిన లేఖతో ఏపీ కాంగ్రెస్‌ నేతల్లో కొత్త ఉత్సాహమొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్‌కి ఎనలేని మమకారం అనడానికి సోనియా, ప్రధానికి రాసిన లేఖే నిదర్శనమని ఏపీ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అయితే, సరిగ్గా ఇదే రోజున పార్లమెంటులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తూ, చట్టం పాస్‌ అయిన విషయం విదితమే. దాన్నుంచి, జనం దృష్టి మరల్చేందుకు సోనియా, ప్రధానికి ఏపీ మీద మమకారం ప్రదర్శిస్తూ లేఖ రాశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.