మన సినిమా మనకు గుర్తుండదు. వుండాలంటే మళ్లీ కులాల ఈక్వేషన్లో, లేదంటే,. ఆ సినిమా తీసినవాళ్లు ఇప్పటికి స్టూడియో ఓనర్లో, లేదా ఇంకా సినిమా పరిశ్రమపై బలమైన పట్టు కలిగో వుండాలి. ఇంకా కాదంటే ఆ దర్శకుడికి హీరోలతో ఇప్పటికీ లావాదేవీలో, సబంధ బాంధవ్యాలో వుండివుండాలి.
1980లో వచ్చింది శంకరాభరణం. బోలెడు జాతీయ అవార్డులు కొట్టుకొచ్చింది. జనాల్లో సంగీతంపై అభిమానాన్ని పెంచింది. దేశ విదేశాల్లో తెలుగు సినిమా బావుటాను రెపరెపలాడించింది. అంతకు మించి, డబ్ కాకుండా భాషాభిమానానికి పెట్టిన పేరు అయిన తమిళనాట, తెలుగు వెర్షన్ సినిమా, అదీ అందరికీ అందుబాటులో లేని చోట, ఏడాది పాటు ఆడింది. జనం విరగబడి చూసారు.
ముఫై అయిదేళ్లు గడిచాయి. మన దగ్గర శంకరాభరణాన్ని మరిచారు. కనీసం ఆ సినిమా పేరు గౌరవం అలా వుంచాలని కూడా అనుకోకుండా, ఆ పేరుతో కామెడీ సినిమా తీయడానికి పూనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాను మనం పట్టించకోవడం మానేసాం.
కానీ తమిళ నాట చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. ఆనాటి సినిమాను మళ్లీ మరోసారి ఈ నాటి సాంకేతిక సొబగులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. డీటీఎస్, డిఐ వంటి వి జోడించారు. అంతే కాదు. గడచిన మూడు నెలల్లో దీని గురించి ఇంతా అంతా హడావుడి కాదు. కొత్త సినిమా కు చేసినట్లు ఫంక్షన్లు చేసారు. రెండు మూడు సార్లు ప్రివ్యూలు వేసారు.
దొరుకునా ఇటు వంటి సేవ మరే తెలుగు సినిమాకైనా..ఎంత సేపూ బొడ్లపై పళ్లు పూవులు కొట్టిన వైనాన్ని చూసి, వారం వారం అనుభవించి పలవరించేవారు, కనీసం శంకరాభరణం గురించి కలనైనా తలవరు. అయ్యో పొరుగునాట అంత చేస్తున్నారే,..మన సినిమాకు మనమైనా కాస్త ఏదైనా చేద్దామన్న ఆలోచన రాదు.
ఎందుకంటే కె విశ్వనాధ్ కు ఏ హీరోలతో, రాజకీయ పార్టీలతో సామాజిక బంధాలతో సంబంధం లేదు. ఏడిద నాగేశ్వరరావు కు స్టూడియో లు లేవు, సినిమాలు చేయడం లేదు. ఇంకెందుకు గుర్తుంటుంది మనవారి. మన తెలుగు సినిమా బంధాలన్నీ అయితే సామాజిక బంధాలు లేదా ఆర్థిక బంధాలు అంతే. మిగిలినన్నీ కామెడీనే.